ఈ హ్యాండ్ బ్యాగ్ దాదాపు 86 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది.. ఏమిటి దీని ప్రత్యేకత?

తన బ్యాగ్‌తో ఆంగ్లో -ఫ్రెంచ్ సింగర్, నటి జేన్ బర్కిన్

ఫొటో సోర్స్, ALAIN JOCARD,GILLES LEIMDORFER/AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, బ్యాగ్‌తో ఆంగ్లో -ఫ్రెంచ్ సింగర్, నటి జేన్ బర్కిన్
    • రచయిత, ఇయాన్ యంగ్స్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఫ్యాషన్ ప్రపంచంలో అత్యంత ఫేమస్ యాక్సెసరీగా పరిగణించే బర్కిన్ బ్యాగ్‌, జులై 10న జరిగిన వేలంలో 8.6 మిలియన్ యూరోలు అంటే 85.8 కోట్ల రూపాయలకు అమ్ముడైంది.

దీంతో, ఇప్పటివరకు వేలంలో అత్యంత ఖరీదుకు అమ్ముడైన బ్యాగ్‌గా ఇది నిలిచింది.

ఈ నలుపు రంగు బ్యాగ్‌ను 1985లో గాయని జేన్ బర్కిన్ కోసం తయారు చేశారు.

ఒకసారి విమాన ప్రయాణంలో గాయని జేన్ బర్కిన్, ఫ్రెంచ్ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ 'ఆర్మెస్' చీఫ్ పక్కన కూర్చున్నారు. ఆ సమయంలో ఆమె బ్యాగ్‌లోని సామగ్రి కింద పడిపోయింది.

అప్పుడు ఆమె, మీ కంపెనీ పెద్ద బ్యాగులను ఎందుకు తయారు చేయదని ఆర్మెస్ చీఫ్‌ను అడిగారు. వెంటనే ఆయన అదే విమానంలో ఒక కొత్త బ్యాగ్ డిజైన్‌ను తయారు చేశారు.

ఈ డిజైన్‌తో రూపొందించిన ప్రోటోటైప్ బ్యాగ్‌ను జులై 10న పారిస్‌లో జరిగిన వేలంలో జపాన్‌కు చెందిన ఒక సేకరణ కర్త (ప్రైవేట్ కలెక్టర్) సొంతం చేసుకున్నారు.

పారిస్‌లోని సోద్‌బీజ్ యాక్షన్ హౌజ్‌ దీన్ని వేలం వేసింది.

గత రికార్డు ధర 4.39 లక్షల యూరోల కంటే చాలా ఎక్కువ ధరకు అమ్ముడైన ఈ బ్యాగ్ కొత్త రికార్డు సృష్టించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఈ బ్యాగ్ ధర కోట్లలో ఉంటుంది

ఫొటో సోర్స్, Julien Hekimian/Getty Images

ఫొటో క్యాప్షన్, ఈ బ్యాగ్ ధర కోట్లలో ఉంటుంది

వేలం నిర్వాహకులు ఏమన్నారు?

యాక్షన్ హౌజ్ వెల్లడించిన వివరాల ప్రకారం, వేలం జరుగుతున్నప్పుడు దాదాపు 10 నిమిషాల పాటు 9 మంది కొనుగోలుదారుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

''ఐకానిక్ వస్తువులకు ఎంత విలువ ఉందో, సేకరణ కర్తల్లో ఇలాంటివాటిని దక్కించుకోవాలనే కోరికను, ఆశను అవి ఎంతగా ప్రేరేపిస్తాయో ఈ ధరను చూస్తే అర్థం అవుతుంది'' అని సోద్‌బీజ్ యాక్షన్ హౌజ్‌ హ్యాండ్‌బ్యాగ్, ఫ్యాషన్ గ్లోబల్ చీఫ్ మోర్గాన్ హాలిమీ అన్నారు.

''బర్కిన్ ప్రొటోటైప్ ఈ ఫ్యాషన్ కథకు మూలం. దీని ఆధారంగానే మోడ్రన్ ఐకాన్ అయిన బర్కిన్ బ్యాగ్ పుట్టింది. ప్రపంచంలో అత్యంత ఎక్కువగా ఇష్టపడే హ్యాండ్‌బ్యాగ్ ఇది'' అని వ్యాఖ్యానించారు.

పారిస్‌లో వేలం వేస్తున్న క్షణాలు

ఫొటో సోర్స్, Julien Hekimian/Getty Images

ఫొటో క్యాప్షన్, పారిస్‌లో వేలం వేస్తున్న క్షణాలు

బ్యాగ్ చరిత్ర, ప్రత్యేకతలు..

ఆంగ్లో-ఫ్రెంచ్ గాయని, నటి జేన్ బర్కిన్ కోసం తయారు చేసిన ఈ బ్యాగ్‌ను అర్మెస్ ఆ తర్వాత వాణిజ్య ఉత్పత్తిగా మార్చారు.

అప్పటినుంచి దీనిని ఫ్యాషన్ ప్రపంచంలో 'స్టేటస్ సింబల్'గా పరిగణిస్తారు.

కొన్ని బర్కిన్ బ్యాగుల ధర, లక్షల డాలర్ల వరకు ఉంటుంది. వీటిని పొందడానికి ఒక పెద్ద వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది.

ఈ బ్యాగులను వాడే వారిలో కేట్ మాస్, విక్టోరియా బెక్‌హమ్, జెన్నిఫర్ లోపెజ్ వంటి ఇంటర్నేషనల్ సెలెబ్రిటీలు ఉన్నారు.

వేలంలో అమ్ముడైన ప్రొటోటైప్ బ్యాగ్ ఫ్రంట్ ఫ్లాప్ మీద బర్కిన్ పేరు చెక్కి ఉంటుంది.

జేన్ బర్కిన్ 76 ఏళ్ల వయస్సులో 2023లో చనిపోయారు.

ఆమె ఈ బ్యాగ్‌ను ఒక దశాబ్దం పాటు తన వద్దే ఉంచుకున్నారు. 1994లో ఎయిడ్స్ చారిటీకి విరాళాల సేకరణ కోసం ఈ బ్యాగ్‌ను వేలం వేయడానికి ఇచ్చేశారు.

పారిస్‌లో ఒక లగ్జరీ బొటిక్‌ను నడిపే కేథరిన్ బెనియర్ ఈ బ్యాగ్‌ను దక్కించుకున్నారు. ఆమె ఈ బ్యాగ్‌ను 25 ఏళ్ల పాటు జాగ్రత్తగా దాచుకుని, గురువారం వేలంలో విక్రయించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)