భారత్‌లో టెస్లా కారు రేటెంత?

టెస్లా, ఇండియా, ఎలాన్ మస్క్, అమెరికా

ఫొటో సోర్స్, PUNIT PARANJPE/AFP via Getty Images

ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా కంపెనీ మంగళవారం భారత కార్ల మార్కెట్లో అడుగుపెట్టింది.

ముంబయిలో తమ తొలి షోరూమ్‌ను టెస్లా ప్రారంభించింది.

త్వరలోనే దేశ రాజధాని దిల్లీలోనూ షోరూమ్‌ ఏర్పాటు చేయనున్నట్లు టెస్లా డైరెక్టర్ ఇసాబెల్ ఫాన్ ప్రకటించినట్లు సీఎన్‌బీసీ రిపోర్ట్ పేర్కొంది.

కొంతకాలంగా కార్ల అమ్మకాలు తగ్గుముఖం పట్టడంతో టెస్లా ఇబ్బంది పడుతోంది. మరోవైపు, అధిక పన్నుల విషయంలో భారత్‌పై మస్క్ విమర్శలు చేస్తున్నారు.

ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో, భారత కార్ మార్కెట్లోకి టెస్లా ప్రవేశాన్ని ఆటోమొబైల్ రంగం ఆసక్తిగా గమనిస్తోంది. టెస్లా ఇండియాకు సంబంధించిన కొన్ని కీలక విషయాలు ఇక్కడ చూద్దాం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
టెస్లా కార్

ఫొటో సోర్స్, Dhiraj Singh/Bloomberg via Getty Images

టెస్లా కారు రేటెంత?

టెస్లా కంపెనీ, భారత్‌లో తమ 'మోడల్ వై' కారును ప్రవేశపెట్టింది. ఈ కారు ప్రారంభ ధర 70,000 డాలర్లు. అంటే సుమారు రూ. 60 లక్షల రూపాయలు.

కస్టమర్లు, టెస్లా అధికారిక వెబ్‌సైట్ నుంచి ఈ కార్‌ను బుక్ చేసుకోవచ్చు. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో (అక్టోబర్-డిసెంబర్ మధ్య) కారు డెలివరీ అయ్యే అవకాశం ఉంది.

మస్క్ చాలాకాలంగా టెస్లాను భారత్‌లోకి తీసుకురావాలని, టెస్లా ఫ్యాక్టరీని కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

'మోడల్ వై' కారు రెండు వేరియంట్లలో లభించనుంది. రియర్-వీల్ డ్రైవ్ వేరియంట్ ధర సుమారు రూ. 60 లక్షలు ఉండగా, లాంగ్-రేంజ్ రియర్-వీల్ డ్రైవ్ ధర రూ. 68 లక్షలు.

అలాగే 'ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్' ఫీచర్‌ను అదనంగా మరో 6 లక్షలకు కంపెనీ అందిస్తుంది. ఈ ఫీచర్ వల్ల భవిష్యత్‌లో పెద్దగా మానవుల జోక్యం లేకుండానే కారు డ్రైవింగ్ సాధ్యమవుతుందని కంపెనీ హామీ ఇస్తోంది.

టెస్లా కార్

ఫొటో సోర్స్, Getty Images

అమెరికాలో సుమారు రూ.39 లక్షలు, చైనాలో రూ.32 లక్షలు..

భారత్‌లో దాదాపు రూ. 60 లక్షలకు లభించే వేరియంట్ కారు ధర అమెరికాలో అయితే సుమారు రూ. 39 లక్షలు, చైనాలో రూ. 32 లక్షలు, జర్మనీలో దాదాపు రూ. 40 లక్షలుగా ఉంది.

అలాంటప్పుడు భారత్‌లో ఇదే వేరియంట్ ధర ఇంత ఎక్కువగా ఎందుకు ఉందనే సందేహాలు తలెత్తవచ్చు.

భారత్‌లోకి దిగుమతి అయ్యే టెస్లా కార్లపై దాదాపు 100 శాతం సుంకాన్ని విధిస్తారు. అందుకే, భారత్‌లో విక్రయించే టెస్లా కార్ల ధరలు అంత ఎక్కువగా ఉన్నాయి.

టెస్లా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వైభవ్ తనేజా గతంలో మాట్లాడుతూ, భారత్‌పై సంస్థకున్న ఆసక్తిని వ్యక్తం చేశారు.

''భారత్‌లో మా కంపెనీ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తుంది. ఎందుకంటే, భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల పన్ను 70 శాతం, లగ్జరీ టాక్స్ 30 శాతం ఉంది'' అని వ్యాఖ్యానించారు.

టెస్లా కార్

ఫొటో సోర్స్, Getty Images

టెస్లా రాకతో పోటీ తప్పదా?

టెస్లా, భారత్‌లోని చిన్నదైన ఎలక్ట్రిక్ కార్ల ప్రీమియం గ్రూప్‌ను లక్ష్యంగా చేసుకుంటోంది. భారత ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఈ గ్రూప్ పరిమాణం 4 శాతంగా ఉంది. దేశీయంగా విద్యుత్ కార్లను తయారు చేసే టాటా మోటార్స్, మహీంద్ర వంటి కంపెనీలతో కాకుండా బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ వంటి విలాసవంతమైన కార్ల కంపెనీలతో టెస్లా పోటీపడుతుందని నిపుణులు అంటున్నారు.

అధిక కార్ల ఉత్పత్తి, తక్కువ విక్రయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న టెస్లా, అధిక సుంకాలున్నప్పటికీ భారత్‌లో తమ ఇంపోర్టెడ్ కార్లను విక్రయించాలనే వ్యూహాన్ని అనుసరిస్తోంది.

టెస్లా, భారత మాస్ మార్కెట్‌పై ప్రభావం చూపుతుందా? అనే ప్రశ్నకు అలా జరగదని సీఎన్‌బీసీ ఇన్‌సైడ్ ఇండియా కార్యక్రమంలో ప్రోస్ట్‌ ఎండ్ సలీవాన్ మొబిలిటీ సెక్టర్ గ్లోబల్ క్లయింట్ లీడర్ వివేక్ వైద్య అన్నారు. ఎందుకంటే, భారత్‌లో ఎక్కువగా అమ్ముడయ్యే కార్ల ధర, దీని ధరలో పదో వంతు మాత్రమే ఉంటుందని ఆయన చెప్పారు.

''అయితే, టెస్లా కార్ల ధరలు ప్రజలకు పూర్తిగా అందుబాటులో లేవని నేను చెప్పను. ఎందుకంటే, భారత్‌లో అన్ని స్థాయిల్లోనూ కార్లను కొనే వినియోగదారులు ఉన్నారు'' అని ఆయన అభిప్రాయపడ్డారు.

ముంబయిలో టెస్లా విడుదల చేసిన కార్లు చైనాలో తయారయ్యాయి. ఈ కార్లను తయారు చేసిన ఫ్యాక్టరీలు, వాహనాలకు కుడి వైపు స్టీరింగ్‌ను అమర్చవు. భారత్‌లో వాహనాలకు స్టీరింగ్ కుడివైపు ఉంటుంది.

ముంబయిలో టెస్లా షోరూమ్ ప్రారంభమైన ఆఫీస్ కాంప్లెక్స్ బయట మంగళవారం పెద్ద ఎత్తున మీడియా గుమిగూడింది.

ఈ ప్రారంభోత్సవానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ కూడా హాజరయ్యారు.

''భవిష్యత్‌లో భారత్‌లో టెస్లా రీసర్చ్ అండ్ డెవలప్‌మెంట్, మ్యాన్యుఫాక్చరింగ్ జరుగుతుందని మేం ఆశిస్తున్నాం. టెస్లా దీని గురించి కచ్చితంగా ఆలోచిస్తుందని మేం నమ్ముతున్నాం'' అని ఫడణవీస్ అన్నారు.

ఆనంద్ మహీంద్ర ఈ పోటీని సానుకూలంగా తీసుకున్నారు. ఇది ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుందని అన్నారు.

''ఎలాన్ మస్క్, టెస్లా మీకు భారత్‌లోకి స్వాగతం. ఈ పోటీ, ఆవిష్కరణలను పెంచుతుంది. ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది. చార్జింగ్ స్టేషన్‌లో మీకోసం ఎదురుచూస్తుంటా'' అని ఆయన సోషల్ మీడియా పోస్ట్‌లో రాశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)