ఆంధ్రప్రదేశ్: లులు మాల్‌కి బెజవాడ పాత బస్టాండ్‌ స్థలం ఇస్తూ జీవో, దీనిపై ఆర్టీసీ వర్గాలు ఏమన్నాయంటే...

లులు మాల్‌ వస్తే ఎలా ఉంటుందనే ఊహా చిత్రం

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, లులు మాల్‌ వస్తే ఎలా ఉంటుందనే ఊహా చిత్రం
    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌
    • హోదా, బీబీసీ కోసం
  • విజయవాడలోని ఆర్టీసీ పాత బస్టాండ్ స్థలాన్ని లులు మాల్‌ ఏర్పాటుకు ఇవ్వాలని జీవో
  • రాష్ట్రవ్యాప్త ఆందోళనలను చేపడతామంటున్న ఆర్టీసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్‌
  • ఇప్పటికే విశాఖ బీచ్‌ రోడ్‌లో 13.74 ఎకరాలు కేటాయింపు
  • విశాఖతో పాటు అమరావతి, తిరుపతి నగరాల్లో లులు మాల్స్‌ ఏర్పాటు

విజయవాడ నగరంలోని ఆర్టీసీ గవర్నర్‌పేట–2 డిపో స్థలాన్ని లులు మాల్‌ ఏర్పాటుకు కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.

బెజవాడ పాత బస్టాండ్‌గా పేరున్న ఆ డిపో స్థలంలో 2.23 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో షాపింగ్‌ మాల్‌ ఏర్పాటుకు 4.15 ఎకరాల భూమిని లీజు పద్ధతిలో కేటాయించేందుకు సూత్రపాయంగా ఆమోదం తెలిపింది.

ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి యువరాజ్‌ పేరిట జూలై 27వ తేదీన జీవో (ఎం.ఎస్‌. నెంబర్‌ 137) విడుదలైంది. అయితే, ఆర్టీసీ వర్గాలు ప్రభుత్వ ప్రతిపాదనను, జీవో 137ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

బెజవాడ పాత బస్టాండ్‌ భూములను లులు మాల్‌కి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని ఆర్టీసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్‌ స్పష్టం చేయగా, జీవోను చూశాక స్పందిస్తానని ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు బీబీసీతో అన్నారు.

ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఆర్టీసీ మాజీ చైర్మన్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
విజయవాడలోని ఆర్టీసీ గవర్నర్‌పేట –2 డిపో

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, విజయవాడలోని ఆర్టీసీ గవర్నర్‌పేట –2 డిపో

జీవోలో ఏముందంటే...

లులు ఇంటర్నేషనల్‌ షాపింగ్‌ మాల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎల్‌ఐఎస్‌ఎం) రూ.156 కోట్ల పెట్టుబడితో 2.32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ ప్లస్‌ త్రీ విధానంలో షాపింగ్‌ మాల్‌ నిర్మించనుంది. 120 రిటైల్‌ దుకాణాలు, 200 వాహనాలకు సరిపడా పార్కింగ్‌ ప్రాంతంతో ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయనుంది.

అందులోని 1.34 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని బయటి వ్యక్తులకు లీజుకు ఇవ్వవచ్చు.

65 సంవత్సరాల లీజును మరో 33 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు. 3 సంవత్సరాల అద్దె మినహాయింపు లేదా షాపింగ్‌ మాల్‌ ప్రారంభ తేదీ వరకు ఏది ముందుగా అయితే అమల్లోకి వస్తుంది.

ఈ స్థలానికి బదులుగా ఏపీఎస్‌ఆర్టీసీకి ప్రత్యామ్నాయంగా వేరే చోట భూమిని కేటాయించాల్సిందిగా ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

చంద్రబాబుని కలిసిన లులు చైర్మన్‌ యూసఫ్‌ అలీ

ఫొటో సోర్స్, X/Chandrababu Naidu

ఫొటో క్యాప్షన్, 2024 సెప్టెంబర్‌ 28న సీఎం చంద్రబాబుని కలిసిన లులు చైర్మన్‌ యూసఫ్‌ అలీ

వారం కిందటే ప్రతిపాదన

విజయవాడలో పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌ (పీఎన్‌బీఎస్‌) సమీపంలోని పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ జంక్షన్‌ వద్దనున్న 4.15 ఎకరాల ఆర్టీసీ భూములను లులు గ్రూప్‌కు ఇవ్వాలని ఇటీవలే ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలోనే ఆ స్థలాన్ని తమకు ఇవ్వాలంటూ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుకు ఏపీ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) ఎండీ అభిషిక్త్‌ కిశోర్‌ వారం కిందట లేఖ రాశారు.

అయితే, ప్రభుత్వ ప్రతిపాదనలను తాను బహిరంగంగా మీడియాకి వెల్లడించలేనని అభిషిక్త్‌ కిశోర్‌ నాలుగురోజుల కిందట బీబీసీతో అన్నారు.

కాగా, ఏపీఐఐసీ లేఖ రాసిన ఆ విషయం బయటకు రావడంతో ఆర్టీసీ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తూ వచ్చారు.

'అక్కడి భూమితో ఈ స్థలాన్ని పోల్చలేం'

''నగరంలోని 4.15 ఎకరాలకు బదులుగా గొల్లపూడిలో ఔటర్‌ రింగ్‌రోడ్డు సమీపంలో స్థలం ఇస్తామని ఏపీఐఐసీ ప్రతిపాదించినట్టు మాకు తెలిసింది. నగర నడిబొడ్డున ఉన్న భూమికి, అక్కడ ఇరిగేషన్‌ కాలువతో కలిసి ఉన్న ఆ భూమికి విలువలో ఎంత వ్యత్యాసముంటుంది? పైగా గవర్నర్‌పేట-2 డిపో స్థలం ఆర్టీసీకి ఐకానిక్‌ వంటిది. ఇది ఒకప్పుడు బెజవాడ బస్టాండ్‌గా ఉండేది. దీన్ని లులుకి ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు'' అని ఆర్టీసీకి చెందిన ఓ ఉన్నతాధికారి బీబీసీతో అన్నారు.

ఈ జీవోపై స్పందించారు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ. ‘‘ ఖాళీగా ఉన్న ఆర్టీసీ స్థలాలను ఆదాయం కోసం వాణిజ్యపరమైన అవసరాలకు ఇవ్వడం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తోంది. ఇది కూడా అలానే చూడాలి. ఖాళీగా ఉంచితే ఏమొస్తుంది?’’ అని వ్యాఖ్యానించారు.

‘‘గతంలోనూ ఇదే మాదిరిగా ఆర్టీసీ భూములిచ్చారు.. కానీ...’’

''2014–19 మధ్య కూడా గన్నవరం సమీపంలో ఆర్టీసీకి ఉన్న 29 ఎకరాల భూములను అప్పట్లో ప్రభుత్వం సాఫ్ట్‌వేర్‌ రంగం అభివృద్ధి పేరిట హెచ్‌సీఎల్‌ కి అప్పగించింది. దాని బదులు కృష్ణాజిల్లా సూరంపల్లిలో ఇస్తామని చెప్పింది. కానీ ఆ హామీ ఇప్పటి వరకు నెరవేరలేదు. ఇప్పుడు నగరంలో ఎంతో విలువైన పాత బస్డాండ్‌ భూములను లులు మాల్‌కి అప్పగించాలని ఉత్తర్వులు ఇవ్వడం అన్యాయం'' అని ఆలిండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ స్టేట్‌ జనరల్‌ సెక్రటరీ ముజఫర్‌ అహ్మద్‌ బీబీసీతో అన్నారు.

గతంలో ఆర్టీసీ భూములను హెచ్‌సీఎల్‌కి అప్పగించినా అందుకు బదులుగా ఇప్పటి వరకు భూములు ఇవ్వకపోవడం, ప్రస్తుతం లులు మాల్‌కి భూములు ఇవ్వాలనే ఉత్తర్వులు రావడంపై రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్‌ రెడ్డితో మాట్లాడేందుకు బీబీసీ యత్నించగా, ఆయన అందుబాటులోకి రాలేదు. స్పందన రాగానే అప్‌డేట్‌ చేస్తాం.

విజయవాడలో ఆర్టీసీ భూములను లులుకి ఇవ్వొద్దంటూ సీపీఎం నిరసన

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, విజయవాడలో ఆర్టీసీ భూములను లులుకి ఇవ్వొద్దంటూ సీపీఎం నిరసన

‘ఇంత విలువైన భూమి ఎలా ఇస్తారు?’

విజయవాడ నగరానికి ఒకప్పుడు ఇదే బస్టాండ్‌.. ఎన్టీఆర్‌ హయాంలో మొదలై చెన్నారెడ్డి హయాంలో ప్రారంభమైన పీఎన్‌బీఎస్‌ తర్వాత ఇది పాత బస్టాండ్‌గా ప్రాచుర్యంలో ఉంది. కాలక్రమంలో గవర్నర్‌పేట–2 ఆర్టీసీ డిపోగా మారిన ఈ బస్డాండ్‌ ప్రాంగణం ప్రస్తుతం 4.15 ఎకరాల్లో ఉంటుంది. ఇక్కడ గవర్నర్‌పేట–1,2 డిపోల బస్సులను నిలుపుతారు. 1, 2 ఆర్టీసీ డిపోల మేనేజర్ల ఆఫీసులు ఇక్కడే ఉంటాయి.

''నగరం మధ్యలో ఉన్న ఇవి ఇప్పుడు ఎక్కడికి వెళ్తాయి. అలానే ఈ బస్డాండ్‌లోని 30సెంట్ల స్థలంలో పదేళ్ల కిందట మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఐరన్‌ స్క్రాప్‌ మెటీరియల్‌తో రూపొందించిన బొమ్మలతో పార్క్‌ ఏర్పాటు చేసింది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు? ప్రభుత్వం వెంటనే ఈ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలి. ఇప్పటికే ప్రతిపాదనలపై రోజువారీ ధర్నాలతో ఉద్యమ కార్యాచరణ చేపట్టాం. ఇప్పుడు జీవో విడుదలైన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతాం’’ అని ఆర్టీసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్‌ బీబీసీతో అన్నారు.

లులు మాల్

ఫొటో సోర్స్, Lulu Group

ఇక్కడే లులుకి ఎందుకంటే..

రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం జూలై 17 గురువారం నాడు అమరావతిలో జరగగా, అందులో లులు గ్రూప్‌ సంస్థ చేపట్టే ప్రాజెక్టులకు ఆమోదం లభించిందని ఏపీఐఐసీ అధికారి ఒకరు బీబీసీకి తెలిపారు.

విజయవాడ నగరంలో పెద్ద మాల్‌తో పాటు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు లులు ముందుకు వచ్చిందని తెలిపారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌ టూరిజం ల్యాండ్‌ అలాట్‌మెంట్ పాలసీ 2024–2029 ప్రకారం షాపింగ్‌ మాల్‌ అభివృద్ధి కోసం లీజు అద్దె ప్రాతిపదికన నగరంలోని ఆర్డీసీకికి చెందిన 4.15 ఎకరాల భూమిని కేటాయించడానికి ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల్లో ఉంది.

ప్రస్తుతం లులు మాల్‌ ఏర్పాటుకు సూచించిన పాత బస్టాండ్‌లోని ఆర్టీసీ నిర్మాణాలను ప్రత్యామ్నాయ స్థలాలకు తరలించేందుకు ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ చర్యలు తీసుకోవాలని ఆ జీవో పేర్కొంది. అదేవిధంగా ఆర్టీసీకి ప్రత్యామ్నాయంగా ఇచ్చేందుకు అవసరమైన భూమిని చూడాలని స్పష్టం చేసింది.

సీఎం చంద్రబాబుని కలిసిన లులు చైర్మన్‌ యూసఫ్‌ అలీ

ఫొటో సోర్స్, X/Chandrababu Naidu

ఫొటో క్యాప్షన్, సీఎం చంద్రబాబుని కలిసిన లులు చైర్మన్‌ యూసఫ్‌ అలీ

విశాఖ బీచ్‌రోడ్‌లో 13.74 ఎకరాలు కేటాయింపు

విశాఖపట్నంలో లులు గ్రూప్‌ నిర్మించనున్న మెగా షాపింగ్‌ మాల్‌ నిర్మాణానికి ప్రభుత్వం భూమిని కేటాయించింది. ఈ మేరకు విశాఖ బీచ్‌ రోడ్డులోని హార్బర్‌ పార్కులో లులు ఇంటర్నేషనల్‌ షాపింగ్‌ మాల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కు 99 ఏళ్ల లీజు ప్రాతిపదికన 13.74 ఎకరాలను ద్వారా ఏపీఐఐసీ ద్వారా కేటాయించినట్టు జీవో 137లో పేర్కొన్నారు.

మొదటి మూడేళ్లు ఎటువంటి లీజు లేకుండా నిర్మాణం పూర్తయిన తర్వాత లీజు వసూలు చేస్తారనీ, చదరపు అడుగుకి నెలకు రూపాయిన్నర చొప్పున ఏడాదికి రూ.4.51 కోట్లు ప్రభుత్వానికి లులు చెల్లిస్తుందని జీవోలో పేర్కొన్నారు.

ప్రతి పదేళ్లకి 10% అద్దె పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. రూ.1066కోట్ల పెట్టుబడితో నిర్మించే ఈ మెగా షాపింగ్‌ మాల్‌ 2028 డిసెంబర్‌ నాటికి అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.

2017లోనే విశాఖలో లులుకి కేటాయింపులు..

2014-19మధ్య చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో 2017లోనే విశాఖ బీచ్‌ రోడ్‌ లోని హార్బర్‌ పార్కులో ఇంటర్నేషనల్ కన్వెన్షన్‌ సెంటర్‌ ఏర్పాటుకు లులు గ్రూప్‌ ముందుకు వచ్చింది. ఆ మేరకు విశాఖలో రూ.2200 కోట్ల పెట్టుబడితో షాపింగ్‌ మాల్, 5 వేల సీట్ల సామర్థ్యంతో కన్వెన్షన్‌, ఫైవ్‌స్టార్ హోటల్‌ నిర్మాణం ద్వారా 10 వేల మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో 2018 సంవత్సరంలో జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో లులు గ్రూప్‌తో నాటి చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.

ఇందుకోసం ఏపీఐఐసీకి చెందిన 11.23 ఎకరాలు, సీఎంఆర్‌ గ్రూప్‌నకు చెందిన విశ్వప్రియ ఫంక్షన్‌ హాల్‌ ఉన్న ప్రాంతం 2.60 ఎకరాలు, మొత్తంగా 13.83 ఎకరాల భూమిని ఆనాటి టీడీపీ ప్రభుత్వం కేటాయించగా, ప్రాజెక్టుకు శంకుస్థాపన కూడా చేసింది.

ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావును కలిసి వినతిపత్రం సమర్పిస్తున్న ఉద్యోగుల నేతలు
ఫొటో క్యాప్షన్, విజయవాడ పాత బస్టాండ్‌ భూములను పరిశ్రమలకు కేటాయించొద్దని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావును కలిసి వినతిపత్రం సమర్పిస్తున్న ఆర్టీసీ ఉద్యోగుల నేతలు

ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వంలో ఏం జరిగిందంటే

2019లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత లులు మాల్‌కు భూకేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ రివర్స్‌ టెండరింగ్‌ పేరిట, 2018లో టీడీపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఆ భూముల ఒప్పందాన్ని 2023లో రద్దు చేసింది. దీంతో లులు గ్రూప్‌ రాష్ట్రం నుంచి తరలిపోయింది.

అప్పట్లో వైసీపీ నిర్ణయాన్ని విశాఖ టీడీపీ నేతలు తీవ్రంగా విమర్శించారు. పెట్టుబడులు, ఉపాధికల్పన లక్ష్యంగా తమ ప్రభుత్వం లులును తీసుకువస్తే వైసీపీ దురుద్దేశపూర్వకంగా పంపించివేసిందని నాటి విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే, టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు. దీనిపై వైసీపీ నేత మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు బీబీసీతో మాట్లాడుతూ.. భూ కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయనే తమ ప్రభుత్వం ఆనాడు రద్దు చేసిందని చెప్పారు.

విశాఖలో కేటాయింపులపై కోర్టుకి

కాగా, విశాఖలో బీచ్‌ సమీపంలో విలువైన స్థలాన్ని లులుకి కట్టబెట్టారంటూ న్యాయవాది పాకా సత్యనారాయణ ప్రభుత్వ ఉత్తర్వులపై హైకోర్టులో పిటిషన్‌ వేయగా, ప్రస్తుతం అది విచారణలో ఉంది. కాగా, లులుకి విశాఖ, విజయవాడల్లో భూకేటాయింపులపై పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్‌తో మాట్లాడేందుకు బీబీసీ యత్నించగా, ఆయన అందుబాటులోకి రాలేదు. ఆయన స్పందిస్తే ఈ కథనంలో అప్‌డేట్‌ చేస్తాము.

లులు గ్రూప్

ఫొటో సోర్స్, luluretail.com

అసలేంటీ లులు మాల్‌?

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ దేశంలోని అబుదాబి ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న వ్యాపార సంస్థ లులు గ్రూప్‌ ఇంటర్నేషనల్‌.

ఎం.ఎ. యూసఫ్‌ అలీ దీని వ్యవస్థాపకులు. ఈయన భారతీయుడు. కేరళకు చెందిన వ్యక్తి.

1995లో ప్రారంభం అయిన ఈ సంస్థలో సుమారు 57 వేల మంది పనిచేస్తున్నారు.

వివిధ రకాల కిరాణా వస్తువులు, పండ్లు, కూరగాయలు, మాంసం.. సహా అన్నీ ఒకచోట అమ్మే హైపర్‌ మార్కెట్‌ వ్యాపారంలో ప్రపంచంలోనే పెద్ద సంస్థల్లో లులు ఒకటి.

ప్రపంచ వ్యాప్తంగా 116 హైపర్‌ మార్కెట్లు, 102 ఎక్స్‌‌ప్రెస్‌ స్టోర్లను నడుపుతున్నట్లు ఆ సంస్థ తమ వైబ్‌సైట్‌లో పేర్కొంది.

కాగా, లులు మాల్‌కి భూ కేటాయింపులు, వివిధ వర్గాల వాదనలపై బీబీసీతో మాట్లాడారు హైదరాబాదులోని లులు ఆపరేషన్స్‌ ప్రతినిధి ముజఫజ్‌. ఏపీలో పెట్టుబడుల వ్యవహారం, అక్కడ ప్రభుత్వంతో ఒప్పందాలపై మీడియాలో వస్తున్న వాదనలు, వార్తలను అబుదాబిలోని తమ సంస్థ పెద్దలకు చేరవేస్తామని చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)