హైదరాబాద్: 'నా అండం, నా భర్త వీర్యం తీసుకుని, వేరొకరి బిడ్డను అప్పగించారు', మోసం ఎలా బయటపడిందంటే..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
''నా నుంచి అండం, నా భర్త నుంచి వీర్యం తీసుకుని సరోగసీ విధానంలో బేబీని పుట్టిస్తామని చెప్పారు. ఆ తర్వాత మాకు ఇచ్చిన పసికందు మా బిడ్డ కాదని, మేం మోసపోయామని అర్థమైంది'' అంటూ హైదరాబాద్‌లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసర్చ్ సెంటర్‌పై రాజస్థాన్‌కు చెందిన దంపతులు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన హైదరాబాద్ గోపాలపురం పోలీసులు.. నిబంధనలకు విరుద్ధంగా ఫెర్టిలిటీ సెంటర్ నడుపుతున్నట్లుగా గుర్తించారు.
సరోగసి ముసుగులో శిశు విక్రయాలు చేశారని పోలీసులు చెబుతున్నారు.
నిర్వాహకురాలు, డాక్టర్‌గా వ్యవహరిస్తున్న నమ్రత సహా 8 మందిని అరెస్టు చేసినట్లు హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ మీడియాకు చెప్పారు.
ఈ విషయంపై యూనివర్సల్ సృష్టి సెంటర్ నిర్వాహకులను సంప్రదించేందుకు బీబీసీ ప్రయత్నించగా.. వారు పోలీసుల అదుపులో ఉన్నందున మాట్లాడేందుకు వీలు కాలేదు.


ఫొటో సోర్స్, HYDPolice
అసలు ఏం జరిగిందంటే..
రాజస్థాన్‌కు చెందిన భార్యాభర్తలు(పేర్లు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు) సికింద్రాబాద్ ప్రాంతంలో ఉంటున్నారు. పిల్లలు పుట్టకపోవడంతో ఐవీఎఫ్ విధానంలో బిడ్డను కనేందుకు నిరుడు ఆగస్టులో సికింద్రాబాద్‌లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసర్చ్ సెంటర్ (సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్)ను సంప్రదించారు.
''రూ.66 వేలు చెల్లించి అన్ని మెడికల్ టెస్టులు చేయించుకోగా.. అంతా బాగానే ఉన్నట్లుగా వచ్చింది. అయినప్పటికీ సరోగసీ విధానంలో పిల్లలను కనేందుకు మాపై ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకులు డాక్టర్ నమ్రత ఒత్తిడి తెచ్చారు. మేం ఇచ్చే అండాలు, వీర్యంతోనే పిండాన్ని తయారు చేసి సరోగసీ విధానంలో పిల్లలు పుట్టిస్తామని చెప్పారు'' అని పోలీసులకు చేసిన ఫిర్యాదులో రాజస్థాన్ దంపతులు తెలిపారు.
ఇందుకుగాను రూ.30 లక్షలు ఖర్చు అవుతుందని ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకులు చెప్పారని దంపతులు తెలిపారు. నిరుడు సెప్టెంబరులో విశాఖపట్నంలోని ఫెర్టిలిటీ సెంటర్‌కు దంపతులను తీసుకెళ్లి.. వారి నుంచి అండం, వీర్యం సేకరించారు.

ఫొటో సోర్స్, HYDPolice
యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసర్చ్ సెంటర్‌కు సికింద్రాబాద్‌తోపాటు విశాఖపట్నం, విజయవాడల్లోనూ బ్రాంచీలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు.
సెప్టెంబరు 23వ తేదీన సరోగేట్ తల్లి (బిడ్డను కనేందుకు ఒప్పందం చేసుకున్న మహిళ) దొరికిందని సెంటర్ నిర్వాహకులు రాజస్థాన్ దంపతులకు సమాచారం ఇచ్చారు.
''తర్వాత వివిధ దశల్లో ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకులు డబ్బులు వసూలు చేశారు. అలా ఈ ఏడాది మే నాటికి రూ.30.26 లక్షలు చెల్లించాం'' అని బాధిత మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఎప్పటికప్పుడు ప్రెగ్నన్సీకి సంబంధించి స్కాన్లు చూపించేవారని తెలిపారు.

ఫొటో సోర్స్, HYDPolice
బిడ్డ వారిది కాదని ఎలా తెలిసిందంటే..
మోసం ఎలా బయటపడిందో పోలీసులు మీడియా సమావేశంలో వెల్లడించారు. వారు చెప్పిన వివరాల మేరకు..
బేబీ పుట్టాక డీఎన్ఏ టెస్టు చేయాలనేది ఫెర్టిలిటీ సెంటర్, రాజస్థాన్ దంపతుల మధ్య ఒప్పందంగా ఉంది.
డెలివరీకి ముందుగానే డీఎన్ఏ టెస్టు చేయాలని వారు కోరినా, డాక్టర్ నమ్రత దాటవేస్తుండటంతో దంపతుల్లో అనుమానం మొదలైంది.
తర్వాత సరోగేట్ తండ్రి మరికొంత డబ్బులు డిమాండ్ చేస్తున్నారంటూ నిర్వాహకులు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో రూ.2 లక్షలు ఇచ్చేందుకు దంపతులు అంగీకరించారు.
ఆ తర్వాత వారి చేతిలో అప్పుడే పుట్టిన బేబీని పెట్టారు. డీఎన్ఏ రిపోర్టులు లేకుండా బిడ్డను ఇవ్వడంతో రాజస్థాన్ దంపతులకు అనుమానం వచ్చి నిలదీయడంతో డీఎన్ఏ శాంపిల్స్ తీసుకున్నారు. అయితే, టెస్టులు చేయకుండా ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకులు దాట వేస్తున్నట్లుగా దంపతులు గుర్తించారు.
తర్వాత ఆ దంపతులు దిల్లీకి వెళ్లి, అక్కడ బేబీ సహా ముగ్గురికీ డీఎన్ఏ టెస్టులు చేయించగా.. అసలు విషయం బయటపడింది. ఆ పసికందుకు వారు తల్లిదండ్రులు (బయోలాజికల్ పేరెంట్స్) కాదని తేలింది.
సరోగసీ విధానాన్ని అనుసరించలేదు..
''ఈ విషయంపై మాట్లాడేందుకు సికింద్రాబాద్‌లోని ఫెర్టిలిటీ సెంటర్‌కు జూన్ 24న రాగా, మమ్మల్ని కలవకుండా డాక్టర్ నమ్రత వెళ్లిపోయారు'' అని తమ ఫిర్యాదులో చెప్పారు రాజస్థాన్ దంపతులు.
దీంతో మోసపోయామని గ్రహించిన దంపతులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకులు సరోగసీ విధానాన్ని అనుసరించలేదని విచారణలో తేలిందని డీసీపీ రష్మీ పెరుమాళ్ చెప్పారు.
''హైదరాబాద్‌లో ఉంటున్న అస్సాంకు చెందిన మొహమ్మద్ అలీ అదిక్, నస్రీన్ బేగం దంపతులతో బేబీని కని ఇస్తే డబ్బులు ఇస్తామని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకులు ఒప్పందం చేసుకున్నారు. అలా బేబీని కన్న వెంటనే రాజస్థాన్ దంపతులకు అప్పగించి, వారి అండం, వీర్యం ద్వారానే జన్మించినట్లుగా చెప్పారు'' అని డీసీపీ తెలిపారు.
"బిడ్డను కన్న మహిళను హైదరాబాద్ నుంచి విమానంలో విశాఖపట్నం తీసుకెళ్లారు. అక్కడ బిడ్డను కన్న తర్వాత ఆమెకు రూ. 80- 90 వేలు ఇచ్చినట్లుగా మా విచారణలో తెలిసింది" అని రష్మీ పెరుమాళ్ చెప్పారు.
''సరోగసీ పేరిట పిల్లల క్రయవిక్రయాలు చేస్తున్నారని, అందుకే కేసులో బిడ్డను విక్రయించినందుకు అస్సాంకు చెందిన దంపతులు, వారికి సహకరించిన ఏజెంటును కూడా అరెస్టు చేశాం'' అని డీసీపీ చెప్పారు.
అలాగే, ఆ పసికందును శిశువిహార్‌కు తరలించినట్లుగా చెప్పారు రష్మీ పెరుమాళ్.

ఫొటో సోర్స్, HYDPolice
పోలీసులు అరెస్టు చేసింది వీరినే..
- అత్తలూరి నమ్రత అలియాస్ పచ్చిపాల నమ్రత.. యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసర్చ్ సెంటర్ నిర్వాహకులు.
- పచ్చిపాల జయంత్ కృష్ణ.. ఇతను నమ్రత కుమారుడు. న్యాయవాదిగా పనిచేస్తున్నట్లుగా చెప్పి సెంటర్‌లో ఆర్థిక లావాదేవీలన్నీ చూస్తుంటారు. ఎవరైనా ఎదురు తిరిగి ప్రశ్నిస్తే 'లీగల్'గా సమస్యలు ఎదుర్కొంటారని బాధితులను బెదిరిస్తుంటారని డీసీపీ చెప్పారు.
- సి.కల్యాణి.. ఈమె విశాఖపట్నంలోని యూనివర్సల్ సృష్టి సెంటర్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నారు.
- గొల్లమందల చెన్నారావు.. ఇతను ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు.
- నర్గుల సదానందం.. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో డాక్టర్‌గా పనిచేస్తూ, యూనివర్సల్ సృష్టి సెంటర్‌లో అనస్థీషియా స్పెషలిస్టుగా పనిచేస్తున్నారు.
- ధనశ్రీ సంతోషి.. అస్సాం దంపతుల విషయంలో ఏజెంట్‌గా పోలీసులు చెబుతున్నారు.
- మొహమ్మద్ అలీ అదిక్, 8. నస్రీన్ బేగం.. వీళ్లది అస్సాం. వీరు బిడ్డను కని అమ్ముకున్నట్లుగా పోలీసులు తెలిపారు.

ఫొటో సోర్స్, HYDPolice
2021లోనే అనుమతులు రద్దు
డాక్టర్ నమ్రత 1995లో మెడికల్ ప్రాక్టీసు ప్రారంభించి, 1998 నుంచి ఐవీఎఫ్, సంతానోత్పత్తి వైద్యం చేస్తున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు.
సికింద్రాబాద్, విశాఖపట్నంలోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసర్చ్ సెంటర్‌లో వైద్యారోగ్యశాఖాధికారులు, రెవెన్యూ అధికారులతో కలిసి పోలీసులు దాడులు చేశారు. ఐవీఎఫ్ చికిత్సతో పాటు మొత్తంగా యూనివర్సల్ సృష్టి సెంటర్ అనుమతుల్లేకుండా నడుస్తున్నట్లుగా గుర్తించి సీజ్ చేశారు.
ఫెర్టిలిటీ సెంటర్‌పై 2021లోనే ఫిర్యాదులు రావడంతో సికింద్రాబాద్‌లోని సెంటర్‌ను సీజ్ చేసినట్లుగా హైదరాబాద్ డీఎంహెచ్‌వో వెంకటి చెప్పారు.
''గతంలోనే సెంటర్ సీజ్ చేయడం జరిగింది. నమ్రత డాక్టర్ లైసెన్స్ కూడా 2021లోనే ముగిసింది. రెన్యూవల్ చేసుకోలేదు. వేరొక డాక్టర్ పేరుతో సెంటర్ నడుపుతున్నట్లుగా ప్రస్తుతం విచారణలో తేలింది'' అని చెప్పారు వెంకటి.
ఒక అపార్ట్మెంట్‌లో ఫ్లాట్ అద్దెకు తీసుకుని, ఎవరైనా బాధితులు సంప్రదించినప్పుడే అక్కడికి వీళ్లు వస్తున్నట్లుగా వెంకటి చెప్పారు.
నాలుగేళ్లుగా నిబంధనలకు విరుద్ధంగా సెంటర్ నడుస్తున్నప్పటికీ, గుర్తించకపోవడంపై వైద్యారోగ్య శాఖపై విమర్శలు వస్తున్నాయి.
''మేం తనిఖీలకు వెళ్లిన సమయంలో మూసివేసి ఉంటోంది. అందువల్ల మా సిబ్బంది గుర్తించలేకపోయారు. అంతేతప్ప నిర్లక్ష్యం లేదు'' అని వెంకటి సమాధానం ఇచ్చారు.
వైద్యారోగ్య శాఖ లెక్కల ప్రకారం, హైదరాబాద్ నగరంలో 158 ఐవీఎఫ్, ఐయూఐ, సరోగసీ సెంటర్లు నడుస్తున్నాయి.
''సెంటర్లన్నింటిలో తనిఖీలు చేపడతాం'' అని చెప్పారు డీఎంహెచ్‌వో.
ఇప్పటికే 10కి పైగా కేసులు
యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసర్చ్ సెంటర్‌పై విశాఖపట్నం, గుంటూరు, గోపాలపురంలో ఇప్పటికే పదికి పైగా కేసులు నమోదయ్యాయని డీసీపీ రష్మీ పెరుమాళ్ చెప్పారు.
ఇందులో, మొత్తం 50 మందికి ప్రమేయం ఉన్నట్లుగా సమాచారం ఉందని చెప్పారామె. పోలీసుల దాడుల్లో గత రెండు, మూడేళ్ల రికార్డులు స్వాధీనం చేసుకున్నారు.
''పదుల సంఖ్యలో చికిత్సలు, సరోగసీ చేసినట్లుగా ఆధారాలు లభించాయి. దీనిపై విచారణ జరుగుతోంది. ఎంతమందికి సరోగసీ పేరుతో బిడ్డలను విక్రయించారనేది తెలుస్తుంది'' అని డీసీపీ చెప్పారు.
పోలీసులు, వైద్యారోగ్యశాఖ తనిఖీలలో యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసర్చ్ సెంటర్లో లింగ నిర్ధరణ పరీక్షల యంత్రాలు ఉన్నట్లుగా గుర్తించారు.
''చాలామంది సరోగసీ విధానంలో పిల్లలు కని, తర్వాత డీఎన్ఏ పరీక్షలు చేయించుకోవడం లేదు'' అని డీసీపీ చెప్పారు.
సరోగసీ నిబంధనలేమిటి?
భారత్‌లో సరోగసీ విధానంపై పరిమితులు ఉన్నాయి. సరోగసీ(నియంత్రణ) చట్టం, 2021 పేరుతో కేంద్రం ప్రభుత్వం 2022 జనవరి నుంచి నిబంధనలను అమల్లోకి తీసుకువచ్చింది.
ఈ విధానంలో కమర్షియల్(వాణిజ్య) పద్ధతిలో, అంటే డబ్బుల కోసం సరోగసీ విధానంలో పిల్లలను కనడం చట్టవిరుద్ధం. కేవలం నిస్వార్థ పద్ధతిలో పిల్లలను కనేందుకు చట్టం అనుమతిస్తుంది.
సరోగసీ విధానంపై గతంలో బీబీసీ రాసిన కథనాన్ని ఇక్కడ లింక్ ఇస్తున్నాం.
మరోవైపు, ''ఎవరైనా సరోగసీ విధానంలో పిల్లలు కనేందుకు డబ్బులు వసూలు చేస్తుంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలి'' అని డీసీపీ రష్మీ పెరుమాళ్ కోరారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














