ఉర్ఫీ జావేద్ ముఖానికి చేయించుకున్న లిప్ ఫిల్లర్ సర్జరీ ఏమిటి?

ఉర్ఫీ జావేద్

ఫొటో సోర్స్, Uorfi

ఫొటో క్యాప్షన్, ఉర్ఫీ జావేద్ తన పెదవుల సైజ్‌ పెంచుకోవడానికి 'లిప్ ఫిల్లర్' అనే కాస్మెటిక్ సర్జరీ చేయించుకున్నట్లు చెప్పారు.
    • రచయిత, డింకిల్ పోప్లీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

హెచ్చరిక: ఈ కథనంలోని కొన్ని చిత్రాలు, సమాచారం మిమ్మల్ని కలవరపెట్టవచ్చు.

సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ఉర్ఫీ జావేద్ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేశారు. అందులో ఆమె ముఖం చాలా ఉబ్బినట్లు కనిపిస్తోంది.

ఆ వీడియోను మొదటిసారి చూస్తే ఏదైనా ఇన్‌స్టాగ్రామ్ ఫిల్టర్ వేశారా అనిపిస్తుంది, కానీ అసలు కారణం మాత్రం వేరే ఉంది.

ఉర్ఫీ ఇటీవల తన పెదవుల సైజును పెంచేందుకు 'లిప్ ఫిల్లర్' అనే కాస్మెటిక్ సర్జరీ చేయించుకున్నానని ఆ పోస్ట్‌లో చెప్పారు.

కానీ పెదవులు నిండుగా కనిపించేలా చేయడానికి ఉపయోగించే లిప్ ఫిల్లర్స్ చేరాల్సిన చోటికి కాకుండా వేరే చోటికి వెళ్లాయని ఆమె రాసుకొచ్చారు.

"ఫిల్లర్స్ సరైన విధంగా వేయలేదని నాకు అర్థమైంది, అందుకే వాటిని తీసేయాలని నిర్ణయించుకున్నా" అని ఉర్ఫీ ఇన్‌స్టాగ్రామ్‌లో రాశారు.

ఉర్ఫీ వాటిని తీయించుకోవడానికి వెళ్లినప్పుడు ఆ క్రమంలో ఆమె ముఖం ఉబ్బిపోయింది.

"నేను ఈ సర్జరీ కొనసాగిస్తాను. ఫిల్లర్స్‌ను పూర్తిగా వద్దనుకోవడంలేదు, కానీ వాటిని తొలగించుకోవడం చాలా నొప్పిగా ఉంటుంది" అని ఆమె అన్నారు.

తరువాత తన ముఖం ఇప్పుడు మామూలుగా అయిందని చెబుతూ ఫోటోను పోస్ట్ చేశారు ఉర్ఫీ.

ఆమె తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో మరో పోస్ట్‌ చేశారు.

"నిజం చెప్పాలంటే, ట్రోలింగ్‌లు, మీమ్స్ అన్నింటిని చూసి నేను బాగా నవ్వుకున్నా. ఇది ఫిల్లర్స్ లేకుండా, వాపులేని ముఖం. ఇక్కడ నేను లిప్ ప్లంపర్ మాత్రమే వాడాను" అని ఆ పోస్ట్‌లో రాశారు.

ఇంతకీ ఫిల్లర్స్ అంటే ఏమిటి? అవి ఎలా పని చేస్తాయి? వాటి ధర ఎంత? ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఫిల్లర్స్ అంటే ఏమిటి?

లూథియానాలో 'స్కినిక్' అనే కాస్మటాలజీ క్లినిక్ నడుపుతున్న చర్మవైద్య నిపుణురాలు డాక్టర్ అనుపమా రాంపాల్ ఈ విషయం గురించి బీబీసీతో మాట్లాడారు.

"ఫిల్లర్స్ అనేవి హయలురానిక్ యాసిడ్ అణువులు. వీటిని శరీరంలోని ఏ భాగంలోనైనా ఇంజెక్ట్ చేయవచ్చు. హయలురానిక్ యాసిడ్ సహజంగా మన శరీరంలో కూడా ఉంటుంది. ఇది ప్రధానంగా చేసే పని నీటిని పీల్చుకోవడం. దీనివల్ల చర్మం మృదువుగా, మెరుస్తూ ఉంటుంది" అని డాక్టర్ అనుపమ చెప్పారు.

"సాధారణంగా హయలురానిక్ యాసిడ్ అణువులు లేదా ఫిల్లర్స్ మనం నిండుగా లేదా బొద్దుగా కనిపించేలా చేయాలనుకునే ప్రాంతాలలోకి ఇంజెక్ట్ చేస్తారు. బుగ్గలు, పెదవులు, ముక్కు, కళ్ల కింద, దవడ రేఖ, గడ్డం, నుదుటిపై ఇంజెక్ట్ చేస్తారు" అని అనుపమ తెలిపారు.

ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్

ఫొటో సోర్స్, Uorfi

ఫొటో క్యాప్షన్, ఉర్ఫీ జావేద్

ఖర్చు ఎంత?

ఇలాంటి సర్జరీకి సుమారు రెండు గంటలు పడుతుందని డాక్టర్ అనుపమ రాంపాల్ చెప్పారు.

"ఫిల్లర్ ఇంజెక్ట్ చేయాల్సిన ప్రదేశంలో ముందుగా లోకల్ అనస్తీషియాగా ఒక క్రీమ్ రాసి, ఆ తర్వాత ఫిల్లర్ ఇంజెక్ట్ చేస్తారు" అని ఆమె తెలిపారు.

"ఈ సర్జరీకి సుమారు రూ. 25,000 నుంచి రూ. 35,000 వరకు ఖర్చవుతుంది. దీని ప్రభావం ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు ఉంటుంది" అని డాక్టర్ అనుపమ చెప్పారు.

"ఈ సర్జరీ కోసం సాధారణంగా 25 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మహిళలే ఎక్కువగా వస్తుంటారు" అని ఆమె తెలిపారు.

lip fillers

ఫొటో సోర్స్, Getty Images

ఫిల్లర్స్‌ను 'డిజాల్వ్' చేయడం అంటే ఏంటి?

‘హయలురానిక్ యాసిడ్ ఇంజెక్షన్లు తరచూ 'బ్లైండ్ స్పాట్స్'లో ఇస్తారు. అంటే నిపుణులు కేవలం తమ అంచనా ఆధారంగా ఈ ఇంజెక్షన్లు ఇస్తుంటారు" అని డాక్టర్ అనుపమ రాంపాల్ చెప్పారు.

‘ఈ ఇంజెక్షన్‌ను శిక్షణ పొందిన నిపుణులు చేయకపోతే లేదా అవసరమైన జాగ్రత్తలు తీసుకోకపోతే, ఫిల్లర్ అవి చేరాల్సిన స్థానం నుంచి పైకి లేదా కిందకి మారిపోవచ్చు’ అని ఆమె అన్నారు.

అలా జరిగితే ముఖం అందవికారంగా మారొచ్చు.

‘ఉదాహరణకు ఫిల్లర్స్‌ను పెదవుల్లో ఇంజెక్ట్ చేస్తే అవి పైవైపు వ్యాపించే అవకాశాలు ఉంటాయి. దీని వల్ల అసమతుల్యత ఏర్పడవచ్చు. కొన్నిసార్లు, క్లయింట్ ఫలితాలతో సంతృప్తిగా లేకపోతే, ఈ సర్జరీని రివర్స్ చేయడం కూడా సాధ్యమే’ అని డాక్టర్ అనుపమ అంటున్నారు.

నిపుణులు హయలురానిడేస్ అనే ఎంజైమ్‌ను ఉపయోగించి లిప్ ఫిల్లర్స్‌‌ను కరిగిస్తారు. ఈ పదార్ధం హయలురానిక్ ఆమ్లం కలిగిన ఫిల్లర్స్‌‌ను మాత్రమే నాశనం చేస్తుంది.

‘సాధారణంగా ఈ రివర్సల్ ప్రక్రియ ఎటువంటి సమస్యలు లేకుండా జరుగుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఇది "ఎంప్టీ పాకెట్స్" అంటే ఖాళీల ప్రదేశాలను ఏర్పరుస్తుంది’ అని అనుపమ చెప్పారు.

lip fillers

ఫొటో సోర్స్, Getty Images

ఫిల్లర్స్ వల్ల కలిగే నష్టాలు

ఈ సర్జరీ నిపుణుల పర్యవేక్షణలో జరిగితే చాలా సురక్షితమని స్కినోవేషన్ క్లినిక్స్ వ్యవస్థాపక డైరెక్టర్, చర్మవ్యాధి నిపుణులు డాక్టర్ అనిల్ గంజూ బీబీసీతో అన్నారు.

"అయితే దీని అర్థం దానితో సంబంధం ఉన్న ప్రమాదాలు పూర్తిగా తొలగిపోతాయని కాదు" అని ఆయన చెప్పారు.

"ఫిల్లర్స్‌‌ను చర్మంలోని వివిధ పొరలలోకి ఇంజెక్ట్ చేస్తారు. కానీ అవి పొరపాటుగా రక్తనాళంలోకి వెళితే, అది చాలా తీవ్రమైన సమస్యకు దారితీయొచ్చు" అని డాక్టర్ గంజూ అంటున్నారు.

కళ్ళ కింద, నుదుటిపై ఫిల్లర్స్ వేయడం అత్యంత క్లిష్టమైన పని. ఎందుకంటే ఈ భాగాల్లో వేసేటప్పుడు ఏదైనా తప్పు జరిగితే, అది కంటిచూపుపై ప్రభావం చూపించే ప్రమాదం ఉంటుంది" అని ఆయన అంటున్నారు.

ఇంజెక్షన్ చేసిన చోట చర్మం నీలం, ఎరుపు రంగుల్లోకి మారడం, వాపు, నొప్పి, దురద వంటి దుష్ప్రభావాలు ఉంటాయి" అని ఆయన వివరించారు.

"తీవ్రమైన దుష్ప్రభావాల గురించి చెప్పాలంటే ఇన్ఫెక్షన్, అలెర్జిక్ రియాక్షన్స్, కంటిచూపు సమస్యలు ఉండవచ్చు" అని డాక్టర్ గంజూ అన్నారు.

హైయలురోనిక్ ఆమ్లం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఫిల్లర్స్ శరీరంలోని ఏ భాగానికైనా ఇంజెక్ట్ చేయవచ్చు

తప్పు ఎక్కడ జరగొచ్చు?

దీనికి సంబంధించి.. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రోహిత్ రాంపాల్ మాట్లాడుతూ.. నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనల ప్రకారం చర్మవ్యాధి నిపుణులు లేదా ప్లాస్టిక్ సర్జన్‌లకు మాత్రమే ఫిల్లర్స్, ఇతర కాస్మటాలజీ ప్రక్రియలు నిర్వహించడానికి అనుమతి ఉందని అన్నారు.

‘పార్లర్, డెంటల్ లేదా ఇతర రంగాలతో సంబంధం ఉన్న చాలా మంది తమ సొంత వాణిజ్య క్లినిక్‌లను తెరిచి ఈ సేవలను అందించడం మొదలుపెడుతున్నారు. వారు ఈ విషయంలో నిపుణులు కాకపోయినా, తక్కువ ధరలు, మార్కెటింగ్ ద్వారా ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటారు" అని డాక్టర్ రోహిత్ రాంపాల్ అంటున్నారు.

"డబ్బు ఆదా చేయడానికి స్పెషలిస్ట్ కాని వ్యక్తి నుంచి ఈ చికిత్స చేయించుకుంటే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఇది చికిత్స సమయంలో లేదా తర్వాత అనేక సమస్యలకు దారితీస్తుంది" అని ఆయన అన్నారు.

గుర్తుంచుకోవలసిన విషయాలేంటి?

చర్మవ్యాధి నిపుణురాలు డాక్టర్ అనుపమ రాంపాల్ మాట్లాడుతూ, ఫిల్లర్స్ తీసుకునే ముందు ఈ విషయాలను గుర్తుంచుకోవడం ముఖ్యమని చెప్పారు.

  • అర్హత కలిగిన ప్రొఫెషనల్‌ని సంప్రదించండి. డెర్మల్ ఫిల్లర్స్‌తో అనుభవం ఉన్న సర్టిఫైడ్ డెర్మటాలజిస్ట్ లేదా ప్లాస్టిక్ సర్జన్‌ని ఎంచుకోండి.
  • ప్రక్రియను అర్థం చేసుకోండి: ఉపయోగించిన ఫిల్లర్ రకం ఏంటి? దాని ప్రభావాలు ఎంతకాలం ఉంటాయి? ఏవైనా దుష్ప్రభావాలు ఉంటాయేమో అడగండి.
  • మీ మెడికల్ హిస్టరీని తప్పకుండా డాక్టర్‌కు తెలియజేయండి.
  • రక్తాన్ని పలుచబరిచే మందులను వేసుకోకండి.
  • మద్యం, ధూమపానం తగ్గించండి.
  • డాక్టర్ సూచనలను పాటించండి.

మీకు ఏదైనా సమస్య ఉంటే, వెంటనే వైద్యుడికి తెలియజేయండి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)