ఆఫీస్ రొమాన్స్: సహోద్యోగులతో రిలే‌షన్‌షిప్‌లో ఉన్నారా? అయితే, ఈ విషయాలు గుర్తుంచుకోండి..

రిలేషన్‌షిప్, ఆఫీస్ రొమాన్స్, కంపెనీ పాలసీ, హెచ్‌ఆర్ పాలసీ

ఫొటో సోర్స్, Getty Images/BBC

ఫొటో క్యాప్షన్, చాలా కంపెనీలు మేనేజర్‌కు, ఆయన లేదా ఆమె కింద పనిచేసే వ్యక్తికి మధ్య సంబంధాన్ని అనుమతించవు.
    • రచయిత, బీబీసీ మరాఠీ టీం

కోల్డ్ ప్లే కాన్సర్ట్‌లో తమ కంపెనీకి చెందిన ఇద్దరు ఉద్యోగులు ఆలింగనం చేసుకుంటున్నట్లు కనిపిస్తోన్న క్లిప్ వైరల్ అయిన తర్వాత తమ కంపెనీ సీఈవోను సస్పెండ్ చేసినట్లు అమెరికా టెక్ కంపెనీ ఆస్ట్రానమర్ ప్రకటించింది.

బోస్టన్‌ కాన్సర్ట్‌లోని బిగ్ స్క్రీన్‌పై కనిపించిన ఆ దృశ్యంలో, ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు కౌగిలించుకున్నట్లుగా ఉన్నారు. ఇందులో ఒకరు ఆ కంపెనీ సీఈవోగా వార్తలొచ్చాయి.

మరొకరు అదే కంపెనీలో చీఫ్ పీపుల్ ఆఫీసర్‌గా (హెచ్‌ఆర్) పనిచేస్తున్నట్లు తెలిసింది.

ఆ దృశ్యం స్క్రీన్‌పై ప్రదర్శితం కాగానే, వారిద్దరూ వెంటనే కెమెరా నుంచి తమ ముఖాలను దాచుకున్నారు.

ఆ తర్వాత సింగర్ చేసిన ఒక వ్యాఖ్యతో ఆస్ట్రానమర్ అనే కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌లుగా పనిచేస్తోన్న వీరిద్దరి మధ్య ఎఫైర్ వెలుగులోకి వచ్చింది.

ఈ నేపథ్యంలో, సీఈవో ఆండీ బిరాన్‌ను సస్పెండ్ చేసినట్లు సామాజిక మాధ్యమం 'ఎక్స్‌'లో కంపెనీ పోస్ట్ చేసింది.

ఈ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అయినప్పటి నుంచి ప్రతిచోటా ఆఫీస్ రొమాన్స్ గురించి, పని ప్రదేశాల్లో సంబంధాల గురించి చర్చించుకుంటున్నారు.

ఒకవేళ మీరు పనిచేసే కంపెనీలో ఎవరితోనైనా ప్రేమలో పడితే ఎలా? ఆ తర్వాత జరగబోయేది ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం..

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
రిలేషన్‌షిప్, ఆఫీస్ రొమాన్స్, కంపెనీ పాలసీ, హెచ్‌ఆర్ పాలసీ

ఆఫీసు సహోద్యోగులతో రొమాంటిక్ రిలేషన్‌షిప్‌ల కారణంగా చాలామంది ఉన్నత స్థాయి అధికారులు తమ ఉద్యోగాలను పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి.

సహోద్యోగులతో ఎవరితోనైనా ఆఫీసు బయట సంబంధం కొనసాగించినా అది ఆఫీస్ రిలేషన్‌షిప్ కిందకే వస్తుంది.

పని ప్రదేశంలో ఎలా ప్రవర్తించాలి? అనే విషయాలను తెలుపుతూ చాలా కంపెనీలు ప్రవర్తన నియమావళి లేదా ఎంప్లాయీ హ్యాడ్‌బుక్స్‌ను అందిస్తుంటాయి.

ఒకవేళ పని ప్రదేశంలో, ఇలాంటి విషయాలు క్లిష్టంగా మారుతున్నా.. లేదా ఎవరితోనైనా సంబంధం బలపడుతున్నా కింది విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి.

ఆఫీస్ రొమాన్స్, రిలేషన్‌షిప్

ఫొటో సోర్స్, Getty Images

రిలేషన్‌షిప్, ఆఫీస్ రొమాన్స్, కంపెనీ పాలసీ, హెచ్‌ఆర్ పాలసీ

ఆఫీస్ రొమాన్స్ విషయంలో మీ కంపెనీ పాలసీ ఏమిటో తెలుసుకోవాలి. చాలా కంపెనీల్లో దీనిపై అధికారిక పాలసీలు ఉంటాయి.

ఈ పాలసీల ద్వారా ఏది అనుమతించదగినదో, ఏది కాదో తెలుసుకోవచ్చు.

ఉదాహరణకు, చాలా కంపెనీలు మేనేజర్‌కు, ఆయన లేదా ఆమె కింద పనిచేసే వ్యక్తికి మధ్య సంబంధాన్ని అనుమతించవు.

ఎందుకంటే, దీనివల్ల పని ప్రదేశంలో వివక్షకు దారితీస్తుందని కంపెనీలు భావిస్తాయి.

ఉద్యోగుల పనితీరు అంచనా కూడా పక్షపాత ధోరణిలో ఉంటుందని కంపెనీలు ఈ సంబంధాలను ప్రోత్సహించవు.

కొన్ని కంపెనీల పాలసీ ప్రకారం.. ఒకే కంపెనీలో పనిచేసే ఎవరైనా ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకుంటే, ఆ ఇద్దరిలో ఒకరు తమ ఉద్యోగానికి రాజీనామా చేయాలి.

మరికొన్ని కంపెనీల పాలసీ ప్రకారం.. ఉద్యోగుల మధ్య ఈ సంబంధాల విషయంలో ఎలాంటి అభ్యంతరం చెప్పనప్పటికీ, వారి మధ్యనున్న సంబంధాన్ని వెల్లడించాలని ఉద్యోగులకు చెబుతుంటాయి.

అయితే, ఒకే టీమ్‌లో ఆ ఇద్దరు ఉద్యోగులు పనిచేస్తున్నప్పుడు, వారి మధ్య బాస్-ఎంప్లాయీ సంబంధం ఉంటే, హెచ్‌ఆర్ ఆ ఇద్దరినీ రెండు వేర్వేరు టీమ్‌లలో ఉండేలా చూడాలి.

అయితే, ఈ విషయంలో మీ కంపెనీ పాలసీ ఏంటో తెలుసుకోవాలి.

ఆఫీస్ రొమాన్స్, రిలేషన్‌షిప్

ఫొటో సోర్స్, Getty Images

రిలేషన్‌షిప్, ఆఫీస్ రొమాన్స్, కంపెనీ పాలసీ, హెచ్‌ఆర్ పాలసీ

ఆఫీసులో ఎవరితోనైనా సంబంధం పెట్టుకోవడం అంటే అది చాలా సున్నితమైన అంశం.

సున్నితమైన కోణంలో దీన్ని చూడాలి. వృత్తిపరమైన హద్దులను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉల్లంఘించకూడదు.

బీబీసీ వర్క్‌లైఫ్ దీనిపై ఒక కథనాన్ని ప్రచురించింది. దీనిలో కొన్ని ముఖ్యమైన విషయాలను తెలియజేసింది. అవేంటంటే..

  • మీ టీమ్‌లో ఎవరితోనైనా ప్రత్యేకమైన అనుబంధాన్ని ఏర్పరుచుకుంటే, దాన్ని మీరు పని ప్రదేశంలోకి తీసుకురాకూడదు. ఆఫీసులో వ్యక్తిగత, ప్రైవేట్ విషయాలను మాట్లాడుకోకూడదు.
  • ఆఫీసు సంబంధాలు ప్రొఫెషనల్‌గా ఉండేలా చూసుకోవాలి. ఈ సంబంధం తెలిసో, తెలియకో వర్క్‌లో ఎలాంటి ప్రభావం చూపకూడదు, అలాగే ఎలాంటి వివక్షకు దారితీయకూడదు.
  • ఏ సంబంధమైనా అది జీవితకాలం కొనసాగకపోవచ్చు. పని ప్రదేశంలో ఎవరితోనైనా మీరు సంబంధాన్ని కొనసాగించి, ఆ తర్వాత ఇద్దరి మధ్యన పొంతన కుదరక విడిపోతే, అప్పుడు ఎంతో ఓపికతో, లోతైన అవగాహనతో చాలా విషయాలను సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో మీ భావోద్వేగాలను పని ప్రదేశంలోకి తీసుకురావడం అంత మంచిది కాదు. మీ వ్యక్తిగత జీవితంలో జరిగిన దాని గురించి మీ వృత్తిపరమైన జీవితంలో కోపాన్ని ప్రదర్శించకూడదు.
ఆఫీస్ రొమాన్స్, రిలేషన్‌షిప్

ఫొటో సోర్స్, Getty Images

రిలేషన్‌షిప్, ఆఫీస్ రొమాన్స్, కంపెనీ పాలసీ, హెచ్‌ఆర్ పాలసీ

పని ప్రదేశంలో చోటుచేసుకునే వ్యక్తిగత సంబంధాలు కొన్నిసార్లు పని దోపిడీకి కూడా దారితీస్తాయన్నది గుర్తుంచుకోవాలి.

ముఖ్యంగా సీనియర్, జూనియర్ మధ్య ఏదైనా సంబంధం ఏర్పడితే, అది తీవ్రమైన పని ఒత్తిడికి దారితీస్తుంది. అలాగే, కొన్ని పనులు తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వస్తుంది.

మీరు నిజంగానే ప్రేమలో ఉన్నారా? లేదా? ఆ సంబంధాన్ని అవతలి వ్యక్తి వాడుకుంటున్నారా? అనే విషయాన్ని గ్రహించాలి.

ఇలాంటి సంబంధంలో మీరు చిక్కుకుపోతే.. కంపెనీ హెచ్ఆర్‌పై నమ్మకం ఉంచి వారితో మాట్లాడాలి.

పని ప్రదేశంలో సంబంధాలను సరిగ్గా మేనేజ్ చేసుకోగలగడం అటు వ్యక్తిగత జీవితానికీ, ఇటు వృత్తిపరమైన జీవితానికీ చాలా ముఖ్యం.

ఎందుకంటే, ఒకవేళ కంపెనీ నియమ, నిబంధనలను, విధానాలను ఉల్లంఘిస్తే, కంపెనీ ప్రతిష్టను లేదా వర్క్‌ను ప్రమాదంలోకి నెడితే, మీరు కేవలం ఉద్యోగాన్ని పోగొట్టుకోవడమే కాదు. మీ సీవీలో అది ఎప్పటికీ ఒక మాయని మచ్చలా మిగిలిపోతుంది.

పని ప్రదేశంలో నైతికపరమైన బాధ్యతల గురించి వర్క్ లైఫ్ ఒక కథనాన్ని ప్రచురించింది. దాని గురించి మీరు ఈ లింక్‌లో వివరంగా తెలుసుకోవచ్చు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)