భర్తలను హత్య చేసిన ఘటనలపైనే ఇంత చర్చ ఎందుకు, సమస్యలోని అసలు కోణాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదా?

ఫొటో సోర్స్, Raghuvanshi family
- రచయిత, నాసిరుద్దీన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
మహిళల చేతుల్లో మగవాళ్ల జీవితాలు ప్రమాదకరంగా మారాయన్న మాటలను ఈ మధ్య బాగా వింటున్నాం.
ముఖ్యంగా ఒక వ్యక్తి హత్యలో ఆయన భార్య లేదా పార్ట్‌నర్ ప్రమేయం ఉందని తెలిసినప్పుడు, అనుమానం వచ్చినప్పుడు ఇది ఎక్కువగా వినిపిస్తోంది.
గత కొన్ని నెలలుగా ఇలాంటి వార్తలు తరచూ కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి.
చూస్తుండగానే ఈ వార్తలు న్యూస్, సోషల్ మీడియాలలో విపరీతంగా ప్రచారమవుతున్నాయి.
ఇలాంటి వార్తలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్న తరుణంలో, ప్రతి మహిళ తన భర్తను లేదా భాగస్వామిని చంపేందుకు కుట్ర చేస్తోందన్న భావన ప్రతిచోటా క్రియేట్ అవుతోంది.
ఇలాంటి కొన్ని ఘటనలను గుర్తు చేసుకుందాం:
- ఒక వ్యక్తి మృతదేహం నీలం రంగు డ్రమ్‌లో దొరికింది.
- హనీమూన్‌కు వెళ్లిన ఓ వ్యక్తి, భార్య చేతిలో హత్యకు గురయ్యారు.
- ఒకచోట పెళ్లయిన తొలి రాత్రే భార్య తన భర్తను కత్తితో బెదిరించింది.
ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చిన తర్వాత, వీటికి రకరకాలుగా, క్రియేటివ్‌గా టైటిళ్లు పెడుతూ.. సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలు దర్శనమిచ్చాయి. ఇస్తూనే ఉన్నాయి.
ఈ వీడియోలు, కథనాలు సంఘటన తీవ్రతను సూచించేలా కాకుండా..ఎగతాళిగా, నవ్వులాటగా, లేదంటే స్త్రీ పురుషులలో ఎవరో ఒకరిని కించపరిచేలా కనిపించాయి.

నీలం రంగు డ్రమ్ అన్నది భర్తను భయపెట్టే ఆయుధంగా మారింది. దానిని అలా చిత్రిస్తూ చాలా వీడియోలు, పోస్టులు ఆన్‌లైన్‌లో కనిపించాయి.
ఇదొక్కటే కాదు, ప్రతి భార్యా తన భర్తను బెదిరిస్తున్నట్లు, ఆమెను చూసి ఆయన భయపడుతున్నట్లు పోస్టుల్లో, వీడియోల్లో కనిపించేది.
ఇలాంటివి చూసి దీనిని ఒక సీరియస్ విషయంగా కాకుండా, ఒక జోక్‌గా భావించే పరిస్థితి ఏర్పడింది.
అందుకే, ఈ ఘటనల తీవ్రతపై లోతైన చర్చ జరగకుండా..అవి కేవలం నవ్వులాటగా, అంత ప్రాధాన్యత లేని అంశంగా మారిపోయాయి.
అంతే కాదు, మహిళలకు వ్యతిరేకంగా ఏదైనా బలమైన ఆధారం దొరికినట్లు కనిపిస్తే చాలు,.. ‘చూశారా మహిళలు ఇలానే చేస్తారని మేం చెప్పాం కదా’ అంటూ వ్యాఖ్యానించినవాళ్లూ ఉన్నారు.
కానీ, ఇది అంత మామూలు విషయమా? నవ్వులాటగా తేలిగ్గా తీసుకోవాల్సిందా?
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ), ఇతర సోర్స్‌ల నుంచి సేకరించిన గణాంకాలను చూస్తే...మహిళలు అనేక రూపాలలో హింసను ఎదుర్కోవాల్సి వస్తోందని తెలిసింది. ఇలా హింసను ఎదుర్కొంటున్న మహిళల్లో అనేక వయోవర్గాల వారున్నారు.
మరి పురుషులకు కూడా ఇలా జరుగుతుందా?
ఇక్కడ ఒక విషయం స్పష్టం. ఇళ్లల్లో, కుటుంబాల్లో, సమాజంలో మహిళలపై హింస అనేది సాధారణంగా మారిపోయింది. అందుకే ఏదైనా అసాధారణంగా, ప్రత్యేకంగా కనిపిస్తే తప్ప మహిళలపై హింసను పెద్దగా పట్టించుకోరు.
కానీ, పురుషులపై ఏదైనా హింస జరిగితే, దాన్ని చిన్న విషయంగా తీసుకోరు. ప్రతి ఘటనను, అది చిన్నదైనా,పెద్దదైనా పురుష జాతి ఉనికికే ప్రమాదం అన్నట్లుగా చూపిస్తారు, ప్రచారం చేస్తారు.

ఫొటో సోర్స్, BBC Tamil
అవును, మహిళలు కూడా హింసకు పాల్పడతారు
మహిళలు కూడా హింసకు పాల్పడతారు అనే నిజాన్ని ఒప్పుకునేందుకు వెనకాడేది ఎవరు?
పురుషాధిక్యత కారణంగా సమాజంలో ఏర్పడిన ఆలోచనలు, విలువలు, సామాజిక ప్రమాణాల్లోనే మహిళలు కూడా పెరిగారు.
పురుషాధిక్య శక్తిని, బలాన్ని ఇచ్చిన ఈ ప్రమాణాలే, మగవాళ్లలో ఒక రకమైన హింసా ప్రవృత్తిని సృష్టించాయి.
దారుణమైన హింస, పురుషాధిక్యత సమాజమంతా వ్యాపించినప్పుడు, దాని నుంచి మహిళలు ఎలా తప్పించుకోగలరు?
ప్రతి అంశాన్ని, ప్రతి ఒక్కరినీ తమ నియంత్రణలో ఉంచాలనుకోవడం, తిట్టడం, కొట్టడం లేదా ఆధిక్యం ప్రదర్శించడం, తనకంటే తక్కువవారిగా చూడటం లేదా చంపడం.. ఇవన్ని హింసాత్మక పురుష స్వభావానికి సంకేతాలుగా ఉంటూ వస్తున్నాయి.
వీటి సాయంతోనే శతాబ్దాలుగా పురుషులు ఈ సమాజాన్ని నడిపిస్తున్నారు. ఇవి తమ శక్తికి, బలానికి, ఆధిక్యతకు సంకేతంగా చూస్తున్నారు.
చాలామంది మహిళలు కూడా పురుషులు ఇలా ప్రవర్తించడం కరెక్టేనని భావిస్తుంటారు.

ఫొటో సోర్స్, ANI
పురుషులు, మహిళలపై హింస
కానీ, ఈ హింస పురుషులపైన, మహిళలపైనా ఒకే స్థాయిలో జరుగుతోందా? అంటే, కచ్చితంగా కాదు. ఈ హింసకు ప్రధాన కారణం అసమానత్వం, వివక్ష, అధికారం, బలం.
ఈ హింసను అతి సామాన్య విషయంగా చూపడం, లేదంటే చట్టబద్ధం చేయడం అన్నది ఈ వ్యవస్థే చేసింది.
మహిళలపై జరుగుతున్న హింస తప్పు అని అంగీకరించడం చాలామందికి కష్టంగా అనిపిస్తోంది. అందుకే, ఈ హింసను పదేపదే చూపించాల్సి వస్తోంది. చట్టం దృష్టిలో ఇది తప్పని చెప్పాల్సి వస్తోంది.
అయితే, మహిళలు పాల్పడే హింస విషయంలో ఇలా జరగడం లేదు. వ్యక్తిగత ప్రయోజనం లేదా తాత్కాలిక కారణాలే ఈ ఘటనలకు ఎక్కువ కారణమవుతున్నాయి.
అంతేకాక, చాలాసార్లు పురుషాధిక్యత వల్ల ఏర్పడిన పరిస్థితులే వీటికి దారి తీస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లో దారుణమైన హింస కనిపిస్తోంది.
అయితే, ఇవి కూడా పురుషుల సాయం లేకుండా కూడా జరగడం లేదు. ఈ నేరాలకు స్ఫూర్తి పురుషులు కూడా కావొచ్చు.
ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయాలి. మహిళలు పాల్పడుతున్న హింసను సమర్థించడానికి ఇదంతా చెప్పడం లేదు. కానీ, వీటిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.
మహిళల హింసలో ఎలాంటి కోణం కనిపిస్తోంది?
ఎవరిపైనైనా, ఏ రూపంలో హింస జరిగినా..అది సమర్థించేది కాదన్నది ఒప్పుకోవాల్సిన విషయం.
పురుషులపై లేదా మహిళలపై ఏదైనా హింస జరిగినట్లు కనిపిస్తే దాన్ని విచారించాలి.
ఉదాహరణకు, మహిళపై జరిగిన హింస గురించి ఇటీవల వార్తల్లో మూడో వ్యక్తిని పదేపదే ప్రస్తావిస్తే.. ఆ మూడో వ్యక్తిని మీడియా ఒక 'లవర్'గా పేర్కొంటోంది.
అయితే, సహజంగా ఇక్కడొక ప్రశ్న తలెత్తడం జరుగుతుంది.
ఈ సమస్య ఒక మహిళ తన భాగస్వామిని ఎంపిక చేసుకునే హక్కుకు సంబంధించినది కాదా? కేవలం వైవాహిక జీవితంలో ఒక మహిళ పాల్పడే హింస మాత్రమేనా? అనే అనుమానాలను లేవనెత్తుతోంది.
మహిళ తమ భాగస్వామిని ఎంపిక చేసుకునే స్వేచ్ఛను మన కుటుంబ వ్యవస్థ లేదా సమాజం సహజంగా అంగీకరించదు.
తాము వెతికిన అబ్బాయినే ఆమె పెళ్లి చేసుకోవాలని కుటుంబం కోరుకుంటుంది. ఇదే తరచూ ఒకరికొకరు సరితూగని జంటలను బలవంతంగా కలుపుతుంది.
ఈ బలవంతపు నిర్ణయానికి వ్యతిరేకంగా మహిళలు బలంగా తమ గొంతును వినిపించలేరు. ఫలితంగా అది విడాకులకు, ఒక్కోసారి హింసకు దారితీస్తుంది.
భర్తలపై లేదా భాగస్వాములపై భార్యలు పాల్పడే హింసకు, మహిళలపై జరుగుతోన్న హింసకు చాలా తేడా ఉంటుందన్నది గుర్తుంచుకోవాల్సి విషయం.
మహిళలపై జరుగుతున్న హింస చాలావరకు వారు స్త్రీ అయినందున జరుగుతుంటుంది.
ఉదాహరణకు, ఆడపిల్ల గర్భంలో ఉందని తెలిసినప్పుడే గర్భస్రావానికి పాల్పడటం, చదువుకోకుండా అడ్డుకోవడం, అత్యాచారానికి పాల్పడటం, వరకట్నం కోసం హత్య చేయడం...ఇవన్ని స్త్రీ కావడం వల్ల వారిపై జరిగే హింసలే.
ఇలాంటివి అబ్బాయిలపై జరగడం లేదు. ఈ తేడాను అర్థం చేసుకోకపోతే, వీటిపై తీసుకునే చర్యలు కూడా పరిస్థితిని మార్చలేవు.

ఫొటో సోర్స్, ANI
ఈ హింసను ఎలా ఆపగలం?
ఏ రకమైన హింస కూడా భరించరానిదే. అది నేరమే. మహిళపై ఒక వ్యక్తి హింసకు పాల్పడితే అది తప్పు. పురుషునిపై మహిళ హింసకు పాల్పడితే అది కూడా నేరమే.
అందుకే, మహిళల సమస్యలపై పోరాడే ప్రతి ఒక్కరూ హింసారహిత సమాజం గురించి మాట్లాడుతున్నారు.
ఒక హింసను తప్పు అని చెప్పి, మరో హింసను ఒప్పని చెప్పేందుకు ఆస్కారమే లేదు.
హింసకు గల కారణాన్ని గుర్తించాలి: మహిళపై జరుగుతున్న హింసకు అనుకూలంగా సమాజం చాలారకాల వాదనలను వినిపిస్తుంటుంది. మహిళలు కూడా తాము స్త్రీ కావడమే హింసకు కారణమని భావిస్తుంటారు. అందుకే, ముందు హింసకు మూలాన్ని గుర్తించాలి.
మహిళల ఉనికి: మహిళలను ఒక స్వతంత్ర వ్యక్తులుగా చూడాలి. ఈ ఆలోచనను అంగీకరించాలి. జీవితంలో, అవి మంచివైనా, చెడ్డవైనా, నిర్ణయాలను తీసుకునే స్వేచ్ఛను వారికి ఇవ్వాలి. ఆ నిర్ణయాలను గౌరవించాలి. అది భాగస్వామిని ఎంచుకునే నిర్ణయం కూడా కావచ్చు.
మహిళలైనంత మాత్రాన హింసను సమర్ధించలేం: మహిళలు కూడా వారిపై ఏదైనా జరుగుతుంటే, అర్థం చేసుకోవాలి. దానిపై మాట్లాడాలి. ఖండించాలి. వారి జీవితాన్ని నిర్ణయించుకునే అధికారం వారికుండాలి. కానీ, తమ జీవితం కోసం మరొకరి ప్రాణాన్ని తీసే హక్కు వారి చేతుల్లోకి తీసుకోకూడదు. ఇది నేరం. ఈ నేరానికి శిక్ష ఉంటుంది.
నేరం చేసి, తమ జీవితాన్ని సంతోషంగా మార్చుకోలేరు. అందుకే, హింసను వారు తిరస్కరించాలి.
హింసపై గొంతెత్తి మాట్లాడాలి: కోల్‌కతా ఆర్జీ కాలేజీలో అత్యాచార ఘటన, దిల్లీలో కదులుతోన్న బస్సులో మహిళపై అత్యాచారం జరిగినప్పుడు మహిళలు తీవ్రస్థాయిలో తమ నిరసనను వ్యక్తం చేశారు. నిజంగా తాము హింసకు వ్యతిరేకమైతే, అన్ని రకాల హింసలపైనా ఇదే స్థాయిలో గొంతెత్తి మాట్లాడాలి.
డేటాను సేకరించాలి: క్రైమ్ రికార్డులలో భర్తలపై భార్యలు పాల్పడుతున్న హింసను ప్రత్యేకంగా రికార్డు చేయాలి. ఎవరి జీవితాలు హింస కారణంగా ప్రమాదంలో ఉన్నాయో తెలుసుకునేందుకు ఇది సాయపడుతుంది.
అత్యంత ముఖ్యమైన విషయం, అన్ని రకాల హింసలను మహిళలు కచ్చితంగా తిరస్కరించాలి. హింసారహిత, సమానత్వ సమాజాన్ని హింసను వాడుతూ సృష్టించలేరన్నది గుర్తుంచుకోవాలి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














