కొద్ది రోజుల్లో మరణశిక్ష: నర్స్ నిమిష కేసులో భారత్ ప్రభుత్వం ఏమైనా చేయగలదా?

యెమెన్, భారత్, నిమిష ప్రియ కేసు
    • రచయిత, సిరాజ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

యెమెన్‌లో మరికొద్దిరోజుల్లో(జులై 16) మరణశిక్ష ఎదుర్కోనున్న భారతీయ నర్సు నిమిష ప్రియను రక్షించేందుకు కాన్సులేట్ ద్వారా చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ 'సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్' సంస్థ జులై 10న, గురువారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ఈ పిటిషన్‌ను పరిశీలించిన సుప్రీం కోర్టు న్యాయమూర్తులు సుధాంశు ధూలియా, జోయ్‌మాల్యా బాగ్చి నేతృత్వంలోని ధర్మాసనం జులై 14న ఈ అంశంపై విచారణ చేపట్టేందుకు అంగీకరించింది.

అలాగే, నిమిషకు జులై 16న మరణశిక్ష అమలుకు తేదీ ఖరారైన నేపథ్యంలో, కేసు అత్యవసర పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం అటార్నీ జనరల్‌కు కూడా పిటిషన్ కాపీని అందజేయాలని పిటిషనర్లకు సూచించింది.

ఈ కేసులో ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఏవైనా చర్యలు తీసుకుని ఉంటే, అటార్నీ జనరల్ ద్వారా కోర్టుకు తెలియజేయాలని కూడా న్యాయమూర్తులు ప్రభుత్వాన్ని కోరారు.

ఇలాంటి పరిస్థితుల్లో, నిమిష ప్రియను రక్షించేందుకు లేదా ఆమె శిక్షను తగ్గించేలా భారత ప్రభుత్వం ఏవైనా చర్యలు చేపట్టగలదా?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

మహదీ కుటుంబ క్షమాభిక్ష

నిమిష ప్రియ తన వ్యాపార భాగస్వామి, యెమెన్ పౌరుడు అయిన తలోల్ అబ్డో మహదీని 2017లో హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో నిమిష ప్రియకు మరణశిక్ష పడింది. ప్రస్తుతం ఆమె యెమెన్‌ రాజధాని సనాలోని సెంట్రల్ జైల్లో ఉన్నారు.

మరణశిక్ష నుంచి ఆమెను కాపాడేందుకు దాదాపు చట్టపరమైన మార్గాలన్నీ మూసుకుపోయాయని చెప్పొచ్చు.

కారణం.. మహదీ మృతదేహం ఒక నీళ్ల ట్యాంకులో ముక్కలుముక్కలుగా కనిపించడం. ఆ తర్వాత నెలరోజులకు సౌదీ అరేబియా - యెమెన్ బోర్డర్‌లో నిమిషను అరెస్టు చేశారు.

మహదీకి అధిక మోతాదులో మత్తుమందు ఇచ్చి చంపేసి, ఆ తర్వాత శరీరాన్ని ముక్కలుముక్కలు చేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు ఆమెపై ఉన్నాయి.

అయితే, నిమిషను మహదీ శారీరకంగా హింసించారని, ఆమె డబ్బు లాగేసుకున్నారని, పాస్‌పోర్ట్ కూడా తీసేసుకున్నారని, తుపాకీతో పలుమార్లు బెదిరించారని ఆమె తరఫు లాయర్ వాదించారు.

యెమెన్ రాజధాని సనాలోని ఒక కోర్టు 2020లో ఆమెకు మరణశిక్ష విధించింది. దీనిపై చేసిన అప్పీల్‌ను యెమెన్ సుప్రీంకోర్టు 2023 నవంబర్‌లో తిరస్కరిస్తూ మరణశిక్షను సమర్థించింది.

ఆ తర్వాత, ఈ ఏడాది మొదట్లో యెమెన్ హూతీ నాయకుడు మహదీ అల్- మషాద్ మరణశిక్షను ఆమోదించారు.

యెమెన్‌లో షరియా చట్టం అమల్లో ఉన్నందున, బాధిత కుటుంబం 'బ్లడ్ మనీ'గా పిలిచే పరిహారాన్ని అంగీకరించి, క్షమాభిక్ష ప్రసాదిస్తేనే ఆమె ఈ మరణశిక్ష నుంచి తప్పించుకోగలరు.

జులై 16న నిమిషకు మరణశిక్ష అమలు చేయనున్నట్లు సమాచారం అందిందని ఆమె కుటుంబం చెప్పిన నేపథ్యంలో, మహదీ కుటుంబాన్ని క్షమాభిక్ష కోరడం మినహా మరో మార్గం లేదు.

యెమెన్, భారత్, నిమిష ప్రియ కేసు

'మేం భారత ప్రభుత్వాన్ని ఆర్థిక సాయం అడగలేదు'

మహదీ కుటుంబంతో చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం సాయం చేయాలని 'సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్' అనే స్వచ్ఛంద సంస్థ విజ్ఞప్తి చేస్తోంది.

ఈ సంస్థ తరఫున సీనియర్ న్యాయవాది రఘేంద్ బసంత్, సుభాష్ చంద్రన్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

న్యాయవాది సుభాష్ చంద్రన్ బీబీసీతో మాట్లాడుతూ, "నిమిషను కాపాడేందుకు అవసరమైన ఆర్థిక సాయం చేయమని ప్రభుత్వాన్నిఅడగడం లేదు. సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ విరాళాల ద్వారా ఆ డబ్బును సేకరిస్తుంది."

''మా అభ్యర్థన ఏంటంటే, మహదీ కుటుంబంతో చర్చలు జరిపేందుకు అధికారికంగా భారత ప్రభుత్వం సాయం చేయాలి. అందుకోసమే పిటిషన్ దాఖలు చేశాం'' అని అన్నారు.

2015లో, యెమెన్ పశ్చిమ ప్రాంతంలో ఎక్కువ భాగాన్ని హూతీ రెబల్స్ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత యెమెన్‌లో అంతర్యుద్ధం మొదలైంది.

ఈ అంతర్యుద్ధాన్ని ప్రపంచలోనే అత్యంత దారుణ మానవతా సంక్షోభంగా ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఏళ్లుగా ఈ అంతర్యుద్ధం కొనసాగుతోంది.

''ఈ కేసుపై అంతర్యుద్ధం ప్రబావం చాలానే ఉంది. 2017లో తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు నిమిష అరెస్టయ్యారు. ఆ సమయంలో ఆమెకు చట్టపరంగా సరైన రక్షణ లభించలేదు. ఎందుకంటే, ఆ సమయంలో అక్కడ సరైన ప్రభుత్వ పాలనా వ్యవస్థ లేదు'' అని సుభాష్ చంద్రన్ అన్నారు.

అయితే, హూతీ తిరుగుబాటు గ్రూపును భారత్ ఇంకా గుర్తించలేదు.

యెమెన్, భారత్, నిమిష ప్రియ కేసు

ఫొటో సోర్స్, Getty Images

భారత్ - యెమెన్ సంబంధాలు

2015లో అంతర్యుద్ధం మొదలైన తర్వాత యెమెన్‌లో చిక్కుకున్న వేలాది మంది భారతీయులను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకొచ్చింది. అయితే, నిమిష సహా కొందరు మాత్రం అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు.

అనంతరం 2017 సెప్టెంబర్‌లో.. అంతర్యుద్ధం, భద్రతా కారణాలను చూపుతూ భారతీయులు యెమెన్ వెళ్లకుండా భారత ప్రభుత్వం నిషేధం విధించింది.

దానికి తోడు, అంతర్యుద్ధం కారణంగా యెమెన్ ప్రస్తుతం మూడు వర్గాల నియంత్రణలో ఉంది.

అందువల్ల మహదీ కుటుంబంతో చర్చలు జరిపేందుకు అనేక అడ్డంకులు ఉన్నాయని సుభాష్ చంద్రన్ అంటున్నారు. ''అందువల్ల, మహదీ కుటుంబంతో చర్చలు జరిపేందుకు భారత ప్రభుత్వం సాయం అందించాలి. నేరుగా అయినా, లేదా ఇరాన్, ఒమన్ వంటి మిత్రదేశాల ద్వారా హూతీలతో సంప్రదించవచ్చు'' అని ఆయన అన్నారు.

''2015లో యెమెన్ నుంచి భారతీయులను సురక్షితంగా తరలిచేందుకు చేపట్టిన ఆపరేషన్ రహాద్ సమయంలో, హూతీలు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా సహకరించారు. కాబట్టి, నిమిష విషయంలోనూ భారత్ అధికారికంగా జోక్యం చేసుకుంటే ఓ పరిష్కారం దొరకొచ్చు'' అని నిమిష కేసును పర్యవేక్షిస్తున్న సోషల్ యాక్టివిస్ట్ శామ్యూల్ జెరోమ్ అన్నారు.

''నిమిష ఇప్పటి వరకూ బతికి ఉందంటే హూతీ గ్రూప్‌కు భారత్‌పై నమ్మకం ఉండడం వల్లే. చాలా తక్కువ సమయం ఉంది. అందువల్ల భారత ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలి.''

అలాగే, నిమిష ప్రియ కేసులో వెంటనే జోక్యం చేసుకుని ఆమెను కాపాడాలని సీపీఐ(ఎం) పార్లమెంట్ సభ్యులు జాన్ బ్రిటాస్ సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఇదే విషయమై విదేశాంగ మంత్రి జైశంకర్‌కు లేఖ కూడా రాసినట్లు ఆయన తెలిపారు.

యెమెన్, భారత్, నిమిష ప్రియ కేసు

భారత్ ఏం చేయగలదు?

చెన్నైలోని లయోలా కాలేజీలో అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, సామాజిక కార్యకర్త అయిన ప్రొఫెసర్ గ్లాడ్సన్ జేవియర్ ఈ విషయంపై మాట్లాడుతూ, ''దౌత్యపరంగా లేదా హూతీలతో మాట్లాడడం ద్వారా భారత్ అధికారికంగా చర్యలు చేపట్టడం కష్టం. ఇది యెమెన్ అంతర్గత వ్యవహారం. అలాగే, హూతీలవి రాడికల్ రాజకీయాలనే విషయం గమనించాల్సి ఉంటుంది'' అన్నారు.

ఈ విషయంలో భారత్ కేవలం అభ్యర్థన మాత్రమే చేయగలదని, నిర్దేశించలేదని అన్నారు.

''నేరమైతే జరిగింది. దానిని కాదనలేం. తమ పౌరుడిని చంపేస్తే ఏ దేశమూ ఊరుకోదు. ఇది అర్థం చేసుకుని, అలాగే బాధిత కుటుంబం దృష్టితోనూ ఈ సమస్యను చూడాల్సి ఉంటుంది.''

ఇరాన్ లేదా ఒమన్ వంటి దేశాల ద్వారా అయినా సంప్రదించవచ్చు అని జేవియర్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)