భారత విదేశాంగ విధానంపై సీడీఎస్ చేసిన వ్యాఖ్యలు ఎంత సీరియస్?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రజనీశ్ కుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల ప్రయోజనాలు ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయని, అవి ఇక్కడి ప్రాంతీయ స్థిరత్వంపై ప్రభావం చూపిస్తాయని భారత్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయమయ్యాయి.
ఈ నెల 8వ తేదీన అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఓఆర్ఎఫ్) ఫారిన్ పాలసీ సర్వే-2024 నివేదిక ఆవిష్కరణ సందర్భంగా ఆయన ఈ విషయాలను వెల్లడించారు.
ప్రాంతీయ సుస్థిరత గురించి ప్రస్తావిస్తూ, మియన్మార్ విషయంలో జోక్యం చేసుకోవడం భారత్‌కు ఏ విధంగానూ ప్రయోజనకరంకాదని జనరల్ చౌహాన్ అభిప్రాయపడ్డారు.
''ఇది శరణార్థుల సంక్షోభాన్ని సృష్టిస్తుంది. ఈశాన్య రాష్ట్రాలకు ఇది సమస్యగా మారుతుంది. దీర్ఘకాలంలో భారత్‌కు భద్రతాపరమైన సవాళ్లను పెంచుతుంది'' అని చౌహాన్ అన్నారు.
భారత్‌కు హిందూ మహాసముద్రంలో పెరుగుతున్న సవాళ్లను జనరల్ చౌహాన్ ప్రస్తావించారు. ఈ రీజియన్‌లో రుణాలు ఇస్తూ తన ప్రాబల్యాన్ని పెంచుకుంటోందని, పరోక్షంగా చైనాను ఉద్దేశించి అన్నారు.
‘‘దక్షిణాసియాలో ప్రభుత్వాలు తరచుగా మారుతుంటాయి. ఇది భౌగోళిక రాజకీయ సమీకరణాలను మారుస్తోంది. దీంతో పాటు, సైద్ధాంతిక స్థాయిలోనూ పెను సవాళ్లు తలెత్తుతున్నాయి. అదేవిధంగా చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల పరస్పర సంబంధం ఉన్న ప్రయోజనాలు కూడా భద్రతాపరమైన ఆందోళనలను పెంచుతున్నాయి’’ అని చౌహాన్ వివరించారు.


ఫొటో సోర్స్, Getty Images
తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, సైబర్ దాడులు, డిజిటల్ స్పేస్‌ను ఆయుధంగా వాడుకొనే విధానాలు కొత్త సంఘర్షణలను సృష్టిస్తున్నాయని జనరల్ చౌహాన్ అన్నారు. ''అవగాహన ఉండాల్సిన చోట ఉన్న అపనమ్మకం, కపటత్వం కూడా ప్రధాన సవాళ్లు. మనందరికీ తెలిసిందే, ఇప్పుడు ప్రపంచ భద్రత పరిస్థితి చాలా సున్నితంగా ఉంది. ప్రపంచం రెండు ధ్రువాల దిశగా వెళ్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో, అమెరికా వైఖరి సంక్లిష్టతను మరింత పెంచుతోంది. ఆ సంక్లిష్టతలేమిటో మనందరికీ తెలుసు'' అని వ్యాఖ్యానించారు.
భారత్ తన శక్తిసామర్థ్యాలను మరింత వృద్ధి చేసుకోవడంపై దృష్టి పెట్టాలని, అలాగే విదేశాలలో విశ్వాసపాత్రులైన భాగస్వాములను తయారుచేసుకోవాలని చౌహాన్ అన్నారు. ‘‘ఆర్థికాభివృద్ధి, సాంకేతిక నైపుణ్యాల ద్వారా మాత్రమే జాతీయ భద్రతను బలోపేతం చేసుకోగలం'' అని వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌కు సవాళ్లు ఏంటి?
ఇప్పటివరకూ భారతదేశం పశ్చిమ, ఉత్తర సరిహద్దుల నుంచే ఎక్కువ ముప్పును ఎదుర్కొంటోంది. కానీ ఇప్పుడు తూర్పు సరిహద్దు గురించి ఆందోళన పెరుగుతోంది.
సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ వ్యక్తంచేసిన ఆందోళనలు పూర్తిగా సమర్థనీయమైనవేనని, ఆపరేషన్ సిందూర్ తర్వాత అనేక విషయాలపై స్పష్టత వచ్చిందని రక్షణ రంగ విశ్లేషకుడు రాహుల్ బేదీ అన్నారు.
''చైనా, పాకిస్తాన్‌లను జనరల్ చౌహాన్ తప్పుపడుతున్నారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్‌కు చైనా సహకరించిందని డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ గత వారమే చెప్పారు. గతంలో రెండు దేశాల యుద్ధం అనేవారు. కానీ ఇప్పుడు వన్ ఫ్రంట్ రీయిన్ఫోర్సుడ్ వార్ అంటున్నారు. అంటే, నీవు (భారత్) ఒకరి (పాకిస్తాన్)తో ప్రత్యక్షంగా యుద్ధం చేస్తుంటే, పాకిస్తాన్ అనేక రకాలుగా మరొకరి (చైనా) నుంచి సాయం పొందుతోంది'' అని రాహుల్ బేదీ వివరించారు.
''చైనా నుంచి రక్షణ సామగ్రి, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, శాటిలైట్ చిత్రాలు, సాంకేతిక పరిజ్ఙానం పాకిస్తాన్ పొందుతోంది. భారత్ వ్యతిరేక కూటమిలో పాకిస్తాన్, చైనాలకు బంగ్లాదేశ్ కూడా జత చేరడం భారత్‌కు ఆందోళన కలిగించే విషయం. ఇప్పుడు మూడు వైపుల నుంచి భారత్ ముప్పు ఎదుర్కొంటోంది. ఒకటి పశ్చిమ సరిహద్దు, రెండోది ఉత్తర సరిహద్దు, బంగ్లాదేశ్ చేరడంతో ఇప్పుడు తూర్పు సరిహద్దు కూడా'' అని రాహుల్ బేదీ వివరించారు.
''చైనా సహకారంతో బంగ్లాదేశ్ నిర్మిస్తోన్న ఎయిర్ ఫీల్డ్‌తో పెద్ద ప్రమాదం ఉంది. ఈశాన్య భారతదేశాన్ని అనుసంధానించే చికెన్ నెక్ ( కోడి మెడను పోలిన సన్నని భూభాగం)కు ముప్పు పెరుగుతుంది. 1971లో బంగ్లాదేశ్‌ను ఏర్పాటుచేసిన తర్వాత తూర్పు సరిహద్దు గత 30 ఏళ్లుగా సురక్షితంగానే ఉంది. కానీ ఇప్పుడు అలా కాదు'' అని బేదీ అన్నారు.
సిలిగురి కారిడార్‌కు చికెన్ నెక్ అని పేరు. ఈ కారిడార్ పొడవు 22 కిలోమీటర్లే. భారత్ ప్రధాన భూభాగాన్ని ఈశాన్య భారతంతో అనుసంధానించే ఏకైక భూభాగం ఇది.
ఈ కారిడార్‌తో బంగ్లాదేశ్, నేపాల్ కూడా సరిహద్దును పంచుకుంటున్నాయి. భూటాన్, చైనా దేశాలు కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. పాత ఎయిర్ బేస్ లాల్‌మోనిర్‌హాత్ నుంచి కార్యకలాపాలకు వీలుగా చైనా సాయంతో బంగ్లాదేశ్ పునర్నిర్మిస్తోందని గత ఏడాది సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
ఈ ఎయిర్‌ఫీల్డ్ భారత్ సరిహద్దుకు కేవలం 15 కిలోమీటర్ల దూరంలో, సిలిగురి కారిడార్‌కు 135 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
'తూర్పు సరిహద్దు నుంచి ముప్పు’
బంగ్లాదేశ్‌కు 'ఇండియా లాక్డ్ కంట్రీ' అని పిలుస్తారు. ఎందుకంటే, బంగ్లాదేశ్ సరిహద్దులో 94 శాతం భారత్‌ను ఆనుకునే ఉంది. ఇరుదేశాల మధ్య అంతర్జాతీయ సరిహద్దు పొడవు 4,367 కిలోమీటర్లు.
భద్రత, వాణిజ్య అవసరాలకు బంగ్లాదేశ్ ఎక్కువగా భారత్‌పైనే ఆధారపడుతోంది. అలాగే భారతదేశానికి ఈశాన్య రాష్ట్రాలను అనుసంధానం చేయడంలో బంగ్లాదేశ్‌ది కీలక పాత్ర.
ఇంతటి సుదీర్ఘమైన సరిహద్దు భారత్ వ్యతిరేకంగా మారితే, ఎంత ప్రమాదమో ఊహించలేమని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఓఆర్ఎఫ్) సీనియర్ సభ్యుడు మనోజ్ జోషి అన్నారు.
''చైనాలోని కున్‌మింగ్‌లో గత నెలలో పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ మధ్య ఒక సమావేశం జరిగింది. ఒక కొత్త ప్రాంతీయ కూటమిని ప్రారంభించాలనే చర్చ అక్కడ జరిగింది. అందుకే ప్రాంతీయ సుస్థిరత, భద్రత గురించి జనరల్ చౌహాన్ ఆందోళన వ్యక్తం చేశారు''అని మనోజ్ జోషి అభిప్రాయపడ్డారు.
''నీవో సైనిక శక్తి లేదా ఆర్థిక శక్తి అయితే నీవు ఆశించిన విధంగా పొరుగు దేశాల విదేశాంగ విధానాన్ని మార్చగలవు. బంగ్లాదేశ్‌తో అదే చేయించవచ్చు. కానీ భారత్ సైనిక శక్తి కాదు, ఆర్థిక శక్తి కాదు. ఆ రెండింటిలో ఏ శక్తిగా ఉన్నా పొరుగుదేశాలు మాట వింటాయి. షేక్ హసీనా నిష్క్రమణ తర్వాత, భారత్ సమీకరణాలు తలకిందులయ్యాయి'' అని జోషి చెప్పారు.
ఆపరేషన్ సిందూర్ తర్వాత అమెరికా పాకిస్తాన్‌కే అధిక ప్రాధాన్యం ఇస్తోందని జోషి విశ్లేషించారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌కు నష్టమా?
పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ జనరల్ అసిమ్ మునీర్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైట్‌హౌస్‌లో విందుకు ఆహ్వానించారు
''దేశీయ రాజకీయాల కోసం టెర్రరిజం వంటి సమస్యలను ఉపయోగించడాన్ని భారత్ ఆపేయాలనేది నా భావన. మోదీ ప్రభుత్వం విదేశాంగ విధానం నుంచి దేశీయ రాజకీయాలను వేరుచేయాలి. అలాంటిదేదో సాధించినట్లు జి-20 సదస్సులో చూపించారు. మనం తక్కువ చూపించాలి. క్షేత్రస్థాయిలో ఎక్కువ పటిష్టంగా పనిచేయాలి. ఆపరేషన్ సిందూర్‌కు భూటాన్ కూడా మద్దతు ఇవ్వలేదు. భారత్ ఆందోళన పెరుగుతూనే ఉంది. ఏం జరుగుతుందనేదీ బంగ్లాదేశ్ ఎన్నికలు ముగిసేవరకూ ఎదురుచూడాలి'' అని మనోజ్ జోషి అన్నారు.
''ట్రంప్ ధోరణి పాకిస్తాన్ పరపతిని పెంచుతోంది. పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్‌ను వైట్ హౌస్‌లో విందుకు ఆహ్వానించారు. పది రోజుల కిందట పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ కూడా అమెరికాలో పర్యటించారు. పాకిస్తాన్‌కు ఆయుధాల సరఫరాను అమెరికా పునరుద్ధరిస్తుందనడానికి ఇదో సంకేతం'' అని రాహుల్ బేదీ అన్నారు.

ఫొటో సోర్స్, X/Shehbaz Sharif
అమెరికాకు పాకిస్తాన్ హఠాత్తుగా ఎందుకు ముద్దొస్తోంది?
‘‘పాకిస్తాన్ చాలా వ్యూహాత్మకమైన ప్రాంతంలో ఉంది. చైనా, అఫ్గానిస్తాన్, ఇరాన్, మధ్య ఆసియా దేశాలతో పాకిస్తాన్ సరిహద్దు పంచుకుంటోంది. అంతేకాదు బలూచిస్తాన్‌లో లభించే అరుదైన ఖనిజాలు అందరికీ అవసరమే. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్‌కు ఒక్క ఇజ్రాయెల్ మినహా మరే దేశం ఎందుకు మద్దతు ఇవ్వలేదో తేటతెల్లమవుతోంది. టెర్రరిజాన్ని అంతర్జాతీయ సంస్థలన్నీ ఖండిస్తాయి. కానీ పాకిస్తాన్ విషయంలో ఖండించవు. ఇది పాకిస్తాన్‌కు పెద్ద విజయం. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ ప్రాధాన్యం పెరిగింది'' అని రాహుల్ బేదీ విశ్లేషించారు.
ఈ విషయంలో ఓపీ జిందాల్ యూనివర్సిటీలో చైనా స్టడీస్ ప్రొఫెసర్ శ్రీపర్ణ పాథక్ విభేదించారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ ప్రాధాన్యం పెరగడమనేదీ నమ్మశక్యంగా లేదన్నారు.
''అమెరికా నుంచి మనం ఎక్కువగా ఆశించలేం. టెర్రరిజంపై పాశ్చాత్య దేశాల విధానం పాత ధోరణిలోనే ఉంది. భారత్‌కు స్వీయ రక్షణ హక్కు ఉందని మద్దతు ప్రకటించిన ఏకైక దేశం ఇజ్రాయెల్ మాత్రమే. కానీ దురదృష్టవశాత్తూ, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా బ్రిక్స్ ప్రవేశపెట్టిన తీర్మానంలో మనమూ భాగస్వాములయ్యాం'' అని ప్రొఫెసర్ పాథక్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














