రష్యా: పుతిన్ తొలగించిన మంత్రి మృతి

ఫొటో సోర్స్, EPA
- రచయిత, లారా గోజీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
రష్యా రవాణా మంత్రి రోమన్ స్టారోవోయిట్ తుపాకీతో కాల్చుకుని చనిపోయినట్లు ఆ దేశానికి చెందిన దర్యాప్తు కమిటీ తెలిపింది.
అధ్యక్షుడు పుతిన్ సోమవారం ఉదయం ఆయన్ను మంత్రి పదవి నుంచి తొలగించారు.
ఆయన్ను తొలగించడానికి కారణాలు ఏంటనేది వెల్లడించలేదు.

రోమన్ స్టారోవోయిట్ స్థానంలో డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ ఆండ్రీ నికిటిన్‌కు బాధ్యతలు అప్పగించారు.
ఈ సంఘటనకు దారి తీసిన పరిస్థితుల్ని కనుక్కునేందుకు కృషి చేస్తున్నట్లు దర్యాప్తు కమిటీ తెలిపింది.
స్టారోవోయిట్‌ను 2024 మేలో మంత్రిగా నియమించారు.

ఫొటో సోర్స్, Getty Images
కుర్క్స్ గవర్నర్‌గా..
అంతకు ముందు, అంటే మే 2024 వరకు ఆయన కుర్క్స్ ప్రాంతానికి దాదాపు ఆరేళ్ల పాటు గవర్నర్‌గా పని చేశారు.
2024 ఆగస్ట్‌లో యుక్రెయిన్ బలగాలు ఆకస్మిక దాడి చేసి కుర్క్స్‌లోని కొంత ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాయి.
రష్యాలో కొంత భాగం ఇప్పటికీ తమ అధీనంలో ఉందని జూన్ చివరి వారంలో కీయెవ్ ప్రకటించినప్పటికీ మాస్కో ఇటీవలే అక్కడ నుంచి యుక్రెయిన్ సేనలను వెళ్లగొట్టింది.
స్టారోవోయిట్ తరువాత కుర్క్స్ గవర్నర్‌గా వచ్చిన అలెక్సీ స్మిర్నోవ్ కొంత కాలమే ఆ పదవిలో ఉన్నారు. ఆయనను ఈ ఏడాది ఏప్రిల్‌లో అరెస్ట్ చేశారు.
యుక్రెయిన్‌తో సరిహద్దును బలోపేతం చేసేందుకు కేటాయించిన నిధుల్లో దుర్వినియోగం చేశారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి.
ఈ కేసులో స్టారోవోయిట్‌ను ప్రతివాదిగా చేర్చేందుకు ప్రయత్నాలు జరిగాయని రష్యన్ వార్తా పత్రిక కొమ్మర్సాంట్ చెబుతోంది.
స్టారోవోయిట్ కచ్చితంగా ఎప్పుడు చనిపోయారనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.
ఆయన మరణం "చాలా కాలం క్రితమే" జరిగింది అని డ్యూమా డిఫెన్స్ కమిటీ హెడ్ ఆండ్రీ కర్టాపొలోవ్ రష్యన్ వార్తా సంస్థ ఆర్టీవీఐతో చెప్పారు.
సోమవారం ఉదయం స్టారోవోయిట్ మరణం గురించి ప్రకటించడానికి ముందు ‘కుర్క్స్‌లో జరిగిన సంఘటనల వల్ల స్టారోవోయిట్ పుతిన్ విశ్వాసం కోల్పోయారా? అందుకే ఆయన్ను తొలగించారా’ అని మీడియా ప్రతినిధులు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్‌ను ప్రశ్నించారు.
"విశ్వాసం కోల్పోతే నమ్మకం కోల్పోవడం గురించి ప్రస్తావించాలి. అలాంటి పదాలేవీ వాడలేదు (క్రెమ్లిన్ ఆదేశాలలో)" అని పెస్కోవ్ బదులిచ్చారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














