మీ ఏకాంత ఫోటోలు, వీడియోలను పోర్న్‌సైట్లు, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఏం చేయాలి? వాటిని తొలగించేందుకు ఉన్న మార్గాలేంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, విజయానంద్ అరుముగం
- హోదా, బీబీసీ ప్రతినిధి
తమ వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు ఆన్‌లైన్‌లో పబ్లిష్ అయితే, బాధితులే వాటిని స్వయంగా తొలగించేలా భారత ప్రభుత్వం ప్రామాణిక మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది జూలై 22న మద్రాస్ హైకోర్టుకు తెలిపారు.
ఒక మహిళా న్యాయవాది కేసు విచారణ సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
తన మాజీ ప్రియుడు, తమ ప్రైవేట్ ఫోటోలను 70కి పైగా వెబ్‌సైట్లలో పోస్టు చేసినట్లు ఆరోపిస్తూ ఒక మహిళా న్యాయవాది కేసు దాఖలు చేశారు.
ఎవరైనా మీ సమ్మతి లేకుండా, మీ ప్రైవేట్ ఫోటోలను వెబ్‌సైట్లలో పోస్ట్ చేస్తే ఏం చేయాలి? వాటిని తొలగించేందుకు ఉన్న మార్గాలేంటి? అనేది ఒకసారి చూద్దాం..


ఫొటో సోర్స్, Getty Images

గత జనవరిలో చెన్నైకు చెందిన ఒక మహిళా న్యాయవాది సైబర్ క్రైమ్స్ విభాగానికి ఫిర్యాదు చేశారు.
''కాలేజీలో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని ప్రేమించాను. అతనితో ఏకాంతంగా ఉన్నప్పుడు నా ఫోటోలు, వీడియోలు తీశాడు. ప్రస్తుతం, అతనితో ఎలాంటి సంబంధాలు లేవు. అప్పుడు ప్రైవేట్‌గా తీసుకున్న వీడియోలను అతను 70కి పైగా వెబ్‌సైట్లలో పోస్టు చేశాడు'' అని మహిళా న్యాయవాది తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
తాను తీవ్ర మనస్థాపానికి గురయ్యానని, ఆ ప్రైవేట్ వీడియోలను వెబ్‌సైట్ల నుంచి వెంటనే తొలగించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
''సైబర్ క్రైమ్ వింగ్‌కి బాధితురాలు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే, వీడియో ఫుటేజీని తొలగించేందుకు పోలీస్ డిపార్ట్‌మెంట్ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు'' అని బాధితురాలి తరఫున వాదిస్తోన్న సీనియర్ న్యాయవాది అబుదు కుమార్ చెప్పారు.
'' ఈ చిత్రాలను ఎన్‌సీఐఐ (నాన్ కాన్‌సెన్సువల్ ఇంటిమేట్ ఇమేజెస్ - సమ్మతి లేకుండా పోస్ట్ చేసిన సన్నిహిత చిత్రాలు)గా వ్యవహరిస్తారు. వాటిని తొలగించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో మేం కేసు వేశాం'' అని ఆయన బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

ఈ కేసు జూలై 9న, జస్టిస్ ఆనంద్ వెంకటేశ్ ఎదుట విచారణకు వచ్చింది. అప్పుడు, మహిళా న్యాయవాది వీడియోలు, ఫోటోలను 48 గంటల్లోగా తొలగించాలని కేంద్ర సమాచార సాంకేతిక, ప్రసారాల మంత్రిత్వ శాఖను (మినిస్ట్రీ ఆఫ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ బ్రాడ్‌కాస్టింగ్‌ను) న్యాయమూర్తి ఆదేశించారు.
ఇలాంటి కేసులపై పోలీసు సిబ్బందికీ అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని తమిళనాడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ను (డీజీపీని) హైకోర్టు ఆదేశించింది.
ఫిర్యాదుదారు ఒక మహిళా న్యాయవాది కావడంతో తాను సాయం చేయగలిగానని చెప్పిన జస్టిస్ ఆనంద్ వెంకటేశ్, ''ఇలా పోరాటం చేయలేని వారి దుస్థితి ఏంటో ఊహించుకోలేను'' అని వ్యాఖ్యానించారు.
''ఓ వ్యక్తి గౌరవప్రదంగా జీవనం సాగించే ప్రాథమిక హక్కును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం, న్యాయస్థానాలపై ఉంది'' అని జస్టిస్ ఆనంద్ వెంకటేశ్ చెప్పారు.
దీనిపై కేంద్ర ప్రభుత్వం జూలై 14న నివేదిక సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది.

ఫొటో సోర్స్, Getty Images

మళ్లీ ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు, కేంద్రం తరఫున న్యాయవాది కుమారగురు హాజరయ్యారు. వీడియోలను బ్లాక్ చేసేందుకు అన్ని చర్యలూ తీసుకున్నట్లు కోర్టుకు చెప్పారు.
అయితే, ప్రభుత్వ న్యాయవాది వాదనలను సీనియర్ అడ్వకేట్ అబుదు కుమార్ తిరస్కరించారు. '' వీడియో ఇంకా 39 వెబ్‌సైట్లలో సర్క్యులేట్ అవుతోంది. దీన్ని ఆపేందుకు కేంద్రం చర్యలు చేపట్టాలి'' అన్నారు.
ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న జడ్జి ఆనంద్ వెంకటేశ్.. ''ప్రైవేట్ వీడియోలను తొలగించడానికి ఎక్కడ ఫిర్యాదు చేయాలి, అలాంటి ఫిర్యాదు వస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అనే అంశాలపై కేంద్ర ప్రభుత్వం వివరణాత్మకంగా రిపోర్ట్ దాఖలు చేయాలి'' అని ఆదేశించారు.
ఈ కేసు మళ్లీ జూలై 22న విచారణకు వచ్చింది.
''ప్రస్తుతం, ఆరు వెబ్‌సైట్లలో బాధితురాలి ప్రైవేట్ వీడియోలు, ఫోటోలు ఉన్నాయి. వాటిని తొలగించేలా ఆదేశాలు జారీ చేయాలి'' అని బాధితురాలి న్యాయవాది అబుదు కుమార్ కోర్టును కోరారు.
సైబర్ క్రైమ్ బారినపడిన బాధిత మహిళలు తమ ప్రైవేట్ వీడియోలు, ఫోటోలు వారే నేరుగా తొలగించుకునేలా కేంద్ర ప్రభుత్వం ప్రామాణిక మార్గదర్శకాలను రూపొందిస్తోందని కేంద్రం తరఫున కోర్టుకు హాజరైన న్యాయవాది కుమారగురు చెప్పారు.
అనంతరం, మార్గదర్శకాలను ఫైల్ చేసేందుకు అనుమతిస్తూ ఆగస్ట్ 5కు కేసును వాయిదా వేశారు.

ఫొటో సోర్స్, Getty Images

ఒకవేళ వెబ్‌సైట్లలో అశ్లీల చిత్రాలు పబ్లిష్ అయితే, తక్షణమే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై సైబర్ నిపుణులు, న్యాయవాది కార్తికేయన్‌తో బీబీసీ మాట్లాడింది.
'' నగ్న చిత్రాలను సోషల్ మీడియా సహజంగా తీసుకోదు. ఇలాంటి ప్లాట్‌ఫామ్‌లకు గ్రీవెన్స్ రిడ్రెసల్ సెంటర్ (ఫిర్యాదుల పరిష్కార కేంద్రం) ఉంటుంది. అక్కడ ఫిర్యాదు చేస్తే, వెంటనే చర్యలు తీసుకుంటారు. వారిని నేరుగా ఫోన్‌లో సంప్రదించడం కుదరదు. ఫిర్యాదు చేయాలి'' అని తెలిపారు.
సోషల్ మీడియాకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 2021లో మార్గదర్శకాలను రూపొందించినట్లు ఆయన చెప్పారు. ఇంటర్‌మీడియరీ గైడ్‌లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ రూల్స్, 2021 పేరుతో ఈ మార్గదర్శకాలు అమలవుతున్నాయి.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2000కు చెందిన సెక్షన్ 87 (1)(2) కింద కల్పించిన అధికారాలకు అనుగుణంగా, వీటిని రూపొందించినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.
''ఆ నిబంధనల ప్రకారం, ప్రతి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌కు ఒక గ్రీవెన్స్ రిడ్రెసల్ సెంటర్ ఏర్పాటు చేశారు. గ్రీవెన్స్ రిడ్రెసర్ సెంటర్ వద్ద, దాని కంటెంట్, అభ్యంతరకర చిత్రాల గురించి ఫిర్యాదు చేస్తే, వెంటనే తొలగిస్తారు'' అని కార్తికేయన్ వివరించారు.
''అంతేకాకుండా, ప్రైవేట్ ఫోటోలు ప్రచురితమవడం వల్ల ప్రభావితమైన బాధితులు https://cybercrime.gov.in/ వెబ్ పోర్టల్‌లోనూ ఫిర్యాదు చేయొచ్చు. అక్కడ వారి పేరు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ ఫోటోలు ఎందులో పోస్ట్ అయ్యాయో ఆ వెబ్‌సైట్ అడ్రస్ చెప్పి, ఫిర్యాదు చేయొచ్చు'' అని ఆయన చెప్పారు.
1930 నంబర్‌కి కాల్ చేయడం ద్వారా కూడా సైబర్ క్రైమ్‌లను రిపోర్ట్ చేసే సౌకర్యాన్ని కూడా కేంద్రం అందుబాటులోకి తెచ్చింది.
''పోర్నోగ్రఫీ వెబ్‌సైట్లలో వీడియో ప్రచురితమైతే, ఆ సైట్ల ఈమెయిల్ అడ్రస్‌కు ఫిర్యాదు పంపితే, వెంటనే వాటిని తొలగిస్తారు'' అని కార్తికేయన్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

''మహిళల అభ్యంతరకర చిత్రాలను ప్రచురించినట్లు ఫిర్యాదు వస్తే, వాటిని 24 గంటల్లో తొలగించాలని 2021లో జారీ చేసిన మార్గదర్శకాల్లో భారత ప్రభుత్వం పేర్కొంది. అయినా వాటిని తొలగించడం లేదు'' అని కార్తికేయన్ చెప్పారు.
'' సైబర్ క్రైమ్ విభాగంలో మీరు ఫిర్యాదు చేస్తే, అది నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోకు వెళ్తుంది. ఈమెయిల్ ద్వారా సంబంధిత సైట్లకు వారు నోటిఫై చేస్తారు. అందుకు కొన్ని రోజులే పట్టినప్పటికీ, బాధితులపై తీవ్ర ప్రభావముంటుంది'' అని కార్తికేయన్ చెప్పారు.
ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేసినప్పటికీ, వెబ్‌సైట్ల నుంచి చిత్రాలను తొలగించకపోతే, వెంటనే పోలీసులను ఆశ్రయించి, ఫిర్యాదు చేయాలి. అలా చేస్తే సంబంధిత వెబ్‌సైట్లపై చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది.
ఇందులో కృత్రిమ మేధస్సు వినియోగం గురించి కూడా కార్తికేయన్ వివరించారు.
పోర్నోగ్రఫిక్ చిత్రాలను అప్‌లోడ్ చేయకుండా నివారించేలా చాలా కంపెనీలు కృత్రిమ మేధస్సును (ఏఐను) వాడుతున్నాయని కార్తికేయన్ చెప్పారు. నగ్న చిత్రాలు, వీడియోలను తొలగించేందుకు వాటిని రూపొందించారు.
'' సైబర్ క్రైమ్ హాట్‌లైన్ 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే, వెంటనే చర్యలు తీసుకుంటాం. కొన్ని వీడియోలు, చిత్రాలు అయితే తొలగించడంలో పెద్ద ఇబ్బంది ఉండదు'' అని ఒక మహిళా పోలీసు అధికారి బీబీసీతో చెప్పారు.
''ఒకవేళ అవి చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటే, అవి ఎక్కడ నుంచి వస్తున్నాయో గుర్తించడం కష్టం. అందుకోసం పోలీసు శాఖలో తగినంత మంది నిపుణులు లేరు'' అని ఆమె చెప్పారు.

చెన్నై మహిళా న్యాయవాది దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌లో ఆమె పేరును పేర్కొన్నారు.
''ఆమె పేరును పేర్కొనడం మాత్రమే ఖండించదగినది కాదు. నిందితుడిని గుర్తించేందుకు ఏడుగురు మగ పోలీసు అధికారుల సమక్షంలో విచారణ చేపట్టడం కూడా ఖండించదగినదే'' అని విచారణ సందర్భంగా జస్టిస్ ఆనంద్ వెంకటేశ్ అన్నారు.
ఇలాంటి ఘటనలు ఇప్పటికే శారీరక హింసను ఎదుర్కొన్న బాధితురాలికి, మానసికంగా కూడా మరింత హానిని కలగజేస్తాయని న్యాయమూర్తి పేర్కొన్నారు. వెంటనే డాక్యుమెంట్ల నుంచి బాధితురాలి పేరును తొలగించాలని ఆదేశించారు.
ఈ కేసు డాక్యుమెంట్లు అన్నింటిలో మహిళా న్యాయవాది పేరును తొలగించినట్లు తమిళనాడు చీఫ్ క్రిమినిల్ అడ్వకేట్ అసన్ మొహమ్మద్ జిన్నా చెప్పారు.
''పిల్లలపై, మహిళలపై హింస జరిగిన కేసుల్లో మాత్రమే ఎఫ్ఐఆర్‌లో వారి పేర్లను ప్రస్తావించకూడదని పోలీసులు భావిస్తున్నారు. అయితే, ఇలాంటి ఘటనల్లో కూడా బాధితుల పేర్లను పేర్కొనకూడదని కోర్టు పేర్కొంది'' అని అబుదు కుమార్ చెప్పారు.
మహిళా న్యాయవాది ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు.
''అనుమతి లేకుండా ఎవరివైనా ప్రైవేట్ ఫోటోలను అప్‌లోడ్ చేస్తే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది'' అని అబుదుకుమార్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














