రాజీనామాకు ముందు జగ్‌దీప్ ధన్‌ఖడ్‌కు ఎవరి నుంచి ఫోనొచ్చింది? ఉప రాష్ట్రపతి రేసులో ఎవరెవరున్నారు?

ఉపరాష్ట్రపతి, జగ్‌దీప్ ధన్‌కఢ్

ఫొటో సోర్స్, Getty Images

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జులై 21న ప్రారంభమయ్యాయి. రాజ్యసభ చైర్మన్‌గా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఆ రోజు సభ కార్యకలాపాలను నిర్వహించారు.

కానీ అదే రోజు రాత్రి ఆయన రాజీనామా చేశారు.

రాష్ట్రపతికి రాసిన రాజీనామా లేఖలో జగదీప్ ధన్‌ఖడ్ తన ఆరోగ్యం గురించి ప్రస్తావించారు.

కానీ ప్రతిపక్షాలు, అనేక మంది రాజకీయ విశ్లేషకులు ఆయన రాజీనామాకు ఆరోగ్యం మాత్రమే కారణం కాదని చెబుతున్నారు.

జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా, దాని వెనుక ఉన్న కారణం, ప్రతిపక్షాల స్పందన, తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరయ్యే అవకాశముంది వంటివాటిపై బీబీసీ హిందీ వీక్లీ ప్రోగ్రామ్ 'ది లెన్స్'లో, కలెక్టివ్ న్యూస్‌రూమ్ జర్నలిజం డైరెక్టర్ ముఖేశ్ శర్మ చర్చించారు.

ఈ చర్చలో ముఖేష్ శర్మతో కలిసి బీబీసీ హిందీ మాజీ ఎడిటర్ సంజీవ్ శ్రీవాస్తవ, సీనియర్ జర్నలిస్ట్ సబా నఖ్వీ , ది హిందూ సీనియర్ జర్నలిస్ట్ శ్రీపర్ణ చక్రవర్తి పాల్గొన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
జగ్‌దీప్ ధన్‌కఢ్

ఫొటో సోర్స్, @SansadTV

ఫొటో క్యాప్షన్, జగ్‌దీప్ ధన్‌ఖడ్

జగదీప్ ధన్‌ఖడ్ ఎందుకు రాజీనామా చేశారు?

ఈ నెల ప్రారంభంలో జరిగిన ఒక కార్యక్రమంలో ధన్‌ఖడ్ తాను 2027 ఆగస్టులో పదవీ విరమణ చేస్తానని చెప్పారు. ఆ తర్వాత కొన్నిరోజులకే ఆయన రాజీనామా చేయడంతో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

కొంతకాలం క్రితమే ఉపరాష్ట్రపతి కార్యాలయం ఆయన జైపూర్ పర్యటనను ప్రకటించింది. అంతేకాదు, ధన్‌ఖడ్ రాజీనామా చేసిన రోజు మూడు సమావేశాలకు కూడా అధ్యక్షత వహించారు.

ఆ సమావేశాల చర్చల్లో ఎక్కడా ఆయన రాజీనామా చేస్తున్న సూచనలు కనిపించలేదని అందులో పాల్గొన్న కొందరు ఎంపీలు తర్వాత చెప్పారు.

ఆ రోజు ధన్‌ఖడ్ అన్ని పనులను సజావుగా, సమర్ధవంతంగా చేశారని, తర్వాత ఏమందయిన్నదే ముఖ్యమైన ప్రశ్నని బీబీసీ మాజీ ఎడిటర్ సంజీవ్ శ్రీవాస్తవ అభిప్రాయపడ్డారు.

''సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య ఆ నాలుగు గంటల్లోనే ఏదో జరిగింది. సాయంత్రం 4 గంటలకు ఆయన తన రెండో బీఏసీ (బిజినెస్ అడ్వైజరీ కమిటీ) సమావేశాన్ని షెడ్యూల్ చేసుకున్నారు. దానికి బీజేపీ నాయకులు జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘ్వాల్ రాలేదు. అప్పటి నుంచి తీవ్రంగా మారిన పరిస్థితులు సాయంత్రం ఆయన రాజీనామాతో ముగిశాయి'' అని సంజీవ్ శ్రీవాస్తవ చెప్పారు.

ఉపరాష్ట్రపతి, జగ్‌దీప్ ధన్‌కఢ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రధాని మోదీ, అమిత్ షాతో జగ్‌దీప్ ధన్‌ఖడ్(ఫైల్ ఫోటో)

సాయంత్రం 4 గంటల తరువాత మారిన పరిణామాలు

ఆ నాలుగు గంటల్లోనే ఏదో జరిగిందని శ్రీపర్ణ చక్రవర్తి కూడా అంటున్నారు. ఇవన్నీ తమకు ఉన్న సమాచారం ఆధారంగా మాట్లాడుకునేవేనని, అయితే ప్రభుత్వానికి, ఉపరాష్ట్రపతికి మధ్య కొంత విభేదాలు ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోందని తెలిపారు.

దీనిపై ధన్‌ఖడ్‌తో తాను మాట్లాడలేదని, కానీ తనకు అందిన సమాచారం ప్రకారం, ధన్‌ఖడ్‌ను తొలగించే చర్చ జరిగిందని కొంతమంది చెబుతున్నారని సంజీవ్ శ్రీవాస్తవ అన్నారు.

''ఏ ప్రభుత్వమైనా ఉపరాష్ట్రపతిని ఎందుకు తొలగిస్తుంది? కానీ ప్రచారంలో ఉన్న వార్త నిజమా కాదా తెలియనప్పటికీ .. అలాంటి అవకాశం ఉందన్న చర్చ జరుగుతోందన్న విషయం ధన్‌ఖడ్‌కు తెలిసుండొచ్చు'' అని కూడా సంజీవ్ శ్రీవాస్తవ చెప్పారు.

ధన్‌ఖడ్‌కు వచ్చిన ఓ ఫోన్ కాల్ గురించి సంజీవ్ శ్రీవాస్తవ ప్రస్తావించారు.

''ప్రభుత్వం మీపై చాలా కోపంగా ఉందంటూ చాలా సీనియర్ వ్యక్తి నుంచి ధన్‌ఖడ్‌కు ఫోన్ వచ్చింది... ఒక విధంగా ప్రధానమంత్రి ప్రతినిధి లాంటి వ్యక్తి నుంచి. దీనికి స్పందించిన ధన్‌ఖడ్, వారు కోపంగా ఉంటే నేను రాజీనామా చేస్తానని అన్నారు. ఆయన్ను ఆపడానికి అవతలి వైపు నుంచి ఎలాంటి ప్రయత్నం జరగలేదు'' అని ఆయన అన్నారు.

''బీజేపీ ప్రత్యేకంగా దృష్టి సారించిన పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి ధన్‌ఖడ్‌ గతంలో గవర్నర్‌ పనిచేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఆయన చాలా ఇబ్బంది పెట్టారు. దానికి ప్రతిఫలంగా ఆయనను ఉపరాష్ట్రపతిని చేశారు. ధన్‌ఖడ్ బీజేపీ కోసం పనిచేస్తున్నంత కాలం పార్టీకి ఎలాంటి సవాళ్లు లేవు, సమస్యా లేదు'' అని సబా నఖ్వీ అన్నారు.

''ధన్‌ఖడ్ నుంచి పదవి చేజారిపోయేలా గడచిన ఆరేడునెలల్లో ఏం జరిగింది? ఎందుకంటే నాకు తెలిసినంతవరకు ఆయనెప్పుడూ రాజీనామా చేయాలనుకోలేదు, కానీ దానికి ప్రత్యామ్నాయం లేదని ఆయన అర్థం చేసుకుని ఉండాలి'' అని సంజీవ్ శ్రీవాస్తవ అన్నారు.

ఉపరాష్ట్రపతి, జగ్‌దీప్ ధన్‌కఢ్

ఫొటో సోర్స్, Getty Images

చాలా నెలలుగా..

ప్రభుత్వానికి, ధన్‌ఖడ్‌కు మధ్య చాలా నెలలుగా విభేదాలు కొనసాగుతున్నాయని సంజీవ్ శ్రీవాస్తవ, శ్రీపర్ణ చక్రవర్తి ఇద్దరూ భావిస్తున్నారు.

''ఉపరాష్ట్రపతిగా ఉన్న ధన్‌ఖడ్ కొంతమంది విదేశీ ప్రముఖులను కలవాలని అనుకున్నారని, కానీ ప్రభుత్వం అలా జరగడానికి అనుమతించలేదని, దీనిపై ఆయన చాలా కోపంగా ఉన్నారని నేను విన్నా. రైతుల సమస్యలపై కూడా ఆయనకు బలమైన అభిప్రాయాలు ఉన్నాయి. శివరాజ్ సింగ్ చౌహాన్ సమక్షంలో రైతుల పట్ల ప్రభుత్వ నిబద్ధత గురించి ఆయన మాట్లాడుతున్న ఒక క్లిప్ చూశాం'' అని శ్రీపర్ణ చక్రవర్తి అన్నారు.

న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా ధన్‌ఖడ్ చేసిన ప్రకటనలు కూడా మోదీ ప్రభుత్వంతో సంబంధాలు క్షీణించడానికి ఒక కారణంగా భావిస్తున్నారు.

న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా ధన్‌ఖడ్ బహిరంగంగా మాట్లాడుతున్నారు. ఇది ధన్‌ఖడ్ చేసిన అతిపెద్ద తప్పుగా ప్రభుత్వంలో ఉన్నవారు భావించి ఉండొచ్చని సంజీవ్ శ్రీవాస్తవ అభిప్రాయపడ్డారు.

''న్యాయవ్యవస్థకు సంబంధించి ధన్‌ఖడ్ పదే పదే బహిరంగ ప్రకటనలు చేయడాన్ని అర్ధం చేసుకోవచ్చు, ఎందుకంటే అది ఆయన జీన్స్‌లో ఉంది. ఆయన తన జీవితాన్ని కోర్టులలో గడిపారు. ఆయన లాయర్. ఈ పరిస్థితుల్లో, ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తపరచడం సహజం'' అని సంజీవ్ శ్రీవాస్తవ అన్నారు.

అయితే ప్రభుత్వం తరఫున న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా ధన్‌ఖడ్ మాట్లాడుతున్నట్టుగా భావించకూడదని ప్రభుత్వం అనుకుంది.

ధన్‌ఖడ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ధన్‌ఖడ్ ఎందుకు రాజీనామా చేశారనేదానిపై అనేక ఊహాగానాలు సాగుతున్నాయి.

జస్టిస్ యశ్వంత్ వర్మ కేసులో ప్రతిపక్షం రాజ్యసభలో చేసిన ప్రతిపాదనను ఆమోదించడం కూడా ఆయన రాజీనామాకు ఒక కారణమని భావిస్తున్నారు.

ఎందుకంటే మోదీ ప్రభుత్వం జస్టిస్ యశ్వంత్ వర్మ సమస్యను తనదైన రీతిలో పరిష్కరించుకోవాలనుకుంది.

''జస్టిస్ వర్మ కేసులో ప్రతిపక్షాలతో కలిసి ఒక ఉమ్మడి ప్రతిపాదనను తీసుకువస్తున్నట్టు ప్రభుత్వం చూపించాలనుకుంది. లోక్‌సభలో, ఈ ప్రతిపాదనపై ఎన్డీఏ, ప్రతిపక్షాలు రెండూ సంతకాలు చేశాయి. రాజ్యసభలో తీసుకువచ్చిన ప్రతిపాదనపై ప్రతిపక్షాల సంతకాలు మాత్రమే ఉన్నాయి. ప్రతిపక్షాల నుంచి తనకు ప్రతిపాదన అందిందని, 50 సంతకాలు అవసరమని ధన్‌ఖడ్ రాజ్యసభలో ప్రకటించారు'' అని శ్రీపర్ణ చక్రవర్తి చెప్పారు.

ఈ ప్రతిపాదన వస్తుందని ఎన్డీఏకి కూడా చెప్పలేదని శ్రీపర్ణ చక్రవర్తి అంటున్నారు.

''ఆ రోజు ఆయన నిండా మునిగారు. ధన్‌ఖడ్‌ను తొలగిస్తారని గానీ, లేదా ఆయన రాజీనామా చేస్తారని గానీ ఆ మధ్యాహ్నం వరకు ప్రభుత్వంలో కూడా ఎవరూ అనుకోలేదు. ఆ రోజు చాలా విషయాలు ప్రతికూలంగా మారాయి. నీళ్లు ప్రమాద స్థాయిని మించి ప్రవహించి వరద వచ్చింది'' అని సంజీవ్ శ్రీవాస్తవ కూడా చెప్పారు.

ధన్‌ఖడ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ధన్‌ఖడ్‌

ప్రతిపక్షాలకు కూడా తెలియదా?

‘ధన్‌ఖడ్ రాజీనామా తర్వాత ప్రతిపక్ష పార్టీల ప్రకటనలను బట్టి చూస్తే, ప్రతిపక్షాలకు కూడా దీని గురించి తెలియదని అనిపిస్తోంది.

2024 డిసెంబరులో ధన్‌ఖడ్‌పై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టాయి. ఇప్పుడు చాలా మంది ప్రతిపక్ష నేతలు ధన్‌ఖడ్ ఆకస్మిక రాజీనామాను ప్రశ్నిస్తున్నారు.

రాజ్యసభలో ప్రతిపక్షాలు మాట్లాడడానికి చాలాసార్లు ధన్‌ఖడ్ అనుమతించలేదు, ఇప్పుడు ధన్‌ఖడ్ తరఫున ప్రతిపక్షం మాట్లాడుతోంది’ అని సబా నఖ్వీ అన్నారు.

ప్రతిపక్షాల వైఖరిని ఆమె సమర్థించారు.

''ప్రతిపక్షాలు ఎందుకు ప్రశ్నించకూడదు. ఎందుకంటే ఈ పద్ధతి తప్పు. మీరే ఒక వ్యక్తిని ఎంచుకుని పదవీకాలం ముగియకముందే ఆయన్ను తొలగించారు. ఇది తప్పు. ధన్‌ఖడ్ బీజేపీ కోసం పనిచేస్తున్నారు. కానీ మధ్యలో ఆయన ప్రతిపక్షాలతో కొంచెం స్నేహంగా ఉండటం ప్రారంభించారు.. కాబట్టి బీజేపీ దీనిని సహించలేకపోయింది'' అని ఆమె అన్నారు.

ధన్‌ఖడ్

ఫొటో సోర్స్, Getty Images

నితీశ్‌కు అవకాశం ఉందా? లేదా?

తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరైనా కావచ్చని సంజీవ్ శ్రీవాస్తవ చెప్పారు.

''ఈ ప్రభుత్వంలో రాష్ట్రపతి లేదా ఉపరాష్ట్రపతిని నియమించిన విధానం లేదా మంత్రి పదవులు ఇచ్చిన విధానం విశ్లేషిస్తే, ఎవరి పేరు అయితే ఎక్కువగా చర్చకు వస్తోందో వారు అభ్యర్థిగా ఉండరని నేను చెప్పగలను'' అని ఆయన అన్నారు.

''ఎల్లప్పుడూ ఆశ్చర్యం కలిగించాలని కోరుకోవడం ఈ ప్రభుత్వంలో నేను చూస్తున్న బలహీనత. తమ నిర్ణయంలో ఆశ్చర్యకరమైన అంశం లేకపోతే వారు నిరాశ చెంది మరో నిర్ణయం తీసుకుంటారు. ఈ పరిస్థితిలో ఇప్పటికే చర్చలోకి వచ్చిన వారు ఉపరాష్ట్రపతి అయ్యే అవకాశం నాకు కనిపించడం లేదు'' అని సంజీవ్ శ్రీవాస్తవ అన్నారు.

నితీశ్ కుమార్‌ను ఉపరాష్ట్రపతి చేసే అవకాశాన్ని కూడా సంజీవ్ శ్రీవాస్తవ ఖండించారు.

''బిహార్ ఎన్నికలకు ముందు నితీశ్‌ను తొలగించడం బీజేపీకి, ఆయనకు నష్టం కలిగిస్తుంది'' అని అభిప్రాయపడ్డారు.

మరోవైపు, ప్రతిపక్షాలు కూడా దీనిపై తమ వ్యూహాన్ని రూపొందిస్తున్నాయని శ్రీపర్ణ అంటున్నారు. కాంగ్రెస్ తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరున్నా మొత్తం ఇండియా బ్లాక్ మద్దతు ఉంటుందని అభిప్రాయపడ్డారు.

బీజేపీ అగ్ర నాయకత్వంలో ఒకరు లేదా ఇద్దరు ఈ నిర్ణయం తీసుకుంటారని సబా నఖ్వీ అంటున్నారు. ఆర్ఎస్ఎస్ అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారని ఆమె అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)