ప్రీ విహీర్: కంబోడియాలోని ఈ పురాతన దేవాలయ చరిత్ర ఏంటి? థాయిలాండ్‌తో వివాదమెందుకు?

ఫొటో సోర్స్, Getty Images
థాయిలాండ్ – కంబోడియా సరిహద్దుల్లో గురువారం నుంచి రెండు దేశాల సైనికుల మధ్య కాల్పులు జరుగుతున్నాయి.
కంబోడియా సైనిక స్థావరాలపై వైమానిక దాడులు చేసినట్టు థాయిలాండ్ చెప్పింది.
వందల ఏళ్ల కిందట ఫ్రెంచ్ ఆక్రమణ తరువాత కంబోడియా సరిహద్దులు నిర్ణయమయ్యాయి.
కంబోడియా వివాదాస్పద ప్రాంతంలో ఉన్న 11వ శతాబ్దపు దేవాలయాన్ని 2008లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా నమోదు చేయడానికి ప్రయత్నించినప్పుడు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
థాయిలాండ్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ తర్వాత రెండు దేశాల మధ్య పలుసార్లు ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో సైనికులు, పౌరులు చనిపోయారు.
ఇటీవల మే నెలలో జరిగిన ఘర్షణలో కంబోడియా సైనికుడు మరణించడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు గత దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంతగా దిగజారాయి.
గత రెండు నెలలుగా రెండు దేశాలు పరస్పరం సరిహద్దు ఆంక్షలు విధించుకున్నాయి. థాయిలాండ్ నుంచి పండ్లు, కూరగాయల దిగుమతిని నిషేధించిన కంబోడియా విద్యుత్, ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేసింది.
గత కొన్ని వారాలుగా రెండు దేశాలూ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున బలగాలను మోహరించాయి.

ఆలయ చరిత్ర ఏంటి?
యునెస్కో ప్రకారం.. కంబోడియాలో ఎత్తయిన పీఠభూమి ప్రాంతం అంచున ప్రీ విహీర్ అనే శివాలయం ఉంది. ఈ ఆలయంలో ఎన్నో ఆధ్యాత్మిక కట్టడాలు ఉన్నాయి.
11వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. అయితే, అంతకుముందే 9వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో ఒక మఠం ఏర్పాటైంది.
ఈ ప్రాంతాన్ని చాలా జాగ్రత్తగా సంరక్షిస్తుంటారు. ఇది ఒక మారుమూల ప్రదేశంలో ఉంది.
అత్యుత్తమ వాస్తుశిల్పానికి పెట్టింది పేరుగా ఈ ఆలయం నిలుస్తోంది. శిల్పాలతో ఈ ఆలయ నిర్మాణం ఆకర్షణీయంగా ఉంటుందని యునెస్కో పేర్కొంది.
1962 జూన్ 15న అంతర్జాతీయ న్యాయస్థానం ప్రీ విహీర్ ఆలయ వివాదంపై తన తీర్పును వెల్లడించింది.
ప్రీ విహీర్ ఆలయ శిథిలాల చుట్టూ ఉన్న తమ భూభాగంలో కొంత భాగాన్ని థాయిలాండ్ ఆక్రమించుకుందని అంతర్జాతీయ న్యాయస్థానానికి కంబోడియా ఫిర్యాదు చేసింది.
ఈ ప్రాంతం కంబోడియా ప్రజల మత విశ్వాసాలకు కేంద్రంగా ఉంది.
ఈ ఆలయ హక్కులపై నిర్ణయం తీసుకోవాలని, 1954 నుంచి అక్కడ మోహరించిన బలగాలను ఉపసంహరించేలా థాయిలాండ్‌ను ఆదేశించాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని కంబోడియా కోరింది.
అయితే, కోర్టు పరిధిపై తొలుత థాయిలాండ్ అభ్యంతరం చెప్పింది. అయితే, థాయిలాండ్ అభ్యంతరాలను 1961 మే 26న కోర్టు కొట్టేసింది.

ఫొటో సోర్స్, Getty Images
అంతర్జాతీయ న్యాయస్థానం 1962 జూన్ 15న వెల్లడించిన తుది తీర్పులో.. 1904 ఫ్రాంకో-సియామీస్ ఒప్పందంలో భాగంగా వివాదాస్పద ప్రాంతానికి వాటర్ షెడ్ రేఖ ద్వారా హద్దులు నిర్ణయించినట్లు కోర్టు పేర్కొంది.
సంయుక్తంగా బౌండరీ డీమార్కేషన్ కమిషన్ సిద్ధం చేసిన మ్యాప్‌లో కంబోడియా భూభాగంలోనే ఈ ఆలయం ఉందని తెలిపింది.
అయితే, ఈ మ్యాప్‌ను అంగీకరించడం తప్పనిసరి కాదని థాయిలాండ్ వాదించింది. ఈ మ్యాప్‌ను థాయిలాండ్ ఎప్పటికీ అంగీకరించడం లేదు.
అయితే, థాయిలాండ్ ఈ మ్యాప్‌ను అంగీకరించిందని చెప్తూ ఆలయం కంబోడియా భూభాగంలోనే ఉందని కోర్టు తేల్చి స్పష్టం చేసింది.
అక్కడ మోహరించిన పోలీసు లేదా సైనిక బలగాలను థాయిలాండ్ తొలగించాలని, 1954 తర్వాత ఆలయం నుంచి తొలగించిన ప్రతిదాన్ని కంబోడియాకు తిరిగి ఇవ్వాలని కోర్టు తీర్పునిచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
థాయిలాండ్ ఎందుకు హెచ్చరికలు జారీ చేసింది?
సరిహద్దులో మందుపాతర పేలడంతో ఒక థాయ్ సైనికుడు గాయపడిన ఒక రోజు తర్వాత థాయిలాండ్, కంబోడియా మధ్య తాజాగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఆ తర్వాత కంబోడియా నుంచి తమ రాయబారిని వెనక్కు పిలిపించింది థాయిలాండ్.
కాల్పులు మొదలుపెట్టింది మీరేంటే మీరేనని ఇరుపక్షాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి.
సరిహద్దు సమీపంలో థాయ్ దళాలను పర్యవేక్షించడానికి కంబోడియా సైన్యం డ్రోన్లను మోహరించడంతో ఈ సంక్షోభం ప్రారంభమైందని థాయిలాండ్ చెప్పింది.
ఈ సంఘర్షణ యుద్ధంగా మారవచ్చని థాయిలాండ్ హెచ్చరించింది. ఈ సంక్షోభం వల్ల వేలమంది ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లాల్సివచ్చింది.
భారీ ఆయుధాలను ఈ ఘర్షణల్లో వాడుతున్నట్లు థాయిలాండ్ తాత్కాలిక ప్రధాన మంత్రి ఫుమ్‌థమ్ వెచాయాచాయి తెలిపారు.
పౌరులు ఉండే ప్రాంతాలపై కంబోడియా దాడులు చేస్తుందని థాయిలాండ్ ఆరోపించింది. రాకెట్లు పడే పరిధిలోని గ్రామాలన్నింటిన్నీ ఖాళీ చేయించినట్లు తెలిపింది.
మరోవైపు, క్లస్టర్ బాంబులను థాయిలాండ్ వాడిందని కంబోడియా ఆరోపిస్తోంది. ఇవి సామాన్యులపై ప్రభావం చూపుతాయని ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో క్లస్టర్ బాంబులపై నిషేధం ఉంది. ఈ ఆరోపణలపై థాయిలాండ్ ఇంకా స్పందించలేదు.

ఫొటో సోర్స్, Getty Images
రెండు దేశాలు వెంటనే కాల్పుల విరమణ చేపట్టాలని, పౌరులను కాపాడాలని, ఈ సంక్షోభాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని అమెరికా పిలుపునిచ్చింది.
''థాయిలాండ్-కంబోడియా సరిహద్దు వెంబడి ఘర్షణలు తలెత్తడంపై మేం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. పౌరుల మరణాలు చోటు చేసుకున్నట్లు వస్తోన్న రిపోర్టులు బాధాకరంగా ఉన్నాయి'' అని స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికార ప్రతినిధి టామీ పిగ్గట్ చెప్పారు.
చైనాకు కంబోడియా, థాయిలాండ్‌లతో రాజకీయ, వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయి. ఈ సంక్షోభంపై చైనా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
చర్చలు, సంప్రదింపుల ద్వారా రెండు దేశాలు ఈ సంక్షోభాన్ని పరిష్కరించుకుంటాయని ఆశిస్తున్నట్లు చైనా తెలిపింది.
శాంతియుతంగా ఉండాలని ఆస్ట్రేలియా, యూరోపియన్ యూనియన్, ఫ్రాన్స్ కూడా అభ్యర్థించాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














