‘అయిదు యుద్ధ విమానాలను కూల్చేశారు’.. భారత్-పాక్ ఘర్షణపై ట్రంప్ కొత్త వ్యాఖ్యలు

ట్రంప్, వైట్‌హౌజ్, రిపబ్లిక్ లా మేకర్స్

ఫొటో సోర్స్, Anna Moneymaker/Getty

భారత్-పాకిస్తాన్ మధ్య మే నెలలో జరిగిన ఘర్షణలో అయిదు యుద్ధ విమానాలు కూలిపోయినట్లు శుక్రవారం అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.

అయితే, ఏ దేశం ఎన్ని యుద్ధ విమానాలను నష్టపోయిందో ఆయన చెప్పలేదు. శుక్రవారం రాత్రి వైట్ హౌస్‌లో రిపబ్లికన్ సెనేటర్లతో విందు సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

పాకిస్తాన్ కూడా గతంలో భారత్‌కు చెందిన 'అయిదు యుద్ధ విమానాలను కూల్చివేశాం' అని వ్యాఖ్యానించింది. భారత్ ఈ వాదనలను ఖండించింది.

పాకిస్తాన్‌తో జరిగిన సైనిక సంఘర్షణలో భారత యుద్ధ విమానాలకు సంబంధించిన ప్రశ్నలపై భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ మే నెలాఖరులో సమాధానాలు ఇచ్చారు. యుద్ధ విమానాలను కూల్చామంటూ పాకిస్తాన్ చేస్తోన్న వాదనలను ఆయన పూర్తిగా ఖండించారు.

భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ జరిగేలా చేశామంటూ కూడా ట్రంప్ చెబుతూ వస్తున్నారు.

భారత్, పాకిస్తాన్‌లతో వాణిజ్యాన్ని నిలిపివేస్తామంటూ బెదిరించామని, ఆ తర్వాతే రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని కూడా ట్రంప్ చెప్పుకొచ్చారు.

నిజానికి, మే మొదట్లో భారత్, పాక్ దేశాల మధ్య సైనిక వివాద సమయంలో ప్రధాని నరేంద్ర మోదీతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడారు.

ఈ సంభాషణనే కాల్పుల విరమణ చర్చలుగా అమెరికా ప్రదర్శించింది. ట్రంప్ స్వయంగా సోషల్ మీడియా మాధ్యమం ట్రుత్‌ సోషల్‌లో కాల్పుల విరమణ గురించి ప్రకటించారు.

కాల్పుల విరమణ అనేది పూర్తిగా ద్వైపాక్షిక నిర్ణయమని ఈ నెల ప్రారంభంలో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ట్రంప్, వైట్ హౌజ్

ఫొటో సోర్స్, Francis Chung/Politico/Bloomberg via Getty

‘అమెరికా ఎన్నో యుద్ధాలను ఆపింది’

అమెరికా చాలా యుద్ధాలను ఆపిందని, అవన్నీ కూడా చాలా తీవ్రమైన యుద్ధాలని శుక్రవారం రాత్రి వైట్ హౌస్‌లో రిపబ్లికన్ సెనేటర్లతో ట్రంప్ అన్నారు.

''భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఇదే జరిగింది. అక్కడ విమానాలను కూల్చేశారు. నిజానికి అయిదు యుద్ధ విమానాలను కూల్చేశారని నేను అనుకుంటున్నా. ఈ రెండూ అణ్వస్త్ర దేశాలు. ఒకదానిపై మరొకటి దాడి చేసుకుంటున్నాయి. ఇదొక కొత్త రకమైన యుద్ధంలా అనిపించింది. ఇటీవల మనం ఇరాన్‌లో ఏం చేశామో మీరు చూశారు. అక్కడ వారి అణ్వాయుధ సామర్థ్యాన్ని పూర్తిగా నాశనం చేశాం'' అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

వాణిజ్యాన్ని సాధనంగా వాడి భారత్, పాక్‌ల మధ్య ఘర్షణ ఆగేలా చేశామని ట్రంప్ మరోసారి అన్నారు.

మీరు అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాలని అనుకుంటున్నారు. ఇలా ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటే, అణ్వాయుధాలను ఉపయోగిస్తే అమెరికా మీతో వాణిజ్య ఒప్పందాలను చేసుకోదు అని చెప్పాం'' అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్

యుద్ధ విమానాలు కూలిపోవడంపై భారత్ సమాధానం

పాకిస్తాన్‌తో జరిగిన సైనిక ఘర్షణలో భారత యుద్ధ విమానాలను కోల్పోవడానికి సంబంధించిన ప్రశ్నలకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ సమాధానమిచ్చారు.

బ్లూమ్‌బర్గ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సీడీఎస్ అనిల్ చౌహాన్ మాట్లాడుతూ.. 'విమానం కూలిపోయిందా లేదా అనేది అంత ముఖ్యమైన విషయమేమీ కాదు, కానీ అది ఎందుకు జరిగిందనేదే ముఖ్యం' అని ఆయన స్పష్టం చేశారు.

అలాగే, ఆరు విమానాలను కూల్చేశామన్న పాకిస్తాన్ వాదనలను ఆయన పూర్తిగా తిరస్కరించారు.

విమానాల సంఖ్య గురించి ఆయన ఏమీ మాట్లాడలేదు.

''కనీసం ఒక్కటైనా కూల్చేశారా, అదైనా నిజమా?'' అని ఆ జర్నలిస్ట్ మరోసారి అడిగారు.

దీనికి జనరల్ అనిల్ చౌహాన్ స్పందిస్తూ, ''ఇక్కడ మంచి విషయం ఏంటంటే, మా వ్యూహాత్మక తప్పులను మేం గుర్తించగలిగాం. వాటిని సరిదిద్దుకున్నాం. రెండు రోజుల తర్వాత వాటిని అమలు చేశాం. ఆ తర్వాత మా జెట్లన్నింటినీ మోహరించాం, సుదూర లక్ష్యాలను టార్గెట్ చేశాం'' అన్నారు.

''ఆరు భారత యుద్ధ విమానాలను కూల్చివేశామని పాకిస్తాన్ చెబుతోంది, అది నిజమేనా?'' అని ఆ జర్నలిస్ట్ మరోసారి అడిగారు.

ఈ ప్రశ్నకు జనరల్ అనిల్ ప్రతిస్పందిస్తూ".. అది పూర్తిగా తప్పు. అయితే నేను చెప్పినట్లుగా, ఇదంత ముఖ్యం కాదు. జెట్‌లు ఎందుకు కూలిపోయాయి, ఆ తర్వాత మేం ఏం చేశామన్నదే కీలకం. అది మాకు చాలా ముఖ్యం'' అన్నారు.

ఎస్ జై శంకర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్, భారత్ వ్యవహారాలన్నీ ద్వైపాక్షికమైనవని జై శంకర్ అన్నారు

అమెరికా కాల్పుల విరమణ వ్యాఖ్యలపై భారత్ ఏమన్నది?

భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఇటీవల క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనడానికి అమెరికా వెళ్లారు. కాల్పుల విరమణ అనేది పూర్తిగా ద్వైపాక్షికమని అక్కడ అమెరికన్ మ్యాగజీన్ 'న్యూస్‌వీక్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జై శంకర్ చెప్పారు.

భారత్, పాక్‌ల మధ్య సంఘర్షణను ఆపడానికి వాణిజ్యాన్ని ఒక సాధనంగా ఉపయోగించామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే పదే చెప్పారు. ఇది వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన చర్చలపై ఏదైనా ప్రభావం చూపిందా? అని జైశంకర్‌ను ఇంటర్వ్యూలో ప్రశ్నించారు.

''అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మే 9న ప్రధాని నరేంద్రమోదీతో మాట్లాడినప్పుడు నేను ఆ గదిలోనే ఉన్నాను. మనం కొన్ని విషయాలకు అంగీకరించకపోతే భారత్‌పై పాక్ పెద్ద దాడికి దిగొచ్చని ఆయన అన్నారు. కానీ, ప్రధానిపై పాకిస్తాన్ బెదిరింపులు ఎటువంటి ప్రభావం చూపలేదు. పైగా భారత్ తరఫు నుంచి సరైన ప్రతిస్పందన ఉంటుందనే స్పష్టమైన సంకేతాలను ఆయన ఇచ్చారు'' అని జై శంకర్ బదులిచ్చారు.

పాకిస్తాన్‌తో భారత్ వ్యవహారాలు ద్వైపాక్షికమైనవనే భావన విషయంలో చాలా ఏళ్లుగా ఏకాభిప్రాయం ఉందని జైశంకర్ అన్నారు.

''ఇక ఆరోజు రాత్రి గురించి మాట్లాడుకుంటే, పాకిస్తాన్ మాపై దాడి చేసిన వెంటనే మేం జవాబు ఇచ్చాం. మరుసటి రోజు ఉదయం మార్కో రూబియో నాకు ఫోన్ చేసి పాకిస్తాన్ చర్చలకు సిద్ధంగా ఉందని చెప్పారు. నాకు స్వయంగా తెలిసిన విషయాలను మాత్రమే నేను మీకు చెప్పగలను. మిగిలినవి మీరు అర్థం చేసుకోవచ్చు'' అని ఎస్ జైశంకర్ అన్నారు.

పాకిస్తాన్‌తో కాల్పుల విరమణ ద్వైపాక్షికమని, మూడో దేశం జోక్యం వల్ల జరగలేదని ట్రంప్‌కు ప్రధాని మోదీ స్పష్టంగా చెప్పారని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)