షేక్‌హ్యాండ్ వివాదం: ఇద్దరు భారత క్రికెటర్లు సెంచరీకి చేరువలో ఉన్నప్పుడు మ్యాచ్ ముగించాలని ఇంగ్లండ్ కెప్టెన్ ఎందుకనుకున్నాడు?

భారత్, ఇంగ్లండ్, టెస్ట్ సిరీస్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అభిజిత్ శ్రీవాత్సవ
    • హోదా, బీబీసీ కోసం

మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రఫోర్డ్‌లో డ్రాగా ముగిసిన నాలుగో టెస్ట్‌లో షేక్ హ్యాండ్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులు వెనుకబడినప్పటికీ, కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో భారత జట్టు ఈ టెస్టును డ్రా చేయగలిగింది.

మ్యాచ్ ముగియడానికి దాదాపు గంట ముందు, ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ క్రీజులో ఉన్న రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌తో షేక్‌హ్యాండిచ్చి, మ్యాచ్‌ను డ్రా చేయాలని ప్రతిపాదించాడు.

కానీ, ఆ సమయంలో సెంచరీలకు దగ్గరగా ఉన్న ఆ ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు ఆ ప్రతిపాదనను తిరస్కరించారు.

అప్పుడు రవీంద్ర జడేజా 89 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 80 పరుగుల దగ్గర ఆడుతున్నారు.

ఆ సమయానికి మ్యాచ్‌లో 15 ఓవర్లు మిగిలి ఉన్నాయి. అంటే గంటకు పైగా ఆట మిగిలి ఉంది.

మ్యాచ్ ముగించాలన్న ప్రతిపాదనను జడేజా, సుందర్ తిరస్కరించడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన స్టోక్స్, అంపైర్‌ను సంప్రదించాడు.

ఇంతలో ఇంగ్లండ్ ఆటగాడి గొంతు స్టంప్స్ మైక్ నుంచి వినిపించింది. '' ఎంత టైమ్ కావాలి, ఒక గంటా? అన్న మాట వినిపించింది.

అప్పుడు రెండు జట్ల ఆటగాళ్ల మధ్య కొంత వాడీవేడీ వాదన జరిగింది. ఇంగ్లండ్ ఆటగాళ్లు హ్యారీ బ్రూక్, జాక్ క్రాలీ కూడా ఏదో అన్నారు గానీ వారు చెప్పేది స్పష్టంగా వినపడలేదు.

స్టోక్స్ ఆ తర్వాత హ్యారీ బ్రూక్, జో రూట్‌తో బౌలింగ్ చేయించాడు. చివరి కొన్ని నిమిషాలపాటు రెండు జట్ల మధ్య కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
భారత్, ఇంగ్లండ్, టెస్ట్ సిరీస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రెండో ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ సెంచరీలు చేశారు.

'హ్యాండ్ షేక్' వివాదంపై గంభీర్, స్టోక్స్ ఏమన్నారు?

మ్యాచ్ తర్వాత టీం ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్‌ను దీని గురించి అడిగినప్పుడు, ''ఒక బ్యాట్స్‌మన్ 90 పరుగుల వద్ద, మరొకరు 85 పరుగుల వద్ద ఆడుతున్నట్టయితే, అతను సెంచరీకి అర్హుడు కాదా? ఇంగ్లండ్‌కు చెందిన ఎవరైనా ఇలా ఆడుతూ తన మొదటి టెస్ట్ సెంచరీ సాధించే అవకాశం ఉంటే, అతన్ని అనుమతించరా?'' అని ప్రశ్నించాడు.

సెంచరీ పూర్తి చేయడానికి భారత జట్టు ఆటను పొడిగించిందని, అయితే తన బౌలర్లతో ఎక్కువ బౌలింగ్ చేయించకూడదని తాను భావించానని మ్యాచ్ తర్వాత బెన్ స్టోక్స్ చెప్పాడు.

తాను షేక్ హ్యాండ్ ఇచ్చి మ్యాచ్ ముగించాలన్న ప్రతిపాదన చేసిప్పుడు, ఆట ముగిసినా ఫలితం డ్రా అవుతుందని స్టోక్స్ అన్నాడు.

నాకు దీనితో (జడేజా, సుందర్ బ్యాటింగ్ కొనసాగించడం) ఎలాంటి సమస్యా లేదు. ఇగ్లండ్‌కు దీంతో సమస్య ఉంది. బౌలర్లు అలసిపోయారు కాబట్టి వారు మైదానం వదిలి వెళ్లాలనుకున్నారు. కానీ ఇద్దరు ఆటగాళ్లు 80, 90 పరుగులు దాటడానికి చాలా కష్టపడ్డారు. వారు టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ సాధించాలని కోరుకున్నారు'' అని ఆ సమయంలో స్కై స్పోర్ట్స్‌ కోసం కామెంటరీ చేస్తున్న ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ వ్యాఖ్యానించాడు.

''ఇంగ్లండ్ జట్టులోని ఇద్దరు బ్యాట్స్‌మెన్ టెస్ట్ సెంచరీలకు దగ్గరగా ఉంటే బెన్ స్టోక్స్ ఏం చేసే వాడో చూడాలనుకుంటున్నాను?'' అని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు.

ఆ తర్వాత, రవీంద్ర జడేజా తన టెస్ట్ కెరీర్‌లో ఐదో సెంచరీని పూర్తి చేయగా, వాషింగ్టన్ సుందర్ తన టెస్ట్ కెరీర్‌లో తొలి సెంచరీ సాధించాడు.

మ్యాచ్ తర్వాత ఈ సంఘటన గురించి వాషింగ్టన్ సుందర్‌ను అడిగినప్పుడు, అతనా ప్రశ్నకు జవాబివ్వలేదు. ''ఏ జరిగిందో టీవీలో అందరూ చూశారని, వారందరూ దానిని ఆస్వాదించి ఉంటారని నేను అనుకుంటున్నా" అని సుందర్ అన్నాడు.

భారత్, ఇంగ్లండ్, టెస్ట్ సిరీస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రవీంద్ర జడేజా తన టెస్ట్ కెరీర్‌లో ఐదో సెంచరీ, వాషింగ్టన్ సుందర్ తొలి సెంచరీ చేశారు.

రికార్డుల టెస్ట్

చివరి సెషన్‌లో ఈ వివాదం కాకుండా, ఈ టెస్ట్ మ్యాచ్‌ అనేక రికార్డులకు వేదికయింది.

టెస్ట్ క్రికెట్‌లో పరుగులు సాధించడంలో జో రూట్ దూసుకుపోయాడు.

ఓల్డ్ ట్రఫోర్డ్ టెస్టులో ఎవరెవరు ఏ రికార్డులు సృష్టించారంటే...

ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఐదో సాన్థం నుంచి రెండో స్థానానికి ఎగబాకాడు.

టెస్టు క్రికెట్‌లో రూట్ 13,409 పరుగులు చేశాడు. అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగుల జాబితా రికార్డు సచిన్ టెండూల్కర్ (15,921) పేరు మీద ఉంది.

టెస్టు క్రికెట్‌లో 7వేల పరుగులు, 200 వికెట్లు తీసిన మూడో ఆల్ రౌండర్‌గా బెన్ స్టోక్స్ నిలిచాడు.

వరుసగా 350పైగా పరుగుల రికార్డు

ఓల్డ్ ట్రఫోర్డ్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 425 పరుగులు చేసింది. దీనితో, ఈ టెస్ట్ సిరీస్‌లో భారత జట్టు మొత్తం ఏడుసార్లు 350కి పైగా పరుగులు చేసింది.

ఒక టెస్ట్ సిరీస్‌లో ఏ జట్లయినా ఇన్నిసార్లు 350కి పైగా పరుగులు చేయడం సరికొత్త రికార్డు.

ఈ విజయంతో, ఆస్ట్రేలియా రికార్డును బద్ధలు కొట్టింది భారత్. 1920–21, 1948, 1989 యాషెస్ సిరీస్‌లలో ఆస్ట్రేలియా ఆరుసార్లు 350కి పైగా స్కోరు చేసింది.

భారత్, ఇంగ్లండ్, టెస్ట్ సిరీస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, టెస్ట్ సిరీస్‌లో ఇప్పటికే శుభమన్ గిల్ నాలుగు సెంచరీలు చేశాడు.

ఒక టెస్ట్ సిరీస్‌లో ఇప్పటికే నాలుగు సెంచరీలు

ఈ సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ నాలుగు సెంచరీలు చేశాడు. ట్రఫోర్డ్ టెస్టులో చేసిన సెంచరీతో సునీల్ గావస్కర్, విరాట్ కోహ్లీ రికార్డును శుభ్‌మన్ గిల్ సమం చేశాడు.

గిల్ ఈ నాలుగు సెంచరీలను కెప్టెన్‌గా సాధించాడు. కెప్టెన్‌గా ఒకే సిరీస్‌లో నాలుగు సెంచరీలు చేసిన రికార్డు గతంలో డాన్ బ్రాడ్‌మాన్, సునీల్ గావస్కర్ పేరిట ఉండేది.

బ్రాడ్‌మన్ 1947-48లో, గావస్కర్ 1978-79లో ఈ ఘనతను సాధించారు. గిల్ ఈ రికార్డును సమం చేశాడు.

ఇది మాత్రమే కాదు, బ్రాడ్‌మన్ (1930) తర్వాత ఇంగ్లండ్‌లో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఆ జట్టుపై నాలుగు సెంచరీలు చేసిన మొదటి బ్యాట్స్‌మన్‌గా గిల్ నిలిచాడు.

ఈ సిరీస్‌లో ఇప్పటివరకు గిల్ 722 పరుగులు చేశాడు.

భారత్, ఇంగ్లండ్, టెస్ట్ సిరీస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా 112 పరుగులిచ్చాడు.

రెండో ఇన్నింగ్స్‌లో ముగ్గురు సెంచరీలు

ఈ సిరీస్‌లో ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ 511 పరుగులు చేశాడు. ఇంగ్లండ్‌లో 500 కంటే ఎక్కువ పరుగులు చేసిన రెండో ఓపెనర్ అతను. 1979 పర్యటనలో గావస్కర్ మాత్రమే అతని కంటే ఎక్కువ పరుగులు చేశాడు. అప్పుడు గావస్కర్ 542 పరుగులు చేశాడు.

ఓల్డ్ ట్రఫోర్డ్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో భారత్ తరఫున కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (103 పరుగులు), ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా (107 పరుగులు), వాషింగ్టన్ సుందర్ (101 పరుగులు) సెంచరీలు చేశారు. ఒక టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో భారత్ నుంచి ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లు సెంచరీలు చేయడం ఇదే తొలిసారి.

ప్రపంచ నంబర్ వన్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 112 పరుగులు ఇచ్చాడు. టెస్ట్ మ్యాచ్‌ల ఇన్నింగ్స్‌లో జస్‌ప్రీత్ బుమ్రా 100 కంటే ఎక్కువ పరుగులు ఇవ్వడం ఇదే తొలిసారి. అంతకుముందు 2024లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్‌లో జస్‌ప్రీత్ 99 పరుగులకు నాలుగు వికెట్లు పడగొట్టాడు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)