ఇంగ్లండ్‌‌పై రెండో టెస్టులో భారత్ ఘన విజయం, 10 వికెట్లు తీసిన ఆకాశ్ దీప్

ఆకాశ్ దీప్, భారత్ , ఇంగ్లండ్

ఫొటో సోర్స్, Getty Images

ఇంగ్లండ్‌తో బర్మింగ్‌హామ్‌లో ఎడ్జ్‌బాస్టన్‌‌ మైదానంలో జరిగిన రెండో టెస్టులో భారత జట్టు 336 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.

608 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 271 పరుగులకే ఆలౌటైంది. ఈ ఇన్నింగ్స్‌లో భారత బౌలర్ ఆకాశ్ దీప్ అత్యధికంగా ఆరు వికెట్లు తీశాడు.

విజయానికి చివరి రోజు భారత్‌కు ఏడు వికెట్లు అవసరం కాగా, ఇంగ్లండ్ గెలవాలంటే మరో 536 పరుగులు చేయాల్సి ఉంది.

ఐదో రోజు ఆట మొదలుపెట్టిన ఓలీ పోప్ (24), హ్యారీ బ్రూక్ (23)లను భారత బౌలర్లు ఎక్కువసేపు క్రీజులో ఉండనివ్వలేదు. ఆకాశ్ దీప్ వెంటవెంటనే ఇద్దరినీ ఔట్ చేశాడు. దీంతో 83 పరుగులకే ఇంగ్లండ్ జట్టు ఐదు వికెట్లు కోల్పోయింది.

ఆకాశ్ దీప్, భారత్ టెస్టు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆకాశ్ దీప్ సంబరం

ఐదు వికెట్లను కోల్పోయిన తర్వాత కెప్టెన్ స్టోక్స్, జేమీ స్మిత్ భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నారు. ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డుకు పరుగులు జతచేశారు.

అయితే, ఈ జోడీని వాషింగ్టన్ సుందర్ విడదీశాడు. స్టోక్స్‌(33)ను ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ 153 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది.

స్మిత్, స్టోక్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, స్టోక్స్ రెండు ఇన్సింగ్స్‌లలో తక్కువ పరుగులకే ఔటయ్యాడు.

స్టోక్స్ ఔటయ్యాక, జేమీ స్మిత్ ఒంటరి పోరాటం చేశాడు. 88 పరుగులు చేసిన స్మిత్ చివరికి ఆకాశ్ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి ఔటయ్యాడు.

ఆ తర్వాత టెయిలెండర్లు కొద్దిసేపు పోరాడినా భారత విజయాన్ని అడ్డుకోలేకపోయారు.

చివరికి 271 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఆలౌటైంది. భారత బౌలర్లలో ఆకాశ్ దీప్ ఆరు వికెట్లు తీయగా, సిరాజ్, జడేజా, ప్రసిద్ధ్, సుందర్ తలో వికెట్ తీశారు.

మొత్తంగా ఈ టెస్టులో ఆకాశ్ దీప్ పది వికెట్లు పడగొట్టాడు.

సిరాజ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రెండో టెస్టులో సిరాజ్ ఏడు వికెట్లు తీశాడు.

ఈ టెస్టులో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 587 పరుగుల చేసి ఆలౌట్ అయింది.

కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 269 పరుగులు, రవీంద్ర జడేజా 89 పరుగులు, జైశ్వాల్ 87 పరుగులతో రాణించారు.

ఇంగ్లండ్ బౌలర్ బషీర్ మూడు వికెట్లు తీశాడు.

గిల్, భారత్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గిల్

ఇంగ్లండ్ మొదటి ఇన్సింగ్స్‌లో 407 పరుగులకు ఆలౌటైంది. జేమీ స్మిత్(184), హ్యారీ బ్రూక్(158) రాణించారు.

భారత బౌలర్లలో మొహమ్మద్ సిరాజ్ ఆరు వికెట్లు తీయగా, ఆకాశ్ దీప్ నాలుగు వికెట్లు తీశారు.

స్మిత్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇంగ్లండ్ బ్యాటర్ జేమీ స్మిత్

భారత్ రెండో ఇన్నింగ్స్‌ను 427/6 వద్ద డిక్లేర్ చేసి, ఇంగ్లండ్ ముందు 608 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

గిల్ రెండో ఇన్నింగ్స్‌లోనూ 161 పరుగులతో ఆకట్టుకున్నాడు. రిషబ్ పంత్ 65, రవీంద్ర జడేజా 69 పరుగులు చేశారు.

ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 271 పరుగులకే ఆలౌటైంది. 88 పరుగులు చేసిన స్మిత్ టాప్ స్కోరర్.

ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీ‌స్‌ను భారత్ 1-1తో సమం చేసింది.

గిల్, భారత్, ఇంగ్లండ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్

ఒకే టెస్టులో 200, 150 పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా గిల్ అరుదైన రికార్డు సృష్టించాడు.

ఈ సిరీస్‌లో అతను మొత్తంగా 585 పరుగులు చేశాడు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)