బుమ్రాకు, మిగతా ఫాస్ట్ బౌలర్లకు తేడా ఆ 40 సెంటీమీటర్లేనా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, స్టీవెన్ ఫిన్
- హోదా, బీబీసీ క్రికెట్ జర్నలిస్ట్
జస్‌ప్రీత్ బుమ్రా ‘మోస్ట్ కంప్లీట్ ఫాస్ట్ బౌలర్ ఆఫ్ ఆల్‌టైమ్’ అనే వాదనను కాదనడం చాలా కష్టం.
ఆయన ఆడే ప్రతి మ్యాచ్‌లో సంధించే బంతుల ప్రభావం అలా ఉంటుంది మరి.
హెడింగ్లే వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఇప్పటివరకు చూసిన అన్ని సందర్భాలను మించి రాణించాడు బుమ్రా.
ఇంగ్లండ్‌తో జరిగిన ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా 83 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు.
బుమ్రా చేతికి బంతి వచ్చిందంటే చాలు.. ప్రతి బంతికి ఏదో జరగబోతుందని ఫీల్ కావొచ్చు.
ప్రపంచంలోని అత్యుత్తమమైన బ్యాటర్లను సైతం బుమ్రా తన బౌలింగ్‌తో తికమకలో పడేస్తాడు. అసలేం జరిగిందో వారికి అర్థం కాదు.
అర్థమయ్యేలోగానే అతని చేతుల్లో నుంచి బంతి వేగంగా బ్యాటర్ ముందుకు దూసుకొస్తుంది.


ఫొటో సోర్స్, Getty Images
బుమ్రాను ఎదుర్కొనే అవకాశం కనుక నాకు వచ్చుంటే, రెండు బంతుల్లోనే నేను పెవిలియన్ చేరుతానేమో.
ఒక మంచి షార్ట్ బాల్, ఆ వెంటనే పదునైన యార్కర్.. అలా ఉంటుంది ఆయన అనుసరించే ట్రిక్.
యార్కర్ వేసినప్పుడు బంతి చాలా వేగంగా కచ్చితమైన లక్ష్యంతో బ్యాట్స్‌మన్ కాళ్ల దగ్గర నేలను తాకి, బ్యాట్ ముందుకు నేరుగా దూసుకువస్తుంది.
అతను కనుక పైన ఆప్షన్లలో రెండో దాన్ని ఎంచుకుంటే, నేను ఆశలు వదులుకోవాల్సిందే.
బుమ్రా బౌలింగ్ చేసేటప్పుడు బంతిని చూడటం చాలా కష్టమే.
బ్యాటింగ్‌లో చివరిగా వచ్చే నాలాంటి బ్యాట్స్‌మెన్ అయితే బుమ్రా బౌలింగ్‌కు దెబ్బతినడం ఖాయమే.
ఒక బౌలర్‌ను ''హార్డ్ టూ పికప్'' అని బ్యాటర్లు వర్ణించడం మీరు వినే ఉంటారు.
చివరి సెకను వరకు బంతిని బ్యాటర్ల కంటికి కనిపించకుండా దాచే బౌలర్లను ఎదుర్కోవడం చాలా కష్టం.
బుమ్రా బౌలింగ్ కనుక మీరు చూస్తే.. అతను బంతిని వేసేటప్పుడు చాచిన చేయి గడియారంలో రెండు అంకెపై ఉన్నట్లు కనిపిస్తుంది.
ఆ తర్వాత వెంటనే చేయి బౌలింగ్ ఆర్క్‌పైకి (బంతి వేసే లైన్‌పైకి) దిగొస్తుంది. కానీ, బంతి వేసేటప్పుడు, మోచేయి మరింత సాగుతుంది.
బంతి ఆయన మోచేయి వెనుకనుంచే అదృశ్యమై బ్యాటర్ వైపు దూసుకొస్తుంది. దీంతో బ్యాట్స్‌మెన్ బంతి గమనాన్ని అంత సులభంగా కనిపెట్టలేడు.

ఫొటో సోర్స్, Getty Images
బుమ్రా బౌలింగ్‌లో బ్యాటర్లు ఎదుర్కొనే మరో సవాలు.. బంతిని రిలీజ్ చేసే పాయింట్. అది బుమ్రాకు అడ్వాంటేజ్. మిగతా పేసర్లకు భిన్నంగా బ్యాటర్‌కు బాగా దగ్గరగా బంతిని వేయడం అతని ప్రత్యేకత.
ఫాస్ట్ బౌలర్లు బంతి వేయడాన్ని కనుక మీరు చూస్తే.. చాలామంది తమ ఫ్రంట్ ఫుట్ పైకి తమ చేయి వచ్చిన సమయంలో బంతిని విసురుతారు.
కానీ, బుమ్రా అలా కాదు. తన ఫ్రంట్ ఫుట్ కంటే సుమారు 40 సెంటీమీటర్ల ముందుకి చేయి ఉంటుంది.. ఆ సమయంలో చేతి నుంచి బంతి విడుదలవుతుంది. దానివల్ల బుమ్రాకు, బ్యాటర్‌కు మధ్య దూరం తగ్గుతుంది.
ఈ దూరం తగ్గడంతో మిగతా బౌలర్ల కంటే కచ్చితత్వంతో బుమ్రా బ్యాటర్‌కు దగ్గరగా బంతిని వేయగలుగుతాడు. దాంతో బ్యాటర్‌కు స్పందించడానికి ఉన్న సమయం తగ్గిపోతుంది.
బ్యాటర్లు అనేక గంటల పాటు బుమ్రా బౌలింగ్ ఫుటేజీని పరిశీలించినా.. చివరకు ఆయన్ను ఎదుర్కొనే సమయం వచ్చేసరికి మాత్రం వారికి ఆ బంతులు ఆశ్చర్యకరంగానే ఉంటాయి.
బంతి వేసేటప్పుడు అతను ఏం చేయబోతున్నాడో ఎవరూ చెప్పలేరు. బంతిని విడిచేటప్పుడు చేతిని ఉంచే విధానం, ఫింగర్ పొజిషన్‌లో ఎలాంటి మార్పు ఉండదు.

ఫొటో సోర్స్, Getty Images
ఇంగ్లిష్ బ్యాటర్లలో జో రూట్‌ను టెస్ట్ క్రికెట్‌లో బుమ్రా 10 సార్లు అవుట్ చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లు పాట్ కమిన్స్, హేజిల్‌వుడ్ మాత్రమే రూట్‌ను అంతకంటే ఎక్కువసార్లు అవుట్ చేశారు.
బుమ్రా బౌలింగ్‌లో సాంకేతిక అంశాలను పక్కనపెడితే మ్యాచ్‌లను ఇంత నిలకడగా ప్రభావితం చేస్తున్న ఫాస్ట్ బౌలర్ చరిత్రలో ఎవరూ లేరని నేను భావిస్తాను.
ఎంత పని ఇచ్చినా నిరంతరం పనిచేయగల సామర్థ్యం ఉన్న కంప్యూటర్‌లా ఉంటుంది బుమ్రా తీరు.
తాను అనుకున్నది అనుకున్నట్లుగా కచ్చితత్వంతో అమలు చేయగలడు బుమ్రా.

ఫొటో సోర్స్, Getty Images
టీ 20 ఇంటర్నేషనల్స్‌లో ప్రధాన దేశాలకు చెంది, కనీసం 500 బంతులు వేసిన పేస్ బౌలర్లలో బెస్ట్ ఎకానమీ రేట్ బుమ్రాదే. ఆయన ఎకానమీ రేట్ 6.27.
ఇక టెస్ట్ క్రికెట్‌లో కనీసం 200 వికెట్లు తీసిన బౌలర్లలో చూసుకుంటే ప్రపంచంలోనే అత్యుత్తమ సగటు బుమ్రాది.
బుమ్రా బౌలింగ్ సగటు 19.33 కాగా రెండో స్థానంలో ఉన్న వెస్టిండీస్ లెజెండ్ మాల్కమ్ మార్షల్ బౌలింగ్ సగటు 20.94.
బుమ్రా కంటే తక్కువ సగటుతో 100కి పైగా వికెట్లు తీసిన బౌలర్లు ఉన్నారు. కానీ, వారంతా మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు ఆడినవారు.
బౌలర్లకు టెస్ట్, టీ20 ఫార్మాట్ల మధ్య చాలా తేడా ఉంటుంది. ఈ రెండింటి కోసం వైవిధ్యమైన నైపుణ్యాలు కావాలి. బుమ్రా రెండింట్లోనూ అత్యుత్తమ బౌలర్‌గా పేరొందాడు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














