బౌలర్లు బంతికి ఉమ్మి ఎందుకు రాస్తారు? లాలాజలం రాయడంపై నిషేధం ఎత్తివేయడంతో ఈ ఐపీఎల్‌లో స్కోర్‌లు తగ్గుతాయా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, ఇండియన్ కరెస్పాండెంట్
సాధారణంగా క్రికెట్‌లో బంతి స్వింగ్ చేయడానికి బౌలర్లు లాలాజలం(ఉమ్మి), చెమటను రాస్తుంటారు.
అయితే కరోనా మహమ్మారి సమయంలో ఉమ్మి రాయడాన్ని నిషేధించారు.
అయిదేళ్ల కిందట కోవిడ్ సమయంలో విధించిన ఈ నిషేదాన్ని ఎత్తివేస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్.
శనివారం నుంచి ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో బౌలర్లు క్రికెట్ బంతికి ఉమ్మి రాయడంపై ఎలాంటి నిషేధం ఉండబోదని మీడియా కథనాలు చెప్తున్నాయి.
గురువారం జరిగిన సమావేశంలో ఐపీఎల్ ఫ్రాంచైజీ కెప్టెన్లలో ఎక్కువ మంది నిషేధం ఎత్తివేతకు అనుకూలంగా ఉండడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందని ‘ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో’ తెలిపింది.

కరోనా సమయంలో వైద్యుల సూచనల మేరకు క్రికెట్ మ్యాచ్‌లలో బంతికి ఉమ్మి రాయడాన్ని తాత్కాలికంగా నిషేధించారు. 2020 మే నెలలో ఈ తాత్కాలిక నిషేధం అమలులోకి వచ్చింది.
అయితే, బంతికి చెమట రాయడాన్ని మాత్రం నిషేధించలేదు.
అనంతరం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 2022 సెప్టెంబర్‌లో ఈ నిషేధాన్ని శాశ్వతం చేసింది.
గాలిలో స్వింగ్ చేయడానికి ఆటగాళ్లు బంతికి ఒక వైపు లాలాజలం, చెమటను రాస్తారు.
కోవిడ్ వ్యాప్తిని తగ్గించడానికి లాలాజలం వాడకాన్ని నిషేధించారు.

ఫొటో సోర్స్, AFP
బంతి షైనింగ్ తగ్గకుండా ఫాస్ట్ బౌలర్లు లాలాజలం రాస్తుంటారు. షైనింగ్ ఉంటే బంతి స్వింగ్ అవుతుందని చెప్తుంటారు.
అలాగే బౌలర్లు రివర్స్ స్వింగ్ చేసేటప్పుడు కూడా బంతికి ఉమ్మి రాస్తుంటారు.
పిచ్ పొడిగా ఉన్నప్పుడు, బంతి పాతదైనప్పుడు బౌలర్లు ఎక్కువగా ఇలా చేస్తుంటారు.
వన్డేలు, టీ20ల వంటి వైట్ బాల్ ఫార్మాట్ల కంటే టెస్ట్‌లలో సాధారణంగా ఉపయోగించే రెడ్ బాల్ క్రికెట్‌లో లాలాజలం మరింత ప్రభావం చూపిస్తుంది.
రెడ్ బాల్ క్రికెట్‌లో బంతిని ఎక్కువసేపు ఉపయోగిస్తారు. అలాంటి సందర్భంలో బంతిని షైన్ చేస్తూ రివర్స్ స్వింగ్ రాబట్టడంలో బౌలర్లు బంతికి ఉమ్మి రాస్తుంటారు.
ఐపీఎల్ కోసం బీసీసీఐ ఈ నిషేధాన్ని ఎత్తివేయడంతో ఐసీసీ కూడా రెడ్ బాల్ క్రికెట్‌లోనూ ఉమ్మి రాయడంపై నిషేధం ఎత్తివేస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు.
ప్రపంచంలోని అత్యంత సంపన్న క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ మాజీ కార్యదర్శి అయిన జయ్ షా ప్రస్తుతం ఐసీసీకి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

ఫొటో సోర్స్, AFP
ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2025లో డిఫెండింగ్ చాంపియన్స్ ‘కోల్‌కతా నైట్ రైడర్స్’, ‘రాయల్ చాలెంజర్స్ బెంగళూరు’ మధ్య కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే మ్యాచ్‌తో బంతికి ఉమ్మి రాయడంపై నిషేధం తొలగిపోతుంది.
ఈ టోర్నీలో భాగంగా రెండు నెలల్లో 74 మ్యాచ్‌లు జరుగుతాయి. దేశంలోని 13 నగరాల్లో మ్యాచ్‌లు జరుగుతాయి.
గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ తరపున ఆడుతున్న భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఈ నిర్ణయాన్ని స్వాగతించారు.
"బౌలర్లకు ఇది చాలా మంచి వార్త. ఎందుకంటే బంతి అనుకూలంగా లేనప్పుడు, బంతిపై లాలాజలం పూయడం వల్ల రివర్స్ స్వింగ్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి" అని సిరాజ్ పీటీఐ వార్తా సంస్థతో అన్నారు.
"బంతిని చొక్కాకు వ్యతిరేకదిశలో రుద్దడం వల్ల రివర్స్ స్వింగ్ సాధ్యం కాదు. కానీ బంతిపై లాలాజలం రాస్తే బంతిపై మెరుపు తగ్గకుండా ఉండేలా చేస్తుంది. దీంతో రివర్స్ స్వింగ్ సాధ్యం అవుతుంది. కాబట్టి లాలాజలం రాయడం చాలా ముఖ్యం’ అని ఆయన అన్నారు.
మరో భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ఈ నెల ప్రారంభంలో నిషేధం ఎత్తివేయాలని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)ను కోరారు.
"ఆటలోకి రివర్స్ స్వింగ్‌ను తిరిగి తీసుకురావడానికి లాలాజలాన్ని ఉపయోగించడానికి అనుమతించాలని మేం విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాం" అని ఆస్ట్రేలియాపై భారతదేశం చాంపియన్స్ ట్రోఫీ సెమీ-ఫైనల్‌లో విజయం సాధించిన తర్వాత మహ్మద్ షమీ చెప్పారు.
షమీ విజ్ఞప్తిని మాజీ అంతర్జాతీయ బౌలర్లు వెర్నాన్ ఫిలాండర్, టిమ్ సౌథీ వంటివారు సమర్థించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఈ నిషేధం తనను కూడా గందరగోళానికి గురి చేసిందని చెప్పారు.
"ఐసీసీ కొన్ని పరిశోధన పత్రాలను విడుదల చేసింది, అవి లాలాజలం రివర్స్ స్వింగ్‌కు పెద్దగా సహాయపడదని, బంతిపై లాలాజలం వేయకపోయినా పెద్ద తేడా ఏమీ లేదని పేర్కొంది. వారు పరిశోధన ఎలా చేశారో నాకు తెలియదు, కానీ సమస్య కాకపోతే లాలాజలాన్ని ఎలాగైనా అనుమతించాలి" అని ఆయన తన యూట్యూబ్ చానల్‌లో అన్నారు.
లాలాజలంపై నిషేధాన్ని ఎత్తివేస్తే బ్యాట్, బంతి మధ్య పోటీ సమానంగా ఉంటుందని స్పోర్ట్స్ రైటర్ శారద ఉగ్రా అన్నారు.
టీ20 లీగ్‌లలో బౌలర్లు బ్యాట్స్‌మెన్‌కు అనుకూలమైన వికెట్లతో ఆడటం మంచిదని చాలా మంది నమ్ముతారు. 2013లో పుణెపై రాయల్ చాలంజర్స్ బెంగళూరు జట్టు చేసిన 263 పరుగులు 2024 వరకు ఐపీఎల్‌లో అత్యధిక స్కోర్‌గా ఉండేది. కానీ, 2024లో ఆ స్కోరును నాలుగుసార్లు అధిగమించారు. 17 సీజన్లలో, 250 పరుగులను 10 సార్లు దాటారు.
అయితే, నిషేధం ఎత్తివేయడం బౌలింగ్‌పై ఎంత ప్రభావం చూపుతుందో స్పష్టంగా తెలియదని కూడా ఉగ్రా అంటున్నారు.
"బంతి స్వింగ్ కావడానికి లాలాజలం ఒక్కటే కారణం కాదు, పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండాలి. నైపుణ్యం కలిగిన బౌలర్ కీలకం" అని ఆమె బీబీసీతో చెప్పారు.
వెంకటేష్ ప్రసాద్ వంటి కొంతమంది మాజీ ఫాస్ట్ బౌలర్లు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
"ఉమ్మి రాయడంపై నిషేధం విధించడానికి కారణం శుభ్రత. ఎప్పుడు ఏదైనా జరగవచ్చు, కొత్త వైరస్ గాలిలోకి ఎప్పుడు ప్రవేశిస్తుందో మనకు తెలియదు. కాబట్టి, నిషేధాన్ని ఎత్తివేయడం గురించి నిర్ణయం తీసుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నేను భావిస్తున్నాను" అని ప్రసాద్ ఈ నెల ప్రారంభంలో టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తాపత్రికతో అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














