ట్రంప్ ఎక్స్‌ప్లోజివ్ టారిఫ్స్: ఇప్పటివరకు ఏం జరిగింది, తెలుసుకోవాల్సిన 6 కీలక విషయాలు

ఫొటో సోర్స్, Reuters
చైనాపై అమెరికా అదనంగా విధించిన 50 శాతం టారిఫ్‌లతో ఆ దేశంపై అమెరికా విధించిన సుంకాల మొత్తం 104 శాతానికి చేరింది.
అమెరికా అధ్యక్ష కార్యాలయం విడుదల చేసిన ప్రకటన మేరకు చైనాపై 34 శాతం సుంకం విధించాల్సి ఉండగా దానిని 84 శాతానికి పెంచారు.
ఇప్పటికే అమెరికాకు ఎగుమతయ్యే చైనా వస్తువులపై 20 శాతం సుంకం విధించగా, తాజాగా 84 శాతం పెంపుతో 104 శాతానికి పెరిగింది. ఈ సుంకాలు నేటి నుంచి అమల్లోకి వస్తాయి.
అయితే, చైనా కూడా వెనక్కి తగ్గడం లేదు. ట్రంప్‌ది బెదిరింపు ధోరణి అని పేర్కొంటూ అమెరికాపై విధించిన పరస్పర సుంకాలను వెనక్కి తీసుకోవడానికి తిరస్కరించింది.
మరోపక్క 60 దేశాలపై డోనల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు అమల్లోకి వచ్చాయి.

ఔషధ కంపెనీలపై కూడా భారీ సుంకాలు విధిస్తానని ట్రంప్ ప్రకటించారు. ఈ చర్యవల్ల ఔషధ కంపెనీలు అమెరికాకు తరలివస్తాయని ట్రంప్ చెబుతున్నారు.
గతవారం ట్రంప్ సుంకాలను ప్రకటించినప్పుడు, ఔషధ కంపెనీలకు మినహాయింపునిచ్చారు. కానీ, ఇప్పుడు వాటిపై సుంకాలు విధిస్తామని, దీనివల్ల ఔషధ కంపెనీలు తమ ఉత్పత్తి కేంద్రాలను అమెరికాకు మార్చుకుంటాయనేది ట్రంప్ వాదన.
ఔషధ కంపెనీలలో ఎక్కువ భాగం చైనా, ఇండియా, యూరప్‌లో ఉన్నాయి.
అయితే, ఇది కేవలం అమెరికా, చైనా సమస్య మాత్రమే కాదు. రెండు దిగ్గజ ఆర్థికవ్యవస్థల మధ్య వాణిజ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కూడా చాలా క్లిష్టమైనది.
అమెరికాపై ప్రతీకార చర్యలు తప్పవని పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రకటించినందువల్లే ఆ దేశంపై అదనంగా 50 శాతం సుంకాలు విధించినట్టు శ్వేత సౌధం తన ప్రకటనలో తెలిపింది.
పరస్పర సుంకాల పేరుతో ట్రంప్ చైనాపై 34 శాతం సుంకాలు విధించినప్పుడు చైనా కూడా అదేస్థాయిలో అమెరికా వస్తువులపై 34 శాతం సుంకాలు విధించింది.

ఫొటో సోర్స్, Getty Images
1. రిపబ్లికన్ల విందులో ట్రంప్ ఏం చెప్పారు?
సుంకాలపై చర్చలు జరిపేందుకు 70 దేశాలు ముందుకు వచ్చాయని శ్వేతసౌధం తెలిపింది.
చర్చలు సానుకూలంగా ఉన్నాయని, అజెండాలో అనేక రాయితీలూ ఉన్నాయని ట్రంప్ ఆర్థిక సలహాదారు కెవిన్ హాసెట్ చెప్పారు. ఏ ఒప్పందాన్నైనా అంతిమంగా ట్రంప్ అంగీకరించాలన్నారు.
వాషింగ్టన్ డీసీలో మంగళవారం జరిగిన రిపబ్లికన్ల విందులో ట్రంప్ మాట్లాడుతూ సుంకాల విధింపును గొప్పచర్యగా అభివర్ణించారు.
సుంకాల విధింపు ద్వారా అమెరికా ఖజానాకు ఒక్కరోజులోనే 2 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరిందని చెప్పారు.
''ప్రజలు, దేశాలు సుంకాలు చెల్లిస్తున్నాయి. ఈ ఒప్పందానికి సంబంధించి ఇతర దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నాం. చర్చల కోసం జపాన్ చొరవతీసుకుంది''
ఈ సుంకాలు కొంతమేర విస్ఫోటనమేనని ట్రంప్ అంగీకరించారు.
''సుంకాలు అమలవుతున్నాయి. దీనివల్ల గతంలో ఎన్నడూ లేనంతగా డబ్బు వానలా కురుస్తోంది'' అని బొగ్గు గని కార్మికులు, కేబినెట్ సభ్యులు, వ్యాపార ప్రముఖల సమావేశంలో ట్రంప్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
2. సుంకాల అమలు ఎప్పటి నుంచి?
చైనా మినహా ప్రపంచంలోని అన్ని దేశాలపై విధించిన సుంకాలు అమలు కావడానికి ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది.
అమెరికా స్థానిక కాలమానం ప్రకారం, మంగళవారం అర్ధరాత్రి నుంచి చైనాపై 104 శాతం సుంకాలు విధిస్తామని వైట్ హౌస్ తెలిపింది.
దీనితో పాటు, అమెరికాపై 'అత్యధిక సుంకాలు విధిస్తూ తమను లూటీ చేసిన దేశాలు'గా ట్రంప్ ప్రభుత్వం అభివర్ణించిన సుమారు 60 దేశాలపై అర్ధరాత్రి నుంచి సుంకాలు అమల్లోకి రానున్నాయి.
మే నెల నుంచి చైనా నుంచి వచ్చే చౌక వస్తువులపై అధిక సుంకాలు విధిస్తామని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల షీన్, టెము వంటి బడా చైనా కంపెనీలకు భారీ నష్టం వాటిల్లుతుంది.
అమెరికాలోని దాదాపు అన్ని వాణిజ్య భాగస్వాములపై 10 శాతం సుంకాన్ని విధిస్తున్నట్లు ట్రంప్ గత వారం ప్రకటించిన విషయం తెలిసిందే.
అనిశ్చితి, అస్థిరత కారణంగా ప్రపంచ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్లు ట్రిలియన్ డాలర్ల నష్టాలను చవిచూశారు.
ఇప్పుడు ట్రంప్ కొత్త టారిఫ్ లు అమల్లోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందోనని ప్రపంచం ఎదురుచూస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
3. ప్రపంచ నేతలు ఏమంటున్నారు?
ప్రపంచ దేశాలపై విధించిన సుంకాలను ఉపసంహరించుకోవాలని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ట్రంప్‌కు విజ్ఞప్తి చేశారు.
‘‘యూరప్ ఎన్నడూ సంక్షోభాలను కోరుకోదు’’ అని ఈజిప్ట్ పర్యటనలో ఉన్న మేక్రాన్ ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు సమధానంగా చెప్పారు.
యూరోపియన్ యూనియన్ సభ్యదేశాల ప్రతిస్పందనపై యూరోపియన్ కమిషన్ కసరత్తు చేస్తోందని ఆయన చెప్పారు. అమెరికా వస్తువులపై 25 శాతం వరకు సుంకాలు విధించే అంశాన్ని యూరప్ పరిశీలిస్తున్నట్లు కొన్ని నివేదికలు వెల్లడించాయి.
యూరోపియన్ యూనియన్ నుంచి చేసుకుంటున్న దిగుమతులపై ట్రంప్ 20 శాతం సుంకం విధించారు.
ఈ వాణిజ్య యుద్ధంలో విజేతలు ఉండరని, దాని ప్రభావం పేద దేశాలపై ఎక్కువగా ఉంటుందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ అన్నారు.
ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.. 'వాణిజ్య యుద్ధం చాలా ప్రతికూలం. ఇందులో ఎవరూ గెలవరు, ప్రతి ఒక్కరూ నష్టపోతారు’ అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
4. స్టాక్ మార్కెట్ల సంగతేంటి?
ప్రపంచవ్యాప్తంగా సోమవారం స్టాక్‌మార్కెట్లు భారీ పతనం తరువాత మంగళవారం కాస్త కోలుకున్న సంకేతాలు కనిపించాయి. యూఎస్ స్టాక్ మార్కెట్ లాభాలతో ప్రారంభమైనా ట్రేడింగ్ ముగిసే సమయానికి మార్కెట్ సెంటిమెంట్ ప్రతికూలంగా మారింది.
మంగళవారం అమెరికా స్టాక్ మార్కెట్ ఎస్ అండ్ పీ-500 సూచీ 1.57 శాతం, డౌజోన్స్ 0.84 శాతం, నాస్ డాక్ 2.15 శాతం నష్టపోయాయి.
టెస్లా షేర్లు 5.45 శాతం, ఆపిల్ షేర్లు 5.22 శాతం క్షీణించాయి.
మరో ప్రముఖ అమెరికా టెక్ కంపెనీ ఎన్విడియా షేర్లు 2.01 శాతం, అమెజాన్ షేర్లు 2.88 శాతం క్షీణించాయి.
అమెరికాలో 'మాగ్నిఫిషియంట్ సెవెన్'గా పిలిచే ఏడు అతిపెద్ద కంపెనీల్లో ఎన్విడియా, ఆల్ఫాబెట్, అమెజాన్, ఆపిల్, మైక్రోసాఫ్ట్, మెటా, టెస్లా ఉన్నాయి.
అమెరికా స్టాక్ మార్కెట్ ఎస్ అండ్ పీ-500 ఇండెక్స్ మొత్తం మార్కెట్ విలువ గత కొన్ని ట్రేడింగ్ సెషన్లలో 5 ట్రిలియన్ డాలర్లు క్షీణించిందని, ఈ నష్టంలో ఆ ఏడు కంపెనీలదే ప్రధాన పాత్ర అని వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది.
ఐదు ట్రిలియన్ డాలర్ల మొత్తం భారతదేశ మొత్తం ఆర్థిక వ్యవస్థ కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువ.
ట్రంప్ తాజా ప్రకటనతో ఆస్ట్రేలియా స్టాక్ మార్కెట్ ఏఎస్ఎక్స్-200 ఇండెక్స్ బుధవారం 2.1 శాతం క్షీణతతో ప్రారంభమైంది.
జపాన్ స్టాక్ మార్కెట్ నిక్కీ-225 సూచీ 3 శాతం నష్టంతో ప్రారంభమైంది. అంతకు ఒక రోజు ముందు 6 శాతం భారీగా పెరిగింది

ఫొటో సోర్స్, Getty Images
5. కెనడా ఏం చెప్పింది?
ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమెరికా ప్రభుత్వంతో వివాదాల కారణంగా ఎక్కువగా వార్తల్లో నిలిచిన దేశాల్లో కెనడా ఒకటి.
బుధవారం నుంచి అమెరికా కార్ల దిగుమతులపై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు కెనడా ప్రకటించింది.
కెనడా ఆటో రంగంపై విధించిన సుంకాన్ని అమెరికా తొలగించే వరకు ఈ సుంకం అమల్లో ఉంటుందని కెనడా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
సుంకాల వల్ల దేశీయ కంపెనీలకు కలిగే నష్టాన్ని ఎదుర్కోవడానికి, కార్ల తయారీదారులకు నిధులను పెంచడం, పన్నులను తగ్గించడం, దేశీయ మార్కెట్లో డిమాండ్‌ను పెంచడానికి సబ్సిడీలను అందించడం వంటి అనేక చర్యలను దక్షిణ కొరియా ప్రకటించింది.
ప్రతీకార చర్యలు తీసుకుంటామని దక్షిణ కొరియా ఎలాంటి బెదిరింపులూ చేయలేదు, కానీ తమ దేశీయ పరిశ్రమల రక్షణకు 2 బిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించింది.

ఫొటో సోర్స్, Getty Images
6. నిపుణులు ఏమంటున్నారు?
అమెరికా-చైనా సంబంధాలపై సుంకాల ప్రభావం గురించి, ఆసియా సొసైటీ పాలసీ ఇన్‌స్టిట్యూట్ వైస్ ప్రెసిడెంట్ వెండీ కట్లర్ బీబీసీతో మాట్లాడుతూ, "పరిస్థితి మెరుగుపడడం కంటే, మరింత దిగజారేట్టుంది’’ అన్నారు.
చైనాను చర్చలకు అంగీకరించేలా అమెరికా చేయగలదని తాను భావిస్తున్నట్టు కట్లర్ చెప్పారు.
అమెరికాలో ఓ చిన్న కంపెనీ వ్యవస్థాపకురాలు సారా వెల్స్ సుంకాల సుస్థిరతను ప్రశ్నించారు. ఆమె కంపెనీలో వినియోగించే ఉత్పత్తులు చైనాలో తయారవుతాయి. సుంకాల కారణంగా వాటి ధరల పెరుగుదల చూసి తాను షాక్‌కు గురైనట్టు చెప్పారు.
చైనాపై అదనపు సుంకాలు మార్కెట్ కోలుకుంటుందన్న ఆశలను నీరుగార్చాయని అమెరికా స్టాక్ మార్కెట్ ఆర్థిక విశ్లేషణ సంస్థ బ్యాంక్ రేట్స్‌తో సంబంధం ఉన్న స్టీఫెన్ కేట్స్ అన్నారు.
కొత్త సమాచారం బయటకు వస్తుండటంతో రాబోయే రోజుల్లో, వారాల్లో మరింత కల్లోలం ఏర్పడే అవకాశం ఉందన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘ఇబ్బంది పెట్టం, ఇబ్బంది పడం’
అమెరికా విధించిన 104 శాతం సుంకంపై చైనా ప్రభుత్వ మీడియా స్పందించింది.
అదే సమయంలో చైనాలో ఈ సుంకం అమల్లోకి వచ్చిన సమయంలో ప్రభుత్వ ఛానల్ సీసీటీవీకి సంబంధించిన సోషల్ మీడియా ఖాతా 'యు యువాన్ టాన్ తియాన్' సుంకాలకు సంబంధించి చైనా మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ వీబోలో ఓ పోస్టు రాసింది.
"మేము ఇబ్బంది కలిగించం, మేం ఇబ్బందులకు భయపడం. చైనా ప్రజలు ఒత్తిడి, బెదిరింపులను ఇష్టపడరు’’ అని తెలిపింది.
చైనా తుది వరకు పోరాడుతుందని, చర్చలకు మార్గం ఇంకా తెరిచే ఉందని స్పష్టం చేసింది.
'చైనా బలహీనపడదు, తలవంచదు. అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలను గట్టిగా కాపాడుకుంటామని ప్రపంచానికి చూపిస్తాం.’ అని పేర్కొంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














