అమెరికాకు మూడోసారి అధ్యక్షుడు కావొచ్చా, ట్రంప్ వ్యాఖ్యల వెనక ఆంతర్యమేంటి?

ఫొటో సోర్స్, EPA
- రచయిత, గ్రేమ్ బేకర్
- హోదా, బీబీసీ న్యూస్
అమెరికాకు మూడోసారి అధ్యక్షుడు కావాలనుకునే విషయంలో తానేమీ జోక్ చేయడం లేదని డోనల్డ్ ట్రంప్ అన్నారు.
అమెరికా రాజ్యాంగం ప్రకారం, ''ఏ వ్యక్తి రెండుసార్లకు మించి అధ్యక్ష పదవి చేపట్టేందుకు వీల్లేదు.'' అయితే, దీనికి కూడా ఏదో ఒక మార్గం ఉంటుందని ట్రంప్ మద్దతుదారులు అంటున్నారు.
ట్రంప్ మూడోసారి అధ్యక్షుడు కావాలనుకుంటున్నారా?
వైట్‌హౌస్‌లో, ఎన్‌బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మూడోసారి గురించి ప్రశ్నించినప్పుడు, ''చేయాలనుకుంటే, దానికి అనేక పద్ధతులు(దారులు) ఉంటాయి'' అని స్పందించారు.
''నేనేమీ జోక్ చేయడం లేదు. నేనలా చేయాలని కూడా చాలామంది కోరుకుంటున్నారు'' అని ఆయన చెప్పారు.
మనం ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉందని, పరిపాలనలో ప్రస్తుతం ప్రారంభంలోనే ఉన్నట్లు తాను వారికి చెబుతున్నానని ట్రంప్ అన్నారు.

ప్రస్తుతం రెండోసారి అధ్యక్షుడిగా కొనసాగుతున్న ట్రంప్‌కు, పదవీకాలం ముగిసే సమయానికి 82 ఏళ్లు వస్తాయి. అయినా, దేశంలో అత్యంత క్లిష్టమైన ఉద్యోగంలో కొనసాగాలనుకుంటున్నారా? అని ట్రంప్‌ను ప్రశ్నించారు.
ఆ సమయంలో తనకు పనిచేయడం ఇష్టమని ట్రంప్ సమాధానమిచ్చారు.
అయితే, ఆయన ఈ విధంగా మాట్లాడటం ఇదేమీ తొలిసారి కాదు. జనవరిలో తన మద్దతుదారులతో మాట్లాడుతూ, ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, మూడు, నాలుగు సార్లు అధ్యక్షుడిగా పనిచేయాల్సి వచ్చినా తన జీవితంలో దొరికిన అత్యంత గౌరవంగా భావిస్తానని ట్రంప్ అన్నారు.
అయితే, ''ఫేక్ న్యూస్ మీడియా''కు ఇదొక జోక్ అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
అమెరికా రాజ్యాంగం ఏం చెబుతోంది?
మూడోసారి అధ్యక్ష పదవి అవకాశాలను అమెరికా రాజ్యాంగం తోసిపుచ్చుతున్నట్లు కనిపిస్తోంది.
అమెరికా రాజ్యాంగంలోని 22వ సవరణ ఏం చెబుతుందంటే.. '' రెండు దఫాల కంటే ఎక్కువగా ఏ వ్యక్తి కూడా అధ్యక్ష కార్యాలయానికి ఎంపిక కావడానికి లేదు. ఒక టర్మ్‌లో (పదవీకాలం) రెండేళ్ల కన్నా ఎక్కువకాలం ప్రెసిడెంట్‌గా పని చేసినా లేదా ప్రెసిడెంట్‌గా వ్యవహరించినా, ఆయన మరోసారి మాత్రమే ఆ పదవికి ఎన్నికయ్యే అవకాశం ఉంటుంది.''
రాజ్యాంగాన్ని సవరించాలంటే, సెనేట్, ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) నుంచి మూడింట రెండొంతుల మంది ఆమోదం పొందాల్సి ఉంటుంది. అలాగే, దేశంలోని రాష్ట్ర స్థాయి ప్రభుత్వాల్లో మూడొంతుల ఆమోదం అవసరమవుతుంది.
ట్రంప్ రిపబ్లికన్ పార్టీ కాంగ్రెస్ రెండు చాంబర్లను నియంత్రిస్తున్నప్పటికీ, అవసరమైనంత మెజార్టీ లేదు. పైగా, 50 రాష్ట్ర స్థాయి చట్టసభల్లో, 18 డెమొక్రటిక్ పార్టీ చేతుల్లో ఉన్నాయి.
ట్రంప్ మూడోసారి అధ్యక్షుడు ఎలా కాగలరు?
రాజ్యాంగంలో కూడా లొసుగు ఉందని, ఇంతవరకు ఎప్పుడూ దీని గురించి కోర్టులోనూ విచారణ జరగలేదని ట్రంప్ మద్దతుదారులు అంటున్నారు.
రెండుసార్లు కంటే ఎక్కువగా అధ్యక్ష పదవికి ఎంపిక కావడాన్ని 22వ రాజ్యాంగ సవరణ నిషేధిస్తుంది. కానీ, వారసత్వాన్ని కాదని వారు అంటున్నారు.
ఈ సిద్ధాంతం ప్రకారం, 2028 ఎన్నికల్లో తన సొంత వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్‌ను అధ్యక్ష బరిలోకి దింపి, తాను ఉపాధ్యక్షుడిగా పోటీ చేస్తారు. ఒకవేళ వారు గెలిస్తే, వైట్‌హౌస్‌లోకి అడుగు పెడతారు. ఆ తర్వాత వెంటనే జేడీ వాన్స్ రాజీనామా చేస్తారు. అధ్యక్షుడు రాజీనామా చేసినప్పుడు, ఉపాధ్యక్షుడే అధ్యక్షుడు అవుతారు. ఇలా మూడోసారి ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టవచ్చని మద్దతుదారులు భావిస్తున్నారు.
''ట్రంప్ మరోసారి పోటీ చేసి, గెలుస్తారు కూడా'' అని ట్రంప్ ప్రముఖ మాజీ సలహాదారు, పాడ్‌కాస్టర్ స్టీవ్ బాన్నన్ అన్నారు. అదెలా అనే విషయంలో పలు ప్రత్యామ్నాయాలు ఉన్నాయన్నారు.
వరుసగా అధ్యక్షుడు అవ్వనంత వరకు.. మూడుసార్లు బాధ్యతలు చేపట్టేలా రాజ్యాంగ సవరణ చేపట్టాలని జనవరిలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు టెన్నెస్సీ నుంచి ప్రతినిధుల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్ ఆండీ ఓగస్.
అంటే, ఇంతకుముందు అధ్యక్షులుగా పనిచేసిన బరాక్ ఒబామా, బిల్ క్లింటన్, జార్జ్ డబ్ల్యూ బుష్‌లలో కేవలం ట్రంప్ మాత్రమే అర్హులవుతారు. ఎందుకంటే, 2016లో అధ్యక్షుడిగా గెలిచిన ట్రంప్, 2020లో ఓడిపోయారు. ఆ తర్వాత మళ్లీ 2024 ఎన్నికల్లో గెలుపొందారు.
ఎవరు వ్యతిరేకిస్తున్నారు?
ఈ ప్రతిపాదనకు డెమొక్రాట్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది.
'' ప్రభుత్వాన్ని నియంత్రణలోకి తీసుకుని, మన ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేసేందుకు ఆయన చేస్తున్న మరో స్పష్టమైన ప్రయత్నానికి నిదర్శనం'' అని ట్రంప్ తొలి అభిశంసనకు లీగల్ కౌన్సిల్‌గా పనిచేసిన న్యూయార్క్ ప్రతినిధి డానియల్ గోల్డ్‌మ్యాన్ అన్నారు.
''ఒకవేళ చట్టసభల్లోని రిపబ్లికన్లకు రాజ్యాంగంపై విశ్వాసముంటే, మూడోసారి అధ్యక్షుడు కావాలనుకునే ట్రంప్ ఆశయాలకు విరుద్ధంగా వారు ముందుకు వెళ్తారు'' అని ఆయన అన్నారు.
ట్రంప్ పార్టీలోని కొందరు కూడా ఇదంత మంచి ఆలోచన కాదని అంటున్నారు.
మరోసారి ట్రంప్‌ను వైట్‌హౌస్‌కి పంపే ప్రయత్నానికి తాను మద్దతు ఇవ్వనని ఓక్లహోమా రిపబ్లికన్ సెనేటర్ మార్క్‌వేన్ ముల్లిన్ చెప్పారు.
''రాజ్యాంగాన్ని మార్చాలని అమెరికా ప్రజలు కోరుకునేంత వరకు, నేను అలా చేయను'' అని ముల్లిన్ బీబీసీతో అన్నారు.
న్యాయ నిపుణులు ఏం చెబుతున్నారు?
''రాజ్యాంగబద్ధంగా అధ్యక్ష అభ్యర్థికి అర్హత లేని వ్యక్తి, ఉపాధ్యక్షుడు కూడా కాలేరని రాజ్యాంగంలోని 12వ సవరణ చెబుతుంది'' అని నోట్రే డోమ్ యూనివర్సిటీలో ఎలక్షన్ లా ప్రొఫెసర్ అయిన డెరెక్ ముల్లర్ చెప్పారు.
అంటే, ఆయన చెప్పిన దాని ప్రకారం, అధ్యక్ష కార్యాలయంలో రెండుసార్లు బాధ్యతలు చేపట్టిన వ్యక్తికి, ఉపాధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేసేందుకు కూడా అర్హత ఉండదు.
అధ్యక్ష పదవీకాలం గురించిన పరిమితులను అధిగమించేందుకు ఏదో ఒక విచిత్రమైన ఉపాయం ఉంటుందని తాను అనుకోవడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
మూడోసారి అధ్యక్షుడు అవ్వడం గురించి న్యాయపరంగా ఎలాంటి సహేతుకమైన వాదనలూ లేవని బోస్టన్ ఈశాన్య విశ్వవిద్యాలయంలోని కాన్‌స్టిట్యూషనల్ లా ప్రొఫెసర్ జెరెమీ పాల్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రెండుసార్లకు మించి ఎవరైనా అధ్యక్షుడిగా ఉన్నారా?
ఫ్రాంక్లిన్ డెలానో రూజ్‌వెల్ట్ నాలుగుసార్లు అధ్యక్ష పదవికి ఎన్నికయ్యారు. 1945 ఏప్రిల్‌లో, నాలుగోసారి పదవిలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఆయన చనిపోయారు.
తీవ్ర మాంద్యం, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో రూజ్‌వెల్ట్ అధ్యక్ష బాధ్యతలలో ఉన్నారు. పొడిగించిన ఆయన అధ్యక్ష పదవీకాలాన్ని తరచూ ప్రస్తావిస్తూ ఉంటారు.
ఆ సమయానికి, అమెరికా అధ్యక్షుడు రెండుసార్లు మాత్రమే పదవిలో ఉండాలనే నిబంధన చట్టంలో పొందుపరిచి లేదు. అంతకుపూర్వం, 1796లో మూడోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు జార్జ్ వాషింగ్టన్ నిరాకరించినప్పటి నుంచి, అదే సంప్రదాయాన్ని అనుసరిస్తూ వచ్చారు.
రూజ్‌వెల్ట్ పొడిగింపు ఈ సంప్రదాయానికి తూట్లు పొడిచింది. దీంతో, 1950ల ప్రారంభంలో 22వ సవరణకు దారితీసి, చట్టంగా రూపాంతరం చెందింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














