భారతీయ ఫార్మా కంపెనీపై రష్యా డ్రోన్ దాడి.. ఆరోపించిన యుక్రెయిన్

ఫొటో సోర్స్, X/@MartinHarrisOBE
రాజధాని కీయెవ్‌లోని భారతీయ ఫార్మా సంస్థపై రష్యా డ్రోన్ క్షిపణితో దాడి చేసిందని యుక్రెయిన్ శనివారం పేర్కొంది. భారత్‌లోని యుక్రెయిన్ రాయబార కార్యాలయం ఈ సమాచారాన్ని అందించింది.
‘‘శనివారం యుక్రెయిన్‌లోని భారతీయ ఔషధ సంస్థ కుసుమ్ గోడౌన్‌పై రష్యా క్షిపణి దాడి చేసింది’’ అని రాయబార కార్యాలయం ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
అంతేకాకుండా, రష్యా ఉద్దేశపూర్వకంగా భారత కంపెనీని లక్ష్యంగా చేసుకుందని కూడా యుక్రెయిన్ రాయబార కార్యాలయం ఆరోపించింది.
"భారతదేశంతో 'ప్రత్యేక స్నేహం' ఉందని చెప్పుకునే రష్యా, ఉద్దేశపూర్వకంగా భారతీయ వ్యాపార సంస్థలను లక్ష్యంగా చేసుకుని, పిల్లలు, వృద్ధుల కోసం ఉంచిన మందుల నిల్వలను నాశనం చేస్తోంది" అని రాయబార కార్యాలయం తెలిపింది.

ఇంతకుముందు బ్రిటిష్ రాయబారి చేసిన పోస్ట్‌ను ఉటంకిస్తూ రష్యాపై యుక్రెయిన్ ఈ ఆరోపణలు చేసింది. బ్రిటన్ రాయబారి మార్టిన్ హారిస్ కూడా రష్యా డ్రోన్ దాడి గురించి వెల్లడించారు.
అయితే, ఆయన ఏ భారతీయ కంపెనీ పేరునూ పేర్కొనలేదు.
దాడికి సంబంధించిన ఫోటోను విడుదల చేస్తూ , "ఈ శనివారం ఉదయం రష్యన్ డ్రోన్లు కీయెవ్‌లోని ఒక కీలక ఫార్మా కంపెనీ గోడౌన్‌ను పూర్తిగా ధ్వంసం చేశాయి" అని మార్టిన్ హారిస్ రాశారు.
"ఈ దాడిలో పిల్లలు, వృద్ధుల కోసం ఉంచిన ముఖ్యమైన మందుల స్టాకు కాలి బూడిదైంది. యుక్రేనియన్ పౌరులపై రష్యా దాడి కొనసాగుతోంది" అని ఆయన అన్నారు.
ఈ ఆరోపణలపై రష్యా ఇంకా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. భారతీయ ఔషధ సంస్థ కుసుమ్ ఫార్మా కూడా ఇప్పటివరకు ఈ విషయంలో ఏమీ చెప్పలేదు. ఈ సంఘటనపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ఇంకా స్పందించలేదు.
మరోవైపు, యుక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించడానికి అమెరికా, రష్యా మధ్య చర్చలు జరుగుతున్నాయి. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్ శుక్రవారం రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కలిశారు.

ఫొటో సోర్స్, Getty Images
కుసుమ్ ఫామ్ కంపెనీ యుక్రెయిన్‌లో ఏం పని చేస్తుంది?
కుసుమ్ ఫార్మా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఆ సంస్థ ఒక మధ్య తరహా కంపెనీ.
యుక్రెయిన్‌లోని సుమీలో కంపెనీ ప్లాంట్ ఉంది. అయితే కంపెనీ చిరునామా కీయెవ్‌లో ఉంది. ఈ కంపెనీ మాత్రలు, క్యాప్సూల్స్, పౌడర్, ప్యాలెట్లు వంటివి తయారు చేస్తుంది.
కుసుమ్ ఫామ్ తన వెబ్‌సైట్‌లో కంపెనీ తయారు చేసే 21 మందుల గురించి పేర్కొంది.
కంపెనీకి చెందిన మరో వెబ్‌సైట్ ప్రకారం, కుసుమ్ ఫార్మాస్యూటికల్స్ అనేది అనేక కంపెనీల సమూహం. దీని ప్రధాన కార్యాలయం దిల్లీలో ఉంది.
ఈ కంపెనీకి నాలుగు ప్లాంట్లు ఉన్నాయి. వీటిలో మూడు భారతదేశంలో ఉండగా, ఒక ప్లాంట్ యుక్రెయిన్‌లోని సుమీలో ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
రష్యా-యుక్రెయిన్ యుద్ధం పరిస్థితి ఏమిటి?
రష్యా, యుక్రెయిన్ మధ్య గత మూడు సంవత్సరాలుగా యుద్ధం కొనసాగుతోంది.
గత 24 గంటల్లో తమ ఇంధన స్థావరాలపై యుక్రెయిన్ ఐదుసార్లు దాడి చేసిందని శుక్రవారం రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఆరోపించింది.
గత నెలలో, అమెరికాతో జరిగిన వేర్వేరు ఒప్పందాలలో, ఒకరి ఇంధన స్థావరాలపై మరొకరు దాడి చేయకూడదని రష్యా, యుక్రెయిన్‌లు అంగీకరించాయి.
అయితే, అనేక సందర్భాల్లో ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించారంటూ ఈ రెండు దేశాలు ఒకదానిపై ఒకటి ఆరోపణలు గుప్పించుకున్నాయి.
యుక్రెయిన్‌లోని బీబీసీ ప్రతినిధి జేమ్స్ వాటర్‌హౌస్ తెలిపిన ప్రకారం, కాల్పుల విరమణ కోసం రష్యాపై అమెరికా మరింత ఒత్తిడి పెంచుతుందని యుక్రెయిన్ భావిస్తోంది.
అయితే, యుద్ధాన్ని ఆపడానికి చర్చలు కొనసాగుతున్నాయి. శుక్రవారం, బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో ఒక సమావేశం జరిగింది. కాల్పుల విరమణ గురించి దీనిలో చర్చించారు.

ఫొటో సోర్స్, Reuters
అమెరికా, రష్యా మధ్య చర్చలు
యుక్రెయిన్‌లో యుద్ధాన్ని ఆపడానికి అమెరికా, రష్యా మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.
ఈ శుక్రవారం నాడు, అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలిశారు.
కాల్పుల విరమణ పాటించాలని పుతిన్‌ను ఈ సందర్భంగా ట్రంప్ అభ్యర్థించారు.
ఈ సంవత్సరం అధ్యక్షుడు పుతిన్‌తో విట్‌కాఫ్‌కు ఇది మూడో సమావేశం.
మరోవైపు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శుక్రవారం మాట్లాడుతూ, "యుద్ధాన్ని ముగించడానికి రష్యా చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ యుద్ధంలో ప్రతివారం చాలామంది చనిపోతున్నారు" అని అన్నారు.
యుక్రెయిన్‌కు సైనిక సహాయం ప్రకటించిన బ్రిటన్
కాల్పుల విరమణ కోసం చర్చల మధ్య, యుక్రెయిన్‌కు 45 మిలియన్ పౌండ్ల అదనపు సైనిక సహాయాన్ని ప్రకటించింది బ్రిటన్.
బ్రస్సెల్స్‌లో జరిగిన సమావేశం తర్వాత ఈ ప్రకటన వచ్చింది.
యుక్రెయిన్‌పై దాడిని ఆపమని అధ్యక్షుడు పుతిన్‌పై ఒత్తిడి తీసుకురావడం గురించి సమావేశంలో చర్చ జరిగిందని బ్రిటిష్ రక్షణ మంత్రి జాన్ హేలీ అన్నారు.
"యుక్రెయిన్ భద్రతను బలోపేతం చేస్తూనే రష్యా దాడులను ఆపడానికి మనం చర్యలు తీసుకోవాలి" అని ఆయన అన్నారు.
యుక్రెయిన్‌కు బ్రిటిష్ సైనిక సహాయ ప్యాకేజీలో మిలియన్ల కొద్దీ డ్రోన్లు, యాంటీ ట్యాంక్ మైన్స్, సైనిక వాహనాల మరమ్మతులకు నిధులు ఉన్నాయి.
ఈ ప్యాకేజీలో బ్రిటన్ దాదాపు రూ. 3,136 కోట్లు అందిస్తుంది. మిగిలిన సహాయాన్ని అంతర్జాతీయ నిధి ద్వారా నార్వే అందిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
గత 25 సంవత్సరాలుగా, భారతదేశం, యుక్రెయిన్ మధ్య వాణిజ్య సంబంధాలు పెరిగాయి. రష్యా-యుక్రెయిన్ యుద్ధం నడుమ భారతదేశం యుక్రెయిన్‌కు మానవతా సహాయం అందిస్తోంది.
అయితే, యుక్రెయిన్‌పై రష్యా దాడిని భారతదేశం ఎప్పుడూ ఖండించలేదు. ఐక్యరాజ్య సమితిలో రష్యాకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన తీర్మానాలకు మద్దతు ఇవ్వలేదు.
భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి (పశ్చిమ) తన్మయ్ లాల్ చెప్పినదాని ప్రకారం , గత సంవత్సరం వరకు దాదాపు 135 టన్నుల వస్తువులను యుక్రెయిన్‌కు మానవతా సాయంగా పంపారు.
వీటిలో మందులు, దుప్పట్లు, టెంట్లు, వైద్య పరికరాలు, జనరేటర్లు ఉన్నాయి.
గత సంవత్సరం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ యుక్రెయిన్‌ను సందర్శించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














