ట్రంప్, మెలోని చర్చలు : యూరప్‌తో వాణిజ్య ఒప్పందంపై అమెరికా ఏం చెప్పింది?

మెలోని, ట్రంప్, అమెరికా, ఇటలీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇటలీ ప్రధాని మెలోని అమెరికాలో పర్యటించారు.
    • రచయిత, జెస్సికా రాన్‌స్లే, లారా గోజి
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

అమెరికా, యూరప్ మధ్య వాణిజ్య ఒప్పందం కుదరడానికి ఉన్న అవకాశాలపై డోనల్డ్ ట్రంప్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని చర్చలు జరిపారు.

ఇటలీ ప్రధానమంత్రి మెలోని అమెరికాలో పర్యటించారు.

''వాణిజ్య ఒప్పందం 100శాతం కుదురుతుంది...అది సక్రమంగా ఉంటుంది'' అని ట్రంప్ అన్నారు. ఒప్పందం కుదురుతుందనే విషయంపై విశ్వాసం వ్యక్తం చేసిన మెలోని పాశ్చాత్య దేశాలను మళ్లీ గొప్ప స్థితిలో ఉంచాలనేదే (మేక్ ది వెస్ట్ గ్రేట్ ఎగైన్) తన లక్ష్యమన్నారు.

యూరప్ దేశాలపై ట్రంప్ 20శాతం సుంకాలు ప్రకటించి, వాటిని తాత్కాలికంగా నిలిపివేసిన తర్వాత అమెరికాలో పర్యటించిన తొలి యూరోపియన్ నాయకురాలు మెలోని.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మెలోని, ట్రంప్, అమెరికా, ఇటలీ

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, ఇటలీలో పర్యటించేలా ట్రంప్‌ను మెలోని ఒప్పించారు.

ట్రంప్‌ను ఒప్పించిన మెలోని

ట్రంప్ సుంకాలు అమెరికా, యూరప్ మధ్య సంబంధాలపైనా, అంతర్జాతీయంగా చూపే ప్రభావంపైనా ఆందోళన వ్యక్తమవుతున్న సమయంలో మెలోని వాషింగ్టన్‌లో పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇరు దేశాధినేతలు స్నేహపూర్వకంగా వ్యవహరించారు. యూరప్, అమెరికా మధ్య సత్సంబంధాలు కొనసాగించగల వారధిగా తనని తాను మెలోని భావిస్తున్నారు.

రక్షణరంగ వ్యయం, ఇమ్మిగ్రేషన్, సుంకాలపై చర్చించినట్టు ట్రంప్, మెలోని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పారు.

ఓవల్ కార్యాలయంలో వాతావరణం ఆహ్లాదకరంగా అనిపించింది. యూకే ప్రధాని కీర్ స్టార్మర్ ఫిబ్రవరిలో అమెరికాలో పర్యటించినప్పుడు ఎలాంటి ఆహ్వానం లభించిందో....అలాంటి పరిస్థితులే మెలోని పర్యటనలోనూ వైట్‌హౌస్‌లో కనిపించాయి.

మెలోని అమెరికా పర్యటనను ఆమె అనుచరులు ''వాణిజ్య శాంతి ఒప్పందం''గా అభివర్ణించారు.

గతంలో ట్రంప్ టారిఫ్‌లు ప్రకటించే సమయంలో యూరోపియన్ యూనియన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అమెరికాను చెత్తబుట్టగా మార్చడానికే ఈయూ ఏర్పడిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యూరప్‌పై విధించిన 20శాతం పరస్పర సుంకాల అమలును, జులై వరకు ట్రంప్ తాత్కాలికంగా నిలిపివేశారు.

ట్రంప్ సుంకాలను ''తప్పుడు నిర్ణయం''గా గతంలో మెలోని విమర్శించారు. అవి చివరకు యూరోపియన్ యూనియన్‌కే కాకుండా అమెరికాకూ నష్టం కలిగిస్తాయని ఆమె అన్నారు.

ఈ నేపథ్యంలో సుంకాలపై ట్రంప్‌తో సమావేశంలో మెలోని పైచేయి సాధించినట్టు కనిపించక పోయినప్పటికీ, ఇటలీ పర్యటనకు రావాలని, ఇది ఇతర యూరోపియన్ నాయకులను కలవడానికి సందర్భం కాగలదని ట్రంప్‌ను ఆమె ఒప్పించగలిగారు.

యూరోపియన్ యూనియన్, అమెరికా మధ్య సంబంధాలు దెబ్బతిన్న ప్రస్తుత పరిస్థితుల్లో ట్రంప్ ఇటలీ రావడానికి అంగీకరించడాన్ని తన పర్యటన సాధించిన గొప్ప విజయంగా మెలోని భావించవచ్చు. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వన్ డెర్ లెయెన్‌తో సమావేశమయ్యేందుకు ట్రంప్ అంగీకరిస్తే అది పెద్ద అంశమవుతుంది.

మెలోని, ట్రంప్, అమెరికా, ఇటలీ

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, అమెరికా సుంకాలు అంతిమంగా ఆ దేశానికే నష్టం కలిగిస్తాయని గతంలో మెలోని విమర్శించారు.

ట్రంప్‌పై ప్రశంసలు

ట్రంప్ మద్దతురాలనే తీవ్ర విమర్శల మధ్య మెలోని ఇటలీకి తిరిగి వస్తున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో ఆమె రోమ్‌లో సమావేశం కానుండడం ఈ విమర్శలకు మరింత బలం చేకూర్చుతోంది.

ట్రంప్‌ను ప్రశంసించే విషయంలో మెలోని చాలా జాగ్రత్త వహించారు. ప్రగతి శీల వాదులను, ఉదారవాదులను విమర్శిస్తూ అక్రమ వలసలపై యుద్ధాన్ని గట్టిగా సమర్థించారు.

'పాశ్చాత్యదేశాలను మళ్లీ గొప్ప స్థితిలో ఉంచడం నా లక్ష్యం, మేం కలిసికట్టుగా అది చేయగలమని అనుకుంటున్నా' అని మెలోని అన్నారు.

''స్థిరమైన, నమ్మదగిన దేశంగా చాలా మంచి స్థితిలో ఉన్న ఇటలీ ప్రధానమంత్రిగా నేనిక్కడ ఉండడం గర్వంగా ఉంది'' అని చెప్పడం ద్వారా మెలోని తమ ప్రభుత్వం పనితీరును ప్రశంసించుకోవడానికి కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు.

ద్రవ్యోల్బణాన్ని అదుపుచేశామని, ఉద్యోగాలను పెంచామని చెప్పిన మెలోని...''నేను మా దేశాన్ని ప్రమోట్ చేసుకుంటున్నట్టు భావిస్తే ఏమనుకోవద్దు. అయితే మీరు వ్యాపారవేత్త. నన్ను అర్థం చేసుకోగలరు'' అని నవ్వుతూ ట్రంప్‌తో అన్నారు. మెలోని వ్యాఖ్యలకు ట్రంప్ నవ్వుతూ ప్రతిస్పందించారు.

మెలోని, ట్రంప్, అమెరికా, ఇటలీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఈయూ దేశాలపై ట్రంప్ 20శాతం సుంకాలు విధించారు.

ట్రంప్ ఏమన్నారు?

వలసలపై కఠిన వైఖరి అవలంబించినందుకు మెలోనిని ట్రంప్ ప్రశంసించారు. మరింతమంది ఆమెను అనుసరించాలని కోరారు.

సురక్షిత దేశాలపై ఈయూ ప్రకటనను ప్రస్తావిస్తూ ఇటలీ ఇందుకు ఉదాహరణగా మారడం బాగుందని, మార్పు జరుగుతోందని మెలోని వ్యాఖ్యానించారు.

రక్షణ రంగానికి ఇటలీ తక్కువ కేటాయింపులపై ప్రశ్నించినప్పుడు మాత్రం మెలోని కొంచెం అసహనంగా కనిపించారు.

నాటోలో సభ్యత్వం ఉన్న ప్రతి దేశం జీడీపీలో రెండు శాతం వాటాను కేటాయించాలన్న లక్ష్యాన్ని తమ దేశం సాధించగలదని, జూన్‌లో జరగబోయే నాటో సమావేశంలో దీన్ని ప్రకటించే అవకాశం ఉందని మెలోని అన్నారు.

నాటో మిత్రదేశాలు రక్షణ రంగంపై కేటాయింపులు పెంచాలన్నది ట్రంప్ పదే పదే చేస్తున్న డిమాండ్లలో ఒకటి.

రక్షణ రంగానికి ఇటలీ కేటాయింపులు జీడీపీలో 1.49శాతం మాత్రమే ఉన్నాయి.

ట్రంప్, చైనా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చైనాపై సుంకాలు మరింత పెంచబోమని ట్రంప్ చెప్పారు.

చైనాపై టారిఫ్‌లు 145 శాతమే

చైనాతో చాలా మంచి ఒప్పందం కుదుర్చుకుంటామన్న నమ్మకం తనకుందని మరో ప్రకటనలో ట్రంప్ తెలిపారు. బీజింగ్ ప్రతినిధులు తనను చాలాసార్లు సంప్రదించారని ట్రంప్ చెప్పారు.

ఒప్పందం కుదురుతుందనే నమ్మకమున్నప్పటికీ తాను తొందరపడడం లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం 145శాతంగా ఉన్న చైనాపై సుంకాలను మరింత పెంచడానికి తాను సుముఖంగా లేనని ట్రంప్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)