నేపాల్: రాచరికం, హిందూ రాజ్యం మళ్లీ రావాలని కోరుకుంటున్నది ఎవరు, ఉద్యమ చరిత్ర ఏంటి?

నేపాల్, రాచరికం, రాజు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రాచరికం మద్దతుదారుల నిరసనల్లో హింస చోటుచేసుకుంది.
    • రచయిత, విష్ణు పోఖ్‌రేల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

నేపాల్‌లో రాచరికం మద్దతుదారుల 'పీపుల్స్ మూవ్‌మెంట్ ' మొదటి రోజే హింసాత్మకంగా మారింది. ఈ ఆందోళనల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు.

దీంతో రాచరిక అనుకూల శక్తులు తమ ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్తాయనే ఆందోళన మరింతగా వ్యక్తమవుతోంది.

రాచరిక ఉద్యమ నేతగా దుర్గా ప్రసాయిని ప్రకటించారు. దుర్గా ప్రసాయి పోలీసుల 'వాంటెడ్' జాబితాలో ఉన్నారని భద్రతా అధికారులు చెప్పారు. ఉద్యమ కన్వీనర్ నవరాజ్ సుబేదీని గృహ నిర్బంధంలో ఉంచారు.

రాచరిక అనుకూల రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ (ఆర్పీపీ)కి చెందిన ఇద్దరు సీనియర్ నాయకులను శుక్రవారం(మార్చి 28) అరెస్టు చేశారు. దేశంలో రాచరికం స్థాపించాలని ఈ పార్టీ డిమాండ్ చేస్తోంది.

నారాయణహితి ప్యాలెస్‌కు మాజీ రాజు జ్ఞానేంద్ర షా తిరిగి రావాలని రాచరిక మద్దతుదారులు ప్రారంభించిన ఉద్యమానికి ఎవరు నాయకత్వం వహిస్తారన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తింది.

నారాయణహితి అనేది కఠ్మాండూలో ఉన్న రాజభవనం. ఒకప్పుడు రాజు ఇక్కడ నివసించారు. రాచరిక వ్యవస్థ అంతమై ప్రజాస్వామ్యం ఏర్పడిన తర్వాత దానిని మ్యూజియంగా మార్చారు.

నేపాల్‌లో రెండు దశాబ్దాల కిందట గణతంత్ర రాజ్యాన్ని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమం జరిగింది. ఇది రాజ్యాంగ సభ ఏర్పాటుకు దారితీసింది. 2008లో రాచరికం అంతమై గణతంత్ర రాజ్యం ఏర్పడింది.

నిరసనలు కొనసాగుతాయని, అయితే ఉద్యమానికి ఎవరు నాయకత్వం వహిస్తారనేదానిపై స్పష్టత లేదని రాచరిక అనుకూల నాయకులు బీబీసీతో చెప్పారు.

నేపాల్‌లో హిందూ దేశం, రాచరికం పునరుద్ధరణ కోసం అనేక గ్రూపులు ఉద్యమిస్తున్నాయి. అయితే వాటిలో ఏకాభిప్రాయం లేకపోవడంతో ఒకే నాయకత్వం ఏర్పడే అవకాశం తక్కువగా ఉందని నిపుణులు అంటున్నారు.

శుక్రవారం నిరసన పేరుతో జరిగిన హింసాత్మక కార్యకలాపాలకు బాధ్యత వహించడానికి నాయకులు సిద్ధంగా ఉన్నట్టు కనిపించడం లేదు. ఈ నిరసనలు నాయకుల నియంత్రణలో లేవని వారు బహిరంగంగానే అంటున్నారు.

ఉద్యమానికి సంప్రదాయ రాచరిక అనుకూల వాదులు నాయకత్వం వహిస్తారా లేదా ఆర్‌పీపీ నాయకత్వంలో నిరసనలు జరుగుతాయా అన్నది తెలియాల్సిఉంది. శుక్రవారం(మార్చి 28) నాటి నిరసనకు ఎవరు బాధ్యత తీసుకుంటారో తేలాల్సి ఉంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

‘హింసకు మద్దతు లేదు’

నేపాల్ రాజధాని కఠ్మాండూలో ఏప్రిల్ 8న ఒక సమావేశం, ఏప్రిల్ 20న రాజధానిలో ఒక ఆందోళన, బాగ్‌మతి (నేపాల్‌లోని ఏడు ప్రావిన్సులలో ఒకటి)లో ఒక ప్రావిన్సు స్థాయి నిరసనను నిర్వహిస్తామని ఆర్‌పీపీ ప్రకటించింది.

సీనియర్ నాయకుల అరెస్టు, ఉద్యమంపై సమీక్షించడానికి శనివారం(మార్చి 30) ఆర్పీపీ కేంద్ర కార్యనిర్వాహక కమిటీ సమావేశం జరిగింది.

సమావేశం తర్వాత, ఆర్‌పీపీ అధ్యక్షులు రాజేంద్ర లింగ్దెన్ బీబీసీతో మాట్లాడారు.

"రాచరికం పునరుద్ధరణ కోసం ఎవరైనా చేసే శాంతియుత ఉద్యమానికి మద్దతు ఇస్తామని ఆర్‌పీపీ ఇప్పటికే ప్రకటించింది. కానీ హింసకు మద్దతివ్వదు" అని లింగ్దెన్ చెప్పారు.

కఠ్మాండూలోని టింకునేలో హింస జరిగేలా ప్రభుత్వమే రెచ్చగొట్టిందని, దీనిపై నిష్పాక్షిక దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు.

అరెస్టయిన సీనియర్ నాయకులు హింసాత్మక కార్యకలాపాలలో పాల్గొనలేదని లింగ్దెన్ పేర్కొన్నారు. "హింసాత్మక కార్యకలాపాలలో పాల్గొన్న ఎవరినైనా విచారించాలి" అని ఆయన అన్నారు.

నిరసనల సమయంలో అరెస్టు చేసిన అమాయక పౌరులను విడుదల చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని ఆయన హెచ్చరించారు.

నేపాల్, రాచరికం, రాజు

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, రాచరికాన్ని పునరుద్ధరించాలని కోరుతూ నేపాల్‌లో ఆందోళన

పార్టీలో వర్గ విభేదాలు

రాచరికం,హిందూ దేశం డిమాండ్లతో కొత్త ఉద్యమం రూపురేఖలు సిద్ధమవుతుండగా, ఆర్‌పీపీలో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. ఇది అందరికీ అర్ధమయింది.

దాదాపు నాలుగు దశాబ్దాలుగా క్రియాశీల రాజకీయాల్లో పెద్దగా కనిపించని సుబేదీ ని మాజీ రాజు జ్ఞానేంద్ర షా కోరిక మేరకు, రాచరిక ఉద్యమ నాయకుడిగా నియమించారు.

ఆర్‌పీపీ సీనియర్ ఉపాధ్యక్షుడు రవీంద్ర మిశ్రా, ప్రధాన కార్యదర్శి ధవల్ షంషేర్ రాణా, నాయకుడు హరి బహదూర్ బాస్నెత్‌లు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి నాయకుడిగా తనను మొదట ప్రతిపాదించారని ఇమేజ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుబేదీ చెప్పారు.

అన్ని పార్టీలను కలుపుకుని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి విస్తృత నాయకత్వం అవసరమని భావించిన ఆర్‌పీపీ నాయకుల నుంచి ఈ ప్రతిపాదన వచ్చిందన్నారు.

ఇతర ఆర్‌పీపీ నాయకులు పశుపతి షంషేర్ రాణా, ప్రకాశ్ చంద్ర లోహాని కూడా దీనికి మద్దతు ఇస్తున్నారని, అందరం కలిసి పనిచేస్తున్నామని సుబేదీ చెప్పారు.

అయితే ఆర్‌పీపీ అధ్యక్షులు రాజేంద్ర లింగ్దెన్‌తో సహా అనేక మంది ఇతర నాయకులు సుబేదీ నాయకత్వాన్ని అంగీకరించడంలేదు.

ఆర్‌పీపీ నాయకత్వంలో ఉద్యమాన్ని నిర్వహించడానికి సుబేదీ ఒక కమిటీని ఏర్పాటు చేసి, దానికి లింగ్దెన్‌ను కన్వీనర్‌గా నియమించారు.

''రాచరికం, హిందూ రాజ్యాన్ని పునరుద్ధరించడానికి చేసే ఏ ఉద్యమానికైనా ఆర్‌పీపీ నైతికంగా మద్దతు ఇస్తుంది'' అని శుక్రవారం నిరసనల్లో పార్టీ తెలిపింది.

కానీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మిశ్రా, జనరల్ సెక్రటరీ రాణా తప్ప, ఇతర సీనియర్ ఆర్‌పీపీ నాయకులెవరూ నిరసనలో కనిపించలేదు.

నేపాల్, రాచరికం, రాజు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నేపాల్ ఆందోళనల్లో హింస చెలరేగింది.

జ్ఞానేంద్ర షా గురించి లింగ్దెన్ భయం

మాజీ రాజు జ్ఞానేంద్ర షా కోరిక మేరకు సుబేదీని ఉద్యమ నాయకుడిగా నియమించారని చెబుతారు. రాచరిక మద్దతుదారులందరికీ ఆమోదయోగ్యమైన నాయకత్వం ఉండాలనే ఉద్దేశంతో 86 ఏళ్ల సుబేదిని నాయకుడిగా ఎన్నుకున్నారని చాలామంది భావిస్తున్నారు.

శుక్రవారం నిరసనకు ముందు, సుబేదీ, దుర్గా ప్రసాయి... నిర్మల్ నివాస్ (మాజీ రాజు జ్ఞానేంద్ర షా ప్రైవేట్ నివాసం) చేరుకుని షాను విడివిడిగా కలిశారు. ఆ సమావేశాల తర్వాత కూడా జ్ఞానేంద్ర షాకు సుబేదీ, ప్రసాయి ఇష్టమైన నాయకులు అయి ఉండవచ్చన్న ప్రచారం సాగింది.

గురువారం నిర్మల్ నివాస్‌లో సుదీర్ఘ చర్చలు జరిపి తిరిగి వచ్చిన తర్వాతే ప్రసాయిని ఉద్యమ నాయకుడిగా నియమించారు.

దీనిని ఉదాహరణగా చూపిస్తూ...శుక్రవారం హింస జ్ఞానేంద్ర షా ఆదేశం మేరకు జరిగిందని కూడా కొంతమంది రిపబ్లిక్ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు.

జ్ఞానేంద్రను కలిసిన తర్వాత, ఉద్యమ నాయకుడిగా నియమితుడైన తర్వాత, ప్రసాయి మీడియాతో మాట్లాడుతూ తాను మాజీ రాజుతో ఉద్యమం గురించి చర్చించానని, కానీ తమ మధ్య ఏం జరిగిందో వెల్లడించలేమని అన్నారు.

ఆర్‌పీపీ పేరు చెప్పకుండానే "రాచరికం ముగిసిన తర్వాత నేను ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ వారు (ఆర్‌పీపీ) ఎన్నికల్లో పోటీ చేశారు" అని అన్నారు.

''రాజ్‌షాహీని సందర్శించిన తర్వాత జ్ఞానేంద్ర షా మొదటిసారి నా కార్యక్రమానికి హాజరయ్యారు. దీపం వెలిగించి రాచరికం పునరుద్ధరణ ఉద్యమంలో పాల్గొన్నారు'' అని ఆయన తెలిపారు.

జ్ఞానేంద్ర షా కోరిక మేరకు సుబేదీ, ప్రసాయిలను రాచరిక ఉద్యమానికి నాయకులుగా పరిగణించడంతో... పార్టీ అధ్యక్షుడు లింగ్దెన్, నిర్మల్ నివాస్... కారణంగా పార్టీ విడిపోతుందని తాము ఆందోళన చెందుతున్నామని కొంతమంది ఆర్‌పీపీ నాయకులు అంటున్నారు.

దీనికి ప్రధాన కారణం గత సమావేశంలో నిర్మల్ నివాస్ మద్దతుతో లింగ్దెన్ అధ్యక్షులయ్యారు. కమల్ థాపా ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది.

ఆ ఆరోపణలను లింగ్దెన్ బహిరంగంగా ఖండించారు. కానీ తన ఓటమి తర్వాత, కమల్ థాపా నిర్మల్ నివాస్‌పై ఆరోపణలు చేశారు.

వెంటనే థాపా ఆర్‌పీపీ నేపాల్‌ను స్థాపించి...రాచరికాన్ని పునరుద్ధరించాలనే తన పాత ఎజెండాను వదిలేశారు. అయితే, ఇప్పుడు ఆయన రాచరికం పునరుద్ధరణను తిరిగి డిమాండ్ చేస్తున్నారు.

కమల్ థాపాను ఓడించి తాను గెలవడానికి సహాయం చేసినట్టే..ఇప్పుడు నిర్మల్ నివాస్ పార్టీని చీల్చివేయగలదని లింగ్దెన్ భయపడుతున్నట్టు కొంతమంది ఆర్‌పీపీ నాయకులు చెబుతున్నారు.

"నిర్మల్ నివాస్ పార్టీని చీలుస్తుందని మీరు భయపడుతున్నారా?" అని లింగ్దెన్‌ను బీబీసీ ప్రశ్నించినప్పుడు ''ఇది పూర్తిగా అబద్ధం....నిజం కాదు. తప్పుడు సమాచారం" అని ఆయన నవ్వుతూ సమాధానమిచ్చారు.

శుక్రవారం జరిగిన ఆందోళనలకు సంబంధించి... మాజీ రాజును రాజకీయాల్లోకి లాగవద్దని ఆయన అందరినీ కోరారు.

నేపాల్, రాచరికం, రాజు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆందోళనకారులు జ్ఞానేంద్ర షా ఫోటో పట్టుకున్నారు.

ఇప్పుడు ఆర్‌పీపీ ఏం చేస్తుంది?

నేపాల్‌లో గణతంత్ర రాజ్యం నడుస్తోంది. కానీ నిత్యం రాచరికానికి అనుకూలంగా వాదించే ఆర్‌పీపీ, హిందూదేశం, రాచరిక పునరుద్ధరణను డిమాండ్ చేస్తూ అప్పుడప్పుడు నిరసనలు నిర్వహించింది.

"ఏకగ్రీవంగా, ఎలాంటి హింస లేకుండా, లేదా మూడింట రెండొంతుల మెజారిటీ సాధించి రాజ్యాంగ సవరణ చేయడం ద్వారా రాచరికం పునరుద్ధరిస్తాం.’’ అని పార్టీ చైర్మన్ లింగ్దెన్ అన్నారు.

కానీ ఇటీవలి సంవత్సరాలలో, దుర్గా ప్రసాయి మాజీ రాజుకు దగ్గరవడంతో, ఆయనతో పాటు అనేక సంస్థలు నిరసనలను ప్రారంభించడంతో లింగ్దెన్‌పై ఒత్తిడి పెరిగిందని చాలామంది భావిస్తున్నారు.

ఆర్‌పీపీలోని ఇతర గ్రూపుల నాయకులు ప్రదర్శనలు జరపాలని లింగ్దెన్‌పై ఒత్తిడి తెస్తున్నారు.

సుబేదీ నేతృత్వంలోని రాచరిక మద్దతుదారులు వీధుల్లో నిరసనలకు పిలుపునివ్వడం వల్లే, ఆర్‌పీపీ కూడా ఆందోళనకు దిగాల్సి వచ్చిందని అంటున్నారు.

గత సంవత్సరం 40 డిమాండ్లను ప్రభుత్వానికి సమర్పించింది ఆర్పీపీ. వాటిలో రాచరికం, హిందూ దేశ పునరుద్ధరణ, సమాఖ్యవాదానికి ముగింపు పలకడం వంటివి ఉన్నాయి.

నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్ట్ సెంటర్) అధ్యక్షుడు పుష్ప కమల్ దహల్ ప్రచండ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, లింగ్దెన్ ఆయనను కలిసి డిమాండ్లతో కూడిన మెమోరాండం అందజేశారు.

హింసకు పాల్పడకుండా చర్చలు, ఏకాభిప్రాయం ద్వారా పార్టీల మధ్య ‘కొత్త ఒప్పందం’ కుదుర్చుకోవడం ద్వారా ముందుకు సాగే అవకాశాన్ని తాను ఇప్పటికీ పరిశీలిస్తున్నానని లింగ్దెన్ అన్నారు.

14 మంది ఎంపీలతో పార్లమెంటులో ఆర్‌పీపీ ఐదో అతిపెద్ద పార్టీ. ఆ పార్టీ ఎంపీలు రాచరికం పునరుద్ధరణ గురించి కొన్నిసార్లు పార్లమెంటులో మాట్లాడారు.

రాచరికం పునరుద్ధరణ ఉద్యమాన్ని కొనసాగించడానికి శనివారం జరిగిన సమావేశంలో వారు అంగీకరించారని లింగ్దెన్ బీబీసీకి తెలిపారు.

"ఈ ఉద్యమం ఇప్పుడు కొనసాగుతుంది. పరిస్థితిని బట్టి ముందుకు సాగుతుంది" అని ఆయన అన్నారు.

నేపాల్, రాచరికం, రాజు

ఫొటో సోర్స్, RSS

ఫొటో క్యాప్షన్, ఆర్‌పీపీ అధ్యక్షులు రాజేంద్ర లింగ్దెన్

నవరాజ్ సుబేదీ నాయకత్వంలోని ఉద్యమం ఏమవుతుంది?

సుబేదీ నాయకత్వంలో రాచరిక పునరుద్ధరణ ఉద్యమం కొనసాగుతుందని యునైటెడ్ పీపుల్స్ మూవ్‌మెంట్ కమిటీ తెలిపింది.

"మేం ఎప్పుడూ ప్రజా ఉద్యమానికి, ప్రజా సంకల్పానికి అనుకూలంగా ఉంటాం. దానికి మద్దతు ఇస్తాం. అలాగే, దేశవ్యాప్తంగా శాంతియుతంగా ఉద్యమాన్ని నిర్వహించాలని ప్రజలను అభ్యర్థించాం" అని సుబేదీ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

"గుర్తుంచుకోండి.. దేశభక్తుల ఉద్యమం కొనసాగుతుంది'' అని ఆయనన్నారు.

మాజీ రాజును అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపిస్తున్నారు. " పీపుల్స్ మూవ్‌మెంట్‌కు ఏ నాయకుడూ నాయకత్వం వహించడు. ప్రజల సంకల్పం, ప్రజా తిరుగుబాటు నుంచి ఉత్పన్నమయ్యే ఉద్యమానికి ప్రజలే నాయకత్వం వహిస్తారు. దిశానిర్దేశం చేస్తారు" అని ఆయన అన్నారు.

నేపాల్, రాచరికం, రాజు

ఫొటో సోర్స్, Facebook/Nava Raj Meera Subedi

ఫొటో క్యాప్షన్, నవరాజ్ సుబేదీ, రాజేంద్ర లింగ్దెన్

రాచరికం పునరుద్ధరణ ఉద్యమంలో సుబేదీ వర్గానికి సాంస్కృతిక నిపుణులు జగ్మాన్ గురుంగ్ సలహాదారు.

"మీ సమన్వయకర్త గృహ నిర్బంధంలో ఉన్నారు. మీ నాయకుడిని సంప్రదించే పరిస్థితి లేదు. ఇప్పుడు ఉద్యమం ఎలా ముందుకు సాగుతుంది?" అని బీబీసీ ఆయన్ను ప్రశ్నించింది.

"మా నాయకుడు గృహ నిర్బంధంలో ఉన్నప్పటికీ, ఉద్యమం ఆగదు. నాయకుడు కనిపించకపోతే ప్రజలు మౌనంగా ఉండరు. వారు (ప్రజలు) తమను తాము నడిపించుకుంటారు" అని ఆయన సమాధానమిచ్చారు.

అయితే, శుక్రవారం జరిగిన హింసకు నిర్వాహకులు కూడా బాధ్యులేనని ఆయన అన్నారు.

"నిర్వాహకుల నిష్క్రియాపరత్వం కారణంగానే ఇలాంటి సంఘటన జరిగింది. ఇప్పుడు నిర్వాహకులు ఆత్మపరిశీలన చేసుకుని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలి" అని గురుంగ్ అన్నారు.

అయితే, టింకునే సంఘటన తర్వాత దుర్గా ప్రసాయి, నవరాజ్ సుబేదీ, రాజేంద్ర లింగ్దెన్‌తో సహా ఏ ఆర్‌పీపీ నాయకుడితోనూ తాను మాట్లాడలేదని ఆయన చెబుతున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)