నేపాల్: రాచరికం కావాలంటూ ప్రజలు వీధుల్లోకి ఎందుకు వచ్చారు?

ఫొటో సోర్స్, Getty Images
నేపాల్‌లో శుక్రవారం రాచరికవాదులు భారీ ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా కఠ్మాండూలోని అనేక ప్రాంతాల్లో విధ్వంసం, నిప్పంటించడం వంటి చర్యలకు పాల్పడ్డారు.
పోలీసులు, ప్రదర్శనకారుల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణలో ఇద్దరు చనిపోయారు. అందులో ఒకరు జర్నలిస్టు. చాలామంది గాయాల పాలయ్యారు.
రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ (ఆర్‌పీపీ) ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన కార్యక్రమం జరిగింది. ఈ పార్టీకి నేపాల్ మాజీ రాజు జ్ఞానేంద్ర షా మద్దతు ఉంది. దేశంలో రాచరికాన్ని తిరిగి తీసుకురావాలంటూ ఈ పార్టీ డిమాండ్ చేస్తోంది.
బీబీసీ నేపాలీ సర్వీస్ వెల్లడించిన వివరాల ప్రకారం, కఠ్మాండూ పోలీసులు ఆర్‌పీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ ధవల్ షంషేర్ రాణా, పార్టీ సీనియర్ ఉపాధ్యక్షుడు రవీంద్ర మిశ్రా సహా అయిదుగురిని అరెస్టు చేశారు.


ఫొటో సోర్స్, EPA
రాచరిక అనుకూల ప్రదర్శనలో పాల్గొన్నందుకు వీరిని అరెస్ట్ చేశామని నేపాలీ పోలీస్ డీఐజీ దినేశ్ ఆచార్య చెప్పారు. ఈ ప్రదర్శన సందర్భంగా కఠ్మాండూలోని టింకునేలో భారీ హింస జరిగింది.
రాచరిక అనుకూల నిరసనలను ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.
నిరసన ప్రదర్శన సమయంలో జరిగిన విధ్వంసం, నిప్పంటించడం, దోపిడీ, మరణాలపై విచారణ జరపాలని శుక్రవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించారని బీబీసీ నేపాల్ సర్వీస్ వెల్లడించింది.
ప్రధానమంత్రి నివాసంలో క్యాబినెట్ సమావేశం జరిగింది. హింసలో గాయపడిన వారికి ఉచిత చికిత్స అందించాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయించినట్లు నేపాలీ ప్రభుత్వ ప్రతినిధి పృథ్వీ సుబ్బా గురుంగ్ తెలిపారు.
కఠ్మాండూలోని కొన్ని ప్రాంతాల్లో శనివారం ఉదయం వరకు కర్ఫ్యూ విధించారు.
శనివారం ఉదయం నుంచి కఠ్మాండూ లోయలో సాధారణ పరిస్థితులే ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇప్పుడెలా ఉంది?
శనివారం ఉదయం నుంచి కర్ఫ్యూను ఎత్తివేసినట్టు బీబీసీతో అసిస్టెంట్ చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ చెప్పారు.
శుక్రవారం నాటి హింసలో జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు.
పోలీసుల ప్రకారం, శుక్రవారం జరిగిన నిరసనల సమయంలో 53 మంది పోలీసులు, 24 మంది సాయుధ బలగాల భద్రతా సిబ్బంది గాయపడ్డారు.
నిరసన శాంతియుతంగా జరుగుతున్న సమయంలో పోలీసుల అణచివేత కారణంగానే ఈ దారుణ ఘటన జరిగిందని యునైటెడ్ పీపుల్స్ మూమెంట్ కమిటీ కన్వీనర్ నవరాజ్ సుబేదీ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కమిటీ రాచరిక పునరుద్ధరణకు మద్దతు ఇస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
దుర్గా ప్రసాయి కోసం గాలింపు
రాచరికానికి మద్దతుగా జరిగిన ప్రదర్శనలో 10,000 నుంచి 12,000 మంది ప్రజలు గుమిగూడారని నేపాల్ హోం మంత్రిత్వ శాఖను ఉటంకిస్తూ బీబీసీ నేపాల్ సర్వీస్ తెలిపింది.
అదే రోజు భృకుటిమండప్‌లో జరిగిన సోషలిస్ట్ ఫ్రంట్ ప్రదర్శనలో దాదాపు 35,000 మంది గుమిగూడారని భద్రతా సంస్థలు అంచనా వేసినట్లు హోం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి ఛబీ రిజాల్ తెలిపారు.
టింకునే, భృకుటి మండప్‌లలో శుక్రవారం 5,000 మంది భద్రతా సిబ్బంది మోహరించారు.
ప్రదర్శనకారులు, టింకునేలోని అనేక ఇళ్లను ధ్వంసం చేసి, ఒక ఇంటికి నిప్పు పెట్టి, అలోక్‌నగర్‌లోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యునైటెడ్ సోషలిస్ట్) పార్టీ కార్యాలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారని మీడియా నివేదికలు పేర్కొన్నాయి.
అలాగే పెరిసదందాలోనిలోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్ట్ సెంటర్) కార్యాలయంలోకి కూడా ప్రవేశించడానికి ప్రయత్నించారు. అనేక ప్రభుత్వ వాహనాలకు నిప్పు పెట్టారు.

ఫొటో సోర్స్, Getty Images
''దుర్గా ప్రసాయి ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఈ ఘటనకు ఆయనే ప్రాథమిక బాధ్యత. జరిగిన నష్టానికి నిర్వాహకులే పూర్తి బాధ్యత వహించాలి'' అని మంత్రిత్వ శాఖ సమావేశంలో రిజల్ చెప్పారు.
''రాచరిక అనుకూలవాదులు టింకునేలోని అనేక ప్రైవేట్ ఇళ్లను ద్వంసం చేశారు. ఒక హెర్బల్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీకి నిప్పంటించారు. దాని ప్రాంగణంలో వాహనాలను తగలబెట్టారు. నేపాల్ రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛా హక్కులను వారు దుర్వినియోగం చేశారు. భద్రతా బలగాలను చంపడమే వారి ఉద్దేశంగా కనిపించింది. ఆ తర్వాత పరిస్థితే మరింత దిగజారింది'' అని ఆయన అన్నారు.
దుర్గా ప్రసాయి ఒక కారును వేగంగా నడుపుతూ బారికేడ్లను బద్దలు కొట్టడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఒక వీడియోలో కనిపిస్తుంది.
ఆ వీడియోలో బారికేడ్లను బద్దలు కొట్టి నిరసనకారులను ముందుకు సాగమని ఆయన ప్రోత్సహిస్తూ కనిపించారు.
ఈ నిరసనకు ఒక రోజు ముందు మాజీ రాజు జ్ఞానేంద్ర షాను ఆయన కలిశారు.
రాచరిక అనుకూలవాదుల కమాండర్ ప్రసాయి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కానీ, ఆయన కనిపించడం లేదు.
రాచరిక పునరుద్ధరణ ఉద్యమం దేనికి?
రాజకీయ అస్థిరత కొనసాగుతున్న పరిస్థితులలో రాచరికాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ కొన్నిరోజులుగా అనేక ర్యాలీలు, ప్రదర్శనలు జరిగాయి. నేపాల్ మాజీ రాజు జ్ఞానేంద్ర కూడా క్రియాశీలకంగా కనిపిస్తున్నారు.
ఈ నెల 5న రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ కఠ్మాండూలో నిర్వహించిన బైక్ ర్యాలీలో ప్రజలు నేపాల్ జాతీయ జెండాతో పాల్గొన్నారు.
మార్చి 6న జ్ఞానేంద్ర పోఖరాలో మాజీ రాజు బీరేంద్ర విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ కార్యక్రమానికి హాజరైన వందలాదిమంది రాచరికం కాలం నాటి జాతీయ గీతం ఆలపించారు.
నేపాల్‌లో ప్రజాస్వామ్యం ఏర్పడిన తర్వాత జ్ఞానేంద్ర బీర్ బిక్రమ్ షా ఇలా బహిరంగంగా కనిపించడం చాలా అరుదు. ప్రత్యేక సందర్భాల్లో సాధారణ ప్రకటనలు మాత్రమే చేసేవారు.
మార్చి 9న ఆయన పోఖారా నుంచి కఠ్మాండూ వచ్చినప్పుడు ఆయనకు స్వాగతం పలికేందుకు వేలాదిమంది ప్రజలు వచ్చారు.
ఆ గుంపులో జ్ఞానేంద్ర, ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఫోటోతో ఓ వ్యక్తి నిలబడి ఉన్నారు.
రాజు అయ్యేందుకు జ్ఞానేంద్ర విదేశీయుల సాయం తీసుకుంటున్నారని, వారికి లంచం ఇచ్చారని పాలక కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ కేంద్ర కమిటీ సభ్యుడు విష్ణు రిజాల్ ఆరోపించారు.
నేపాల్ ప్రజలు ప్రభుత్వంపై చాలా అసంతృప్తితో ఉన్నారని, రాచరికం మద్దతుదారులకు ఇది అవకాశం కల్పించిందని కొందరంటున్నారు.
హిందూ దేశంగా ప్రకటించాలని నేపాల్‌లో కొన్ని రోజులుగా ఆందోళన జరుగుతోంది. నేపాల్‌లోని జనక్‌పుర్‌లో రామనవమి శోభాయాత్ర సమయంలో 2023 మార్చిలో మతపరమైన ఉద్రిక్తత చెలరేగింది.
జానకి ఆలయం దగ్గర మసీదు ఉంది. అక్కడ శోభాయాత్రలో పాల్గొన్న ప్రజలు గందరగోళం సృష్టించారు. నేపాల్‌లో ఇలాంటి పరిస్థితులు ఏర్పడడం అదే తొలిసారి. విశ్వహిందూ పరిషత్ ఈ శోభాయాత్ర నిర్వహించిందని అధికార యంత్రాంగం చెబుతోంది.
2014 తర్వాత నేపాల్‌లోని మాధేస్ ప్రాంతంలో ఆరెస్సెస్, హిందుత్వ రాజకీయాలు మరింత బలపడ్డాయని నేపాలీ సీనియర్ జర్నలిస్ట్ సీకె లాల్ చెప్పారని 2023 మార్చిలో బీబీసీ కరెస్పాండెంట్ రజనీష్ కుమార్ తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయం)














