టిబెట్‌లో 126కు చేరిన భూకంప మృతుల సంఖ్య, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, లారా బైకర్, కోహ్ ఈవ్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
మంగళవారం ఉదయం టిబెట్ ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపం ధాటికి 126 మంది మరణించారని, 188 మంది గాయపడ్డారని చైనా ప్రభుత్వ మీడియా వెల్లడించింది. 3వేలకు పైగా భవనాలు ధ్వంసమయ్యాయి. భూకంపం సంభవించిన ప్రాంతం ఎవరెస్ట్‌కు దగ్గరలో ఉంది. క్షతగాత్రులకోసం రాత్రంతా రెస్క్యూ ఆపరేషన్ సాగింది. ఈ ప్రాంతంలో భూకంపాలు సంభవించడం సాధారణమే అయినప్పటికీ...ఇటీవలి సంవత్సరాల్లో ఇంత భారీ ప్రాణ నష్టం జరగడం ఇదే తొలిసారి.
యు.ఎస్. జియోలాజికల్ సర్వే నుంచి వచ్చిన డేటా ప్రకారం, టిబెట్‌లో పవిత్ర నగరంగా పిలిచే షిగాట్సేలో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 09:00 సమయంలో భూకంపం ఏర్పడింది.
రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.1 గా నమోదైంది. ఈ భూకంపం ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతున ఏర్పడినట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ తీవ్ర భూకంపం తర్వాత కూడా తిరిగి వరస ప్రకంపనలు(ఆఫ్టర్ షాక్స్) ఏర్పడ్డాయని చెబుతున్నారు.
పొరుగునే ఉన్న భారత్‌లోని కొన్ని ప్రాంతాలతోపాటు నేపాల్‌లో కూడా ఈ ప్రకంపనలు సంభవించాయి.


ఫొటో సోర్స్, Getty Images
షిగాట్సే నగరాన్ని టిబెట్ పవిత్ర నగరాలలో ఒకటిగా చెబుతారు. టిబెటన్ బౌద్ధమతంలో కీలకమైన వ్యక్తి అయిన పంచన్ లామా ఇక్కడే ఉంటారు. పంచన్ లామా పదవి దలైలామా తర్వాతి స్థానంలో ఉంటుంది.
ఈ ప్రాంతంలో భూకంపం తీవ్రత 6.8 అని చైనా ప్రభుత్వ మీడియా వెల్లడించింది.
భూకంపకేంద్రానికి దగ్గరలో ఉన్న టింగ్రీ కౌంటీలో ఉష్ణోగ్రతలు మైనస్ 8డిగ్రీల సెంటీగ్రేడ్‌కు పడిపోయాయని చైనా వాతావరణ శాఖ తెలిపింది.
చైనా వాయుసేన రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తోంది. డ్రోన్ల సాయంతో నష్టం తీవ్రతను అంచనా వేసే ప్రయత్నాలు చేస్తోంది. తీవ్ర ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్, నీటి సరఫరాలు నిలిచిపోయాయి. అంబులెన్సులు రోజంతా క్షతగాత్రులను ఆస్పత్రులకు తీసుకెళ్తూనే ఉన్నాయని సంగ్జీ డాంగ్జీ అనే స్థానికుడు తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
నేపాల్‌లోనూ ప్రకంపనలు నమోదైనప్పటికీ ఆస్తి, ప్రాణనష్టాలు రిపోర్టు కాలేదని ఎవరెస్ట్ సమీపంలోని నామ్చే ప్రాంతానికి చెందిన ఒక అధికారి ఏఎఫ్‌పీకి చెప్పారు.
నష్టాన్ని అంచనావేస్తున్నామని, ఇప్పుడే పూర్తి వివరాలు చెప్పలేమని టిబెట్ ఎర్త్‌క్వేక్ బ్యూరో బీబీసీకి చెప్పింది.
ఇండియన్, యూరేషియన్ టెక్టానిక్ ప్లేట్ల మధ్యన ఉండే మేజర్ ఫాల్ట్‌లైన్‌కు సమీపంలో ఉన్న ఈ ప్రాంతం తరచుగా భూకంపాలకు గురవుతూ వస్తోంది.
2015లో నేపాల్ రాజధాని కాఠ్‌మాండులో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల దాదాపు 9,000 మంది మరణించగా, 20,000 మందికి పైగా గాయపడ్డారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














