‘‘వక్ఫ్ బోర్డులో ప్రస్తుతానికి ముస్లిమేతరులను నియమించం’’ సుప్రీం కోర్టుకు తెలిపిన కేంద్రం

ఫొటో సోర్స్, Getty Images
వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులను నియమించబోమని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు హామీ ఇచ్చింది.
వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై గురువారం కూడా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రస్తుత వక్ఫ్ ఆస్తులపైనా ఎలాంటి చర్యలు తీసుకోమని కేంద్రం తెలిపింది. ఈ కేసులో సుప్రీం కోర్టు ఇంకా ఎలాంటి స్టే ఉత్తర్వులు ఇవ్వలేదు.
ఈ మొత్తం వ్యవహారంపై ఏడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని సుప్రీం కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ కేసులో తదుపరి విచారణ మే 5 నుంచి ప్రారంభమయ్యే వారంలో జరగనుంది.
కేంద్రప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వక్ఫ్ సవరణ చట్టం 2025లో కొన్ని నిబంధనలను ప్రస్తుతానికి అమలు చేయమని కోర్టుకు హామీ ఇచ్చారు.

చీఫ్ జస్టిస్ ఏం చెప్పారు?
‘‘విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ ప్రభుత్వం ఏడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపారు. వక్ఫ్ కౌన్సిల్ లేదా బోర్డులో కొత్త నియామకాలు చేయబోమని ఆయన హామీ ఇచ్చారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు వక్ఫ్ లో ఇప్పటికే వక్ఫ్ కింద రిజిస్టర్ అయిన వక్ఫ్ బై యూజర్స్ లో ఎలాంటి మార్పులు చేయరు. సంబంధిత కలెక్టర్ కూడా వాటిలో ఎలాంటి మార్పులు చేయరు. ఈ వాంగ్మూలాన్ని రికార్డులో నమోదు చేస్తున్నాం’’ అని చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘హిందూ మత ట్రస్టుల్లోనూ ముస్లింలను చేరుస్తారా?’’
వక్ఫ్ సవరణ చట్టంలోని కొన్ని నిబంధనలపై స్టే విధించవచ్చని సుప్రీంకోర్టు బుధవారం సూచించింది. దీనిపై బుధవారం చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం పలు వ్యాఖ్యలు చేసింది.
ఈ సందర్భంగా హిందువులకు చెందిన మతపరమైన ట్రస్టుల్లో ముస్లింలు లేదా హిందూయేతరులకు స్థానం కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నారా అని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
ఈ వ్యవహారంలో ఏవైనా ఉత్తర్వులు జారీ చేయడానికి ముందు తమ వాదన కూడా వినాలని కోర్టును కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు.
ఈ విచారణకు పిటిషనర్ల తరఫున కపిల్ సిబల్, రాజీవ్ ధవన్, అభిషేక్ మను సింఘ్వి వంటి సీనియర్ న్యాయవాదులు హాజరయ్యారు.
వక్ఫ్ సవరణ చట్టంలోని అనేక సవరణలు మతపరమైన వ్యవహారాలకు సంబంధించిన ప్రాథమిక హక్కులను ప్రభావితం చేస్తాయని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు.

ఫొటో సోర్స్, Getty Images
పిటిషనర్లు ఎవరు?
ఇటీవల పార్లమెంటు ఆమోదించిన వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పదికి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి.
వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ చెల్లుబాటుపై పిటిషనర్లు ప్రశ్నలు లేవనెత్తారు.
పిటిషనర్లలో ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్, సమస్తా కేరళ జమియతుల్ ఉలేమా సంస్థ, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా, ఆర్జేడీ నాయకుడు మనోజ్ ఝా ఉన్నారు.
ఈ పిటిషన్లు దాఖలైన తర్వాత, ఈ చట్టం రాజ్యాంగబద్ధతను సమర్థిస్తూ ఆరు బీజేపీ పాలిత రాష్ట్రాలు పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిలో హరియాణా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, అసోం రాష్ట్రాలు ఉన్నాయి.
ఈ చట్టం రద్దు తర్వాత కలిగే చట్టపరమైన పరిణామాలను పేర్కొంటూ ఈ రాష్ట్రాలన్నీ వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












