వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ముర్షిదాబాద్‌లో జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి ఎందుకు?

ఫొటో సోర్స్, ANI
- రచయిత, శుభోజీత్ బాగ్చీ
- హోదా, కోల్‌కతా నుంచి బీబీసీ కోసం
వక్ఫ్ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. సెంట్రల్ బెంగాల్ జిల్లా అయిన ముర్షిదాబాద్‌లో పరిస్థితులు అదుపు తప్పాయి. ఈ హింసాత్మక ఘటనలో ముగ్గురు మరణించారు.
మరణించిన వారిని ఎజాజ్ అహ్మద్ (17), హర్‌గోవింద్ దాస్ (65), చందన్ దాస్(35)గా గుర్తించినట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు బీబీసీకి చెప్పాయి.
హర్‌గోవింద్, చందన్‌లు తండ్రికొడుకులని.. వీరు మేకల వ్యాపారం చేస్తూ చాలీచాలని సంపాదనతో జీవిస్తున్నారని పొరుగింటి వారు చెప్పారు.
ఈ హింసాత్మక ఘర్షణల్లో పలువురికి గాయాలయ్యాయి. ఇప్పటి వరకు 150 మందిని పైగా అరెస్ట్ చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి చెప్పినట్లు వార్తా సంస్థ పీటీఐ రిపోర్టు చేసింది.

ప్రజలు శాంతియుతంగా ఉండాలంటూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరారు. ''రాజకీయ ప్రయోజనాల కోసం అల్లర్లను ప్రేరేపించవద్దు'' అని తన ఎక్స్ హ్యాండిల్‌లో అభ్యర్థించారు.
ఈ హింసాత్మక ఘర్షణల తర్వాత, రాజకీయ ప్రయోజనాల కోసం కొన్ని పార్టీలు మతాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఆరోపించింది.
సుమారు 26 వేల మంది స్కూల్ టీచర్లు తమ ఉద్యోగాలను పోగొట్టుకున్న విషయం నుంచి ప్రజల దృష్టి మళ్లించి, ఓటు బ్యాంకును పొందేందుకు టీఎంసీనే ఈ హింసను ప్రేరేపిస్తుందని ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రత్యారోపణ చేసింది.
బెంగాల్‌లో వక్ఫ్ చట్టాన్ని అమలు చేయబోమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు.
రాష్ట్రానికి తక్షణమే కేంద్ర భద్రత బలగాలను పంపించాలని కోల్‌కతా హైకోర్టు శనివారం ఆదేశించింది.
జిల్లాకు కేంద్ర భద్రతా బలగాలను పంపించాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి వేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది.
బెంగాల్ ఉన్నతాధికారులతో కేంద్ర హోం శాఖ కార్యదర్శి మాట్లాడినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ రిపోర్టు చేసింది. అవసరమైన సాయమంతా అందిస్తామని హోం శాఖ కార్యదర్శి తెలిపినట్లు పేర్కొంది.
ముర్షిదాబాద్‌లోనే 300 మంది బీఎస్ఎఫ్ సిబ్బంది అందుబాటులో ఉన్నట్లు హోం శాఖ కార్యదర్శి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు అదనంగా బలగాలను అక్కడకు పంపించినట్లు తెలిపారు.

ఫొటో సోర్స్, ANI
ముర్షిదాబాద్‌లో అసలెలా హింస చెలరేగింది?
వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ముర్షిదాబాద్ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి.
ఉత్తర బెంగాల్‌ను దక్షిణ బెంగాల్‌తో అనుసంధానించే జాతీయ రహదారి 12పై ఉన్న సజూర్ మోర్ ప్రాంతంలో, ధులియాన్ మున్సిపాలిటీకి చెందిన జఫ్రాబాద్ పట్టణంలో నెలకొన్న హింసాత్మక ఘర్షణల్లో ముగ్గురు చనిపోయారు.
ఈ రెండు ప్రాంతాలు బంగ్లాదేశ్ సరిహద్దులో ముర్షిదాబాద్ జంగీపూర్ సబ్‌డివిజన్‌లో ఉన్నాయి.
''17 ఏళ్ల ఎజాజ్ అహ్మద్‌కు సజూర్ మోర్‌లో శుక్రవారం బుల్లెట్ తగిలింది. వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. శనివారం సాయంత్రం అహ్మద్ చనిపోయారు.'' అని బెంగాలీ వార్తా పత్రికకు ముర్షిదాబాద్‌కు చెందిన ఒక సీనియర్ జర్నలిస్ట్ చెప్పారు.
''శనివారం ఉదయం జఫ్రాబాద్‌లో తండ్రి, కొడుకు మృతదేహాలను గుర్తించారు. వారి శరీరాలపై గాయాల గుర్తులు ఉన్నాయి. ఈ గుర్తులు బట్టి వారు హత్యకు గురైనట్లు తెలుస్తోంది'' అని తెలిపారు.
అహ్మద్‌ను ఎవరు చంపారో ఇప్పటి వరకు పోలీసులు ధ్రువీకరించలేదు. దాస్ కుటుంబ సభ్యుల మరణంపైనా రకరకాల కథనాలు వస్తున్నాయి.
స్వీట్ల తయారీదారు హేమంత్ దాస్ దిఘ్రీలో ఉంటుంటారు. ఇది జఫ్రాబాద్‌కు పక్కనే ఉంటుంది. శనివారం తాను హర్‌గోవింద్ దాస్ ఇంటికి వెళ్లినట్లు హేమంత్ దాస్ చెప్పారు.
తండ్రీకొడుకులను ఎందుకు హత్య చేశారో తెలియడం లేదని హేమంత్ దాస్ ఫోన్‌లో ఒక జర్నలిస్టుతో చెప్పారు.
'' వారిది (దాస్ కుటుంబం) మేకల వ్యాపారం చేసే చిన్న కుటుంబం. ఎందుకు వారిని లక్ష్యంగా చేసుకున్నారో నాకు తెలియడం లేదు'' అని హేమంత్ దాస్ అన్నారు.
'' తొలుత రాళ్లు రువ్వారు. ఆ తర్వాత వారి ఇంటిపై కొందరు వ్యక్తులతో ఉన్న గుంపు దాడి చేసింది. వారిని దోచుకునేందుకు ప్రయత్నించింది. దాస్ కుటుంబం ప్రతిఘటించినప్పుడు, ఆ గుంపు వారిని కొట్టి చంపేసింది'' అని హేమంత్ దాస్ చెప్పారు.
రెండు వర్గాల మధ్య ఘర్షణల్లో తండ్రి, కొడుకు చనిపోయారని మరో స్థానిక జర్నలిస్టు చెబుతున్నారు.
''శుక్రవారం ప్రార్థనల తర్వాత నిరసనలు పెద్దఎత్తున జరిగినప్పటికీ ప్రశాంతంగా సాగాయి. జాతీయ రహదారి వైపు దాక్ బంగ్లా మోర్ వైపుగా యాంటీ-వక్ఫ్ ర్యాలీలు కొనసాగాయి. హిందువులు ఎక్కువగా ఉండే ఘోస్ పారాను దాటుతున్నప్పుడు ర్యాలీల్లో ఒకదానిలో చిన్నపాటి గొడవ జరిగింది.
మొదట రాళ్లను అవతలి వర్గమే రువ్విందంటూ రెండు వర్గాలూ పరస్పరం ఆరోపించుకున్నాయి. జాతీయ రహదారిపై ఉన్న నిరసనకారులకు ఈ విషయం తెలియగానే, అల్లర్లు జరిగాయి. దుకాణాలను ధ్వంసం చేశారు.'' అని ఆయన చెప్పారు.
ఈ ఘర్షణలలో చాలా వాహనాలు మంటల్లో కాలిపోయాయి. ఆస్తుల ధ్వంసమయ్యాయి. రతన్‌పూర్‌లోని ఆలయం, శివమందిర్ ప్రాంతంలోని మసీదును లక్ష్యంగా చేసుకుని ఈ అల్లర్లు జరిగాయి.
'' జఫ్రాబాద్‌లో ఘర్షణలు నెలకొనడం దురదృష్టకరం. ఎందుకంటే, హిందువులు, ముస్లింలు ఇక్కడ ఎప్పుడూ శాంతియుతంగా జీవిస్తుంటారు. ఈ ఘర్షణల నుంచి ఆలయాన్ని రక్షించేందుకు రతన్‌పూర్‌లో శాంతి సమావేశాన్ని రెండు వర్గాలు ప్రతినిధులు నిర్వహించారు'' అని ఒక టీచర్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
2011 జనగణన ప్రకారం, ముర్షిదాబాద్‌లో 66 శాతానికి పైగా ముస్లిం జనాభా. తాజాగా జరిగిన అన్ని ఎన్నికల్లో దాదాపు ప్రతి సీటును తృణమూల్ కాంగ్రెస్ చేజిక్కించుకుంది.
ముర్షిదాబాద్‌లో ఉన్న ముగ్గురు ఎంపీలు కూడా అధికార పార్టీకి చెందినవారే. రాష్ట్ర అసెంబ్లీలో ముర్షిదాబాద్ నుంచి 22 సభ్యులు ఉండగా అందులో 20 మంది టీఎంసీకి చెందినవారే.
ఉత్తర ముర్షిదాబాద్ ప్రాంతంలో ఈ హింసాత్మక ఘర్షణలు జరిగాయి. ఈ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలందరూ తృణమూల్ కాంగ్రెస్‌వారే. అంతేకాక, మొత్తం 8 మున్సిపాలిటీల్లో ఏడు ఈ పార్టీ నియంత్రణలో ఉన్నాయి.
''బీజేపీ ఉనికినే లేకుండా ఇంత ఎక్కువ మెజార్టీతో టీఎంసీ ఉన్నప్పటికీ, పరిస్థితి ఎలా అదుపు తప్పింది? అనేది ప్రస్తుతం మనం అడగాల్సిన ప్రశ్న'' అని ముర్షిదాబాద్‌కు చెందిన సీనియర్ జర్నలిస్టు అన్నారు.
''శుక్రవారం రాత్రి వరకు అంతా ప్రశాంతంగా ఉంది. శనివారం ఉదయం కల్లా ఎలా హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. ఎందుకు?'' అని ధులియాన్‌కు చెందిన సామాజిక కార్యకర్త జిమ్ నవాజ్ ప్రశ్నించారు.
''ఎందుకంటే, దుకాణాలను తగలపెట్టేటప్పుడు పోలీసులు చర్యలు తీసుకునేందుకు నిరాకరించారు. వారికి సమాచారం అందిన వెంటనే చర్యలు తీసుకోవడానికి స్థానిక అథారిటీలు నిరాకరించడంతోనే ఇలా జరిగిందని నాకు తెలిసింది.'' అని తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














