పంజాబ్‌లో మళ్లీ రైతుల నిరసన, అరెస్ట్ చేసి శిబిరాలను ఖాళీ చేయించిన పోలీసులు

ఫొటో సోర్స్, Charanjeev Kaushal/BBC
కనీస మద్దతు ధర సహా పలు డిమాండ్లను నెరవేర్చాలంటూ పంజాబ్, హరియాణా సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులను పోలీసులు బలవంతంగా తరలించారు.
పటియాలా రేంజ్ డీఐజీ మన్ దీప్ సింగ్ నేతృత్వంలో పోలీసులు రైతులను బలవంతంగా బస్సుల్లోకి ఎక్కించి తరలించారు.
బీబీసీ కరస్పాండెంట్ చరంజీవ్ కౌశల్ అందించిన సమాచారం ప్రకారం... ఇంటర్‌నెట్ సర్వీసులను ప్రభుత్వం నిలిపివేసింది.
రైతు నాయకులు జగ్జిత్ సింగ్ డల్లేవాల్, శర్వణ్ సింగ్ పంధేర్‌లను కూడా బుధవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దీంతోపాటు పంజాబ్, హరియాణా రాష్ట్రాల సరిహద్దులైన శంభు, ఖనౌరీల దగ్గర ఏర్పాటు చేసిన రైతుల శిబిరాలపై పంజాబ్ పోలీసులు బుల్డోజర్ యాక్షన్‌కు దిగారు.
రైతులను తరలించిన తరువాత, హరియాణా పోలీసులు శంభు సరిహద్దులో ఏర్పాటు చేసిన శాశ్వత బారికేడ్లను తొలగించే పనిని ప్రారంభించారని ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.
గత ఏడాది రైతులు దిల్లీకి మార్చ్ ప్రకటించినప్పుడు వారిని అడ్డుకునేందుకు పోలీసులు రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేశారు.
ఏడాది నుంచి తమ డిమాండ్ల సాధన కోసం శంభు, ఖనౌరీ సరిహద్దుల దగ్గర రైతులు ఆందోళన చేస్తున్నారు.
వివిధ రాజకీయపక్షాలు పంజాబ్ ప్రభుత్వ చర్యలను ఖండించాయి. అయితే తమ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకం కాదని, కానీ సరిహద్దుల మూసివేత కారణంగా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని పంజాబ్ ప్రభుత్వం తెలిపింది.
ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో రైతులు నిరహారదీక్షకు దిగుతున్నారు.


ఫొటో సోర్స్, PradeepPandit/BBC
తాజా పరిణామాలేంటి?
ప్రస్తుతం పంజాబ్ పోలీసులు సరిహద్దులను ఖాళీ చేయిస్తున్నారు. హరియాణా పోలీసులు కూడా సిమెంట్ బారికేడ్లను పగలగొట్టే పనిలో ఉన్నారు. రెండు వైపుల నుంచి ఒకటి రెండు రోజుల్లో ట్రాఫిక్‌ను పునరుద్ధరిస్తామని అధికారయంత్రాంగం చెబుతోంది.
ముందు జాగ్రత్త చర్యగా పటియాల, సంగ్రూర్ జిల్లాల్లో ఇంటర్‌నెట్ సేవలు నిలిపివేశారు.
‘‘సరిహద్దుల వద్ద పోలీసులను ఎందుకు మోహరించారో, ప్రభుత్వ ఉద్దేశం ఏమిటో చెప్పాలని మేం సమావేశంలో పంజాబ్ మంత్రులు గుర్మిత్ సింగ్ ఖుదియాన్‌ను, లాల్ చంద్ ఖతార్‌చక్‌ను ప్రశ్నించాం. అయితే పోలీసుల మోహరింపు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా చేసిన పనేగానీ, ప్రభుత్వానికి మరే ఉద్దేశం లేదని చెప్పారు’’ అని శర్వణ్ సింగ్ పంధేర్ అన్నారు.
పంజాబ్ ప్రభుత్వం చేసిన మోసానికి నిరసనగా వివిధ ప్రాంతాలలో పోలీసుల అదుపులో ఉన్నవందలాది రైతులు నిరాహారదీక్షకు దిగారని రాజకీయేతర సంస్థ యునైటెడ్ కిసాన్ మోర్చా ఓప్రకటనలో తెలిపింది.
పంజాబ్ అంతటా జిల్లా కలెక్టర్ కార్యాయలయాల ఎదుట బైఠాయింపునకు దిగాలని కిసాన్ మజ్దూర్ సంగ్రాహాస్ పిలుపునిచ్చింది.

ఫొటో సోర్స్, Kulveer Namol/BBC
అసలేం జరిగిందంటే..
రైతులు, పంజాబ్ ప్రభుత్వ మంత్రులు, కేంద్రం మధ్య 7వ విడత సమావేశాలు చండీగఢ్ లో జరిగాయి.
తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళనలు కొనసాగుతాయని, తదుపరి సమావేశాన్ని మే 4వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు రైతులు తెలిపారు.
అయితే సమావేశం నుంచి తిరిగి వస్తుండగా రైతు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా జగ్జీత్ సింగ్ డల్లేవాల్, సర్వాన్ పంధేర్ సహా పలువురు ప్రముఖ రైతు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రైతులను నిర్బంధించే సమయంలో పోలీసులకు, రైతులకు మధ్య తోపులాట జరిగి పలువురు రైతులు గాయపడ్డారు.
రైతులు ఆందోళనకు దిగడంతో పోలీసులు రైతులను బలవంతంగా బస్సుల్లో ఎక్కించారు.
దీంతో రాత్రికి రాత్రే రెండు సరిహద్దులను ఖాళీ చేయించి అక్కడ భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
ఇది ఆప్ నియంతృత్వం : కాంగ్రెస్
రైతుల అరెస్ట్‌పై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఆప్, పంజాబ్ పోలీసుల చర్యలను ఖండించింది. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారమనే మత్తుకు అలవాటు పడిందని, రైతులకు వ్యతిరేకంగా మారిందని కాంగ్రెస్ విమర్శించింది.
ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఎక్స్‌లో ఒక పోస్టు చేసింది. ''పంజాబ్ అంతటా రైతు నాయకులను అరెస్ట్ చేస్తున్నారు. నిరాహారదీక్షలో ఉన్న జగ్జిత్ సింగ్ డల్లేవాల్‌ను కూడా అరెస్ట్ చేశారు. అన్నివిధాల రైతులను హింసిస్తున్నారు. ఇది స్పష్టంగా ఆప్ నియంతృత్వమే'' అని రాసింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













