'పాకిస్తానీని అడిగితే.. మా చీఫ్ ఫీల్డ్ మార్షల్ అయ్యారు, మేం గెలిచాం అంటాడు': ఇండియన్ ఆర్మీ చీఫ్ ప్రకటనపై చర్చ

భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది

ఫొటో సోర్స్, MONEY SHARMA/AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, 'ఆపరేషన్ సిందూర్' వ్యూహం 'చదరంగం ఆట లాంటిది' అని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అభివర్ణించారు.

భారత్, పాకిస్తాన్ మధ్య 2025 మే నెలలో జరిగిన ఘర్షణ గురించి భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఆపరేషన్ సిందూర్' వ్యూహాన్ని చదరంగం ఆటతో పోల్చారు ద్వివేది.

ఆగస్టు 4న మద్రాస్ ఐఐటీలో జరిగిన కార్యక్రమంలో "ఆపరేషన్ సిందూర్: ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత పోరాటంలో కొత్త అధ్యాయం" అనే అంశంపై ఆర్మీ చీఫ్ ప్రసంగించారు.

ఏప్రిల్ 22న పహల్గాంలో దాడి జరిగిన తర్వాత, భారత్ ప్రతీకార వ్యూహాన్ని ఎలా సిద్ధం చేసిందో ఆయన వివరించారు. ఈ కార్యక్రమం మొత్తం వీడియోను శనివారం భారత సైన్యం అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేశారు.

దీనికిముందు శనివారం, భారత వైమానిక దళం చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, పాక్ ఘర్షణలో భారత వైమానిక దళం పాకిస్తాన్‌కు చెందిన "ఐదు యుద్ధ విమానాలను, ఒక భారీ ఎయిర్‌క్రాఫ్ట్‌ను కూల్చింది" అని అన్నారు. కాగా, పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఈ వాదనను తిరస్కరించారు.

"ఒక్క పాకిస్తాన్ విమానం కూడా లక్ష్యం కాలేదు లేదా నాశనం కాలేదు" అని ఆసిఫ్ అన్నారు.

పహల్గాంలో దాడి జరిగాక, మే 6-7 రాత్రి ''పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలు లక్ష్యంగా దాడులు చేశాం'' అని భారత సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది.

అనంతరం, రెండు దేశాల మధ్య సైనిక ఘర్షణ ప్రారంభమైంది. అయితే, మే 10న ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరింది.

కాగా, ఈ ఘర్షణ సమయంలో భారత్‌కు చెందిన "ఐదు ఫైటర్ జెట్లను కూల్చివేసినట్లు" పాకిస్తాన్ పేర్కొంది. అయితే ఈ వాదనలను భారత్ తిరస్కరించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
భారతదేశం-పాకిస్తాన్ ఘర్షణ

ఫొటో సోర్స్, @SPOKESPERSONMOD/X

ఫొటో క్యాప్షన్, భారత్-పాకిస్తాన్ ఘర్షణ (2025 మే 9) సమయంలో జరిగిన సమావేశం ఫోటో

పహల్గాం దాడి తర్వాత ఏం జరిగిందంటే: ఆర్మీ చీఫ్

ఆపరేషన్ సిందూర్ తర్వాత, టీవీ, పార్లమెంటరీ చర్చలలో దీనిపై చాలా చర్చలు జరిగాయని.. అయితే టెక్నాలజీ వినియోగం, అందులో సంఘటనల క్రమాన్ని అర్థం చేసుకోవడం కూడా ముఖ్యమని మద్రాస్ ఐఐటీలో జరిగిన కార్యక్రమంలో ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అన్నారు.

ఏప్రిల్ 22న పహల్గాంలో దాడి జరిగిన మరుసటి రోజు, ఏప్రిల్ 23న రక్షణ మంత్రి నేతృత్వంలో త్రివిధ దళాల అధిపతులతో సమావేశం జరిగిందని ఆయన తెలిపారు.

"రక్షణ మంత్రి 'ఇక చాలు' అని అనడం అదే మొదటిసారి. ఏదో ఒకటి చేయాలని త్రివిధ దళాల అధిపతులు చాలా స్పష్టతతో సంసిద్ధంగా ఉన్నారు. మాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. అంటే, ఏం చేయాలో మీరే నిర్ణయించుకోమని. అంత నమ్మకం, రాజకీయంగా చూసే కోణం, స్పష్టత మేం మొదటిసారి చూశాం. అదే తేడా చూపించింది" అని ఆర్మీ చీఫ్ అన్నారు.

ఏప్రిల్ 25న, నార్తర్న్ కమాండ్‌లో ప్లాన్ ఖరారైందని, 9 లక్ష్యాలలో ఏడు ఛేదించామని అన్నారు.

దీంతో పాటు, 'ఆపరేషన్ సిందూర్' పేరు పెట్టడం వెనకున్న కథను కూడా ఆర్మీ చీఫ్ వివరించారు.

"ఆపరేషన్ పేరు 'సింధు' అని నాకు చెప్పినప్పుడు, అది సింధు నది గురించి అనుకున్నాను. చాలా బాగుందన్నాను. ఆ తర్వాత వారు, కాదు.. ఇది 'ఆపరేషన్ సిందూర్' అన్నారు. చూడండి, ఈ ఒక్క పేరు దేశం మొత్తాన్ని ఏకం చేసింది" అన్నారు ద్వివేది.

మునుపటి ఆపరేషన్లతో పోల్చి చూస్తే, ఈసారి దాడి "విస్తృతంగా, బలంగా"ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

"మేం వారి హార్ట్‌ల్యాండ్‌పై దాడి చేయడం ఇదే మొదటిసారి. మా లక్ష్యం 'నర్సరీ', దాని యజమాని. ఇలా ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. పాకిస్తాన్ కూడా వారి హార్ట్‌ల్యాండ్‌పై దాడి జరుగుతుందని ఊహించలేదు. ఇది వారికి పెద్ద షాక్" అని ద్వివేది అన్నారు.

అసిమ్ మునీర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ ఫీల్డ్ మార్షల్ హోదాకు పదోన్నతి పొందారు.

'మా చీఫ్ ఫీల్డ్ మార్షల్ అయ్యారు'

జనరల్ ఉపేంద్ర ద్వివేది తన ప్రసంగంలో 'నేరేటివ్ మేనేజ్‌మెంట్ సిస్టం' కూడా మాట్లాడారు.

"నేరేటివ్ మేనేజ్‌మెంట్ సిస్టం అనేది మనం బాగా అర్థం చేసుకున్న విషయం. ఎందుకంటే, విజయం మనస్సులో ఉంటుంది, ఎల్లప్పుడూ ఉంటుంది. మీరు ఎవరైనా పాకిస్తానీ వ్యక్తిని.. మీరు గెలిచారా లేదా ఓడారా అని అడిగితే, అతను - 'మా చీఫ్ ఫీల్డ్ మార్షల్ అయ్యారు. మేం గెలిచాం, అందుకే ఆయన ఫీల్డ్ మార్షల్ అయ్యారు' అని చెబుతారు" అని ద్వివేది అన్నారు.

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్‌ను ఫీల్డ్ మార్షల్‌గా అక్కడి ప్రభుత్వం నియమించడంపై ద్వివేది ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్-పాకిస్తాన్ ఘర్షణ జరిగిన కొన్ని రోజుల తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం ఆయనకు ఈ పదవి ఇచ్చింది.

"వ్యూహాత్మక సందేశం చాలా ముఖ్యమైనది, అందుకే మేం ఇచ్చిన మొదటి సందేశం - ఓకే, న్యాయం జరిగింది, ఆపరేషన్ సిందూర్" అని ద్వివేది అన్నారు.

మే 6-7 రాత్రి భారత సైన్యం దాడులు చేసింది. దీని గురించి, భారత సైన్యానికి చెందిన అడిషనల్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ (ఏడీజీపీఐ) అధికారిక ఎక్స్ హ్యాండిల్ నుంచి ప్రకటన వచ్చింది. జనరల్ ద్వివేది ఈ సందేశం గురించే మాట్లాడారు.

'గ్రే జోన్‌లో చెస్ కదలికలు'

'ఆపరేషన్ సిందూర్' వ్యూహాన్ని చదరంగం ఆటతో పోల్చారు ఆర్మీ చీఫ్ ద్వివేది. ఈ సమయంలో రెండు వైపులా ఒకరి కదలికలను మరొకరు అర్థం చేసుకోవడానికి, బ్రేక్ చేయడానికి ప్రయత్నించారని అన్నారు.

ఈ ఆపరేషన్ 'గ్రే జోన్' ప్రాముఖ్యతను లోతుగా అర్థం చేసుకునేలా చేసిందన్నారు ద్వివేది.

"ఆపరేషన్ సిందూర్‌లో మేం చదరంగం ఆడాం. దీనర్థం శత్రువు తర్వాత ఏం చేస్తాడో, మేం ఏం చేయబోతున్నామో కూడా తెలియదు. మేం దీన్నే 'గ్రే జోన్'గా పిలుస్తాం" అని ఆయన అన్నారు.

ఆపరేషన్ సిందూర్ సమయంలో, రెండు వైపులా చదరంగం కదలికలు జరిగాయని ద్వివేది అన్నారు.

"మేం చదరంగం కదలికలు చేశాం, వారు కూడా చదరంగం కదలికలు చేశారు. ఎక్కడో మేం వారికి చెక్‌మేట్ పెట్టాం, మనకు నష్టం జరగొచ్చని తెలిసి కూడా వారిని అంతం చేయడానికి ముందుకెళ్లాం. జీవితం కూడా అలాంటిదే" అని ఆయన అన్నారు.

భారత్-పాకిస్తాన్ సైనిక సంఘర్షణ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత్-పాకిస్తాన్ సైనిక సంఘర్షణ సమయంలో అనేక రకాల వాదనలు తెరపైకి వచ్చాయి.

ఎవరి వాదనలు ఏంటంటే..

మే 7, 10 మధ్య జరిగిన భారత్-పాకిస్తాన్ సైనిక ఘర్షణలో అనేక వాదనలు తెరపైకి వచ్చాయి.

ఈ ఘర్షణలో 'భారత్‌కు చెందిన 5 యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు' పాకిస్తాన్ క్లెయిమ్ చేసింది.

దీనిపై మే 31న ఇండియన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్‌ను అడిగినప్పుడు "ఇది పూర్తిగా తప్పు" అని అన్నారు.

"అదంత ముఖ్యం కాదు. జెట్లు ఎందుకు కూలిపోయాయి, ఆ తర్వాత మనం ఏం చేశామనేది ముఖ్యం. ఇదే మనకు చాలా ముఖ్యం" అని అన్నారు సీడీఎస్.

మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ భారత్-పాకిస్తాన్ ఘర్షణలో "ఐదు యుద్ధ విమానాలు కూలిపోయాయని" అన్నారు.

అయితే, ఏ దేశానికి చెందిన ఎన్ని యుద్ధ విమానాలు దెబ్బతిన్నాయో ట్రంప్ చెప్పలేదు. రెండు అణ్వాయుధ దేశాలైన భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించానని ట్రంప్ చాలాసార్లు చెప్పారు.

అయితే, కాల్పుల విరమణ ఒప్పందంలో 'మధ్యవర్తిత్వం' వాదనలను పార్లమెంటులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తిరస్కరించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)