అమెరికా-భారత్‌ మధ్య ‘చెడిన’ సంబంధాలను పాకిస్తాన్‌ సద్వినియోగం చేసుకుంటుందా?

మోదీ, షరీఫ్, ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత్‌పై టారిఫ్‌లు విధించి, పాకిస్తాన్‌తో ట్రేడ్ డీల్ కుదుర్చుకున్న ట్రంప్

అమెరికాలోని టెక్సస్‌లో 2019లో 'హౌడీ మోదీ' అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ సందర్భంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డోనల్డ్ ట్రంప్‌ను ఉద్దేశిస్తూ.. ' అబ్‌కీ బార్ ట్రంప్ సర్కార్' (మళ్లీ ట్రంప్ ప్రభుత్వమే) అనే నినాదాన్ని చేశారు.

డోనల్డ్ ట్రంప్ ఆ తర్వాత సంవత్సరం భారత్‌కు వచ్చినప్పుడు అహ్మదాబాద్‌లో ఆయనకు స్వాగతం పలుకుతూ 'నమస్తే ట్రంప్' అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.

రెండు దేశాల నేతల మధ్య సంబంధాలు మెరుగవుతున్నాయడానికి సంకేతంగా విశ్లేషకులు దీన్ని చూశారు. 2024లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాగా, ట్రంప్ కూడా మరోసారి అధికారాన్ని చేపట్టారు.

దీంతో, భారత్-అమెరికా మధ్య సంబంధాలను ఇద్దరు నేతల మధ్య సంబంధంగా చూడటం ప్రారంభించింది మీడియా. కానీ, గత ఆరునెలలుగా ఈ ఇద్దరు నేతల మధ్య సంబంధం మునపటిలా లేదు.

డోనల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత చాలా దేశాలపై టారిఫ్‌లను విధిస్తున్నట్లు ప్రకటించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఇతర దేశాల నుంచి అమెరికా మార్కెట్‌కు వచ్చే వస్తువుల ధరలు చౌకగా ఉన్నాయని ట్రంప్ అంటున్నారు. కానీ, ఇతర దేశాలు మాత్రం తమ అమెరికా ఉత్పత్తులపై పెద్ద మొత్తంలో డ్యూటీలను విధిస్తున్నట్లు ఆరోపించారు.

టారిఫ్‌లను ప్రకటించిన తర్వాత, ట్రేడ్ అగ్రిమెంట్ కోసం ఈ దేశాలకు 90 రోజుల గడువును ఇచ్చారు. కానీ, జులై 30న భారత్‌పై 25 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.

అంతేకాక రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడంపై కూడా పెనాల్టీ విధిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. భారత్‌పై టారిఫ్‌లు విధిస్తున్నట్లు ప్రకటించిన వెంటనే, పాకిస్తాన్‌తో అమెరికా ఒక ఒప్పందం కుదుర్చుకుంది.

పాకిస్తాన్‌లో 'భారీ చమురు నిల్వలను అభివృద్ధి చేయడానికి' ఆ దేశంతో అమెరికా చర్చలు జరిపింది. రెండు దేశాలు వాణిజ్య ఒప్పందంపై సంతకాలు కూడా చేసుకున్నాయి.

పాకిస్తాన్‌తో అమెరికా ఒక ఒప్పందం పూర్తి చేసిందని ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో రాశారు. ఇందులో భాగంగా రెండు దేశాలు కలిసి పాకిస్తాన్‌లోని 'భారీ చమురు నిల్వ కేంద్రాలు' డెవలప్ చేస్తాయని తెలిపారు.

ఈ ఒప్పందం గురించి పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్‌ షరీఫ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేశారు.

ఈ సందర్భంగా భారత్-అమెరికా సంబంధాలతో పాటు భారత్ వాణిజ్య సంబంధాలపై కూడా పలు ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

రష్యాతో భారత్ ఇంధన సంబంధాలు ఎంత ముఖ్యమైనవి? భారత్‌పై వాణిజ్య సుంకాలు ఎంత తీవ్రమైన ప్రభావాన్ని చూపనున్నాయి?

భారత్ ప్రస్తుతం ఏ మార్గాన్ని అనుసరించనుంది? ప్రధాని మోదీ ఇమేజ్‌పై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుంది? చమురు నిల్వల విషయంలో పాకిస్తాన్, అమెరికా మధ్యలో జరిగిన ఒప్పందం వల్ల భారత్‌కు ఏంటి? భారత్, అమెరికా మధ్య సంబంధాలలో ఈ కోణాన్ని ఎలా చూడాలి?

ఈ విషయాలపై బీబీసీ హిందీ వీక్లీ ప్రొగ్రామ్, 'ది లెన్స్'లో కలెక్టివ్ న్యూస్‌రూమ్ డైరెక్టర్ ఆఫ్ జర్నలిజం ముకేశ్ శర్మ మాట్లాడారు.

ఆయనతో పాటు ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనమిక్ రిలేషన్స్ విజిటింగ్ ప్రొఫెసర్ షాన్ రే, హిందూ బిజినెస్ లైన్ రెసిడెంట్ ఎడిటర్ పుర్ణిమా జోషి, జర్నలిస్ట్ జుబేర్ అహ్మద్, బీబీసీ ఉర్దూ సీనియర్ న్యూస్ ఎడిటర్ ఆసిఫ్ ఫరూఖి, దిల్లీకి చెందిన ఇండిపెండెంట్ ఎనర్జీ పాలసీ ఇనిస్టిట్యూట్ చైర్మన్ నరేంద్ర తనేజా ఈ చర్చలో పాల్గొన్నారు.

ట్రంప్

ఫొటో సోర్స్, Francis Chung/Politico/Bloomberg via Getty

భారత్‌పై 25 శాతం టారిఫ్‌ల ప్రభావమెంత?

భారత్‌పై అమెరికా విధించిన టారిఫ్‌లను, వాటి ప్రభావాలను రెండు భిన్నమైన కోణాలలో చూడాలని ప్రొఫెసర్ షాన్ రే అన్నారు. ఒకటి స్వల్పకాలిక, రెండు దీర్ఘకాలిక ప్రభావం.

'' స్వల్పకాలంలో కచ్చితంగా ఎగుమతులు తగ్గుతాయి. ఎగుమతుల ఆదాయం కూడా తగ్గుతుంది. డ్యూటీలతో మన ధరలు పెరుగుతాయి. దీంతో పాటు కొంత అనిశ్చితి ఉంటుంది'' అని అన్నారు.

అయితే, దీర్ఘకాలిక ప్రభావం చాలా ముఖ్యమైందని ప్రొఫెసర్ షాన్ రే అన్నారు. ఎందుకంటే, ఒకవేళ ఇవి సంవత్సరం కంటే ఎక్కువ కాలం కొనసాగితే, సరఫరా గొలుసుల్లో మార్పులు రావొచ్చని అన్నారు.

అమెరికా సుంకాలు స్వల్పకాలంలో వస్త్రాలు, మందులు, ఆటో విడిభాగాలు, ఇంజనీరింగ్ గూడ్స్ వంటి ఉత్పత్తులపై అతిపెద్ద ప్రభావాన్ని చూపనున్నాయని ప్రొఫెసర్ రే అభిప్రాయపడ్డారు.

మోదీ, ట్రంప్

ఫొటో సోర్స్, Andrew Harnik/Getty

వాణిజ్య ఒప్పందంపై మోదీ-ట్రంప్ సంబంధాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి?

భారత్-అమెరికా సంబంధాల గురించి మాట్లాడుకున్నప్పుడు, ఇటీవల ఇరు దేశాల నేతల మధ్య వ్యక్తిగత సంబంధాల కోణంలో కనిపిస్తుంది.

కానీ, ఇటీవల కాలంలో భారత్, అమెరికాల మధ్య సత్సంబంధాలు లేనట్లు కనిపించే చాలా సంఘటనలు జరిగాయి.

భారత్ ప్రభుత్వానికి ఇది ఎదురుదెబ్బనా? దీన్ని సాధారణ కోణంలోనే చూడాలా?

ఇటీవల కాలంలో ఏవైతే జరిగాయో అవి ప్రభుత్వానికి తీవ్ర అవమానాలు తెచ్చిపెట్టాయని 'హిందూ బిజినెస్ లైన్' రెసిడెంట్ ఎడిటర్ పుర్ణిమా జోషి చెప్పారు.

'' పాకిస్తాన్‌తో మనం యుద్ధం చేస్తున్నప్పుడు కాల్పుల విరమణకు ఆదేశించినట్లు డోనల్డ్ ట్రంప్ చెప్పుకొన్న తీరు, ఆ తర్వాత పదేపదే దాన్ని ఆయన చెప్పుకోవడంపై పార్లమెంట్‌లో ప్రధాని వివరణ ఇవ్వాల్సి వచ్చింది'' అని అన్నారు.

''మన ద్వైపాక్షిక విషయాల్లో అమెరికా జోక్యాన్ని ఎలా అనుమతించారని విపక్షం ప్రశ్నించింది. ముఖ్యంగా రక్షణ సంబంధాల విషయాల్లో కఠిన వైఖరి అనుసరించే బీజేపీ వెనుకడగు వేసింది అన్న విమర్శలు ఎదుర్కొన్నారు'' అని తెలిపారు.

'' వాణిజ్య ఒప్పందం విషయంలో మోదీ, ట్రంప్‌లు స్వతంత్రంగా తమ పనిని, బాధ్యతలను నిర్వర్తించే నేతలు కారు. ప్రధాని పనిచేస్తున్నప్పుడు, ముఖ్యంగా వాణిజ్య ఒప్పందం విషయంలో విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, పరిశ్రమ శాఖలు ఎక్కువగా జోక్యం చేసుకుంటాయి. ఇది చాలా క్లిష్టమైన విషయం. ట్రంప్‌తో మోదీకి సత్సంబంధాలు ఉన్నప్పటికీ, ఏం చేయలేరు'' అని పుర్ణిమా జోషి చెప్పారు.

''ఎందుకంటే.. భారత్ నుంచి అమెరికా కావాలని కోరుకుంటున్న వాటిని భారత్ చేయదు. వ్యవసాయం, పాల ఉత్పత్తుల రంగాలకు తలుపులు తెరవాలని ట్రంప్ కోరుకుంటున్నారు. కానీ, వీటిని భారత్ చేయలేదు. ఒకవేళ ప్రభుత్వం చేద్దామనుకున్నా, వాటికి సమ్మతి ఇవ్వలేకపోతుంది'' అని అన్నారు.

''భారత్‌పై టారిఫ్‌లు, రష్యా నుంచి ఆయిల్, రక్షణ పరికరాల కొనుగోళ్లపై పెనాల్టీలు విధించిన తీరు మన సార్వభౌమత్వంపై దాడి చేసినట్లే'' అని పుర్ణిమా జోషి చెప్పారు.

ఎక్కడి నుంచి ఏం కొనాలనేది వేరే దేశం మనకు ఎలా చెబుతుందని ప్రశ్నించారు.

షరీఫ్

ఫొటో సోర్స్, Jeenah Moon/Bloomberg via Getty

అమెరికాతో డీల్ విషయంలో పాకిస్తాన్‌లో ఏం అంటున్నారు?

చమురు నిల్వల విషయంలో అమెరికా, పాకిస్తాన్ మధ్యలో ఒప్పందం కుదిరింది. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై కూడా చర్చ జరిగింది.

భారత్‌లో వాణిజ్యం ఒప్పందం ఇంకా కుదరకపోవడంతో, ఈ సంబంధాల విషయంలో తీవ్ర వ్యాఖ్యలు వెల్లువెత్తుతోన్న నేపథ్యంలో పాకిస్తాన్‌లో దీన్నెలా చూస్తున్నారు?

చమురు నిల్వల విషయంలో జరిగిన ఒప్పందాలను పాకిస్తాన్‌లో స్వాగతిస్తున్నట్లు బీబీసీ ఉర్దూ సీనియర్ న్యూస్ ఎడిటర్ ఆసిఫ్ ఫరూఖి చెప్పారు.

దేశ ఆర్థిక వ్యవస్థకు దీన్ని చాలా ముఖ్యమైన ఒప్పందంగా పాకిస్తాన్ ప్రభుత్వ చూస్తోంది. అంతేకాక, అమెరికాతో, ఇతర దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల విషయంలో అతిపెద్ద విజయంగా కూడా పరిగణిస్తోంది.

'' గత కొన్నేళ్లుగా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దారుణమైన దశను ఎదుర్కొంది. ప్రస్తుతం పట్టాలెక్కే దిశకు చేరుకున్నట్లు అక్కడి ప్రభుత్వం చెబుతోంది. ఈ సమయంలో పాకిస్తాన్ ఎగుమతులు (90 శాతం వస్త్రాలు) ఊపందుకుంటే, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు చాలా సాయం చేసినట్లవుతుంది'' అని ఆసిఫ్ ఫరూఖి చెప్పారు.

''అంతేకాక, చమురు నిల్వల విషయానికొస్తే, గత 20 ఏళ్లుగా లేదా అంతకంటే ఎక్కువగానే తమ చమురు నిల్వలు, గ్యాస్ నిల్వల్లో పనిచేయించుకునేందుకు ప్రైవేట్ కంపెనీలను, దేశాలను తమ దేశంలోకి ఆహ్వానించేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించింది. కానీ, భదత్ర, సాంకేతిక, ఇతర కారణాలతో కంపెనీలు ఇక్కడికి రాలేదు'' అని తెలిపారు.

''ఇప్పుడు ఈ విషయాన్ని ట్రంప్ బహిరంగంగా ప్రకటించడంతో, సాంకేతికతతో కూడిన ఒక పెద్ద అమెరికా కంపెనీ ఇక్కడికి వస్తే, తమ వద్దనున్న చమురు, గ్యాస్ నిల్వలను వెలికితీసేందుకు సాయపడుతుందని పాకిస్తాన్ భావిస్తుంది'' అని ఆసిఫ్ చెప్పారు.

20 ఏళ్లుగా పాకిస్తాన్ ఎదుర్కొంటున్న ఎనర్జీ సంక్షోభానికి పరిష్కారం దొరుకుతుందని అన్నారు.

భారతదేశంపై అధిక సుంకాలు విధించినందున పాకిస్తాన్ ప్రభుత్వం దీన్ని ఒక రాజకీయ, దౌత్య విజయంగా చెబుతోందని ఫరూఖి చెప్పారు.

చమురు నిల్వలు (ప్రతీకాత్మక చిత్రం)

పాకిస్తాన్ వద్ద పెద్ద మొత్తంలో చమురు నిల్వలు ఉన్నాయా?

అమెరికా-పాకిస్తాన్ చమురు నిల్వల ఒప్పందంపై ఇండిపెండెంట్ ఎనర్జీ పాలసీ ఇనిస్టిట్యూట్ చైర్మన్ నరేంద్ర తనేజా మాట్లాడారు. అగ్రిమెంట్‌కు చెందిన వివరాలన్ని బయటికి రానంతవరకు దీన్ని ఒక డీల్‌గా పరిగణించకూడదని అభిప్రాయపడ్డారు.

''అమెరికాలో ఎలాంటి ప్రభుత్వ చమురు కంపెనీలు లేవు. అన్ని ప్రైవేట్‌వే. అయితే ఏ కంపెనీ, ఎప్పుడు డీల్ కుదుర్చుకుంది? నాకు తెలిసినంత వరకు, ఏ కంపెనీ కూడా ఎలాంటి డీల్ కుదుర్చుకోలేదు'' అని తెలిపారు.

'' పాకిస్తాన్‌కు వెళ్లి వర్క్ చేసేందుకు అమెరికా ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది. కానీ, కంపెనీలకు అక్కడ సెక్యూరిటీ ఉంటేనే వెళ్తాయి. ఇక మరో విషయం చమురు నిల్వలు ఎక్కడున్నాయి? భారీ చమురు క్షేత్రాలు ఉన్నాయని ట్రంప్ చెబుతున్నారు. కానీ, అవెక్కడ, ఎంత పెద్దవి?'' అని ప్రశ్నించారు.

ఈ విషయాలన్ని స్పష్టమైన తర్వాతనే, కంపెనీలు అక్కడికి వెళ్తాయని నరేంద్ర తనేజా చెప్పారు.

''మా వద్ద భారీ చమురు, గ్యాస్ క్షేత్రాలు ఉన్నాయని పాకిస్తాన్ కొంతకాలంగా చెబుతోంది. అన్ని ప్రభుత్వాలు చెబుతున్నాయి. మియన్మార్, బంగ్లాదేశ్ ఎన్నో ఏళ్లుగా వారివద్ద పెద్ద మొత్తంలో రిజర్వులు ఉన్నాయని అంటున్నాయి. కానీ, అంతర్జాతీయ కంపెనీలు వీటిని ధ్రువీకరించేంత వరకు ఈ క్షేత్రాలు పరిగణనలోకి రావు. శాస్త్రీయమైన కోణంలో ఈ చమురు, గ్యాస్ క్షేత్రాలను కంపెనీలు ధ్రువీకరిస్తాయి. ప్రపంచమంతా ఈ డేటా చూస్తుంది. అయితే ఇప్పటి వరకు ఇలాంటిది జరగలేదు'' అని నరేంద్ర తనేజా అన్నారు.

మోదీ, పుతిన్

ఫొటో సోర్స్, Contributor/Getty

రష్యా నుంచి భారత్ చమురు కొనకపోతే ఏమవుతుంది?

'' మీరు ఆయిల్ ఉత్పత్తిదారు అయినా లేదా వినియోగదారు అయినా ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఒకే విధంగా ఉంటాయి. ప్రపంచ సరఫరా వ్యవస్థలోకి రష్యా నుంచి రోజూ 50 లక్షల బ్యారెళ్ల చమురు వస్తోంది. సరఫరా వ్యవస్థలోకి వచ్చిన తర్వాత, చమురుకు నేషనాలిటీ ఉండదు. ట్రంప్ ప్రస్తుతం 50 లక్షల బ్యారెళ్ల చమురునే టార్గెట్ చేశారు. దాన్ని భారత్ లేదా చైనా కొనుగోలు చేయొద్దని అంటున్నారు. కానీ, నాటో సభ్య దేశం తుర్కియే కూడా ఈ చమురునే కొంటోంది. యూరోపియన్ యూనియన్‌కు చెందిన సభ్యదేశాలన్నీ రష్యా నుంచి చమురును కొంటున్నాయి'' అని నరేంద్ర తనేజా చెప్పారు.

''భారత్, చైనా, మరే దేశం కానీ ఈ చమురును కొనకపోతే, ఈ 50 లక్షల బ్యారెళ్ల చమురు ప్రపంచ సరఫరా వ్యవస్థ నుంచి కనుమరుగు అవుతుంది. దీంతో, తక్షణమే చమురు ధరలు పెరుగుతాయి'' అని తెలిపారు.

చమురు ధరలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక వ్యవస్థలన్నింటిపై ప్రభావం చూపుతాయని నరేంద్ర తనేజా వివరించారు.

''ప్రపంచంలో అతిపెద్ద చమురు కొనుగోలుదారు అమెరికా. చమురు ధరలు పెరిగితే, అమెరికా ఆర్థిక వ్యవస్థకు నష్టం. భారత ఆర్థిక వ్యవస్థకు దెబ్బనే. చెప్పాలంటే మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చేటు'' అని తెలిపారు.

అంతకుముందు రష్యా నుంచి భారత్ కేవలం 2 శాతం చమురునే కొనేది. కానీ, రష్యా తగ్గింపు ఇస్తుండటంతో ఆ దేశం నుంచి ఎక్కువగా చమురు కొంటున్నట్లు నరేంద్ర తనేజా చెప్పారు.

ఒకవేళ అమెరికా డిస్కౌంట్లు ఇస్తే, భారతీయ కంపెనీలు అక్కడి నుంచి కూడా చమురును కొంటాయని తెలిపారు.

మోదీ, పుతిన్

ఫొటో సోర్స్, ALEXANDER ZEMLIANICHENKO/POOL/AFP via Getty

భారత్-అమెరికా సంబంధాలపై ట్రంప్ ప్రభావమెంత?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దౌత్యం ఆయన వ్యక్తిత్వంతో ముడిపడి ఉంది. ప్రస్తుతం భారత్-అమెరికా సంబంధాల్లో నెలకొన్న విశ్లేషకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇనిస్టిట్యూషనల్ డిప్లొమసీ ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని కూడా చెబుతున్నారు. దీన్ని అంతర్జాతీయ స్థాయిలో ఎలా చూస్తున్నారు?

దీనిపై లండన్‌లోని జర్నలిస్టు జుబేర్ అహ్మద్ స్పందించారు. సంస్థాగత స్థాయిలో భారత్, అమెరికా మధ్య లోతైన సంబంధాలు ఉన్నాయి. అయితే, రాజకీయనేతలు దీన్ని తమ స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని అన్నారు.

ట్రంప్ తొలి పదవీ కాలంలో 'హౌడీ మోదీ' వంటి కార్యక్రమాలు జరిగాయి. ఎన్నికల సమయంలో, ప్రధాని మోదీ, ట్రంప్ ఇద్దరూ దీన్ని వాడుకున్నారు.

అయితే, మీడియా ఒక తప్పు చేసిందని, రెండు దేశాల నేతల మధ్యనున్న బలమైన సంబంధాల నుంచి రెండు దేశాల మధ్య సంబంధాలను అంచనా వేయడం మొదలుపెట్టిందని జుబేర్ అహ్మద్ అన్నారు.

'' బైడెన్ పదవీ కాలంలో ప్రధాని మోదీకి మరింత ప్రయోజనం చేకూరింది. 2023లో మోదీకి స్టేట్ విజిట్ కల్పించారు. ట్రంప్ అలాంటి అవకాశం ఇవ్వలేదు. మోదీకి రెడ్ కార్పెట్ వేసింది బైడెన్, ట్రంప్ కాదు. ఇప్పుడు మళ్లీ ట్రంప్ అధికారంలోకి వచ్చారు. ఆయనకు మోదీతో అంత అవసరం లేదు'' అని తెలిపారు.

''కొన్ని నెలల పాటు భారత్ సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ట్రంప్‌కు ఇంకా మూడున్నర ఏళ్లు ఉంది. ఇప్పుడు వేచిచూడటమే మంచిదని ప్రధాని మోదీ ఆలోచిస్తుండొచ్చని నేను భావిస్తున్నా. దీనికి సహనం అవసరం. ఈ దశ ముగిసిన తర్వాత, రెండు దేశాల మధ్య సంబంధాలు సాధారణ స్థితికి వచ్చి, మరింత బలపడతాయని చాలామంది భావిస్తున్నారు'' అని జుబేర్ అహ్మద్ తెలిపారు.

గత కొన్నేళ్లుగా భారత్ తటస్థ వైఖరిని అనుసరిస్తున్నట్లు చెబుతోంది. ప్రస్తుత ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌కు ఇది నచ్చడం లేదు. ముఖ్యంగా రష్యా, చైనా విషయంలో. అందుకే, వాణిజ్యం సాకుతో భారత్‌ను టార్గెట్ చేస్తున్నారా?

''బైడెన్ ఉన్నప్పుడు కూడా రష్యా వైఖరిని ఖండించాలని భారత్‌పై ఒత్తిడి ఉండేది. రష్యా వైఖరిని భారత్‌ ఖండించకపోవడంపై పశ్చిమానికి చెందిన చాలా దేశాలు పెదవి విరుస్తున్నాయి. కానీ, భారత్‌తో రష్యా సంబంధాలు మరింత బలంగా మారుతున్నాయి. రష్యా నుంచి చౌక ధరలకు భారత్ చమురు కొనడం కూడా వాళ్లకి నచ్చడం లేదు'' అని జుబేర్ అహ్మద్ తెలిపారు.

పశ్చిమ దేశాలు భారత్‌పై ఆగ్రహంతో ఉన్నాయి.

''అయితే, రష్యాను, పుతిన్‌ను ట్రంప్ పొగిడారు. దీంతో, ఏం జరుగుతుందోనని పశ్చిమ దేశాలు ఆందోళన చెందాయి. కానీ, ప్రస్తుతం పుతిన్ విషయంలో ట్రంప్ కూడా నిరాశ చెందారు. ఎందుకంటే, ట్రంప్ కోరుకున్నట్లు యుక్రెయిన్‌తో కాల్పుల విరమణ జరగడం లేదు'' అని అన్నారు.

కాల్పుల విరమణకు పుతిన్‌పై భారత్ ఒత్తిడి తేవాలని ట్రంప్ కోరుకున్నట్లు జుబేర్ తెలిపారు.

''రష్యా, యుక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ జరిగితే, మళ్లీ పుతిన్‌ను పొగడడం ట్రంప్ ప్రారంభిస్తారు. ఒకవేళ భారత్‌తో రష్యా సత్సంబంధాలను కొనసాగిస్తే దానివల్ల ఆయనకు ఎలాంటి ఇబ్బంది లేదు'' అని చెప్పారు.

అయితే, ఇతర యూరప్ దేశాలు మొదట్నుంచి స్థిరంగా ఉన్నాయి. భారత్ ఈ వైఖరి సరైంది కాదని అంటున్నట్లు జుబేర్ అహ్మద్ తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)