అమెరికన్ టెక్ కంపెనీలు భారతీయ నిపుణులను నియమించుకోవడంపై ట్రంప్ ఏమన్నారు? కాంగ్రెస్ ఎందుకు మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది?

డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తాజాగా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మోదీ ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ప్రశ్నలు సంధిస్తోంది.

‘అమెరికాలో అతిపెద్ద టెక్ కంపెనీలు భారత నిపుణులను నియమించుకుంటున్నాయి. కానీ, నా పదవీ కాలంలో ఇదంతా ముగుస్తుంది’' అని బుధవారం జరిగిన ఓ సదస్సులో ట్రంప్ అన్నారు.

ఈ వీడియోను సామాజిక మాధ్యమం ఎక్స్‌లో షేర్ చేసిన కాంగ్రెస్.. ‘మోదీ స్నేహితుడు ట్రంప్ నిత్యం భారతీయుల ఆత్మాభిమానంతో ఆడుకుంటున్నారు. భారతీయులను అవమానిస్తున్నారు. ఇది దేశ గౌరవానికి చెందిన విషయం. నరేంద్ర మోదీ స్పందించాలి’ అని రాసింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

వాషింగ్టన్ డీసీలోని సిలికాన్ వ్యాలీలో జరిగిన ఏఐ సదస్సులో హాజరైన అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్.. ఈ కంపెనీలు అమెరికా విధానాలను ఉపయోగించుకుంటూ, ఇతర దేశాలకు ఆ ప్రయోజనాలను అందిస్తున్నాయని ఆరోపించారు.

అమెరికా తరఫున నిలబడాలని ఆయన తమ దేశ టెక్ కంపెనీలను అభ్యర్థించారు.

ట్రంప్ ఏమన్నారు?

వాషింగ్టన్‌లో కృత్రిమ మేధపై (ఏఐ) జరిగిన సదస్సులో ప్రసంగించారు ట్రంప్.

తన సుంకాల విధానం విజయం సాధించడాన్ని ఆయన తన ప్రసంగంలో ప్రశంసించారు.

''ఎంతో కాలంగా, అమెరికా టెక్ పరిశ్రమ తీవ్రమైన ప్రపంచీకరణ మార్గాన్ని అనుసరిస్తోంది. లక్షల మంది అమెరికన్లకు ఇది ద్రోహం చేసింది, పట్టించుకోలేదు.'' అని అన్నారు.

''మన అతిపెద్ద టెక్ కంపెనీలు చాలా వరకు అమెరికా ఇచ్చిన స్వేచ్ఛను (ఫ్రీడమ్‌ను) వాడుకున్నాయి. కానీ, చైనాలో ఫ్యాక్టరీలను ఏర్పాటు చేశాయి. భారత్‌లో ఉద్యోగులను నియమించుకున్నాయి. ఐర్లాండ్‌లో లాభాలను దాచిపెట్టాయి. ఈ సమయంలో వారు స్వదేశానికి చెందిన ఉద్యోగులను పట్టించుకోలేదు. వారి గొంతుకలను నొక్కిపట్టాయి. ప్రెసిడెంట్ ట్రంప్ నాయకత్వంలో ఇక ఆ యుగం ముగిసినట్లే '' అని ట్రంప్ అన్నారు.

దేశం వెలుపల పెట్టుబడులు పెట్టే అమెరికన్ టెక్ కంపెనీలను ట్రంప్ విమర్శించడం ఇదే తొలిసారి కాదు.

భారత్‌లో లేదా మరే దేశంలోనైనా తయారయ్యే ఐఫోన్లను తమ దగ్గర అమ్మితే యాపిల్ 25 శాతం టారిఫ్‌ను ఎదుర్కోవాల్సి వస్తుందని మే నెలలో ట్రంప్ హెచ్చరించారు.

''అమెరికాలో విక్రయించే ఐఫోన్లను అమెరికాలోనే తయారు చేయాలని, భారత్‌లోనో, మరో దేశంలోనో తయారు చేయరాదని అనుకుంటున్నట్లు ఎంతోకాలం క్రితం నేను యాపిల్ సీఈఓ టిమ్ కుక్‌కు చెప్పాను. అలా జరగకపోతే, అమెరికాకు యాపిల్ కనీసం 25 శాతం టారిఫ్ చెల్లించాలి'' అని ట్రంప్ తన సోషల్ మీడియా పోస్టులో రాశారు.

మోదీతో ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ప్రధాని మోదీని ప్రశ్నించిన కాంగ్రెస్

ట్రంప్ తాజాగా చేసిన ఈ ప్రకటనపై కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది.

'' దీనికి ముందు కూడా యాపిల్ సీఈఓను ట్రంప్ బెదిరించారు. భారత్‌లో ఐఫోన్లు తయారు చేయొద్దని చెప్పారు. అంతకుముందు, భారతీయ పౌరులకు సంకెళ్లు వేసి భారత్‌కు తరలించారు. భారత్‌పై ట్రంప్ ఒకదాని తర్వాత మరొకటి చర్యలు తీసుకుంటున్నారు. భారతీయులను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ, నరేంద్ర మోదీ మౌనంగా ఉంటున్నారు. ఆయన స్పందించాలి'' అని కాంగ్రెస్ రాసింది.

భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై క్రెడిట్ తీసుకునేలా ట్రంప్ చేసిన వ్యాఖ్యల వాస్తవంపై ఈ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు కాంగ్రెస్ తరచూ ప్రయత్నిస్తోంది. మరోవైపు భారత ప్రభుత్వం దీన్ని ఖండిస్తోంది.

ఈ ఏడాది జనవరిలో డోనల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడయ్యారు. అధికారంలోకి రాగానే ఇతర దేశాలతో పాటు భారత్‌పై కూడా సుంకాల విధింపుపై మాట్లాడారు.

ప్రస్తుతం భారత్, అమెరికా మధ్యలో వాణిజ్య ఒప్పందంపై (ట్రేడ్ అగ్రిమెంట్) చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఎలాంటి ఒప్పందం కుదరలేదు.

యాపిల్‌పై ట్రంప్ కామెంట్లకు కొన్ని వారాల ముందు, అమెరికాలో అమ్ముడుపోయే చాలా వరకు ఐఫోన్లు భారత్‌లో తయారు అయినవేనని ఆ టెక్ దిగ్గజం చెప్పింది.

ఆ తర్వాత భారత్‌లో 1.49 బిలియన్ డాలర్ల (రూ.12,886 కోట్లు) విలువైన యూనిట్‌ను పెట్టేందుకు యాపిల్ కాంట్రాక్ట్ మేన్యుఫాక్చరింగ్ కంపెనీ ఫాక్స్‌కాన్ ఆసక్తి వ్యక్తం చేసింది.

తన ఇండియన్ యూనిట్ యుజాన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఈ పెట్టుబడులు పెట్టనున్నట్లు లండన్‌ స్టాక్ ఎక్స్చేంజ్‌కు ఫాక్స్‌కాన్ తెలిపింది.

కంపెనీ తన తయారీ యూనిట్‌ను చెన్నైలో పెట్టనుంది. గత ఏడాది అక్టోబర్‌లో కాంచీపురంలో యుజాన్ రూ.13,180 కోట్ల తయారీ యూనిట్‌ ఏర్పాటుకు తమిళనాడు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)