ఆర్ఐసీ: రష్యా, ఇండియా, చైనా కలిసి పనిచేస్తాయని ట్రంప్ భయపడుతున్నారా?

రష్యా, భారత్, చైనా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పుతిన్, మోదీ, జిన్‌పింగ్(పాత ఫొటో)

బ్రిక్స్ దేశాలపై సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరించారు. ఈ కూటమి కూడా తొందర్లోనే అంతమవుతుందని ట్రంప్ అన్నారు.

బ్రిక్స్ దేశాలు అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించేందుకు ప్రయత్నించాయని, అందుకే తాను ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ట్రంప్ శుక్రవారం వైట్‌హౌస్‌లో తెలిపారు.

అయితే, ఈ సందర్భంగా ట్రంప్ ఏ దేశం పేరును ప్రత్యేకంగా ప్రస్తావించలేదు.

బ్రిక్స్ కూటమిలో కీలక దేశాలైన భారత్, రష్యా, చైనా తమ మధ్య త్రైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ట్రంప్ ఈ హెచ్చరికలు జారీ చేశారు.

అంతకుముందు కూడా బ్రిక్స్ దేశాలపై సుంకాలు విధిస్తామంటూ ట్రంప్ హెచ్చరికలు చేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

భారత్, చైనా మధ్య సంబంధాలను తిరిగి గాడిలో పెట్టేందుకు రష్యా ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం చైనా దీనికి సానుకూలంగా స్పందిస్తోంది.

చైనా, రష్యా, భారత్ మధ్య త్రైపాక్షిక సంబంధాలు కేవలం మూడు దేశాలకు ప్రయోజనం చేకూర్చడమే కాకుండా.. ఈ ప్రాంతంలో, ప్రపంచంలో శాంతిని, భద్రతను, స్థిరత్వాన్ని, అభివృద్ధిని అందించేందుకు సాయం చేస్తుందని చైనా విదేశీ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ చెప్పారు.

త్రైపాక్షిక సహకారాన్ని పెంపొందించుకోవడానికి రష్యా, భారత్‌లతో చర్చలు జరిపేందుకు చైనా సిద్ధంగా ఉందని లిన్ అన్నారు.

రష్యా-భారత్-చైనా (ఆర్ఐసీ) ఫార్మాట్‌ను తిరిగి ప్రారంభించేందుకు భారత్‌, చైనాతో రష్యా చర్చలు జరుపుతోందని అంతకుముందు ఆ దేశ డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ ఆండ్రీ రుడెంకో చెప్పారు.

ట్రంప్

ఫొటో సోర్స్, Al Drago/Bloomberg via Getty

డాలర్, బ్రిక్స్ గురించి ట్రంప్ ఏం అన్నారు?

వైట్‌హౌస్‌లో శుక్రవారం ఓ బిల్లు గురించి మాట్లాడిన ట్రంప్, ఆ బిల్లు అమెరికా డాలర్‌ను బలపడేలా చేస్తుందని చెప్పారు.

బ్రిక్స్‌ విషయం ప్రస్తావించిన ట్రంప్.. '' బ్రిక్స్ అని పిలిచే ఒక చిన్న గ్రూప్ త్వరలోనే అంతం కాబోతుంది. డాలర్‌ను, డాలర్ ఆధిపత్యాన్ని, ప్రమాణాలను ఇది చేజిక్కించుకునేందుకు చూసింది'' అన్నారు.

''బ్రిక్స్ గ్రూప్‌లోని అన్ని దేశాలపై మేం 10 శాతం సుంకాలను విధించనున్నామని చెప్పాను. ఆ తర్వాత రోజే వారు సమావేశం నిర్వహించారు. కానీ, ఎవరూ హాజరుకాలేదు'' అని ట్రంప్ వెటకారంగా అన్నారు.

ఆ తర్వాత ట్రంప్ మరోసారి డాలర్‌ను బలోపేతం చేయాలని, ప్రపంచ కరెన్సీగా దాన్ని ఉంచాలని నొక్కి చెప్పారు.

''మేం డాలర్‌ను పడిపోనీయం. ప్రపంచ కరెన్సీగా డాలర్‌ తన హోదాను కోల్పోతే, అది ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిన మాదిరే అవుతుంది'' అని తెలిపారు.

''బ్రిక్స్ దేశాల కూటమి గురించి విన్నప్పుడు, నేను వారిపై కఠిన వైఖరిని అనుసరించాను. ఒకవేళ ఈ దేశాలు ఏకమైతే, త్వరలోనే ఈ గ్రూప్ అంతమవుతుంది'' అని అన్నారు.

బ్రిక్స్ సమావేశం తర్వాత కూడా ట్రంప్ బెదిరింపులు

ఈ ఏడాది జులై 6, 7 తేదీల్లో బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో బ్రిక్స్ 17వ సదస్సు జరిగింది. ఈ సదస్సు తర్వాత కూడా అదనంగా 10 శాతం సుంకాలను విధిస్తానని ట్రంప్ హెచ్చరించారు.

''బ్రిక్స్‌కు చెందిన ఏ దేశమైనా అమెరికా వ్యతిరేక విధానాలతో ఉంటే అదనంగా 10 శాతం సుంకాలను ఎదుర్కోవాలి. ఈ సుంకాల విధింపులో ఎలాంటి మినహాయింపు ఇవ్వం'' అని జులై 7న ఒక సోషల్ మీడియా పోస్టులో ట్రంప్ రాశారు.

బ్రిక్స్ సదస్సు

ఫొటో సోర్స్, Getty Images

బ్రిక్స్ అజెండా ఏంటి?

'ప్రపంచ పాలనను మెరుగుపర్చడం', 'అంతర్జాతీయ సుస్థిరత'పై బ్రిక్స్ రియో డిక్లరేషన్‌లో చర్చించారు. దీంతో పాటు ఏకపక్ష సుంకాలు, సుంకాలు లేకపోవడంపైనా చర్చ జరిగింది.

ఈ డిక్లరేషన్ మేనిఫెస్టోలో అమెరికా పేరును ప్రస్తావించలేదు.

వాణిజ్య విధానాలను వక్రీకరించి, ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) నిబంధనలను ఉల్లంఘించే ఏకపక్ష సుంకాలు, నాన్-టారిఫ్ చర్యల వినియోగంపై బ్రిక్స్ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయని రియో డిక్లరేషన్ పేర్కొంది.

ఏకపక్ష బలవంతపు చర్యలు విధించడం అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడం కిందకే వస్తుందని ఈ డిక్లరేషన్‌లో బ్రిక్స్ దేశాలు పేర్కొన్నాయి.

ఏకపక్ష ఆర్థిక ఆంక్షలు వంటివి ప్రపంచంపై ప్రతికూల ప్రభావాలను చూపిస్తాయని తెలిపాయి.

ఈ బ్రిక్స్ సదస్సులో డబ్ల్యూటీఓ నిబంధనలకు అనుగుణంగా వాణిజ్యాన్ని సమర్థిస్తూ, బహుళ పక్ష వాణిజ్య విధానం గురించి చర్చించినట్లు తెలిపింది.

జైశంకర్, జిన్‌పింగ్

ఫొటో సోర్స్, X/DR S JAISHANKAR

ఆర్ఐసీని బలోపేతం చేసే ప్రయత్నాలు, ట్రంప్ బెదిరింపులు

2020లో భారత్, చైనా దేశాలకు చెందిన సైనికుల మధ్య ఘర్షణ నెలకొనడంతో, ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. ఆ తర్వాత ఆర్ఐసీ కోసం ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు.

ఆర్ఐసీ ఫార్మాట్‌ను తిరిగి ప్రారంభించడాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోందని జులై 17న భారత మీడియాలో కథనాలు వచ్చాయి. మూడు దేశాలకు అనువైన విధానంలోనే ఏదైనా నిర్ణయం తీసుకుంటారని ఆ కథనాలు పేర్కొన్నాయి.

షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ)లో పాల్గొనేందుకు ఐదేళ్లలో తొలిసారి భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ చైనాకు వెళ్లిన సందర్భంగా.. ఆర్ఐసీ ఫార్మాట్‌పై చర్చలు జరిగాయి.

''ఏకపక్షం, రక్షణవాదం, అధికార రాజకీయం, బెదిరింపులు ప్రపంచానికి తీవ్ర సవాళ్లను విసురుతున్నాయి'' అని జులై 14న జైశంకర్‌తో భేటీ అయిన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ లీ చెప్పారు.

అందుకే, రెండు దేశాలు సామరస్యంగా జీవించేందుకు, ఒకదానికొకటి సాయపడుతూ విజయం సాధించే మార్గాలను అన్వేషించాలని అన్నారు.

భారత్-అమెరికా సంబంధాలపై చైనా అభిప్రాయమేంటి?

రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే అతిపెద్ద దేశాలు భారత్, చైనాలు.

ఈ రెండు దేశాలు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ విధించే అదనపు సుంకాల ముప్పు ముంగిట ఉన్నాయి. సుంకాలు విధిస్తామని 50 రోజుల్లో యుక్రెయిన్‌తో యుద్ధం ముగించేలా ఒప్పందానికి రావడానికి రష్యాపై ఒత్తిడి తీసుకు రానుంది అమెరికా.

ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్-అమెరికా మధ్య సంబంధాలు క్షీణించాయని చైనా నిపుణులు అంటున్నారు.

చైనీస్ న్యూస్ అవుట్‌లెట్ గ్వాంచాలో జులై 13న రాసిన కథనంలో.. అమెరికా, భారత్ మధ్య కొనసాగుతోన్న వాణిజ్య సంక్షోభాన్ని ఫుడాన్ యూనివర్సిటీకి చెందిన ఝి చావో ప్రస్తావించారు.

భారత్‌ను కట్టడి చేసేందుకు పాకిస్తాన్‌ను వాడుకోవడం, రెండు దేశాల మధ్య బలవంతంగా సయోధ్యను కుదర్చడం వంటి వ్యూహాన్ని అమెరికా అవలంభించిందని ఆయన అన్నారు.

చైనాకు చెందిన ఇంటర్నేషనల్ స్కాలర్ ప్రొఫెసర్ జిన్ కాన్‌రాంగ్ కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

భారత్-అమెరికా మధ్య సంబంధాలు క్షీణిస్తుండటంతో.. అమెరికా, పాకిస్తాన్ మధ్య సంబంధాలు ఇటీవల మరింత మెరుగుపడ్డాయని తెలిపారు.

జూన్‌లో కెనడాలో జరిగిన జీ-7 సదస్సుకు హాజరయ్యేందుకు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను కలవలేకపోయారని ప్రొఫెసర్ జిన్ అన్నారు.

ఆ తర్వాత పాకిస్తానీ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ జనరల్ ఆసిమ్ మునీర్‌కు ట్రంప్ వైట్‌హౌస్‌లో ఆతిథ్యం ఇచ్చిన తర్వాత భారత్ మరింత అసంతృప్తి వ్యక్తం చేసింది.

బ్రిక్స్ దేశాలు

ఫొటో సోర్స్, Getty Images

డాలర్‌కు ప్రత్యామ్నాయం కోసం బ్రిక్స్ దేశాలు చూస్తున్నాయా?

చైనా, రష్యాతో అమెరికా సంబంధాలు ఉద్రిక్తతంగా మారాయి. యుక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తర్వాత చైనా, రష్యాలు మరింత దగ్గరయ్యాయి.

అమెరికా ఆధిపత్యంలోని ప్రపంచాన్ని తిరస్కరించి, బహుళ ధ్రువ ప్రపంచాన్ని అంటే పలు దేశాల మధ్య అధికారాన్ని పంపిణీ చేసే వ్యవస్థను సృష్టించాలని ఈ రెండు దేశాలు చర్చిస్తున్నాయి.

అందుకే ప్రపంచంలో అమెరికా కరెన్సీ డాలర్ ఆధిపత్యాన్ని సవాలు చేసేందుకు రెండు దేశాలు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాయి.

అమెరికా డాలర్‌తో కాకుండా చైనా కరెన్సీ యువాన్‌తో ఆసియా, ఆఫ్రికా, దక్షిణా అమెరికా దేశాలతో వాణిజ్యం చేయాలనుకుంటున్నట్లు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ 2023లో చెప్పారు.

చైనా ఇప్పటికే రష్యాతో తన కరెన్సీ యువాన్‌తో ట్రేడ్ చేస్తోంది. రష్యా కూడా అదే చేస్తోంది. ఎందుకంటే, అమెరికా, పశ్చిమ దేశాలు రష్యాపై తీవ్ర ఆర్థిక ఆంక్షలు విధించాయి.

అమెరికా, యూరోపియన్ యూనియన్, బ్రిటన్, వీటి మిత్ర దేశాలు చాలా అత్యంత ముఖ్యమైన అంతర్జాతీయ చెల్లింపు వ్యవస్థ స్విఫ్ట్ నుంచి రష్యన్ బ్యాంకులను నిషేధించాయి.

''బ్రిక్స్ దేశాలు ప్రత్యామ్నాయ కరెన్సీ కోసం ప్రయత్నిస్తున్నాయి. ఒకవేళ ప్రత్యామ్నాయ కరెన్సీని సృష్టించలేకపోతే, కనీసం ఫైనాన్సియల్ నెట్‌వర్క్‌నైనా సృష్టించాలని అనుకుంటున్నాయి'' అని విదేశీ వ్యవహారాల నిపుణులు, 'ది ఇమేజ్ ఇండియా ఇనిస్టిట్యూట్' అధ్యక్షుడు రబీంద్ర సచ్‌దేవ్ చెప్పినట్లు 2024లో బీబీసీ రిపోర్టు చేసింది.

''స్విఫ్ట్ బ్యాంకింగ్ ఇంటర్నేషనల్ అమెరికా, యూరప్, పశ్చిమ దేశాల ఆధిపత్యంలో ఉంది. ఏదైనా దేశంపై ఆంక్షలు విధిస్తే, ఈ వ్యవస్థ నుంచి అది వైదొలుగుతుంది'' అని రబీంద్ర చెప్పారు.

'' రష్యాపై విధించిన ఆంక్షలను చూస్తే, భవిష్యత్‌లో తమ బ్యాంకింగ్‌ను కూడా బ్లాక్ చేస్తాయేమోనని బ్రిక్స్ దేశాలు భయపడుతున్నాయి. అందుకే, ఫైనాన్సియల్ నెట్‌వర్క్‌ను సృష్టించేందుకు ఈ దేశాలు ప్రయత్నిస్తున్నాయి'' అని సచ్‌దేవ్ తెలిపారు.

అయితే, డాలర్‌కు నిజంగా ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారా?

ఈ ప్రశ్నకు స్పందించిన రబీంద్ర సచ్‌దేవ్.. ''బ్రిక్స్ దేశాలు అలాంటి దానికోసం చూస్తే, అది అంత త్వరగా జరగదు. అయితే, కొన్ని ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. బ్రెజిల్‌తో చైనా యువాన్‌లో ట్రేడ్ చేస్తోంది. కరెన్సీ విషయంలో సౌదీ అరేబియాతో చైనా ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే, రష్యాతో కూడా అదే రకమైన ఒప్పందం చేసుకుంది'' అని తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)