నాజీల బారి నుంచి తప్పించుకునేందుకు యూదులకు సాయం చేసిన భారతీయుడు

ఫొటో సోర్స్, Courtesy: Vinay Gupta
- రచయిత, సుధా జీ తిలక్
- హోదా, దిల్లీ
''నీకో రహస్యం చెప్తాను. యూదు కుటుంబాలు నాజీల నుంచి తప్పించుకునేందుకు మీ తాతయ్య సాయం చేశారు.''
తన తల్లి చెప్పిన ఈ ఒక్క విషయం.. వినయ్ గుప్తాను తన తాత గతం గురించి తెలుసుకునేలా ప్రేరేపించింది.
ఈ ప్రయాణంలో ఆయన తెలుసుకున్న విషయాలు.. కల్పిత కథ కంటే ఉత్కంఠగా అనిపించాయి.
యూరప్‌లో, అత్యంత క్లిష్టపరిస్థితుల్లో ఉన్న ఎవరో ముక్కూమొఖం తెలియని వారిని కాపాడేందుకు తనకున్న అన్నింటినీ పణంగా పెట్టిన ఈ భారతీయ వ్యాపారవేత్త గురించి చాలా తక్కువ మందికి తెలుసు.
భారత్‌కు తిరిగొచ్చిన కుందన్‌లాల్ యూదులకు ఉపాధి కల్పించేందుకు వ్యాపారాలను ప్రారంభించారు. వారి కోసం ఇళ్లు కట్టించారు.

కుందన్‌లాల్ జీవితం ఒక వీరగాథలా సాగింది. లుధియానాకు చెందిన, 13 ఏళ్లకే పెళ్లైన ఒక పేద బాలుడు బతుకు బండి లాగేందుకు కలప, ఉప్పు నుంచి ఎద్దుల బండి చక్రాల వరకు ఎన్నో విక్రయిస్తూ వచ్చారు. వస్త్ర వ్యాపారం చేశారు, అగ్గిపెట్టెల తయారీ ఫ్యాక్టరీని నడిపారు.
లాహోర్‌లో ఆయన క్లాస్‌లో టాప్. 22 ఏళ్ల వయసులోనే కొలొనియల్ సివిల్ సర్వీస్‌లో చేరారు. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనేందుకు ఆయన ఆ ఉద్యోగానికి రాజీనామా పెట్టారు. ఫ్యాక్టరీలను నిర్మించారు.
భారతీయ స్వాతంత్య్రోద్యమ నేత, భారత్‌కు తొలి ప్రధాని అయిన జవహర్‌లాల్ నెహ్రూతో చేతులు కలిపారు. నటి దేవికా రాణితో కలిసి స్ట్రీమర్‌లో యూరప్ వెళ్లారు.
'ఏ రెస్క్యూ ఇన్ వియన్నా' అనే పుస్తకం ద్వారా.. విదేశీ గడ్డపై తన తాత అసాధారణమైన సహాయాన్ని గుప్తా వెలుగులోకి తీసుకొచ్చారు.
లేఖలు, నాజీల చేతిలో నుంచి బతికి బయటపడ్డ వారి ఇంటర్వ్యూలు, చారిత్రక రికార్డుల ద్వారా పలు విషయాలను సేకరించారు గుప్తా.
ఆస్ట్రియాను 1938లో హిట్లర్ స్వాధీనం చేసుకునేప్పుడు, కుందన్‌లాల్ పంజాబ్‌లోని లుధియానా నగరంలో ఒక మెషీన్ టూల్ తయారీ సంస్థను నడిపేవారు.
భారత్‌లోని తన తయారీ సంస్థలో యూదులకు ఉద్యోగాలు కల్పించారు.
దీంతో, వారికి 'లైఫ్ సేవింగ్' వీసాలు లభించాయి. భారత్‌లో వారికి పని కల్పించడం, జీవనోపాధిని అందించడం, ఆ కుటుంబాలకు ఇళ్లను నిర్మించడం వంటివి చేశారు కుందన్‌లాల్.

ఫొటో సోర్స్, Courtesy: Vinay Gupta
యూదు కుటుంబానికి చెందిన 30 ఏళ్ల న్యాయవాది ఫ్రిట్జ్ వైస్, అనారోగ్యం ఉన్నట్లు నటిస్తూ ఆస్పత్రిలో దాక్కున్నారు.
కుందన్‌లాల్ కూడా ఆ సమయంలో, అదే ఆస్పత్రిలో తన అనారోగ్యానికి చికిత్స తీసుకుంటున్నారు.
తన ఇంటి బయట ఉన్న వీధులను శుభ్రపర్చాలని ఫ్రిట్జ్ వైస్‌ను నాజీలు బలవంతం చేయడంతో.. ఆయన ఆ ఆస్పత్రిలో తలదాచుకున్నారు. కుందన్‌లాల్ ఆ న్యాయవాదికి జీవితాన్ని అందించారు.
అప్పటికి ఏర్పాటు చేయని, ఒక కల్పిత కంపెనీ 'కుందన్ ఏజెన్సీస్'లో ఉద్యోగాన్ని అందించారు. దీంతో భారత్‌కు వచ్చేందుకు ఆయనకు వీసా లభించింది.
చెక్క పని చేసే ఆల్ఫ్రెడ్ వాష్లర్, గర్భిణీ అయిన తన భార్యను పరీక్షల కోసం ఆస్పత్రికి తీసుకొచ్చినప్పుడు కుందన్‌లాల్‌ను కలిశారు.
ఆయన కూడా భారత్‌కు వలస వచ్చేందుకు కుందన్‌లాల్ సాయపడ్డారు.
1938 జనవరి నుంచి 1939 ఫిబ్రవరి మధ్య కాలంలో భారత్‌కు చేరుకున్న యూదుల కుటుంబాల్లో ఆల్ఫ్రెడ్ కుటుంబం కూడా ఒకటి.
నైపుణ్యవంతులైన ఉద్యోగుల కోసం ఆస్ట్రియన్ పేపర్‌లో కుందన్‌లాల్ ఇచ్చిన వ్యాపార ప్రకటనను చూసి టెక్స్‌టైల్ టెక్నీషియన్ హాన్స్ లాష్ స్పందించారు.
లుధియానాలోని 'కుందన్ క్లాత్ మిల్స్'లో హాన్స్ లాష్‌కు మేనేజీరియల్ పోస్ట్ ఇచ్చారు. అంతేకాక, ఇల్లును, లాభాల్లో వాటాను అందివ్వడమే కాకుండా.. ఆయన సురక్షితంగా భారత్‌కు వచ్చేలా సహకరించారు.
ఒకప్పుడు 50 మంది ఉద్యోగులున్న ప్లేవుడ్ ఫ్యాక్టరీకి యజమాని అయిన ఆల్ఫ్రెడ్ షాఫ్రెనెక్.. తన నైపుణ్యాలను కుందన్‌లాల్‌కు వివరించారు.
దీంతో, భారత్‌లో అత్యంత అధునాతన ప్లేవుడ్ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ఆల్ఫ్రెడ్ షాఫ్రెనెక్‌ను నియమించుకున్నారు కుందన్‌లాల్.
ఆల్ఫ్రెడ్ షాఫ్రెనెక్ కుటుంబాన్ని, ఆయన సోదరుడు సీగ్‌ఫ్రైడ్ కుటుంబాన్ని కుందన్‌లాల్ రక్షించారు.
కుందన్‌లాల్‌ను ఆశ్రయించిన వ్యక్తుల్లో సీగ్‌మండ్ రెట్టర్ ఒకరు. నాజీల కాలంలో ఆయన మెషీన్ టూల్స్ వ్యాపారాలు కుప్పకూలడంతో, రెట్టర్ భారత్‌కు వచ్చి, తిరిగి తన వ్యాపారాలను ప్రారంభించుకునేందుకు కుందన్‌లాల్ సాయపడ్డారు.

ఫొటో సోర్స్, Courtesy: Vinay Gupta
వియన్నాలోని ఆస్పత్రి బెడ్‌తో మొదలు..
డయాబెటిస్, హేమరాయిడ్స్‌తో బాధపడుతున్న 45 ఏళ్ల కుందన్‌లాల్‌కు కొత్త చికిత్సలు అవసరమయ్యాయి. వియన్నాలోని ఓ స్పెషలిస్ట్ గురించి ఆయన చదివారు.
1938లో అక్కడ సర్జరీ చేయించుకుని దాని నుంచి కోలుకునే సమయంలో లూసీ, ఆల్ఫ్రెడ్ వాష్లర్‌ను కలిశారు కుందన్‌లాల్.
ఈ యువ జంట తమ తొలి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. వారి నుంచే యూదులపై జరుగుతోన్న హింసను కుందన్‌లాల్ తెలుసుకున్నారు.
ఆ తర్వాత కొన్ని నెలల పాటు, ఇతర వ్యక్తులను కలిశారు. భారత్‌కు రావాలనుకుంటున్న నైపుణ్యవంతులైన కార్మికుల కోసం వార్తాపత్రికలో కుందన్‌లాల్ వ్యాపార ప్రకటన ఇచ్చారు.
ఈ ప్రకటనకు స్పందించిన వారిలో వాష్లర్, లాష్, షాఫ్రెనెక్, రెట్టర్ ఉన్నారు. భారతీయ వీసాలు పొందేందుకు ప్రతి ఒక్కరికి ఒక ఉద్యోగం, ఆర్థిక భరోసాను, మద్దతును కుందన్‌లాల్ అందించారు.
కుందన్‌లాల్ వారిని తమ ఫ్యాక్టరీల్లో నియమించుకున్న తర్వాత 1938 అక్టోబర్‌లో లుధియానాకు వచ్చిన తొలి వ్యక్తి లాష్.
కుందన్‌లాల్ ఆయన్ను తన ఇంటికి తీసుకెళ్లారని, నిశ్శబ్దంగా ఉన్న ఆ పట్టణంలో వారికి కాస్త ఓదార్పు లభించిందని గుప్తా రాశారు.
అయితే, యూదుల సమాజం అక్కడ లేకపోవడం, వారి సామాజిక జీవితం లేకపోవడం, వస్త్రాల మిల్లులో ఇబ్బందుల కారణంగా, కొన్నివారాలకే లాష్ ముంబయికి వెళ్లారు. పని వాతావరణ పరిస్థితులు సరిగ్గా లేవని, లాభాలకు ఆస్కారం తక్కువగా ఉందని ఆయన చెప్పారు. ఆ తర్వాత తిరిగి వెనక్కి రాలేదు.
వైస్ కూడా కుందన్‌లాల్ దగ్గర రెండు నెలల కంటే తక్కువే ఉన్నారు. వైస్ కోసం సృష్టించిన కుందన్ ఏజెన్సీస్ ఏర్పాటు కాలేదు.
దీంతో, ఆయన బాంబే వెళ్లి, అక్కడే పని చూసుకున్నారు. 1947లో ఇంగ్లండ్‌కు వలస వెళ్లారు.
వారిద్దరూ వెళ్లిపోయినప్పటికీ, కుందన్‌లాల్‌పై ఎలాంటి వ్యతిరేకత రాలేదని గుప్తా రాశారు.
''వియన్నాలో ఉన్న మాదిరి వారికి అవసరమైన జీవన ప్రమాణాలను, సామాజిక వాతావరణాన్ని అందించలేకపోవడంతో కుందన్‌లాల్ చాలా బాధపడ్డారని మా ఆంటీ చెప్పింది. ఒకవేళ అలాంటి వాతావరణం ఉంటే, ఆ ఇద్దరు లుధియానాలోనే ఉండేవారని కుందన్‌లాల్ భావించారని తెలిపింది'' అని గుప్తా రాశారు.

ఫొటో సోర్స్, Courtesy: Vinay Gupta
ఆల్ఫ్రెడ్, లూసీ వాష్లర్ వారి నవజాత శిశువును తీసుకుని సముద్రం, రైలు, రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించి, చివరికి లుధియానాకు చేరుకున్నారు.
లుధియానా వచ్చిన వెంటనే ఆల్ఫ్రెడ్ ఒక ఫర్నీచర్ వర్క్‌షాపు ఏర్పాటు చేసుకున్నారు.
1939 మార్చిలో, ఆల్ఫ్రెడ్ షాఫ్రెనెక్, ఆయన సోదరుడు సీగ్‌ఫ్రైడ్, వారి కుటుంబాలు ఆస్ట్రియా నుంచి లుధియానాకు వచ్చాయి.
భారత్‌లో తొలి ప్లేవుడ్ ఫ్యాక్టరీల్లో ఒకదాన్ని వారి ఇళ్ల వెనుకాల షెడ్‌లో నిర్మించారు.
లుధియానాలో కొన్ని నెలలు గడిచిన తర్వాత, తొలి రోజుల్లో వారికి కలిగిన ఉపశమనం, ఆ తర్వాత విసుగు తెప్పించింది.
పురుషులు సుదీర్ఘ గంటలు పనిచేసే వారు. మహిళలకు భాష అంతగా రాకపోవడం, ఒంటరితనంతో పూర్తిగా ఇంటి పనులకే పరిమితమయ్యారు.
1939 సెప్టెంబర్‌లో హిట్లర్ పోలెండ్‌ను ఆక్రమించారు. కొన్ని రోజుల తర్వాత, జర్మనీపై బ్రిటన్ యుద్ధాన్ని ప్రకటించింది.
బ్రిటన్ పార్లమెంట్ భారత్‌ను కూడా ఈ సంఘర్షణలోకి నెట్టింది. 25 లక్షల మందికి పైగా భారతీయులు ఈ యుద్ధంలో పాల్గొన్నారు. 87 వేల మంది మళ్లీ తిరిగి రాలేదు.
ఈ యుద్ధ ప్రభావం లుధియానాపై చాలా వేగంగా పడింది. 1940 నాటికి యూదులు అయినా కాకపోయినా జర్మన్ ప్రజలందరూ నిర్బంధ శిబిరాల్లోకి వెళ్లేలా విధానాలను తీసుకొచ్చారు.
దీంతో, వాష్లర్, షాఫ్రెనెక్ కుటుంబాలను బలవంతంగా పూనాకు (ప్రస్తుత పుణెకు) సమీపంలోని పురంధర్ నిర్బంధ శిబిరానికి తరలించారు.
కేవలం తప్పుడు పాస్‌పోర్డు తప్ప వారు మరే నేరం చేయలేదు.
పెయిడ్ వర్క్‌ను పొందగలిగితే వారు ఆ శిబిరం నుంచి విడుదల కావడం సాధ్యం.
దీంతో, ఆల్ఫ్రెడ్, సీగ్‌ఫ్రైడ్ షాఫ్రెనెక్‌లు బెంగళూరులో ఒక కొత్త ప్లేవుడ్ బిజినెస్‌లో ఉద్యోగాలను చూసుకున్నారు. కుటుంబాలతో కలిసి అక్కడకు తరలివెళ్లారు.
కరాచీలో ఆల్ఫ్రెడ్ వాష్లర్‌కు ఉద్యోగం దొరకడంతో 1942లో వారు క్యాంపు నుంచి బయటికి వచ్చారు. ఈ కుటుంబాలు మళ్లీ కలుసుకోలేదు.
యుద్ధం ముగిసిన తర్వాత ఏడాదికి 1946లో పురంధర్ క్యాంపు మూతపడింది.
1948లో ఆల్ఫ్రెడ్ వాష్లర్ సోదరుడు వారికి అమెరికా శరణార్థి వీసా ఇప్పించేందుకు స్పాన్సర్ చేయడంతో కరాచీ నుంచి వెళ్లిపోయారు. మళ్లీ తిరిగి భారత్‌కు రాలేదు.
అలాగే, బెంగళూరులో ప్లేవుడ్ వ్యాపారం విజయవంతమైన తర్వాత 1947లో షాఫ్రెనెక్ కుటుంబం కూడా ఆస్ట్రేలియా వెళ్లిపోయింది.
పుస్తకం కోసం తన తాత గురించి తెలుసుకునేందుకు ఆల్ఫ్రెడ్ వాష్లర్ కొడుకు అలెక్స్‌ను గుప్తా కలుసుకున్నారు.
లుధియానాలో కుందన్‌లాల్ తన కూతుర్ల కోసం ఇంట్లోనే ఒక పాఠశాలను ఏర్పాటు చేయించారు. ఆ తర్వాత, ఇది పంజాబ్‌లోనే అత్యంత పురాతన పాఠశాలల్లో ఒకటిగా విస్తరించింది. ఇప్పటికీ 900 మంది విద్యార్థులతో ఈ స్కూల్ నడుస్తోంది. తన భార్య సరస్వతి తీవ్ర డిప్రెషన్‌కు గురయ్యారు.
కుందన్‌లాల్, సరస్వతిలకు ఐదుగురు పిల్లలు. వారిలో నలుగురు కూతుళ్లు. టెర్రస్‌పై నుంచి జారిపడిన తర్వాత, 1965లో సరస్వతి మరణించారు. కుందన్‌లాల్ ఆమె చనిపోయిన ఏడాదికి 73 ఏళ్ల వయసులో గుండెపోటుతో చనిపోయారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














