పహల్గాం ప్రస్తావన లేదంటూ చైనాలో ‘షాంఘై’ సదస్సు ప్రకటనపై సంతకం చేయని రాజ్‌నాథ్ సింగ్.. అయినా, కాంగ్రెస్ ఎందుకు విమర్శిస్తోంది?

ఎస్‌సీవో సమ్మిట్, రాజ్‌నాథ్ సింగ్, నరేంద్ర మోదీ, భారత్, చైనా, పాకిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

చైనాలో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీవో) సదస్సు సంయుక్త ప్రకటనపై సంతకం చేసేందుకు భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నిరాకరించారు.

కొన్ని అంశాలపై ఎస్‌సీవోలోని కొన్ని సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సంయుక్త ప్రకటన జారీ కాలేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.

''ఉగ్రవాదం గురించి మాకు కొన్ని ఆందోళనలు ఉన్నాయి. వాటిని ఆ డాక్యుమెంట్‌లో చేరుస్తారని కోరుకున్నాం. కానీ, ఒక దేశం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీని కారణంగా సంయుక్త ప్రకటన సాధ్యం కాలేదు'' అన్నారు.

ఆ ప్రకటనలో పహల్గాం విషయం ప్రస్తావించకపోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌పై కాంగ్రెస్ ప్రశ్నలు లేవనెత్తుతోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ఏకాకిగా మారిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి షామా మొహమ్మద్ అన్నారు.

చైనాలో రెండు రోజులపాటు జరిగిన ఎస్‌సీవో సదస్సులో పాల్గొనేందుకు భారత రక్షణ మంత్రి చైనాలో పర్యటించారు. జూన్ 25, 26 తేదీల్లో ఈ సదస్సు జరిగింది.

ఇదే విషయమై భారత విదేశాంగ శాఖ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది.

''పొంచివున్న ఉగ్రవాద ముప్పుపై మనం పోరాడాల్సి ఉంది. అదే అంశాన్ని మనం (ఎస్‌సీవో సమావేశంలో) లేవనెత్తాం'' అని ఆ ప్రకటనలో రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు.

''ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత విధానంలో మార్పులకు సంబంధించిన వివరాలను ఎస్‌సీవో సదస్సులో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలియజేశారు'' అని విదేశాంగ శాఖ తన ప్రకటనలో పేర్కొంది.

భద్రతకు ముప్పుగా మారిన ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు సభ్య దేశాలు ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందని రాజ్‌నాథ్ సింగ్ విజ్ఞప్తి చేసినట్లు ఆ ప్రకటనలో విదేశాంగ శాఖ తెలిపింది.

ఎస్‌సీవో సమ్మిట్, రాజ్‌నాథ్ సింగ్, నరేంద్ర మోదీ, భారత్, చైనా, పాకిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎస్‌సీవో సదస్సులో పహల్గాం దాడి ఘటనను రాజ్‌నాథ్ సింగ్ ప్రస్తావించారు.

రాజ్‌నాథ్ సింగ్ ఏం చెప్పారు?

శాంతి, భద్రత, విశ్వాసానికి సంబంధించిన సమస్యలే ఈ ప్రాంతం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.

''ఈ సమస్యలు మతోన్మాదం, తీవ్రవాదం, ఉగ్రవాదం కారణంగానే తలెత్తుతున్నాయి''

శాంతి,ఉగ్రవాదం కలిసి సాగలేవని.. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు నిర్ణయాత్మక చర్యలు అవసరమని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

''కొన్ని దేశాలు క్రాస్‌బోర్డర్ టెర్రరిజాన్ని ఒక సాధనంగా వాడతాయి, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తాయి. అలాంటి ద్వంద్వ ప్రమాణాలకు చోటు ఉండకూడదు. అలాంటి దేశాలను విమర్శించేందుకు కూడా ఎస్‌సీవో సంకోచించకూడదు'' అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

ఎస్‌సీవో సదస్సులో సమర్పించిన తన ప్రకటనలో, ఆపరేషన్ సిందూర్ గురించి కూడా రాజ్‌నాథ్ సింగ్ ప్రస్తావించారు.

''పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా ఆపరేషన్ సిందూర్ చేపట్టాం. పహల్గాంలో జరిగిన దాడిలో, బాధితులను మతం ఆధారంగా కాల్చి చంపారు. ఐక్యరాజ్యసమితి ప్రకటించిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకి అనుబంధ సంస్ధ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్) ఈ దాడి చేసింది తానేనని ప్రకటించుకుంది'' అని రాజ్‌నాథ్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

''గతంలో లష్కరే తోయిబా భారత్‌లో జరిపిన దాడుల తరహాలోనే పహల్గాం దాడి కూడా ఉంది. ఉగ్రవాద కేంద్రాలను ఉపేక్షించేది లేదని, వాటిపై దాడులు చేయడానికి ఏమాత్రం సంకోచించేది లేదని మేం చూపించాం''

''ఎస్‌సీవో సభ్యదేశాలు ఈ దుశ్చర్యలను (ఉగ్రవాదాన్ని) ఖండించాలి'' అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

ప్రధాని మోదీపై ప్రశ్నలు ఎందుకు?

ఉగ్రవాదానికి సంబంధించిన అంశాలపై భిన్నాభిప్రాయాల కారణంగా ఎస్‌సీవో సంయుక్త ప్రకటనపై సంతకం చేసేందుకు భారత్ నిరాకరించడం గురించి చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జాంగ్ షావోగింగ్‌ను అడిగినట్లు చైనా ప్రభుత్వ మీడియా 'గ్లోబల్ టైమ్స్' సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

దీనికి ఆయన స్పందిస్తూ, ''నాకు తెలిసినంత వరకు, ఎస్‌సీవో సభ్యదేశాల రక్షణ మంత్రుల సమావేశం అందరి సహకారంతో విజయంతంగా ముగిసింది'' అని అన్నారని గ్లోబల్ టైమ్స్ ఆ పోస్టులో రాసింది.

ది వైర్ పీకే, న్యూ పాకిస్తాన్ ఫౌండేషన్ థింక్‌ట్యాంక్‌కు చెందిన జర్నలిస్ట్ అలీ కె చిస్తీ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో ఇలా పోస్ట్ చేశారు.

''భారత్ సంతకం చేసేందుకు నిరాకరించడం, పహల్గాం గురించి ప్రస్తావించకపోవడం కాదు.. ఎస్‌సీవో సభ్యదేశాలన్నీ బలూచిస్తాన్‌లో ఉగ్రవాదాన్ని ఖండించడంలో ఐక్యంగా ఉండడం అసలు ముఖ్యాంశం. పాకిస్తాన్‌కు ఇది ఒక పెద్ద దౌత్యవిజయం'' అని ఆయన ఆ పోస్టులో రాశారు.

దీనికి సంబంధించి భారత మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశారు.

''ప్రపంచ వేదికపై భారత్ పూర్తిగా ఒంటరైంది. ఎస్‌సీవో పత్రికా ప్రకటనే దీనికి తాజా ఉదాహరణ. అందులో పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని పూర్తిగా విస్మరించారు. కానీ, బలూచిస్తాన్ గురించి ప్రస్తావించారు. ప్రధాన మంత్రి పూర్తిగా విఫలమయ్యారు, తక్షణమే ఆయన రాజీనామా చేయాలి'' అని ఆయన అందులో రాశారు.

ఎస్‌సీవో సంయుక్త ప్రకటనలో పహల్గాం దాడి ప్రస్తావించకపోవడం గురించి ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌‌పై కాంగ్రెస్ అధికార ప్రతినిధి షామా మొహమ్మద్ ప్రశ్నలు లేవనెత్తారు.

''ఎస్‌‌సీవో సంయుక్త ప్రకటనలో పహల్గాం దాడి గురించి కానీ, పాకిస్తాన్ ప్రోద్బలంతో జరుగుతున్న ఉగ్రవాదం గురించి కానీ ప్రస్తావన లేదు. కానీ బలూచిస్తాన్ గురించి ప్రస్తావించారు'' అని ఆమె ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

''ఇది దౌత్యపరమైన వైఫల్యం. మోదీ ప్రభుత్వ నేతృత్వంలో భారత్ ఏకాకిగా మారింది. పాకిస్తాన్‌కు బిలియన్ల కొద్దీ సాయమందుతోంది, ఉగ్రవాదాన్ని ఖండించడంలో ఏ దేశం కూడా మనకు మద్దతుగా నిలవడం లేదు'' అని ఆమె రాశారు.

ఎస్‌సీవో సమ్మిట్, రాజ్‌నాథ్ సింగ్, నరేంద్ర మోదీ, భారత్, చైనా, పాకిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

ఏమిటీ ఎస్‌సీవో?

చైనా, రష్యా, నాలుగు మధ్య ఆసియా దేశాలు కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ సంయుక్తంగా 2001లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్‌ (ఎస్‌సీవో)ను ఏర్పాటు చేశాయి.

1996లో రష్యా, చైనా, ఈ మధ్య ఆసియా దేశాల మధ్య జరిగిన సరిహద్దు ఒప్పందం నుంచి ఈ సంస్థ ఆవిర్భవించింది. ఈ ఒప్పందాన్ని 'షాంఘై ఫైవ్'గా వ్యవహరిస్తారు.

చైనా సూచన మేరకు, ఈ ప్రాంతంలోని దేశాల మధ్య సహకారాన్ని పోత్సహించేందుకు ఈ ఒప్పందాన్ని మరింత విస్తరించారు.

2017లో భారత్, పాకిస్తాన్ ఈ సంస్థలో చేరాయి. 2023లో ఇరాన్ ఇందులో సభ్యదేశమైంది.

ప్రస్తుత ప్రపంచ జనాభాలో 40 శాతం మంది ఈ ఎస్‌సీవో సభ్యదేశాల్లో నివసిస్తున్నారు. ప్రపంచ జీడీపీలో ఎస్‌సీవో దేశాల వాటా 20 శాతం. ప్రపంచ చమురు నిల్వల్లో 20 శాతం ఈ దేశాల్లోనే ఉన్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)