ట్రంప్ సుంకాల నుంచి భారత్ ఇప్పటికీ తప్పించుకోగలదా, ముందున్న మార్గాలేంటి?

ఫొటో సోర్స్, EPA/Shutterstock EPA/Shutterstock
- రచయిత, మహమ్మద్ షాహిద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ 25 శాతం సుంకాలను ప్రకటించారు.
అలాగే, రష్యాతో వ్యాపారం చేస్తున్నందుకు జరిమానా గురించి కూడా ట్రంప్ మాట్లాడారు. అయితే, ఎలాంటి జరిమానాలు ఉంటాయనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
ఏప్రిల్ 2న, భారత్ సహా 100 దేశాలపై సుంకాలు విధించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
అమెరికా వస్తువులపై ఏ దేశమైతే అత్యధికంగా దిగుమతి సుంకం విధిస్తుందో, ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై అమెరికా కూడా అత్యధిక సుంకాలు విధిస్తుందని ఆయన చెప్పారు. వీటిని రెసిప్రోకల్ టారిఫ్ (ప్రతీకార సుంకం)గా అభివర్ణించారు.
భారత్‌పై 26 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ఏప్రిల్‌లో ట్రంప్ ప్రకటించారు. అదే సమయంలో, అమెరికాతో భారత్ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవచ్చని కూడా అన్నారు.

తొలుత, ఈ సుంకాలు జూలై 9 నుంచి అమలవుతాయని నిర్ణయించారు. కానీ ఆ తర్వాత, ఆ గడువును ఆగస్టు 1 వరకు పొడిగించారు. ఈ గడువు మరో రెండు రోజుల్లో ముగుస్తుందనగా, భారత్‌పై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందానికి సంబంధించి చర్చలు జరుగుతున్నప్పటికీ, కొన్ని రంగాల్లో ఇంకా కొలిక్కిరావాల్సి ఉంది.
అధికారిక నివేదికల ప్రకారం, జన్యుమార్పిడి పంటలైన సోయాబీన్, మొక్కజొన్న దిగుమతులను భారత్ వ్యతిరేకిస్తోంది. అలాగే, దేశీయ పాల ఉత్పత్తుల మార్కెట్‌లోకి విదేశీ కంపెనీలను అనుమతించడానికీ ఇష్టపడట్లేదు.

2024లో, భారత్ - అమెరికా మధ్య 129 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది. ఇందులో భారత్‌కు దాదాపు 46 బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులు (ట్రేడ్ ప్లస్) ఉంది.
అమెరికా వస్తువులపై అత్యధిక సుంకాలు విధిస్తున్న దేశాల జాబితాలో భారత్ కూడా ఒకటి. దిగుమతులపై భారత్ సగటున 17 శాతం సుంకాలు విధిస్తోంది. అటువైపు, ఏప్రిల్ 2వ తేదీకి ముందు అమెరికా సుంకాలు కేవలం 3.3 శాతంగా మాత్రమే.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం... 1990-91 వరకు భారత్‌లో సగటున టారిఫ్ రేట్ 125 శాతం వరకూ ఉండేది. సరళీకరణ విధానాల అమలు తర్వాత అది తగ్గుతూ వచ్చింది. 2024లో, భారత్‌లో సగటు టారిఫ్ రేట్ 11.66 శాతంగా ఉంది.
హిందూ దినపత్రిక కథనం ప్రకారం... భారత ప్రభుత్వం 150 శాతం, 125 శాతం, 100 శాతం టారిఫ్ రేట్లను రద్దు చేసింది.
ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడైన తర్వాత, టారిఫ్ రేట్లలో భారత ప్రభుత్వం మార్పులు చేసింది. భారత్‌లో లగ్జరీ కార్లపై 125 శాతం టారిఫ్ ఉండేది. దానిని 70 శాతానికి తగ్గించారు.
దీంతో, భారత్ సుంకాల సగటు 2025లో 10.65 శాతానికి తగ్గింది.
సాధారణంగా దిగుమతులపై ప్రతిదేశమూ సుంకాలు విధిస్తుంది. అయితే, ఇతర దేశాలతో పోలిస్తే, దిగుమతులపై అత్యధిక సుంకాలు విధించే దేశాలలో భారత్ ఒకటి.
ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధించే దేశాలతో కలిపి భారత్‌నూ ట్రంప్ పదేపదే పేర్కొనడానికి ఇదే కారణం. అమెరికాతో ఇతర దేశాల వాణిజ్య లోటును పూర్తిగా తగ్గించాలని ఆయన ఆశిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు డోనల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక 'ట్రూత్ సోషల్' ద్వారా ప్రకటించారు. కానీ, ఏయే రంగాలపై ఎంత సుంకం విధిస్తారనే వివరాలు వెల్లడించలేదు.
అయితే, ఏప్రిల్‌లో సుంకాలు ప్రకటించినప్పుడు భారత్‌లో ఏయే రంగాలపై ప్రభావం ఉంటుందనేది స్పష్టమైంది.
భారత్ నుంచి 30 రంగాలకు చెందిన ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. వాటిలో ఆరు వ్యవసాయ సంబంధితమైనవి కాగా, మిగిలిన 24 పారిశ్రామిక రంగానికి చెందినవి.
పారిశ్రామిక ఎగుమతుల్లో ఫార్మా రంగానిదే అత్యధిక వాటా. వాటి విలువ సుమారు 13 బిలియన్ డాలర్లు. సుంకాల పెంపు నుంచి ఫార్మా ఉత్పత్తులకు అమెరికా మినహాయింపు ఇచ్చింది. అయితే, ఈసారి కూడా అదే జరిగిందా? లేదా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
అమెరికా సుంకాల పెంపుతో ఫార్మా ఉత్పత్తులతో పాటు, ఆభరణాలు, వస్త్రాలు, టెలికం, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఆటోమొబైల్స్, కెమికల్స్‌కు సంబంధించిన రంగాలు ఎక్కువగా ప్రభావితం కావొచ్చు.
అమెరికా సుంకాలను 25 శాతంగా పరిగణించకూడదని, ఎందుకంటే దీనికి అదనంగా 10 శాతం జరిమానా కూడా ఉందని, అంటే సుంకాలు 35 శాతంగా మారాయని నికోర్ అసోసియేట్స్‌కి చెందిన ఎకనమిస్ట్ మిథాలీ నికోర్ అంటున్నారు.
''రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగించినంత కాలం అమెరికాకు ఎగుమతులపై బేస్ రేట్ 25 శాతం, మరో 10 శాతం జరిమానా వర్తిస్తాయి. ఇది మొత్తం 35 శాతం'' అని మిథాలీ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

భారత్ 11.88 బిలియన్ డాలర్ల విలువైన బంగారం, వెండి, వజ్రాలు తదితర ఆభరణాలను అమెరికాకు ఎగుమతి చేస్తోంది. ఒకవేళ ఈ ఎగుమతులు తగ్గిపోతే, ఈ రంగంపై ఆధారపడిన స్వర్ణకారులు, ఆభరణాల తయారీదారులు, వ్యాపారులపై ప్రభావం పడుతుంది.
''అమెరికా సుంకాల పెంపుతో రత్నాలు, ఆభరణాల రంగం ఎక్కువగా ప్రభావితమవుతుంది. అమెరికాకు ఈ రంగం ఎగుమతుల్లో అధిక భాగం గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచే ఉంటున్నాయి'' అని మిథాలీ నికోర్ చెప్పారు.
భారత్ నుంచి అమెరికాకు 4.93 బిలియన్ డాలర్ల విలువైన వస్త్రాలను ఎగుమతి చేస్తున్న టెక్స్‌టైల్ రంగంపైనా ప్రతీకార సుంకాల ప్రభావం పడుతుంది.
''ఇక్కడి వస్త్ర పరిశ్రమపై ఎంత ప్రభావం ఉంటుందనేది భారత పొరుగుదేశాలపై అమెరికా విధించే సుంకాలను బట్టి కూడా ఉంటుంది. బంగ్లాదేశ్ పెద్దయెత్తున వస్త్రాలను ఎగుమతి చేస్తోంది. వియత్నాం ఇప్పటికే అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసింది'' అని మిథాలీ చెప్పారు.
''ఇదే పరిస్థితే కొనసాగితే, భారత్, బంగ్లాదేశ్‌లతో జరుగుతున్న వాణిజ్యం వియత్నాంకు మారుతుంది. మహిళలు పెద్దయెత్తున ఈ రంగంపై ఆధారపడి ఉన్నారు. వారందరిపై తీవ్ర ప్రభావం పడుతుంది'' అని ఆమె వివరించారు.
అమెరికాకు 14.39 బిలియన్ డాలర్ల విలువైన మొబైల్స్, టెలికం, ఎలక్ట్రానిక్ పరికరాలను భారత్ విక్రయిస్తోంది. ఇప్పుడు ఈ రంగంపైనా ప్రభావం ఉంటుంది.
''యాపిల్ తదితర కంపెనీలు తమ ఉత్పత్తుల కోసం భారత్‌కు వస్తున్నాయి. కానీ ఈ సుంకాల తర్వాత అవి భారత్‌కు ఎందుకు రావాలనుకుంటాయి? ఈ పన్నులతో స్టీల్, అల్యూమినియం పరిశ్రమలూ ప్రభావితమవుతాయి'' అని మిథాలీ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా సుంకాలతో భారత్ ఏటా 7 బిలియన్ డాలర్లు కోల్పోతుందని సిటీ రీసర్చ్ అంచనా వేసింది.
''నష్టం 7 బిలియన్ డాలర్లే మనకు కనిపిస్తుంది. కానీ, ప్రస్తుతం ఇది మన వ్యాపారుల లాభాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది'' అని మిథాలీ అన్నారు.
''సుంకాల పరోక్ష ప్రభావం విషయానికొస్తే.. అది మన ఆర్థిక వ్యవస్థపై ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ సాధారణ సూత్రమేమిటంటే.. ఎగుమతులు తగ్గినప్పుడు, వినియోగం తగ్గుతుంది, అవి రెండూ తగ్గితే ఉద్యోగాల కోత పడుతుంది. వీటన్నింటి కారణంగా, పేదరికం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నవారంతా ఈ పరిణామాలతో మరింత పేదరికంలోకి కూరుకుపోతారు'' అని ఆమె వివరించారు.
సుంకాల పెంపు ప్రభావం ఉత్పత్తిపై ప్రత్యక్షంగా ఉంటుంది. ఉత్పత్తి తగ్గితే ఉపాధి కూడా తగ్గిపోతుంది. ఇది ఏదో ఒక విధంగా మొత్తం ఆర్థిక చక్రంపై ప్రభావం చూపుతుంది.
అయితే, భారత్ వైపు నుంచి వాణిజ్య ఒప్పందంపై ద్వైపాక్షిక చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని, అందువల్ల ముందుగానే ఎలాంటి నిర్ణయానికీ రావాల్సిన అసవరం లేదని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణురాలు మంజరి సింగ్ అన్నారు.
అమెరికాతో భారత్‌కు వాణిజ్య మిగులు (ట్రేడ్ సర్‌ప్లస్) ఉందని, వారికి మన ఎగుమతుల కన్నా వారి నుంచి తక్కువగానే దిగుమతి చేసుకుంటున్నామని ఆమె చెప్పారు.
''25 శాతం సుంకాలు విధిస్తే, 45 బిలియన్ డాలర్ల మిగులు తగ్గిపోతుంది. ముఖ్యంగా, ఆటోమొబైల్, ఫార్మా రంగాలు ప్రభావితమవుతాయి'' అని మంజరి సింగ్ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images

వ్యవసాయం, పాల ఉత్పత్తులకు తలుపులు తెరిచేందుకు భారత్ నిరాకరించడమే రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరకపోవడానికి కారణమని చెబుతారు.
అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ సగటున 37.7 శాతం సుంకాలు విధిస్తోంది. అదేసమయంలో, భారత వ్యవసాయ ఉత్పత్తులపై అమెరికా 5.3 శాతం సుంకాలు వేస్తోంది. ట్రంప్ తాజా ప్రకటన ప్రకారం, భారత ఉత్పత్తులపై సుంకాలు 25 శాతానికి పెరిగాయి.
వ్యవసాయ, డెయిరీ ఉత్పత్తులకు మార్కెట్ తలుపులు తెరవడం భారత్‌కు చాలా పెద్ద విషయమని, అందుకే ఈ అంశంపై ఏకాభిప్రాయం కుదరడం లేదని మంజరి సింగ్ అభిప్రాయపడ్డారు. అమెరికా వ్యవసాయ, పాల ఉత్పత్తులకు మార్కెట్ తెరిస్తే ఇక్కడి చిన్న, సన్నకారు రైతులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆమె అన్నారు.
ట్రంప్ ప్రకటన నేపథ్యంలో భారత వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ స్పందించింది.
''భారతదేశంలోని రైతులతో పాటు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సంక్షేమానికి, ప్రయోజనాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది'' అని పేర్కొంది.

న్యాయమైన, సమతుల్యమైన, పరస్పర ప్రయోజనకరమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం భారత్, అమెరికా గత కొన్ని నెలలుగా చర్చలు జరుపుతున్నాయని, అందుకు ఇరుదేశాలు కట్టుబడి ఉన్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.
అమెరికా సుంకాల విషయంలో భారత్‌కి ఉన్న అత్యుత్తమ ఆప్షన్ సమగ్ర వాణిజ్య ఒప్పందం.
ఒకవేళ ఈ ఒప్పందం కొలిక్కిరాకపోతే, భారత్ తన ఎగుమతులకు అమెరికాయేతర దేశాల్లో మార్కెట్లను అన్వేషించాల్సి ఉంటుంది. లేదా అమెరికాకు వస్తువులను పంపే మార్గాన్ని మార్చాలి.
''అమెరికా ఒకవిధంగా మనల్ని పూర్తిగా వద్దనుకుంటే, ఇతర మార్గాలను అన్వేషించే అవకాశం మనకు ఉంది. ఇటీవలే బ్రిటన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై భారత్ సంతకం చేసింది. ఆ దిశగా ప్రయత్నాలు తీవ్రతరం చేయాలి. అమెరికా సుంకాలతో కలిగే నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి రష్యా, చైనాలతో వాణిజ్యం పెంచుకోవాల్సి రావొచ్చు. రష్యాతో మన సంబంధాలు బాగున్నాయి. కానీ, చైనాతో మాత్రం సంబంధాలను పునర్నిర్మించుకోవాలి'' అని మిథాలీ అభిప్రాయపడ్డారు.
''చైనాపై అమెరికా 100 శాతానికి పైగా సుంకాలు విధించడంతో, తన ఉత్పత్తులను యూరప్ వైపు మళ్లించింది. యూరప్ దేశాల మార్కెట్లలో ఇప్పటికే చైనా ఉత్పత్తులు ఉన్నాయి. కాబట్టి, భారత్ అక్కడ కూడా పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది'' అని మంజరి సింగ్ అన్నారు.
భారత్ తన ఉత్పత్తులను మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా మార్కెట్ల వైపు మళ్లించాలి. అయితే, భారత్ - అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం దృష్ట్యా భవిష్యత్తులో సుంకాలు తగ్గించే అవకాశం ఉంది.''
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














