మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసు: ప్రజ్ఞా ఠాకూర్ సహా నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించిన కోర్టు

ప్రజ్ఞా ఠాకూర్

ఫొటో సోర్స్, Getty Images

మాలేగావ్ బాంబుపేలుళ్ల కేసు నిందితులందరినీ ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా తేల్చింది. ఈ మేరకు గురువారం తీర్పు వెలువరించింది. దాదాపు17 ఏళ్ల తరువాత ఈ కేసు విచారణ ముగిసింది. బలమైన సాక్ష్యాధారాలు లేకపోవడం వల్ల నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తున్నట్లు న్యాయమూర్తి తీర్పు వెలువరించే సమయంలో చెప్పారు.

ఈ కేసులో బీజేపీ నేత ప్రజ్ఞా ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్, మేజర్ రమేష్ ఉపాధ్యాయ్ (రిటైర్డ్), అజయ్ రాహిర్కర్, సుధాకర్ ద్వివేది, సుధాకర్ చతుర్వేది, సమీర్ కులకర్ణీలను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.

మాలేగావ్‌లో 2008 సెప్టెంబర్ 29న ఒక మసీదు సమీపంలో మోటారు సైకిళ్లకు అమర్చిన పేలుడు పదార్థాలు పేలడంతో ఆరుగురు మృతి చెందారు. 100 మందికి పైగా గాయపడ్డారు.

ఈ కేసులో ప్రత్యేక న్యాయమూర్తి ఏకే లాహోటి, నిందితులందరూ జులై 31న కోర్టుకు హాజరుకావాలని మే 8న ఆదేశించారు. విచారణ సందర్భంగా, ప్రభుత్వ ప్రాసిక్యూటర్లు 323 మంది సాక్షులను విచారించారు. వారిలో 37 మంది వాంగ్మూలాలు ఇచ్చారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మాలేగావ్ పేలుళ్లు

ఫొటో సోర్స్, Getty Images

న్యాయమూర్తి ప్రస్తావించిన కొన్ని ముఖ్యాంశాలు

  • బాంబు పేలినట్లుగా ప్రభుత్వం నిరూపించింది. కానీ మోటార్‌సైకిల్‌కు బాంబును అమర్చినట్లుగా నిరూపించలేకపోయింది.
  • ప్రసాద్ పురోహిత్, కశ్మీర్ నుంచి ఆర్డీఎక్స్ తీసుకొచ్చారని చెప్పింది. కానీ, దీన్ని నిరూపించే బలమైన ఆధారాలు లేవు.
  • ప్రసాద్ పురోహిత్ ఇంట్లో బాంబు తయారు చేశారనేందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదు.
  • రంజాన్ కారణంగా ఆ ప్రాంతంలో లాక్‌డౌన్ ఉంది. మరి అక్కడికి మోటార్‌సైకిల్‌ను ఎలా తీసుకువచ్చారో స్పష్టంగా తెలియదు.
  • అర్హత ఉన్న నిపుణుడు పోస్ట్ మార్టం చేయలేదు. సాక్ష్యాధారాలు సరిగా లేవు. కాబట్టి ఈ ఫలితాలు కచ్చితమైనవనే హామీ ఇవ్వలేం.
  • ఇందౌర్, ఉజ్జయిని, నాసిక్ వంటి ప్రదేశాల్లో కుట్ర సమావేశాలు జరిగాయని చెప్పారు. కానీ, వీటికి సంబంధించిన విశ్వసనీయమైన ఆధారాలను కోర్టులో సమర్పించలేకపోయారు.
  • దర్యాప్తు అధికారులు, ఫోన్ రికార్డులను తనిఖీ చేస్తున్నప్పుడు సరైన అనుమతులు తీసుకోలేదని, వారు హోం శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి అనుమతి కూడా తీసుకోలేదని కోర్టు గమనించింది.
  • అభినవ్ భారత్ వ్యవహారంలో పురోహిత్, రాహిర్కర్, ఉపాధ్యాయ్ మధ్య కొన్ని ఆర్థిక లావాదేవీలు జరిగాయనేందుకు ఆధారాలు ఉన్నాయి. కానీ, ఈ డబ్బును ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించారని చెప్పడానికి ఎలాంటి కచ్చితమైన ఆధారాలను సమర్పించలేకపోయారు.
  • ప్రాసిక్యూషన్ తగిన తగిన ఆధారాలు చూపలేకపోయింది.
  • కేవలం అనుమానాలు, సందేహాలతో దేన్ని నిజమని చెప్పలేం. రుజువుల సమగ్రతను గమనిస్తే , నిందితులకు శిక్షవేసేందుకు తగిన బలమైన సాక్ష్యాధారాలు లేవు.
  • ఇదో తీవ్రమైన నేరం. కానీ నిర్ణయాత్మకమైన ఆధారాలు కోర్టుకు సమర్పించలేదు. అందుకే నిందితులందరినీ బెనిఫిట్ ఆఫ్ ది డౌట్ కింద నిర్దోషులుగా ప్రకటిస్తున్నాం.
బాంబు పేలుళ్లు

ఫొటో సోర్స్, Getty Images

అసలేం జరిగింది?

మహారాష్ట్రలోని మాలేగావ్‌లోని భీకు చౌక్, అంజుమన్ చౌక్‌ల వద్ద 2008, సెప్టెంబర్ 29న బాంబులు పేలాయి. ఈ పేలుళ్లలో ఆరుగురు మరణించగా, 101 మంది గాయపడ్డారు.

రంజాన్ మాసంలో జరిగిన ఈ పేలుళ్లపై మొదట ఏటీఎస్ విచారణ చేపట్టింది.

2009 జనవరి 20న ఏటీఎస్ అరెస్ట్ చేసిన 11 మంది, పరారీలో ఉన్న మరో ముగ్గురిపై మొదటి చార్జిషీటు దాఖలు చేసింది.

నిందితులు తమపై ఎంసీఓసీఏ చట్టం కింద కేసు నమోదు చేయడంపై హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేశారు.

ఎన్‌ఐఏకు దర్యాప్తు బాధ్యతలు

ఈ కేసులో లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్, బీజేపీ నేత ప్రజ్ఞా ఠాకూర్, మేజర్ రమేష్ ఉపాధ్యాయ్ (రిటైర్డ్), అజయ్ రాహిర్కర్, సుధాకర్ ద్వివేది, సుధాకర్ చతుర్వేది, సమీర్ కులకర్ణిలపై చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ), భారత శిక్షాస్మృతి (ఐపీసీ) కింద అభియోగాలు నమోదయ్యాయి. ఇప్పుడు వీరందరినీ నిర్దోషులుగా ప్రకటించారు.

గతంలో ఈ కేసును మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) దర్యాప్తు చేసింది. కానీ 2011లో, ఈ కేసు దర్యాప్తు బాధ్యతను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కి అప్పగించారు.

జాతీయ విచారణ సంస్థ (ఎన్ఐఏ) 2016లో దాఖలు చేసిన ఛార్జిషీటులో ఎంసీఓసీఏ కింద నమోదు చేసిన అభియోగాలను తొలగించారు.

ఈ కేసులో ప్రాసిక్యూషన్‌ను మెల్లగా కొనసాగించాలంటూ ఎన్‌ఐఏ తనపై వత్తిడి తెచ్చిందంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రోహిణి సాలియా 2015లో రాజీనామా చేశారు.

అయితే 2016లో ఎన్‌ఐఏ చార్జిషీట్ దాఖలు చేసింది. ప్రజ్ఞా ఠాకూర్, శ్యామ్ సాహు, ప్రవీణ్ తకల్కి, శివనారాయణ్ కల్సంగ్రాలకు క్లీన్ చిట్ ఇస్తూ, వారికి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లభించలేదని, ఈ కేసులో వారిని నిర్దోషులుగా విడుదల చేయాలని పేర్కొంది.

సాహు, కల్సంగ్రా, తకల్కిలను నిర్దోషులుగా తేల్చిన ఎన్‌ఐఏ కోర్టు, ప్రజ్ఞా ఠాకూర్ విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందని తీర్పునిచ్చింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)