ధర్మస్థల గ్రౌండ్ రిపోర్ట్: వంద కాదు.. అంతకు మించి శవాలు ఉంటాయంటున్న స్థానికులు

- రచయిత, బళ్ళ సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
హెచ్చరిక: కలవరపరిచే అంశాలు
''నేను నా చేతులతో కొన్ని వందల శవాలను ధర్మస్థలలో అనేక చోట్ల పూడ్చాను. అందులో అండర్‌వేర్ లేని మహిళలు, బడికి వెళ్లే అమ్మాయిల శవాలు కూడా ఉన్నాయి. ప్రాణభయంతో ఆ పని చేశాను. నిజం చెప్పాలని బయటకు వచ్చాను. అవెక్కడున్నాయో మీకు చూపిస్తాను. ఎవరు చేశారో చెబుతాను. మీరు నా మాటలు నమ్ముతారో లేదోనని నేను ఒక శవాన్ని పూడ్చిన చోట తవ్వి, ఆ ఎముకల ఫోటోలు మీ ముందు పెడుతున్నాను. ఒకవేళ నన్ను ఎవరైనా చంపేస్తే ఆ నిజం నాతో ఆగకూడదు కాబట్టి, కారకుల పేర్లను నేను సీల్డ్ కవర్లో సుప్రీం కోర్టు న్యాయవాదికి ఇస్తున్నాను. కావాలంటే నాపై నిజనిర్ధారణ పరీక్షలు చేసుకోండి. నేను చెప్పింది తప్పైతే ఏ చర్యకైనా నేను సిద్ధం. కానీ దయచేసి దీనిపై చర్యలు తీసుకోండి…''
భారతదేశాన్ని ఉలిక్కి పడేలా చేసిన ఫిర్యాదు ఇది.
జూలై 3న కర్ణాటకలోని మంగళూరు దగ్గరలోని దక్షిణ కన్నడ జిల్లా పరిధిలోని ధర్మస్థల పోలీసు స్టేషన్లో గుర్తు తెలియని ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదులో మాటలివి. తాను ధర్మస్థలలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేశానని చెప్పుకుంటున్న ఆయన్ను, ఇప్పుడు కర్ణాటక వారు 'భీమ' అని పిలుచుకుంటున్నారు. న్యాయవాదులు ఆయనను రహస్య ప్రదేశంలో ఉంచి, పేరు, రూపం ఇతర వివరాలు బయటకు రాకుండా భద్రంగా చూసుకుంటున్నారు.
దానిపై కర్ణాటక ప్రభుత్వం విచారణ కోసం సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) ను నియమించగా, వారు ఆ భీమాను దాదాపు ఐదు గంటల పాటు విచారించారు. ఆయన చెప్పిన ప్రదేశాలలో తవ్వకాలు ప్రారంభించారు. కూలీలు, చిన్న యంత్రాలతో, పోలీసులు, వాసన పసిగట్టే జాగిలాల సమక్షంలో ధర్మస్థల పరిసరాల్లో మృతదేహాల కోసం తవ్వకాలు ప్రారంభం అయ్యాయి.
విచిత్రం ఏంటంటే ఆ వ్యక్తి మాటలు విని ఈ దేశమంతా ఆశ్చర్యపోయింది కానీ కర్ణాటక వాసులు పెద్దగా షాక్ కాలేదు. ఎందుకంటే తుళు ప్రాంతంలోనూ, కర్ణాటకలోనూ ధర్మస్థల గురించి అటువంటి ఎన్నో భయానక కథల గురించి అప్పటికే చాలామంది కర్ణాటక వాసులు విన్నారు. వాటిని బీబీసీతో పంచుకున్నారు.
ఈ గుర్తు తెలియని వ్యక్తి విపులంగా రాసిన ఫిర్యాదులో ఒళ్లు గగుర్పొడిచే, భయంకరమైన ఆరోపణలు ఎన్నో ఉన్నాయి. దాని గురించి తెలుసుకునే ముందు, ధర్మస్థల చుట్టూ ఉన్న నేరారోపణల చరిత్ర తెలుసుకోవాలి.
ధర్మస్థల ఒక పుణ్యక్షేత్రం. దాని పక్కనే ఆనుకుని ఉజిరే అనే మరో ఊరు ఉంటుంది. ఈ రెండూళ్ళ చుట్టుపక్కల అడవిలాంటి ప్రాంతాలు, నేత్రావతి అనే చిన్న నది కూడా ఉంది. అక్కడ ఘోరమైన నేరాలకు దశాబ్దాల చరిత్ర ఉందని స్థానికులు చెబుతున్నారు.


చెప్పుకుంటూ పోతే ఎందరో...
అది 1979.
ధర్మస్థలలో ఓ మహిళా టీచర్ ఉండేవారు. ఆమె భర్త డాక్టర్. ఆమెకు హెడ్‌మిస్ట్రెస్‌గా రావాల్సిన ప్రమోషన్ రాలేదు. ఆమె కోర్టుకు వెళ్లి ప్రమోషన్ తెచ్చుకున్నారు.
''గతంలో ఆమె ప్రమోషన్‌కు అడ్డం పడిన అక్కడి స్థానిక ప్రముఖులు కొందరు, దీన్ని సహించలేకపోయారు. దీంతో ఆమె భర్త ఇంట్లో లేనప్పుడు ఆమెను బాత్రూమ్‌లో తగలబెట్టేశారు. దోషులెవరో తేలలేదు'' అంటూ దాదాపు 45 ఏళ్ళ నాటి నేరాల గురించి బీబీసీకి చెప్పారు మహేశ్ శెట్టి తిమ్మరోడి, గిరీశ్ మట్టెనవార్ అనే వ్యక్తులు.
వీరు ధర్మస్థల నేరాల బాధితులకు న్యాయం కోసం కొంత కాలంగా పోరాడుతున్నారు.
ఇప్పటికీ ధర్మస్థల వాసులకు ఆ టీచర్ గుర్తున్నారు. ఆమె తమను కాదని కోర్టుకెళ్లడం సహించలేని కొందరు పెద్దలు ఈ పని చేశారని స్థానికులు ఎందరో బీబీసీకి చెప్పారు.
''తన భార్యను చంపిన వారి పేర్లను ఆమె భర్త బతికి ఉన్నప్పుడు బహిరంగంగానే చెబుతూ ఉండేవారు. కర్ణాటక సోషల్ మీడియాలో ఆమె భర్త వీడియో ఆ పేర్లతో సహా తిరుగుతుంటుంది'' అని బీబీసీతో అన్నారు మహేశ్.
అది 1986.
17 ఏళ్ల ఓ మలయాళీ అమ్మాయి ఇంటర్-పీయూసీ చదువుతోంది. ఆమె తండ్రి కమ్యూనిస్టు పార్టీ తరపున ధర్మస్థల పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నారు. సరిగ్గా ఆ రోజుల్లోనే అంటే 1986 డిసెంబరులో కాలేజీకి వెళ్లిన అమ్మాయి ఇంటికి రాలేదు. పోలీసులు లోతుగా విచారించలేదు. 56 రోజుల తరువాత నేత్రావతి నది ఒడ్డున శవం దొరికింది. బట్టల్లేవు. శరీరం ఎముకల గూడులా ఉంది.
ఆందోళనలు జరిగాయి. అయినా కేసులో పురోగతి లేదు. అసలైన దోషులు తేలలేదని ఆమె కుటుంబం ఆరోపిస్తోంది. సాధారణంగా ఆ కుటుంబంలో ఎవరైనా చనిపోతే దహనం చేస్తారు. కానీ ఆమెను పూడ్చారు తండ్రి.
ఒకవేళ భవిష్యత్తులో పోలీసులు ఆమె మరణంపై విచారణ చేస్తే సాక్ష్యం ఉండాలని అలా చేశారాయన. తరువాత ఆయన కూడా చనిపోయారు.
ఇది జరిగి దాదాపు 4 దశాబ్దాలు, అంటే 38 సంవత్సరాలు.. ఇప్పటికీ ఆ సమాధిని ఎవరూ తవ్వలేదు. కేసు తెరవలేదు. న్యాయం జరగనూ లేదు. ఆమె గురించి ధర్మస్థల, పక్కనే ఉన్న ఉజిరే గ్రామాల్లో చాలామంది ఈ కథ అంతా అక్షరం పొల్లుపోకుండా చెబుతారు.
''మా సోదరి కాళ్లు, చేతులు తాళ్లతో కట్టేసి ఉన్నాయి. కేసు దర్యాప్తుకు అవసరం అవుతుందని శవాన్ని మా నాన్న ఖననం చేశారు. నా చెల్లి నోటిలో ముందు దంతాలు లేవని మృతదేహాన్ని చూసిన నా అత్త చెప్పింది. విచారణ కోసం పోరాటం చేసిన మా నాన్నను చంపే ప్రయత్నమూ చేశారు. చుట్టాలను మా ఇంటికి రానిచ్చేవారు కాదు.
ఎన్నికల్లో నిలబడడంతో పాటు ఒక ఎస్టీ కుటుంబాన్ని పరిహారం లేకుండా వెళ్లగొడితే దానిపై నిరసన తెలిపినందుకు మా నాన్నపై ఇక్కడి పెద్దలకు కోపం. వారే ఇలా చేయించారు. పోలీసులు సరిగా దర్యాప్తు చేస్తే ఇప్పటికైనా నిజం బయటపడుతుంది'' అని బీబీసీతో చెప్పారు బాధితురాలి సోదరి.

‘ఇప్పటికైనా నా కూతురు గురించి చెప్పండి’
అది 2003.
ఎంబీబీఎస్ మొదటి ఏడాది చదివే అమ్మాయి తన స్నేహితురాళ్లతో కలసి ధర్మస్థల వెళ్లారు. ఆ తర్వాత అకస్మాత్తుగా కనిపించకుండా పోయారు. ఆమె తల్లి ధర్మస్థల వచ్చి కూతురి కోసం వెతకడం మొదలుపెట్టారు.
తన కూతురు గురించి వాకబు చేస్తుంటే స్థానికుల సమాధానం విని ఆమె ఆశ్చర్యపోయారు. 'ఇక్కడ వెతక్కండి, ఇక్కడ ఇదంతా మామూలే' అనేవారు వారు. బెళ్తనగుడి పోలీసులు అసలు ఫిర్యాదే తీసుకోలేదనేది తల్లి ఆరోపణ.
''నీ కూతురు ఎవరితోనో వెళ్లిపోయి ఉంటుందని పోలీసులు చెప్పారు. తరువాత నేరుగా ఆ ఊరిలోని పెద్ద మనిషి దగ్గరకు వెళ్లాను. 'మాకు ఇదే పనా? నువ్వే చూసుకో' అన్నారాయన. నేను అక్కడే గుడి బయట కూర్చున్నాను.
ఆరోజు సాయంత్రం 7 గంటలకు ముగ్గురు మనుషులు నా దగ్గరకు వచ్చి 'మీ అమ్మాయిని చూపిస్తాం' అని నన్ను తీసుకెళ్లి, కళ్లకు గంతలు కట్టి ఒకచోట కుర్చీలో కట్టేశారు. ఎవరో వచ్చి ఇక్కడి నుంచి వెళ్లకపోతే ప్రాణాలకు ప్రమాదం అన్నారు. నేను నా కూతురి గురించి అడగ్గానే వెనుక నుంచి నా తలపై బలంగా కొట్టారు. ఆ తరువాత ఏం జరిగిందో నాకు తెలియదు.
నేను మూడు నెలల తరువాత బెంగళూరులోని ఆసుపత్రిలో కళ్లు తెరిచాను. ఆసుపత్రికి ఎవరు తీసుకువచ్చారో, బిల్లు ఎవరు కట్టారో కూడా నాకు తెలియదు.
డిశ్చార్జి చేశాక మంగళూరులోని సొంతింటికి వెళ్తే, లోపలంతా కాలిపోయి ఉంది. మా దుస్తులు, అమ్మాయి దుస్తులు, నా రికార్డులు, మా అమ్మాయి రికార్డులు తగలబడ్డాయి. ఏం చేయాలో తెలియక వారం రోజుల పాటు రోడ్లపై తిరిగాను'' అంటూ బీబీసీకి చెప్పారు ఆమె.
ఆమెకు బహుశా 70 ఏళ్ల వయసు ఉంటుంది. కోల్‌కతాలో సీబీఐలో స్టెనోగ్రాఫర్‌గా పనిచేశానని ఆమె చెబుతున్నారు.
తాజాగా వందల మందిని పూడ్చానన్న వ్యక్తి వార్తలు చూసి ఈమె మళ్లీ ధర్మస్థల వచ్చారు. తన కూతురు అస్థికలు దొరికితే డీఎన్ఎ పరీక్ష చేసి వాటిని తనకు అప్పగించాలని ఆమె కోరుతున్నారు.
''బ్రాహ్మణ పద్ధతిలో నేను నా కూతురికి అంత్యక్రియలు చేసుకుంటాను. నాకు కనీసం ఆ తృప్తి అయినా మిగల్చండి. అవతలి వారు చాలా పెద్ద వారు. నేను వారితో పోరాడలేను. వారికి ధనబలం ఉంది. నాకు డబ్బు లేదు. జనం లేరు. కొందరు నాకు మద్దతిస్తున్నారు. వారి కారణంగానే నేను రాగలిగాను. లాయర్లు నాకు చాలా సాయం చేస్తున్నారు. నేను 20 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాను. దయచేసి నా కూతురి అస్థికలు ఇప్పించండి'' అని కన్నీటితో వేడుకుంటున్నారామె.

17 ఏళ్ల అమ్మాయిని ఏం చేశారు?
అది 2012.
ధర్మస్థల ప్రాంతానికి చెందిన ఒక యువతి ఇంటర్ (పీయూసీ) రెండో ఏడాది చదువుతుండగా, లైంగిక దాడికి గురై, హత్యకు గురైంది. 2012 అక్టోబరు 10న దుస్తుల్లేని , శరీరం అంతా గాయాలతో ఉన్న శవం దొరికింది.
''ఆమెపై చాలా మంది లైంగిక దాడి చేశారని ఆ శరీరం చూసిన ఎవరైనా చెప్పగలరు'' అని బీబీసీతో చెప్పారు ఆమె కుటుంబ సభ్యులు. ఆమె కేసు విచారణలో చాలా నిర్లక్ష్యం ఉందని కుటుంబ సభ్యులు, స్థానికులు ఆరోపిస్తున్నారు.
సంతోష్ రావు అనే వ్యక్తిని నిందితుడని పోలీసులు చెప్పారు. 9 ఏళ్లు జైల్లో ఉన్న తరువాత, 2023లో ఆయన నిర్దోషి అని కోర్టు వదిలేసింది. అసలు ఆ సంతోష్ రావుకూ, ఈ నేరానికీ ఏ సంబంధమూ లేదని స్థానికులు, ఆమె కుటుంబ సభ్యుల మాట కూడా.
కానీ అసలు నిందితుడు దొరకలేదు. ఈ కేసు మొత్తం కర్ణాటకను కదలించడమే కాకుండా, ధర్మస్థల నేరాల చరిత్రలో కీలకంగా నిలిచింది. ఆ 17 ఏళ్ల అమ్మాయి తాత బీబీసీతో వివరంగా మాట్లాడారు.
''ఇది ఇవాళ్టి విషయం కాదు. వాళ్లు పోలీసులు గురించి పట్టించుకోకుండా హత్య చేసిన వారిని రోడ్డు పక్కనే పాతేసేవారు. నాకు పక్కాగా తెలుసు. ఆ శవాలు పూడ్చిన వారు ఒకరు కాదు, చాలామంది ఉన్నారు. వారు నాతోనే స్వయంగా 'ఇవాళ ఒక హత్యకు గురైన ఓ వ్యక్తి శవాన్ని పూడ్చాం’’ అంటూ చెప్పేవారు.
వారంలో రెండు మూడు ఘటనలు జరిగేవి. ఎన్నో లెక్కలు చెప్పలేను. అప్పట్లో టాయిలెట్లు లేక అడవిలోకి వెళ్లేవాళ్లం. అప్పుడు అడవి పందులు శవాలను పూడ్చినచోట తవ్వేవి, ఎముకల గూళ్లు బయటపడేవి. పంచాయతీ వారు శవాలు పూడ్చారంటూ కొత్తగా ఒక వాదన తెస్తున్నారు కొందరు. ఇప్పుడు పంచాయతీ గురించి మాట్లాడేవారు అసలు అప్పుడు పుట్టనేలేదు. మేం అతణ్ణి (ఒక ప్రముఖుడిని) దేవుడిలా చూసేవాళ్ళం. దూర ప్రాంతం నుంచి దర్శనానికి వచ్చిన ఎందరికో అన్యాయం జరిగింది'' అని బీబీసీతో చెప్పారు అమ్మాయి తాత.
''నా మనుమరాలి గురించే కాదు, అసలు ఏ అమ్మాయికీ అలా జరగకూడదు. నా మనుమరాలి గురించి అడిగినందుకు నా దుకాణాలు లాక్కున్నారు. దేవుణ్ణి, అమ్మవారినే నేరుగా అడిగాను న్యాయం కావాలని. దేవుడు, అమ్మవారు న్యాయం చేస్తారు.
ధర్మస్థల వరకూ వచ్చిన ఒక మంత్రి మా ఇంటికి వస్తారు అన్నారు. కానీ రాలేదు. ఎవరు ఆపారు అతణ్ణి? అంతా మన కళ్ల ముందే జరుగుతుంది. ఎవరు అనేది అందరికీ తెలుసు. నేను సాక్ష్యం ఇస్తాను అంటూ ఒకరు ముందుకు వచ్చారు కూడా. కానీ పోలీసులను ఆపుతున్నది ఎవరు?'' అంటూ ప్రశ్నించారాయన.
లైంగిక దాడి బాధితురాలు కాబట్టి ఆమె పేరు, కుటుంబ సభ్యుల పేరు, ఫోటోలు బీబీసీ ప్రచురించడం లేదు. కానీ కర్ణాటకలో ప్రతి ఒక్కరికీ ఈమె గురించి తెలుసు. ధర్మస్థలలో ఎక్కడ చూసినా ఆమె ఫోటో కనిపిస్తూంటుంది. ఆమె ఇంటికి వెళ్ళే దారి అంటూ బోర్డులు కనిపిస్తాయి. 2012లో ఈ కేసు కర్ణాటకను కుదిపేసింది. ఎందరో ఈ అమ్మాయికి న్యాయం జరగాలంటూ ఆందోళనలు చేశారు, ఇంకా చేస్తున్నారు.
ఆమె ఇంటి దగ్గరలో విగ్రహం పెట్టారు. ధర్మస్థల మందిరానికి వెళ్లే కన్నడిగులు చాలా మంది ఆమె ఇంటికి వెళ్లి ఆమె తల్లిని కలసి సంతాపం చెబుతుంటారు. ఆమె విగ్రహం ఉన్న చోటును దాదాపు గుడిలా చేసి పూజిస్తున్నారు.
ఆమె గురించి సమీర్ అనే యూట్యూబర్ చేసిన వీడియోకు రెండు కోట్ల వ్యూస్ వచ్చాయి. కానీ దాన్ని ఆయన తొలగించాల్సి వచ్చింది. ఈ కేసులో కీలక సాక్షులు కూడా హత్యకు గురయ్యారని ఆరోపణలు వచ్చాయి. ఆ కేసులో ఒక కన్నడ చానెల్‌లో బహిరంగంగా, ధైర్యంగా మాట్లాడిన వ్యక్తిని ధర్మస్థల వాసులు హీరోలాగా స్వాగతించిన వీడియోలు వైరల్ అయ్యాయి.

లెక్కకు అందని అసహజ మరణాలు
ఇక్కడ రాసినవి కేవలం నలుగురు మహిళ గురించే. తాను వందల శవాలు పూడ్చానంటూ ముందుకు వచ్చిన వ్యక్తికీ, ఇక్కడ చెప్పిన ఈ 4 కేసులకీ సంబంధం లేదు. ఇది పూర్తిగా కొత్తది.
ఇలా చెప్పుకుంటూ పోతే ధర్మస్థల చుట్టూ అసహజ మరణాలు, దారుణమైన లైంగిక దాడుల కథలు ఎన్నో వినిపిస్తాయి. దశాబ్దాల నుంచీ ధర్మస్థలలో వందల మంది మహిళలపై లైంగిక దాడులు, హత్యలు, మగవారి హత్యలు జరిగాయనేది స్థానికుల మాట. ఈ నాలుగు కేసుల వారు చెప్పిన ఫిర్యాదులపై దక్షిణ కన్నడ జిల్లా పోలీసులతో మాట్లాడే ప్రయత్నం చేసింది బీబీసీ, కానీ వారు అందుబాటులోకి రాలేదు.
కానీ ఈ మాట సాక్ష్యాలు లేకుండా చెబుతున్నది కాదు.
ధర్మస్థల, ఉజిరే గ్రామాల్లో 2001 నుంచి 2011 మధ్యలో సంభవించిన అసహజ మరణాలు 452 అని బెళ్తంగడి పోలీసులు ఇచ్చిన ఆర్టీఐ రిప్లైలో ఉంది. అందులో 96 మరణాలు మహిళలవి. ఇవన్నీ పోలీసుల దృష్టికి వెళ్లిన అసహజ మరణాలు. అవి ఆత్మహత్యలు, హత్యలు లేదా ప్రమాదాలు కూడా కావచ్చు.
కానీ మొత్తం పోలీస్ స్టేషన్ పరిధి కూడా కాకుండా కేవలం రెండు గ్రామాల్లో అన్ని అసహజ మరణాలు జరగడం ఆశ్చర్యం అంటారు ఆర్టీఐ దాఖలు చేసిన నాగరిక సేవా ట్రస్టు వారు.
''ధర్మస్థలలో ఆత్మహత్య చేసుకుంటే మోక్షం వస్తుందని ఒకటి పుట్టించారు. కానీ అలాంటిదేమీ లేదు'' అని బీబీసీతో చెప్పారు సోమనాథ నాయక్.
''ఇక్కడ ఒక ముఠా ఉంటుంది. జంటగా వచ్చిన వారిలో బావున్న వారిని గుర్తించి ఆ జంటను వేరు చేసి, స్త్రీపై లైంగిక దాడి చేస్తారు. ఆ తరువాత ఏం చేస్తారో నేను చెప్పక్కర్లేదు. దానికి డీ గ్యాంగ్ అని పేరు. ధర్మస్థలలోని కొందరు పెద్దల అండదండలు వారికి ఉన్నాయి. మొత్తంగా వారు చేసే అరాచకాల వల్ల ఈ ప్రాంతానికి ధర్మస్థల రిపబ్లిక్ అనే పేరు పెట్టారు'' అన్నారు సోమనాథ.
ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే, తాజాగా లొంగిపోయిన వ్యక్తి తాను స్వయంగా పూడ్చానని చెబుతున్న వందల శవాలు కూడా ఈ 452 లెక్కలోనివి కాదు. అవి అసలు పోలీసుల రికార్డుల్లో చేరనివి!
ఈ అసహజ మరణాలపై కర్ణాటక ప్రభుత్వం నియమించిన ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ వయొలెన్స్ అగైనెస్ట్ విమెన్ అండ్ చిల్డ్రన్ కమిటీ అధ్యక్షుడు డా. వీఎస్ ఉగ్రప్ప విచారణకు ఆదేశించారు. కానీ ఆ నివేదిక ప్రస్తుత పరిస్థితి గురించి ఎవరికీ తెలియదు.
అయితే 2012 నాటి 17 ఏళ్ల అమ్మాయి ఘటన తరువాత కర్ణాటకకు చెందిన లాయర్లు, డిజిటల్ మీడియా – యూట్యూబర్లు, ప్రజా హక్కుల సంఘాలు, హిందుత్వ సంఘాలు ఈ ఘటనలపై పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగాయి. రాష్ట్రం మొత్తం కదలడంతో, 2012 తరువాత ధర్మస్థలలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని వారంతా చెబుతున్నారు. అయితే పాత నేరాలతో పాటు, అక్కడ జరిగే అనేక చట్ట వ్యతిరేక అంశాలపై విచారణ కోసం వారు పట్టుబడుతున్నారు.
వారంతా ఒకే వ్యక్తి, ఒకే కుటుంబం, ఒకే సంస్థవైపు తమ వేళ్లన్నీ చూపిస్తున్నారు. కోర్టు ఉత్తర్వుల వలన ఆ వ్యక్తి లేదా కుటుంబం పేరు వివరాలు మేం ఇక్కడ రాయడంలేదు. ఈ ఆరోపణలపై వారిని సంప్రదించే ప్రయత్నం చేసింది బీబీసీ. వారు అందుబాటులోకి రాలేదు.

‘నిరసనలకు దిగినా వదిలిపెట్టరు’
హత్యలు తగ్గినప్పటికీ, తమపై నిరసనలకు దిగేవారిని ధర్మస్థల పెద్దలు వదలరనీ, ఏదో రకంగా వేధిస్తారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటీవలే రోడ్డు ప్రమాదానికి గురైన తనుశ్ శెట్టి అనే విద్యార్థి సంఘ నాయకుడు కూడా ఈ తరహా ఆరోపణ చేశారు.
''నేను చిన్నప్పటి నుంచీ ఇక్కడ నేరాలు, అత్యాచారాలు, భూ ఆక్రమణల గురించి వింటూ పెరిగాను. 2012 నాటి 17 ఏళ్ల అమ్మాయి ఘటన తరువాత, నేరం చేసిందెవరో తేలాలన్న ఆందోళనల్లో నేను భాగమయ్యాను.
ఇక్కడ శక్తిమంతమైన వ్యక్తులపై నేను సోషల్ మీడియాలో ఆందోళన ప్రారంభించాను. ఎందుకంటే మీడియా దాన్ని కవర్ చేయడం లేదు.
ఆ క్రమంలో 3 నెలల క్రితం నాకొక మెసేజ్ వచ్చింది... 'త్వరలో నీకు యాక్సిడెంట్ జరగబోతోంది' అని. 2 నెలల క్రితం నేను బైక్‌పై వెళ్తుండగా ఆటో ఢీకొంది. 'నీ ప్రమాదం నేను కళ్లారా చూశాను.. ఇది దేవుని శాపం' అని మళ్లీ పోస్టు వచ్చింది.
నేను స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్తే వారు తీసుకోలేదు. మంగళూరు ఎస్పీ దగ్గరకు వెళ్లాక, ఆయన ఆదేశాలతో తప్పని పరిస్థితుల్లో, చాలా ఇబ్బంది పెట్టి, అప్పుడు కేసు తీసుకున్నారు. కానీ ఏ చర్యా తీసుకోలేదు.
విచిత్రంగా నేను నా ఫిర్యాదులో ఏ పెద్ద మనిషి పేరూ రాయకపోయినప్పటికీ, నా కేసు విచారణపై స్టే కోసం, వారు హైకోర్టుకు వెళ్లారు. ఆ కోర్టు ఉత్తర్వుల్లో వారే ఒక పెద్ద మనిషి పేరు పెట్టి, నేను ఆయన పరువుకు భంగం కలిగించేలా చేస్తున్నానంటూ ఆరోపణలు చేశారు.
ఆ ప్రమాదంలో నా వేళ్లు తెగాయి. చేతుల్లో రాడ్లు పడ్డాయి. చేయి పైకి లేపలేను. ఎవరైతే ఆ పెద్దకు వ్యతిరేకంగా నిరసన చేస్తారో వారిని అంతా లక్ష్యంగా చేసుకుంటారు. వాళ్ల వ్యాపారాలను దెబ్బతీసి దాడులు చేస్తారు. నాది చాలా చిన్న ఉదాహరణ'' అని బీబీసీతో చెప్పారు తనుశ్ శెట్టి.

మనీ లాండరింగ్ ఆరోపణలు
అయితే ఇన్ని నేరాలు కూడా చాలా తక్కువే అంటారు కర్ణాటకకు చెందిన అనేక మంది ఆందోళనకారులు.
కొంతకాలంగా ధర్మస్థల ఘటనలపై పోరాడుతున్న మాజీ పోలీసు అధికారి, బీజేపీ మాజీ నాయకుడు గిరీశ్ మట్టెన్నవార్ దీని గురించి బీబీసీతో విపులంగా మాట్లాడారు. తాజాగా ఆ గుర్తు తెలియని వ్యక్తి ఫిర్యాదు కేసులో ఈయన చురుకుగా వ్యవహరిస్తున్నారు.
''ఇక్కడ మొత్తం క్రిమినల్ జస్టిస్ వ్యవస్థ కుప్పకూలిపోయింది. అన్ని కేసుల్లోనూ ఇదే జరుగుతోంది. 2012 నాటి 17 ఏళ్ల అమ్మాయి మరణానికి కాస్త ముందు అన్నాచెల్లెళ్లను డబుల్ మర్డర్ చేశారు. అందులో చెల్లిపై సామూహిక లైంగిక దాడి చేశారు. తల మీద మోది చంపారు.
అక్కడ వందల కొద్దీ లైంగికదాడులు, హత్యల వివరాలు నమోదు కాలేదు. అక్కడ నేరస్తులు మతం-దేవుడిని అడ్డం పెట్టుకున్నారు. తమను ప్రశ్నిస్తే దేవుణ్ణి ప్రశ్నించినట్టుగా చూపించారు. మేమూ భక్తులమే, మేం దేవుణ్ణి కాదు.. నిర్వాహకులను మాత్రమే ప్రశ్నిస్తున్నాం.
నాలుగైదు దశాబ్దాలుగా ఇది జరుగుతోంది. కానీ 2012 ఘటన తరువాత జనంలో వ్యతిరేకత వచ్చాక పరిస్థితిలో కాస్త మార్పు వచ్చింది. వారిపై కేవలం హత్య, లైంగిక దాడి నేరాల్లోనే కాకుండా వేల కోట్ల మనీ లాండరింగ్ ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ విషయంగా కూడా వారి వల్ల చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు. వీటన్నింటిపై విచారణ జరగాలి'' అని బీబీసీతో చెప్పారు గిరీశ్.

‘అడవిలో కుళ్లిపోయిన, నేత్రావతి నదిలో కొట్టుకుపోయిన, అడవి జంతువులు తినేసిన శవాల లెక్కలెక్కడ?’
దాదాపు 13 ఏళ్లుగా ధర్మస్థల నేరాలపై పోరాడుతున్నారు మహేశ్ శెట్టి తిమ్మరోడి. ఈయన రాష్ట్రీయ హిందూ జాగరణ్ వ్యవస్థాపకులు. సదరు వ్యక్తి చెప్పిన దాని కంటే ఎక్కువ శవాలే ఇక్కడ దొరుకుతాయని ఆయన అంటున్నారు.
''ధర్మస్థల దగ్గరలో చాలా ఎక్కువ లైంగిక దాడులు, హత్యలు జరిగాయి. వాటి వెనుక చాలా మంది పెద్దలు, శక్తిమంతులున్నారు. 2012 నాటి కేసులో నేను కొట్లాడుతున్నాను. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? ఇక్కడ అసలు చట్టమే లేదు.
ఇక్కడ సమస్యలు ఉన్నప్పుడు కూడా నాయకులు వచ్చి ప్రసాదాలు తీసుకువెళ్లిపోతారు, సమస్యలపై మాట్లాడరు. అప్పటి బీజేపీ ప్రభుత్వం ఇక్కడి పెద్ద మనిషికి పూర్తిగా సహకరించింది. కాంగ్రెస్ కూడా సహకరిస్తోంది. వాళ్లు అందర్నీ కొనగలరు. ఎక్కడా ఒక ఎఫ్ఐఆర్ కూడా లేకుండా జాగ్రత్త పడ్డారు.
మేం అసలు భారతదేశంలో ఉన్నామా అనిపిస్తుంది. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ అందరు నాయకులూ వచ్చి వారి కాళ్ల మీద పడతారు. ఆయనపై పోరాడుతున్నందుకు 13 ఏళ్లలో నాపై 25 కేసులు పెట్టారు'' అన్నారు మహేశ్ శెట్టి.
''నేను ధర్మస్థలలో బడిలో చదువుకునే రోజుల నుంచీ వీటిని వింటున్నాను. నేను వారి నేరాల గురించి 24/7 నెల రోజుల పాటు మాట్లాడగలను. నా చిన్నతనం నుంచీ ధర్మస్థలలో చనిపోయిన, లైంగిక దాడికి గురైన వారి సంఖ్య లెక్క లేనంత ఉంది.
మొత్తం కర్ణాటకలో జరిగిన వాటి కంటే ఈ ఊరిలో జరిగిన వాటి సంఖ్యే ఎక్కువ. ఈ మధ్య పోలీసులు ముందు లొంగిపోయిన వ్యక్తి చెప్పిన దాని కంటే చాలా ఎక్కువ ఉంటాయి. అడవిలో కుళ్లిపోయినవి, నేత్రావతి నదిలో కొట్టుకుపోయినవి, అడవి జంతువులు తినేసినవి.. వీటికి మీ దగ్గర లెక్కుందా?'' అని బీబీసీతో అన్నారు మహేశ్ శెట్టి.

కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ ఏమంటున్నాయి?
మహేశ్ శెట్టి ఆరోపణలను మూడు పార్టీలూ ఖండించాయి.
''ఎవరైనా భక్తితో ధర్మస్థల వెళ్లి ఎవరిని అయినా దర్శించుకోవచ్చు. అది వ్యక్తిగతం. దానికి పార్టీతో సంబంధం ఉండదు. కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా సిట్ వేసింది. ఇక్కడ నేరం చేస్తే, చేసిన వారు ఎంత పెద్ద వారైనా వారిని పట్టుకునే బాధ్యత, బాధితులకు న్యాయం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీదే. ఇక్కడ ఎవరైనా వ్యక్తిగతంగా ధర్మస్థలం వెళ్ళి ఎవరి కాళ్లైనా పట్టుకున్నారా అన్నది మనకు సంబంధం లేదు. అక్కడ నిజాలు చెప్పేవారిని కాపాడడం కూడా కాంగ్రెస్ బాధ్యతే'' అంటూ స్పందించారు కాంగ్రెస్ పార్టీ కర్ణాటక రాష్ట్ర మీడియా కమిటీ ఉపాధ్యక్షులు సత్య ప్రకాశ్.
''దీనిపై సిట్ విచారణ జరుగుతోంది. ముందు విచారణ పూర్తయి, నివేదిక బయటకు రానివ్వండి'' అని అన్నారు బీజేపీ అధికార ప్రతినిధి ఒకరు.
''మేమెవరికీ మద్దతివ్వడం లేదు. నేరం రుజువైతే శిక్ష వేయండి. ధర్మస్థలలో ఎవరికీ మా పార్టీతో సంబంధం లేదు. సిట్ విచారణకు ఎదురుచూద్దాం'' అని బీబీసీతో చెప్పారు జేడీఎస్ అధికార ప్రతినిధి అరివలగన్.

ఫొటో సోర్స్, Getty Images
గౌరీ లంకేశ్ పత్రికలోనూ కథనాలు
బెంగళూరులో హత్యకు గురైన జర్నలిస్ట్ గౌరీ లంకేశ్‌కు చెందిన లంకేశ్ పత్రిక చాలా ఏళ్ళ క్రితం ధర్మస్థల గురించి కథనాలు ప్రచురించింది.
''ఎందరో నిజాయతీపరులైన విలేఖర్లను వారు చంపారు. శంకర్ భట్ ప్రెస్ ఆఫీసు తగలబెట్టారు. ఈ ధర్మస్థల మాఫియాపై గౌరీ లంకేశ్ పత్రిక దీపావళి ప్రత్యేక సంచికలో ఒక ప్రత్యేక కథనం ప్రచురించింది. ఆ వెంటనే ఆ రిపోర్టర్‌ను చంపేశారు. 1986 కేసు గురించి వచ్చిన పత్రికలు పంచే పేపర్ బాయ్‌ని కూడా చంపేశారు'' అని బీబీసీతో చెప్పారు గిరీశ్.
ధర్మస్థలలో ఈ నేరాలతో పాటు భూ ఆక్రమణలు, దేవాలయ నిర్వహణ, దేవాలయ యాజమాన్య హక్కులకు సంబంధించిన అంశాలు, నిబంధనలకు విరుద్ధంగా జరిగే అధికంగా ఉండే వారపు వడ్డీ వ్యాపారాలపై పలువురు స్థానికులు పోరాడుతున్నారు. దీనిపై నాగరిక సేవా ట్రస్టు అనే సంస్థ సుదీర్ఘంగా న్యాయ పోరాటం చేస్తోంది.
ధర్మస్థల పెద్దలు కనీసం 16 చట్టాలను ఉల్లంఘించారని, నేరాల విషయంగానే కాకుండా, ఆయా ఉల్లంఘనల పరంగా వారు జైలుకు వెళ్లగరలని సోమనాథ్ నాయక్ బీబీసీ వద్ద ఆరోపించారు. ఈ పోరాటాలకు ప్రతిగా తాము అనేక కేసులు ఎదుర్కొంటున్నట్టు వారు చెప్పారు.

కర్ణాటక ప్రధాన స్రవంతి మీడియాలో ధర్మస్థల వార్తలు తక్కువగా వస్తుండడంతో డిజిటల్ మీడియా ఈ అంశాన్ని తలకెత్తుకుంది.
కన్నడలో ప్రముఖ యూట్యూబర్ సమీర్ తన దూత చానెల్ ద్వారా, అజయ్ తన కుడ్ల రాంపేజ్ చానెల్ ద్వారా, అభిషేక్ యునైటెడ్ మీడియా ద్వారా, దినేశ్ దిను డి టాక్స్ ద్వారా, సుబ్రమణ్య హండిగే థర్డ్ ఐ ద్వారా ఈ ధర్మస్థల నేరాలపై విస్తృతమైన కవరేజీ ఇచ్చారు.
దీనికి ప్రతిగా సమీర్ పై దాదాపు 3 కేసులు దాఖలయ్యాయి. అనేక సందర్భాల్లో కోర్టులు ఆ వీడియోలను తొలగించాలని ఆదేశించాయి. ఈ యూట్యూబర్లకు కన్నడ యువతలో మెయిన్ స్ట్రీమ్ మీడియాకు మించిన గౌరవం ఏర్పడింది.
ఒక రకంగా 2012నాటి 17 ఏళ్ల అమ్మాయి లైంగిక దాడి, హత్య కేసుపై కర్ణాటకలో అవగాహన రావడానికి ఈ డిజిటల్ మీడియా కూడా కారణం.
ఆ ఘటన తరువాత తమకు ధర్మస్థలలో పెద్దలపై గౌరవం తగ్గినట్టు పలువురు స్థానికులు స్వయంగా బీబీసీకి చెప్పారు.

‘పోలీసులు ఎందుకు కదలడం లేదు?’
అలా 2012లో మొదలైన ఆందోళన తాజాగా గుర్తు తెలియని వ్యక్తి ఫిర్యాదుతో తెరమీదకు వచ్చింది. బెంగళూరుకు చెందిన సీనియర్ న్యాయవాది ఆయన్ను కోర్టు ముందు పెట్టారు.
''తాను ఈ విషయాలు చెప్తే ఎవరూ నమ్మరని తనంతట తానే ఆ అస్థికలు తీసుకుని వచ్చాడు. అతను చెప్పేది నిజమా అబద్ధమా అని పోలీసులు తేల్చాలి. మీరు కూడా నమ్మకండి. నిజాయితీగా విచారణ చేసి చూసి అప్పుడే నమ్మండి.
అతని గొంతుక కోర్టు ముందు విప్పే అవకాశం ఇవ్వాలని నేను నమ్మాను. అందుకే ఇందులోకి దిగాను. గతంలో నమోదైన ఏ నేరానికి సంబంధించిన పెండింగు కేసుకీ దీనికీ సంబంధం లేదు. ఇది పూర్తిగా కొత్త కేసు.
ఈ ధర్మస్థల చుట్టూ 1970ల నుంచీ వివాదాలు ఉన్నాయి. నాకు తెలిసి భారత న్యాయ వ్యవస్థలో ఇదో అరుదైన కేసు'' అని బీబీసీతో అన్నారు సుప్రీం కోర్టు న్యాయవాది కేవీ ధనుంజయ.

ప్రస్తుతం ఈ కేసు విచారణ కోసం కర్ణాటక ప్రభుత్వం నలుగురు ఐపీఎస్ అధికారులతో కలసి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను జూలై 19న ఏర్పాటు చేసింది. వారు డా. ప్రణవ్ మహంతి ఐపీఎస్, ఎంఎన్ అనుచేత్ ఐపీఎస్, సౌమ్యలత ఐపీఎస్, జితేంద్ర కుమార్ దయామ ఐపీఎస్. వారికి మరో ఇరవై మంది పోలీసు సిబ్బందిని ఇచ్చింది.
అయితే ఆ నలుగురు ఐపీఎస్‌లలో కూడా ఒకరు వ్యక్తిగత కారణాలతో ఈ విచారణ నుంచి బయటకు వెళ్లిపోతున్నట్టు కర్ణాటక మీడియా చెబుతోంది. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.
ఇప్పటికే ఈ సిట్, విచారణ ప్రారంభించి సదరు ఫిర్యాదుదారుణ్ణి 5 గంటలకు పైగా విచారించింది. తవ్వకాలూ జరుపుతోంది.
దీనిపై ధర్మస్థల దేవాలయం తరపున కె.పార్శ్వనాథ జైన్ ఒక ప్రకటన విడుదల చేశారు. "సిట్ అత్యున్నత స్థాయిలో విచారణ జరిపి, నిజాలు వెలుగులోకి తీసుకువస్తుందని మేం ఆశిస్తున్నాం, కోరుతున్నాం" అని రాశారు.
మరోవైపు ధర్మస్థల స్టేషన్లోని క్రైం నంబర్ 39/2025లో ఎక్కడా ధర్మస్థలకు సంబంధించిన ఒక దేవాలయం పేరు కానీ, దాని నిర్వాహకులైన ఒక కుటుంబం పేరు కానీ, వారు నిర్వహించే ఇతర సంస్థల పేర్లు కానీ రాయవద్దంటూ, ఇప్పటికే రాసినవి తొలగించాలంటూ ఆ కుటుంబ సభ్యులు బెంగళూరు నగర కోర్టుకు వెళ్లగా, వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో ఎక్కడా వారి పేర్లు మీడియాలో రాయడానికి అవకాశం లేకపోయింది.
ఈ కథనంలో పలువురు ధర్మస్థల వాసులు, ఇతర ఆందోళనకారులు చేసిన ఆరోపణలపై స్పందన కోసం ధర్మస్థల పెద్ద అంటూ వారు చెప్పిన వ్యక్తిని సంప్రదించడానికి బీబీసీ ప్రయత్నించింది. కానీ వారు కానీ, ఆయన ప్రతినిధులు కానీ అందుబాటులోకి రాలేదు.

ఫొటో సోర్స్, UGC
ఆ గుర్తు తెలియని వ్యక్తి రాసిచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన ఎఫ్ఐఆర్ సారాంశం క్లుప్తంగా
- 1995 నుంచి 2014 డిసెంబరు వరకూ నేను ధర్మస్థలలోని ఒక దేవాలయంలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేశాను. నేను విధుల్లో చేరిన కొత్తల్లో అక్కడ శవాలు కనిపించేవి. చాలా ఆడవారి శరీరాలు బట్టలు లేకుండా, అండర్ వేర్ లేకుండా ఉండేవి. కొన్నిటిపై స్పష్టమైన గుర్తులు లైంగిక దాడి జరిగినట్టు, హింస జరిగినట్టు గుర్తులుండేవి. కొన్నిటి మీద యాసిడ్ తో కాల్చిన గాయాలుండేవి.
- 1998లో ఈ శవాలను రహస్యంగా పూడ్చేయమని, పోలీసులకు చెప్పవద్దని, చెబితే నన్నూ, నా కుటుంబాన్నీ చంపేస్తామని మా సూపర్‌వైజర్లు చెప్పారు. వారిది ఒకటే మాట, వాళ్ల మాట వినాలి లేదా కుటుంబంతో సహా ముక్కలుగా చావాలి. మా సూపర్‌వైజర్లు శవాలు ఉన్న చోటుకు పిలిచేవారు.
- 2010లో బహుశా 12 నుంచి 15 ఏళ్ల వయసున్న టీనేజీ అమ్మాయి శవం కనిపించింది. ఆమె స్కూల్ యూనిఫాం చొక్కా వేసుకుంది. అండర్ వేర్, స్కర్ట్ లేవు. లైంగిక దాడికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు కనిపించాయి. మెడపై గాయాలున్నాయి. ఆమె స్కూల్ బ్యాగుతో సహా పూడ్చడానికి గొయ్యి తవ్వమని చెప్పారు.
- మరోసారి 20 ఏళ్ల అమ్మాయి శవం. ఆమె ముఖం యాసిడ్ తో కాల్చారు. శవాన్ని న్యూస్ పేపర్లో చుట్టారు. ఆమెను పూడ్చకుండా, చెప్పులు, ఇతర వస్తువులు తీసుకుని, తగలబెట్టేయాలని సూపర్‌వైజర్లు చెప్పారు.
- ధర్మస్థలకు వచ్చే మగవారు, అంటే డెస్టిట్యూట్లు, పేదలను హత్య చేసిన ఉదంతాలు నాకు తెలుసు. వారికి ఊపిరాడకుండా చేసి చంపేసేవారు. కొన్ని నేను స్వయంగా చూశాను. కొన్ని సందర్భాల్లో శవాలను ఏ ఆధారమూ లేకుండా డీజిల్‌తో కాల్చేవాడిని. వందల శవాలు ఈ పద్ధతిలో చేశాం.

ఫొటో సోర్స్, Getty Images
- 2014లో మా కుటుంబానికి చెందిన ఒక అమ్మాయిని లైంగిక వేధించాడు. ఆ డిసెంబరులో కుటుంబంతో సహా పారిపోయాను. మౌనంగా ఉండటానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. నేను ఈ మధ్య ధర్మస్థలలో శవాన్ని పూడ్చిన ఒక చోటుకు వెళ్లి, అక్కడ కప్పెట్టిన శవంలో మిగిలిన భాగాలు బయటకు తీసి వాటి ఫోటోలు, ఈ ఫిర్యాదుకు జత చేస్తున్నాను. మీరు నమ్ముతారని. ఆ శవాలకు అంత్యక్రియలు చేస్తే నా అపరాధ భావం కాస్తైనా తగ్గి, వారి ఆత్మకు శాంతి కలుగుతుంది. ఆఖరికి చావులో కూడా గౌరవానికి నోచుకుని బాధితులకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను.
- నేను ఆరోపణలు చేస్తున్న వారంతా ఒక దేవాలయ పరిపాలనకు సంబంధించిన వారూ, ఇతర సిబ్బందీని. (కోర్టు ఆదేశాల మేరకు ఆ పేరు ఇక్కడ ఇవ్వడం లేదు.) శక్తివంతులు, పలుకుబడి ఉన్నవారు. తమను వ్యతిరేకించే వారిని చంపేస్తారు. కావాలంటే నాపై నిజ నిర్ధరణ పరీక్షలు చేసుకోండి.
- ఒకవేళ నేను ఆ పేర్లు చెప్పకుండానే మాయం అయిపోయినా, లేక నన్ను మర్డర్ చేసినా, నాకు తెలిసిన నేరస్తుల పేర్లు, వారి పాత్రలు, ఈ ఫిర్యాదులో రాసిన దాని కొనసాగింపు అంతా కూడా నేను వివరంగా రాసి సంతకం పెట్టిన ఫిర్యాదు కాపీ సుప్రీం కోర్టు న్యాయవాది కె.వి.ధనుంజయ గారికి అందించాను. ఈ సాక్ష్యాలు నాతో అంతరించకూడదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














