ఒడిశా: పూరీలో 15 ఏళ్ల బాలికకు నిప్పంటించిన ముగ్గురు యువకులు

A crowd of people gathered at the scene

ఫొటో సోర్స్, subrat kumar pati

    • రచయిత, సుబ్రతా కుమార్ పతి
    • హోదా, బీబీసీ కోసం

ఒడిశా రాష్ట్రం పూరీ జిల్లాలో శనివారం ఉదయం ఒక మైనర్ విద్యార్థినికి ముగ్గురు గుర్తు తెలియని యువకులు నిప్పు అంటించారు. ఆ విద్యార్థిని వయస్సు సుమారు 15 ఏళ్లు ఉంటుందని పోలీసులు చెప్పారు.

నీమాపాడా తహసీల్ బాయాబర్ గ్రామంలో ఉదయం 8:30 గంటల సమయంలో తన ఫ్రెండ్‌కు విద్యార్థిని పుస్తకాలు ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది.

బలంగా పోలీస్ స్టేషన్ పరిధిలోని భార్గవి నది మార్గంలో నిర్మానుష్యంగా ఉండే ఒక రోడ్డుపై బాలికను అడ్డగించి ఈ నేరానికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు.

బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ కేసు దర్యాప్తు కోసం అనేక బృందాలను ఏర్పాటు చేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
This case is from Balanga police station area of Puri district

ఫొటో సోర్స్, subrat kumar pati

విద్యార్థిని పరిస్థితి ఎలా ఉంది?

ఈ దాడిలో విద్యార్థిని చేయితో పాటు శరీరంలోని అనేక భాగాలకు తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి.

స్థానికుల సహాయంతో ఆమెను భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌ ఆసుపత్రిలో చేర్చారు.

ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

ప్రత్యేక వైద్య బృందం ఆమెకు చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

ఫ్రెండ్‌కు బుక్ ఇచ్చేందుకు తన సోదరి బయటకు వెళ్లిందని బాధిత విద్యార్థిని బంధువు ఒకరు తెలిపారు.

''ఈ విషయం తెలియగానే నేను వెంటనే అక్కడికి వెళ్లాను. కాలిన స్థితిలో ఆమె కనిపించింది. తర్వాత అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించాం. ఇలా ఎవరు చేశారో మాకు తెలియదు. నువాగోపాల్‌పూర్‌లో మా ఇల్లు ఉంటుంది. మా ఇంటికి, ఘటనా స్థలానికి మధ్య కిలోమీటర్ దూరం కూడా ఉండదు'' అని వివరించారు.

బలంగాలో కొందరు దుండగులు రోడ్డు మీద ఒక 15 ఏళ్ల బాలికకు నిప్పంటించిన వార్త తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని ఒడిశా ఉప ముఖ్యమంత్రి, మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి పార్వతి పరిడా ట్వీట్ చేశారు.

''భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌లో బాలిక చికిత్సకు కావల్సిన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. చికిత్స ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. దోషులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను ఆదేశించాం'' అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఈ ఘటన జరిగిన అసెంబ్లీ నియోజకవర్గం నుంచే పార్వతి పరిడా గెలుపొందారు.

మహిళలపై నేరాలు

ఫొటో సోర్స్, Getty Images

పోలీసులు ఏమంటున్నారు?

సైంటిఫిక్ టీమ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

నిందితులను వీలైనంత త్వరగా పోలీసులు అదుపులోకి తీసుకుంటారని ఒడిశా డీజీపీ వైబీ ఖురానియా అన్నారు.

''ఇది అమానవీయ చర్య. చట్టప్రకారం దోషులపై కఠిన చర్యలు తీసుకుంటాం'' అని చెప్పారు.

నేరం జరిగిన స్థలంలో ఫోరెన్సిక్ బృందం కీలక ఆధారాలను గుర్తించిందని మీడియాతో పూరీ ఎస్పీ పినాక్ మిశ్రా చెప్పారు

''ఈ కేసు దర్యాప్తుకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాం. ఇది చాలా సున్నిత అంశం. ఇది జరగడానికి దారి తీసిన పరిస్థితుల గురించి దర్యాప్తు చేస్తున్నాం. బాధిత బాలిక వాంగ్మూలాన్ని ఇంకా తీసుకోలేదు.

ఆమె ఆరోగ్యం నిలకడ స్థితికి వచ్చినప్పుడు ఆమె నుంచి వాంగ్మూలాన్ని సేకరిస్తాం. ప్రజల్ని విచారిస్తున్నాం. అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు జరుగుతోంది. ఈ కేసును ఛేదించి, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని నేను హామీ ఇస్తున్నా'' అని ఆయన వ్యాఖ్యానించారు.

నవీన్ పట్నాయక్

ఫొటో సోర్స్, Getty Images

ప్రభుత్వం గాఢ నిద్రలో ఉంది: నవీన్ పట్నాయక్

పూరీ ఘటన నేపథ్యంలో ఒడిశాలోని బీజేపీ ప్రభుత్వం తీరును మాజీ ముఖ్యమంత్రి, బీజేడీ నేత నవీన్ పట్నాయక్ విమర్శించారు.

''ఒడిశా అంతటా దాదాపు ప్రతిరోజూ మహిళలపై ఇలాంటి ఊహకందని ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దిగ్భ్రాంతి కలిగించే ఈ ఘటనలు తరచుగా జరుగుతుండటం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం.

ప్రస్తుత ప్రభుత్వ హయాంలో నేరస్థులు స్వేచ్ఛగా నేరాలకు పాల్పడుతున్నారనడానికి, శిక్ష పడుతుందన్న భయం వారికి లేదని చెప్పడానికి ఈ ఘటనలే మంచి ఉదాహరణ. ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల మహిళల భద్రత విషయంలో ఒడిశా ఎంత అసురక్షితంగా మారుతుందో ఈ ఘటనలను చూస్తే అర్థం అవుతుంది.

ఈ మొద్దు నిద్ర నుంచి ఇకనైనా ప్రభుత్వం నిద్ర లేచి దోషులకు కఠిన శిక్ష పడేలా చేస్తుందా? ఇలాంటి ఘటనలు మళ్లీ జరుగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? మీ సమాధానం కోసం ఒడిశాలోని మహిళలు, అమ్మాయిలు ఎదురుచూస్తున్నారు'' అని సోషల్ మీడియాలో నవీన్ పట్నాయక్ పోస్ట్ చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)