నాన్-వెజ్ పాలు అంటే ఏంటి, భారత్ వాటిని ఎందుకు తిరస్కరిస్తోంది?

పాలు

ఫొటో సోర్స్, Getty Images

సుంకాల విధింపునకు అమెరికా అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్ నిర్ణయించిన జూలై 9 గడువును ఇప్పుడు ఆగస్టు 1 వరకు పొడిగించారు.

దీనితో పాటు, భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి. ఇరుదేశాల మధ్య తాత్కాలిక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీనిపై త్వరలో ప్రకటన రావచ్చు.

వ్యవసాయం, పాల ఉత్పత్తులకు భారత మార్కెట్‌ను తెరవాలని అమెరికా నిరంతరం డిమాండ్ చేస్తున్నప్పటికీ, వ్యవసాయం, పాడి పరిశ్రమ రక్షణ కోసం వెనక్కు తగ్గమని భారత్ స్పష్టంగా సూచించింది.

'మాంసాహార పాలపై సాంస్కృతిక ఆందోళనలను చూపుతూ భారత ప్రభుత్వం అమెరికా పాల ఉత్పత్తుల దిగుమతికి అనుమతి నిరాకరించింది. అయితే, ఈ ఒప్పందం 2030 నాటికి రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు తీసుకువెళుతుందని భావిస్తున్నారు.

భారతదేశం తన పౌరుల భద్రత దృష్ట్యా వ్యవసాయ రంగం, పాల ఉత్పత్తుల అంశంపై ఎటువంటి చర్చలను నేరుగా ఆమోదించలేమని స్పష్టంగా పేర్కొన్నట్టు కొన్ని మీడియా నివేదికలు వెల్లడించాయి.

జంతువుల మాంసం, లేదా రక్తం కలిగిన దాణాను మేయని ఆవుల నుంచి మాత్రమే పాలు వచ్చేలా చూసుకోవడానికి వీలుగా అమెరికా పాల ఉత్పత్తులపై కఠిన నిబంధనలు విధించాలని భారత్ కోరుతోంది.

దేశంలోని కోట్లాదిమంది జీవనోపాధి కల్పించే పాడిపరిశ్రమపై భారత్ రక్షణాత్మక వైఖరి అవలంబించింది. వీరిలో చాలా మంది సన్నకారు రైతులే.

అయితే ఇది అనవసరమైన వాణిజ్య అడ్డంకి అని అమెరికా అంటోంది.

చర్చలు విఫలమైతే, ట్రంప్ భారతదేశంపై 26 శాతం సుంకాన్ని తిరిగి విధించే అవకాశం లేదని నిపుణులు భావిస్తున్నారు. వాస్తవానికి, భారతదేశంతో దాదాపు 45 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటును తగ్గించుకోవడానికి భారత్ మార్కెట్లను తెరవాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. అయితే సుంకాల గడువును ఆగస్టు 1 వరకు పొడిగిస్తూ ట్రంప్ ప్రభుత్వం 23 దేశాలకు ఒక లేఖ పంపింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పాడి పరిశ్రమ

ఫొటో సోర్స్, Getty Images

పాల ఉత్పత్తుల దిగుమతిపై భారీ సుంకాలు

భారతదేశ పాడి పరిశ్రమను గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ముఖ్యమైన భాగంగా పరిగణిస్తారు.

ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రకారం , 2023-24 సంవత్సరంలో దేశంలో 23.92 కోట్ల టన్నుల పాలు ఉత్పత్తి అయ్యాయి. మొత్తం పాల ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. 2023-24లో భారతదేశం 272.6 మిలియన్ డాలర్ల విలువైన 63,738 టన్నుల పాల ఉత్పత్తులను ఎగుమతి చేసింది. వీటిలో అత్యధికంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, అమెరికా, భూటాన్, సింగపూర్‌లకు ఎగుమతయ్యాయి.

భారత్‌లో పాల ఉత్పత్తుల దిగుమతిపై గణనీయమైన సుంకాలు ఉన్నాయి. చీజ్‌పై 30 శాతం, వెన్నపై 40 శాతం, పాలపొడిపై 60 శాతం సుంకం విధించారు.

న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల పాల ఉత్పత్తులు చౌకగా ఉన్నప్పటికీ, ఆ దేశాల నుంచి ఈ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడం లాభదాయకం కాకపోవడానికి ఇదే కారణం.

భారతదేశం తన మార్కెట్‌ను అమెరికన్ డెయిరీ ఉత్పత్తులకు తెరవాలని నిర్ణయిస్తే, దేశీయ డెయిరీ రంగానికి భారీ నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం , అమెరికన్ పాల ఉత్పత్తులను అనుమతిస్తే, భారతీయ పాల ఉత్పత్తుల ధరలు కనీసం 15% తగ్గుతాయి. దీంతో, రైతులు ప్రతి ఏటా సుమారు 1.03 లక్షల కోట్ల రూపాయల మేర నష్టపోతారు.

విదేశీ డెయిరీ ఉత్పత్తులకు భారత మార్కెట్‌ తెరిచినట్లయితే, భారతదేశం పాలు ఉత్పత్తి చేసే దేశం నుంచి, పాలను దిగుమతి చేసుకుని వినియోగించే దేశంగా మారిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

పాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికా చాలా కాలంగా భారత్‌లో పాల ఉత్పత్తులను అమ్మాలనుకుంటోంది.

నాన్-వెజ్ పాలు అంటే ఏమిటి?

భారతదేశం తన నుంచి మరిన్ని పాల ఉత్పత్తులను కొనుగోలు చేయాలని అమెరికా కోరుకుంటోంది. కానీ భారత్ తన విశ్వాసాలు, సాంస్కృతిక విలువల కారణంగా అలా చేయడానికి ఇష్టపడడం లేదు.

భారతదేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు శాకాహారులు. వారు జంతు మాంసం సంబంధిత మేతను తినే ఆవుల నుంచి వచ్చే పాలను తమ మత విశ్వాసాలకు అనుగుణమైన ఆహారంగా భావించరు.

జంతు మాంసం సంబంధిత మేతను తినే ఆవుల పాలనే నాన్-వెజ్ మిల్క్ అంటారు.

అమెరికా డెయిరీ పరిశ్రమలో ఆవుల బరువు పెరగడానికి జంతు మాంసం లేదా రక్తాన్ని కలిగి ఉన్న మేత తినిపిస్తారు.

ఈ మేతను సాధారణంగా 'బ్లడ్ మీల్’ అని పిలుస్తారు

"ఆవులకు ఇచ్చే మేతలో పందులు, చేపలు, కోళ్లు, గుర్రాలు, పిల్లులు, కుక్క మాంసం కూడా ఉంటుంది. అలాగే, పందులు, గుర్రాల రక్తం, ప్రోటీన్, కొవ్వు కోసం పంది, గుర్రపు రక్తాన్ని దాణాలో కలుపుతారు. తద్వారా అవి పెరుగుతాయి."అని సియాటిల్ టైమ్స్ పత్రికలో ఒక కథనం ప్రచురితమైంది.

సియాటిల్ టైమ్స్ లో ప్రచురితమైన ఒక కథనంలో ఏముందంటే.. "ఆవులకు పందులు, చేపలు, కోళ్లు, గుర్రాలు, పిల్లులు లేదా కుక్కల మాంసంతో కూడిన మేతను తినిపిస్తారు. పశువులకు ఈ జంతువుల నుండి ప్రోటీన్, కొవ్వు కోసం పంది, గుర్రపు రక్తాన్ని తినిపిస్తారు, తద్వారా అవి పెరుగుతాయి."

జంతువులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 'బ్లడ్ మీల్' అనేది జంతువుల బరువు పెరగడానికి ఉపయోగించే ప్రోటీన్ సమృద్ధిగల మేత.

'బ్లడ్ మీల్' అంటే..?

బీబీసీ హిందీలో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం, 'బ్లడ్ మీల్' అనేది మాంసం ప్రాసెసింగ్ (మీట్ ప్యాకింగ్) పరిశ్రమలో ఉత్పత్తి అయ్యే ఉప ఉత్పత్తి. దీనిని ఇతర జంతువులకు ఆహారంగా ఇవ్వడానికి ఉపయోగిస్తారు.

జంతువులను చంపిన తర్వాత, వాటి రక్తాన్ని సేకరించి ఎండబెట్టి ప్రత్యేకమైన మేతను తయారు చేస్తారు. దీనిని 'బ్లడ్ మీల్' అంటారు.

ఇది లైసిన్ (ఆవు ప్రోటీన్‌లో లభించే పది ముఖ్యమైన అమైనో ఆమ్లాలలో ఒకటి) అనే అమైనో ఆమ్లానికి చక్కని మూలంగా పరిగణిస్తారు. దీనిని పశుపోషణ వ్యాపారంలో ఉపయోగిస్తారు.

పాడి పశువులను ఆరోగ్యంగా ఉంచడానికి, ఎక్కువ పాలు ఉత్పత్తి చేయడానికి, వాటికి క్రమం తప్పకుండా ఆహారంలో 'బ్లడ్ మీల్' ఇస్తారు.

పాడి జంతువులే కాకుండా, పశుసంవర్ధక పరిశ్రమలో వీటిని విస్తృతంగా ఉపయోగిస్తారు. నత్రజనిని పెంచడానికి దీనిని ఎరువుగా ఉపయోగిస్తారు.

ఆవుల శరీరంలో లభించే ప్రోటీన్‌లో దాదాపు పది రకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి. వాటిలో లైసిన్, మెథియోనిన్ చాలా ముఖ్యమైనవి.

ఆవులు ప్రోటీన్లకు బదులుగా అమైనో ఆమ్లాలను జీర్ణం చేసుకోగలవు. కాబట్టి వాటికి 'బ్లడ్ మీల్' మొక్కజొన్న తినిపిస్తారు. 'బ్లడ్ మీల్'కు లైసిన్ మూలం అయితే, మొక్కజొన్న మెథియోనిన్‌కు మూలం. మిన్నెసోటా విశ్వవిద్యాలయం చేసిన పరిశోధనలో అటువంటి మేతను తినడం వల్ల రక్తంలో లైసిన్ పరిమాణం మరింత తగ్గిపోయిందని తేలింది.

సోయాబీన్ కూడా లైసిన్‌కు మంచి శాకాహార ఆధారిత మూలం.

భారతదేశంలోని అనేక ఆన్‌లైన్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో వ్యవసాయం కోసం 'బ్లడ్ మీల్'ను అమ్ముతున్నారు.

ఫీడిపీడియా అనే వెబ్‌సైట్ ప్రకారం, 'బ్లడ్ మీల్' తయారు చేయడం వల్ల కబేళా వ్యర్థాలు, కాలుష్యం తగ్గుతాయి. అయితే రక్తాన్ని ఎండబెట్టే ప్రక్రియకు చాలా విద్యుత్తు ఖర్చువుతుందని నిపుణులు నమ్ముతున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)