యెమెన్‌లో నిమిష ప్రియ మరణ శిక్ష వాయిదా పడేందుకు సాయం చేసిన ఈ ఇస్లామిక్ మతగురువు ఎవరు?

- రచయిత, ఇమ్రాన్ ఖురేషి
- హోదా, బీబీసీ ప్రతినిధి
యెమెన్‌లో భారతీయ నర్సు నిమిష ప్రియ మరణ శిక్ష వాయిదా పడినట్లు వార్తలు వచ్చిన తర్వాత.. 94 ఏళ్ల మతగురువు, గ్రాండ్ ముఫ్తీ ఏ.పీ అబూబకర్ ముస్లియార్ గురించి మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
యెమెన్‌కు చెందిన తలాల్ అబ్దో మహదీ హత్య కేసులో నిమిష ప్రియకు మరణ శిక్ష పడింది. ఈ శిక్ష నుంచి నిమిష ప్రియను కాపాడాలంటే.. మహదీ కుటుంబం ఇచ్చే క్షమాభిక్షే అత్యంత కీలకం.
కేరళలో అత్యంత గౌరవప్రదమైన, పలుకుబడి ఉన్న ముస్లిం మతనాయకుడు అబూబకర్ ముస్లియార్ నిమిష ప్రియ కేసు గురించి జులై 14న యెమెన్‌లోని కొందరు షేక్‌లతో మాట్లాడినట్లు నిమిష ప్రియను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న సేవ్ నిమిష ప్రియ ఇంటర్ యాక్షన్ కౌన్సిల్ క్యాంపెయిన్ తెలిపింది.
'' సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ సభ్యులు గ్రాండ్ ముఫ్తీని కలిసి మాట్లాడారు. ఆ తర్వాత, ఆయన యెమెన్‌లోని కొందరు పలుకబడి గల షేక్‌లతో మాట్లాడారు.'' అని యాక్షన్ కౌన్సిల్ సభ్యుడు, సుప్రీంకోర్టు న్యాయవాది సుభాష్ చంద్ర బీబీసీకి చెప్పారు. మృతుడి బంధువులతో సహా అక్కడ పలుకుబడి ఉన్న వ్యక్తులతో సమావేశం జరిగినట్లు తమకు తెలిసిందని చంద్ర తెలిపారు.
జులై 16న నిమిష ప్రియకు మరణ శిక్ష అమలు చేయాల్సి ఉంది. దానికి 48 గంటల ముందు ముస్లియార్ జోక్యం చేసుకోవడంతో, తలాల్ అబ్దో మహదీ కుటుంబంతో చర్చలు జరిపేందుకు సాధ్యమైంది.

ముస్లియార్ ఎవరు?
భారత్‌లో ముస్లియార్‌ను 'గ్రాండ్ ముఫ్తీ' అని పిలుస్తున్నప్పటికీ.. ఈ బిరుదును ఆయనకు కేవలం అనధికారికంగానే ఇచ్చారు.
సున్నీ సూఫీయిజం, విద్యావ్యాప్తికి ఆయన పెట్టిన పేరుగా నిలుస్తున్నప్పటికీ.. మహిళల విషయంలో ఆయన చేసే వ్యాఖ్యలు పదేపదే విమర్శలకు గురయ్యాయి.
'' ఫాలోవర్స్‌కు ఆయనొక ప్రవక్త. ఆయనకు మంత్ర శక్తులు ఉన్నాయని కొందరు భావిస్తారు.'' అని కేరళ యూనివర్సిటీలోని ఇస్లాం చరిత్ర ప్రొఫెసర్ అష్రఫ్ కడక్కల్ చెప్పారు.
'' సూఫీ సదస్సులో బరేల్వి శాఖకు చెందిన ఈ ముస్లిం వ్యక్తి గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావించారు. కానీ, మహిళల విషయంలో ఆయన వైఖరిని తీవ్రంగా విమర్శించారు’’అని తెలిపారు.
నిమిష ప్రియ కేసులో అబూబకర్ ముస్లియార్ జోక్యం చేసుకున్నప్పటికీ, మహిళల విషయంలో ఆయన వైఖరి ఇప్పటికీ చర్చనీయాంశమే. అయితే రచయిత, సామాజిక కార్యకర్త డాక్టర్ ఖదీజా ముంతాజ్ మాత్రం ఆయనను ప్రశంసించారు.
'' అన్ని ప్రయత్నాలు విఫలమైన సమయంలో, నిమిష కోసం ముస్లియార్ ఏదైనా చేయడం నాకు సంతోషంగా అనిపించింది.'' అని ఆమె బీబీసీతో అన్నారు.

ముస్లియార్ ఏం చేశారు?
యెమెన్‌లో ‘బ’ అల్వి తరిఖా అనే సూఫీ సంప్రదాయ నేత షేక్ హబీబ్ ఒమర్‌తో తనకున్న దీర్ఘకాల సంబంధాలు, స్నేహాన్ని ఉపయోగించి తలాల్ మహదీ కుటుంబాన్ని ముస్లియార్ సంప్రదించగలిగారు.
షేక్ హబీబ్ ఒమర్ యెమెన్‌లోని ‘దార్ ఉల్ ముస్తఫా' అనేక ఆధ్యాత్మిక సంస్థ వ్యవస్థాపకుడు. ఈ సంస్థలో చదువుకోవడానికి కేరళతో పాటు ప్రపంచంలోని చాలా ప్రాంతాలకు చెందిన వారు వస్తుంటారు.
యెమెన్‌లోని యుద్ధంలో పాల్గొన్న గ్రూపులతో సహా అన్ని గ్రూపులలోనూ షేక్ హబీబ్ ఒమర్‌కు మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి.
''మానవతా దృక్పథంతోనే ఆయన జోక్యం చేసుకున్నారు. బ్లడ్ మనీని చెల్లించడం ద్వారా ఒక వ్యక్తి క్షమాభిక్ష పొందవచ్చనే అంశం షరియా చట్టంలో ఉందని ఆయనే మాకు చెప్పారు. గత శుక్రవారం నుంచి ఆయన ప్రయత్నాలు మొదలు పెట్టారు.'' అని ముస్లియార్ అధికార ప్రతినిధి బీబీసీకి చెప్పారు.
ఇస్లామిక్ షరియా చట్టానికి అనుగుణంగా యెమెన్‌లో పాలన సాగుతోంది. ఈ చట్టం ప్రకారం బాధిత (తలాల్ అబ్దో మహదీ) కుటుంబం ఆమెకు క్షమాభిక్ష పెడితే నిమిష ప్రియ మరణ శిక్షను రద్దు చేస్తారు. క్షమాభిక్షకు పరిహారంగా, బ్లడ్ మనీగా (సహజంగా నగదురూపంలో ఉంటుంది) పరిహారాన్ని చెల్లించాలి.
ముస్లియార్‌తో బీబీసీ మాట్లాడలేకపోయింది. మలప్పురంలోని నాలెడ్జ్ సిటీలో ముస్లియార్ కుమారుడు నెలకొల్పిన మదీన్ సదాత్ అకాడమీ, మసీదు ప్రారంభోత్సవ సమయంలో షేక్ హబీబ్ ఒమర్ కేరళకు వచ్చారు.

మౌలావి ముస్లియార్‌కు ఎందుకంత ప్రాధాన్యం?
1926లో ఏర్పాటైన సున్నీ సంస్థ 'సమస్త కేరళ జమియతుల్ ఉలమా' నుంచి వేరుపడి, సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నప్పుడు ఇస్లామిక్ వర్గాలలో ముస్లియార్ చాలా ఆదరణ పొందారు.
1986 వరకు ఈ సంస్థకు పేరు పెట్టలేదు. కానీ, ఆ తర్వాత సిద్ధాంతాల విషయంలో అభిప్రాయ భేదాలు తలెత్తాయి.
'' పాప భాష అయిన ఇంగ్లిషును ముస్లింలు నేర్చుకోకూడదని, నాయర్ కుటుంబానికి చెందినది కావడంతో మలయాళం కూడా నేర్చుకోవద్దంటూ సాగిన రాడికల్ సలాఫీ ఉద్యమాన్ని ముస్లియార్ వ్యతిరేకించారు. అదే సమయంలో ఆయన మహిళా విద్యకు వ్యతిరేకంగా వ్యవహరించారు’’ అని ప్రొఫెసర్ అష్రఫ్ వివరించారు.
విదేశాల నుంచి వచ్చే విరాళాల ద్వారా విద్యా సంస్థలను ఆయన స్థాపించారు.
''సున్నీ ముస్లింలలో 40 శాతం మంది ముస్లియార్‌కు మద్దతు ఇస్తారు'' అని తెలిపారు.
''కేరళలో ఆయనకు పెద్ద సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు. ఎందుకంటే, ఆయన గొప్ప నిర్వాహకులు. ముస్లింలు, మహిళలకు మధ్య సహకారానికి చెందిన ఆయన అభిప్రాయాలు పాతకాలానివి. సలాఫి సర్కిల్‌కు చెందిన వారిని పలకరించవద్దని ఆయన ఒకసారి చెప్పారు.'' అని సాంస్కృతిక, రాజకీయ నిపుణులు షాజహాన్ మదపాట్ బీబీసీతో అన్నారు.

మహిళలపై వివాదాస్పద వైఖరి
ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలను ముస్లిం వ్యక్తులు కలిగి ఉండటం అవసరమని ముస్లియార్ వ్యాఖ్యానించడాన్ని డాక్టర్ ముంతాజ్ ఖండించారు.
''మొదటి భార్యకు రుతుస్రావం అవుతున్నప్పుడు తమ అవసరాలను తీర్చుకోవడానికి రెండో భార్యను ముస్లిం వ్యక్తులు కలిగి ఉండాలి. మహిళల విషయంలో ఆయన వ్యాఖ్యలు చాలా కలవరపెడుతున్నాయి. ఈ వ్యాఖ్యలు అసలు భరించలేనివి.'' అని చెప్పారు.
అయితే, 26/11 ముంబయి దాడుల తర్వాత ముస్లింలతో అతిపెద్ద సదస్సును నిర్వహించడంలో మౌలావి ముస్లియార్ కీలక పాత్ర పోషించారన్నది గుర్తుంచుకోవాల్సిన విషయం.
ఇస్లాంలో టెర్రరిజం నిషేధం అనేది ఇస్లాం కమ్యూనిటీకి తెలియజేయడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశ్యం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














