కేరళ: ఉద్యోగి మెడకు తాడు కట్టి మోకాళ్లపై నడిపిస్తోన్న వీడియో వైరల్, అందులో నిజం ఎంత?

మార్కెటింగ్ కంపెనీలో ఉద్యోగుల వీడియో చిత్రీకరణ

ఫొటో సోర్స్, Handout

    • రచయిత, జేవియర్ సెల్వ కుమార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కొచ్చిలోని ఒక ప్రైవేటు కంపెనీ ఉద్యోగుల మెడకు తాళ్లు కట్టి, వారిని మోకాళ్లపై నడిపిస్తున్నట్లుగా చూపిస్తోన్న వైరల్ వీడియో కలకలం సృష్టించింది.

అదే కంపెనీలో పనిచేసే ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ వీడియోను వ్యాప్తి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పెరంబవూరు పోలీసులు బీబీసీకి చెప్పారు.

కేరళలోని కొచ్చిలో ఒక ప్రైవేట్ మార్కెటింగ్ కంపెనీ రోజువారీ సేల్స్ టార్గెట్లను పూర్తిచేయని ఉద్యోగులను కట్టేసి శిక్షిస్తున్నట్లుగా చూపించే ఈ వీడియో స్థానిక మీడియాలో ప్రసారమైంది.

ఒక యువకుడిని తాడుతో లాగుతున్నట్లు, అతన్ని కుక్కలా మొరిగేలా చేయడం, ప్లేటులోని నాణేలను నోటితో తీయించడం వంటివి ఆ వీడియో ఫుటేజీలో రికార్డు అయ్యాయి. ఘటనా స్థలంలో మరికొందరు ఉద్యోగులు కూడా ఉన్నట్లు వీడియో చూపిస్తోంది.

వీడియో వైరల్
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

వీడియో వైరల్

కేరళలోని ప్రధాన మీడియాలో ఈ వీడియో విడుదలైంది. సోషల్ మీడియా ద్వారా లక్షల మందికి చేరువైంది.

కేరళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, కేరళ రాష్ట్ర యువజన కమిషన్‌లు దీనిపై కేసు నమోదు చేశాయి.

''ఇలాంటి చర్యలు ఆమోదనీయం కాదు. దీనిపై న్యాయపరమైన చర్య తీసుకోవాలి'' అని కేరళ యువజన కమిషన్ చైర్మన్ షాజర్ అన్నారు.

ఈ ఘటన దిగ్భ్రాంతికి గురిచేసిందని వ్యాఖ్యానించిన కేరళ కార్మిక మంత్రి శివన్‌కుట్టి, దీనిపై దర్యాప్తుకు ఆదేశించినట్లు చెప్పారు.

ఎప్పుడు జరిగింది?
వీడియోలోని మార్కెటింగ్ ఉద్యోగులు

ఫొటో సోర్స్, Handout

ఎప్పుడు జరిగింది?

ఈ వీడియోలో మోకాళ్లపై నడిచిన వ్యక్తి వాదనను వార్తా సంస్థ పీటీఐ వెల్లడించింది.

''నేను ఇంకా అదే కంపెనీలో పనిచేస్తున్నా. కొన్ని నెలల క్రితం ఈ కంపెనీలో మేనేజర్‌గా పని చేసిన వ్యక్తి ఆ వీడియో తీశారు. తర్వాత మేనేజ్‌మెంట్ ఆయనను తప్పించింది. ఇప్పుడు ఆ ఫుటేజీని సంస్థ పరువు తీసేందుకు ఆయన ఉపయోగిస్తున్నారు'' అని ఆ ఉద్యోగి చెప్పినట్లు పీటీఐ పేర్కొంది. వాంగ్మూలంలో కూడా ఆ వ్యక్తి ఇదే చెప్పినట్లుగా పీటీఐ వెల్లడించింది.

గత నవంబర్‌లో తీసిన ఆ వీడియో నకిలీదని, సంబంధిత ఉద్యోగులు తనకు వాంగ్మూలం ఇచ్చారని బీబీసీతో ఎర్నాకులం జిల్లా కార్మిక సంక్షేమ అధికారి వినోద్ కుమార్ చెప్పారు.

''ఈ వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తి సదరు కంపెనీలో పనిచేయడం లేదు. కంపెనీ మీద ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో కొన్నినెలల కిందట తాను అక్కడ పనిచేస్తున్నప్పుడు తీసిన వీడియోను ఇప్పుడు పోస్ట్ చేశారు. ఈ వీడియోలో బాధితుడిగా కనిపిస్తున్న ఉద్యోగి ఇప్పటికీ అదే కంపెనీలో పనిచేస్తున్నారు. అక్కడి ఉద్యోగులు అందరినీ విచారించి నివేదికను కార్మిక సంక్షేమ కమిషన్‌కు పంపించాం. తర్వాత ఈ నివేదికను కేరళ ప్రభుత్వానికి పంపుతారు'' అని ఆయన వివరించారు.

వినోద్ చెప్పిన వివరాల ప్రకారం, ‘‘ఆ మార్కెటింగ్ కంపెనీ ఉద్యోగులకు నెలవారీ జీతాలను ఇవ్వదు. వారు విక్రయించిన వస్తువుల అమ్మకాల ప్రకారం కేవలం కమిషన్ మాత్రమే చెల్లిస్తుంది. దీని ఆధారంగా సేల్స్ టార్గెట్ పూర్తిచేయనందుకు వారిని శిక్షిస్తారని చెప్పడం సరైనది కాదు’’ అని వినోద్ కుమార్ అన్నారు.

వీడియో పోస్ట్ చేసిన వ్యక్తిపై ఎఫ్‌ఐఆర్ నమోదు
ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

వీడియో పోస్ట్ చేసిన వ్యక్తిపై ఎఫ్‌ఐఆర్ నమోదు

సరదాగా చిత్రీకరించిన వీడియోను తప్పుడు ఉద్దేశంతో వైరల్‌ చేశారని బీబీసీతో పెరంబవూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సూపీ చెప్పారు.

''ప్రస్తుతం వైరల్ అయిన వీడియో సరదాగా చిత్రీకరించినది. గతంలో ఆ కంపెనీలో పనిచేసిన మేనేజర్ ఈ వీడియోను తీశారు. ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో తప్పుడు సమాచారాన్ని జోడించి ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కంపెనీ యాజమాన్యానికి అతనికి మధ్య సమస్యలు ఉన్నాయి. అందుకే తప్పుడు సమాచారంతో ఈ వీడియోను వ్యాప్తి చేశారు'' అని సూపీ తెలిపారు.

ఆ వీడియోలో బాధితుడిగా కనిపిస్తున్న వ్యక్తి కూడా తనకు అలాంటి శిక్ష ఏదీ విధించలేదని ఒప్పుకున్నట్లు సూపీ చెప్పారు. ఆటవిడుపుగా చేసిన దానిని వీడియో తీసి ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా విడుదల చేశారని ఆ వ్యక్తి చెప్పినట్లు సూపీ తెలిపారు.

అదే కంపెనీలో పనిచేసే ఒక మహిళ, ఈ వీడియో చిత్రీకరించిన మాజీ మేనేజర్‌పై ఫిర్యాదు చేయడంతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని ఆయన చెప్పారు. తమను కుక్కల్లాగా ప్రవర్తించమని శిక్షించినట్లు ఎవరూ ఫిర్యాదు చేయలేదని తెలిపారు.

''మహిళ ఫిర్యాదు మేరకు కోజికోడ్‌కు చెందిన ఆ వ్యక్తిపై ఐపీసీ సెక్షన్ 74 ప్రకారం కేసు నమోదు చేశాం. కానీ, ఫిర్యాదులో పేర్కొన్న ఘటన జరిగి చాలా నెలలు గడిచాయి. అందుకే తక్షణమే అరెస్ట్ చేయలేదు. ఈ విషయంపై న్యాయ సలహా కోరాం'' అని బీబీసీతో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సూపీ అన్నారు.

''ఈ ఘటన మానవ హక్కులకు విరుద్ధం. మానవ గౌరవానికి విరుద్ధమైన చర్య కాబట్టి పోలీసులు కేసు నమోదు చేయవచ్చు'' అని బీబీసీకి పీపుల్స్ సివిల్స్ రైట్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్, లాయర్ బాలమురుగన్ చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)