'ఈ టీచర్ బాధితులు 23 మంది అమ్మాయిలు, అబ్బాయిలు', అరెస్టు చేసిన పోలీసులు.. అసలేం జరిగింది?

శంభు లాల్ ధాకడ్

ఫొటో సోర్స్, Rajkumar/BBC

    • రచయిత, మోహర్ సింగ్ మీణా
    • హోదా, బీబీసీ కోసం

రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్ జిల్లా, బెగున్ పోలీసు స్టేషన్ పరిధిలో మైనర్ విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటోన్న ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు శంభు లాల్ ధాకడ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

దళిత, గిరిజన వర్గాలకు చెందిన 23 మంది విద్యార్థులను ఉపాధ్యాయుడు లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి.

లైంగిక వేధింపులు ఎదుర్కొన్న వారిలో ఐదుగురు బాలికలతో పాటు, 18 మంది అబ్బాయిలు ఉన్నారు.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఉపాధ్యాయుడిపై ఎఫ్ఐఆర్ నమోదైంది.

ఆయనపై పోక్సో, బీఎన్ఎస్, జేజే యాక్ట్, ఐటీ యాక్ట్, ఎస్సీ ఎస్టీ యాక్ట్‌ కింద కేసులు నమోదయ్యాయి.

విచారణలో నిందితుడు నేరాన్ని ఒప్పుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

'' ఇప్పటివరకు ఐదుగురు అమ్మాయిలు, 18 మంది అబ్బాయిలు ముందుకొచ్చారు. చిత్తోర్‌గఢ్ వైద్య సిబ్బంది స్థానిక పీహెచ్‌సీలో చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల వాంగ్ములాలను కూడా రికార్డు చేశాం'' అని బెగున్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ శివ్‌లాల్ మీణా బీబీసీకి చెప్పారు.

ఈ కేసుకు సంబంధించి, కొన్ని వీడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి.

ఈ వీడియోల్లో, నిందితుడు పిల్లలను లైంగికంగా వేధించడం, వాటిని వీడియోలు తీయడం కనిపించింది.

ఈ సంఘటన బయటికి పొక్కడంతో గ్రామంలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

నిందితుడు శంభు లాల్ ధాకడ్‌ను విధుల నుంచి తొలగిస్తూ ఈ నెల 19న రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ ఆదేశాలు జారీ చేశారు. శాఖాపరమైన విచారణలో ఆయన దోషిగా తేలిందని, కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

గ్రామస్తుల నిరసన

ఫొటో సోర్స్, Rajkumar/BBC

ఎలా బయటపడింది?

లైంగిక వేధింపులు ఎదుర్కొన్న 23 మంది విద్యార్థుల్లో ఒకరు విషయాన్ని బయటపెట్టారు.

అనంతరం పిల్లల్లో ఒకరి తండ్రి జూలై 17న రాతపూర్వకంగా చిత్తోర్‌గఢ్‌‌ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను జిల్లా కలెక్టర్‌కు చూపించారు.

కలెక్టర్ ఆదేశాల మేరకు, జూలై 17వ తేదీ రాత్రి బెగున్ పోలీసులు ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నారు.

లైంగిక వేధింపులు ఎదుర్కొన్న విద్యార్థుల్లో ఒకరి తండ్రి సంజయ్ (పేరు మార్చాం) బీబీసీతో మాట్లాడారు.

'' నా కొడుకు దీని గురించి మా ఇంటి పక్కనే ఉన్న అదే స్కూల్‌లో చదివే మరో విద్యార్థికి చెప్పాడు. శంభు లాల్ ధాకడ్ సర్ ఇలా చేశారు అని. అప్పుడు, ఆ విద్యార్థిపై కూడా టీచర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది'' అని తెలిపారు.

ఆ తర్వాత రోజు ఉదయం, సంజయ్‌ను పొరుగున ఉన్న మరో విద్యార్థి తండ్రి కలిశారు. ఈ విషయంపై చర్చించారు.

ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు, కానీ దానిని రుజువు చేసేందుకు విద్యార్థుల వద్ద అప్పుడు ఎలాంటి ఆధారాలూ లేవు.

''ఇది జరిగిన కొద్ది రోజులకు, ఓ విద్యార్థి టీచర్ లైంగిక వేధింపులను వీడియో తీశారు. ఆ తర్వాతే ఉపాధ్యాయుడికి వ్యతిరేకంగా మాకు ఆధారాలు దొరికాయి. నేరుగా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి, జూలై 17న ఫిర్యాదు చేశాం'' అని సంజయ్ తెలిపారు.

''ఇదంతా రెండు, మూడేళ్ల నుంచి సాగుతోంది. కానీ, ఇప్పుడు వెలుగులోకి వచ్చింది'' అని సంజయ్ బీబీసీతో చెప్పారు.

ఈ ఘటనకు వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో, విద్యాశాఖకు చెందిన కొందరు ఉన్నతాధికారులు పాఠశాలకు వచ్చి విచారణ జరిపారు.

'' లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు ఇప్పటివరకూ ముందుకొచ్చిన పిల్లలందరూ ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీకి చెందిన వారే. పోలీసు విచారణలో, చిన్నారుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది'' అని లైంగిక వేధింపులు ఎదుర్కొన్న మరో విద్యార్థి తండ్రి ప్రేమ్‌దాస్ (పేరు మార్చాం) చెప్పారు.

బెగున్ పోలీస్ స్టేషన్

ఫొటో సోర్స్, Rajkumar/BBC

కఠిన సెక్షన్ల కింద కేసులు

జూలై 17వ తేదీ రాత్రి ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నట్లు బెగున్ పోలీస్ స్టేషన్ అధికారి శివ్‌లాల్ మీణా చెప్పారు.

జూలై 18న స్థానిక ఎస్‌డీఎం, పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ స్కూల్ వద్దకు వచ్చారు. విద్యార్థులను, వారి తల్లిదండ్రులను విచారించిన తర్వాత.. కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఆధారాల సేకరణ కోసం ఎఫ్ఎస్‌ఎల్ టీమ్‌ను కూడా పిలిపించారు. విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. పిల్లలకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు.

పోక్సో చట్టం, భారతీయ న్యాయ సంహిత, జువెనైల్ యాక్ట్, ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద నిందితుడిపై కేసు నమోదైంది.

రావత్‌భాటా డీఎస్పీ కమల్ ప్రసాద్ మీణా ఈ కేసు దర్యాప్తు అధికారిగా ఉన్నారు. ఈ కేసులో ఆధారాలను సేకరిస్తున్నారు.

''ఎఫ్ఐఆర్‌లో, పోక్సోలోని 3, 4, 5, 6, 7, 8 సెక్షన్లను చేర్చాం. భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 64, 65 కింద అభియోగాలు నమోదు చేశాం. ఇవి అత్యాచారానికి సంబంధించిన సెక్షన్లు. ఐటీ యాక్ట్ సెక్షన్ 67, జువైనెల్ జస్టిస్ యాక్ట్ (జేజే యాక్ట్) సెక్షన్ 75ను కూడా చేర్చాం'' అని బెగున్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ శివ్‌లాల్ మీణా తెలిపారు.

వీటితో పాటు ఎస్సీ ఎస్టీ యాక్ట్ సెక్షన్లు కూడా నమోదు చేసినట్లు చెప్పారు.

ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుడు విద్యార్థినులను లైంగికంగా వేధిస్తూ వీడియోలు కూడా తీసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.

నిందితుడి ఫోన్ నుంచి ఎన్ని వీడియోలను స్వాధీనం చేసుకున్నారు? అని అడిగినప్పుడు శివ్‌లాల్ మీణా బదులిస్తూ, '' నిందితుడు తన ఫోన్‌లోని అన్ని వీడియోలను డిలీట్ చేశారు. కానీ, స్థానికులు చాలా వీడియోలను మా దృష్టికి తెచ్చారు'' అని చెప్పారు.

''పోలీసు దర్యాప్తు జరుగుతోంది. విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది'' అని పేరు చెప్పడానికి ఇష్టపడని చిత్తోర్‌గఢ్‌కు చెందిన ఒక పోలీసు అధికారి చెప్పారు.

పోలీస్ స్టేషన్

ఫొటో సోర్స్, Rajkumar/BBC

శాఖాపరమైన విచారణలో దోషి తేలిన టీచర్

ఈ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే శంభు లాల్ ధాకడ్‌ను సస్పెండ్ చేస్తూ విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ విషయంలో శాఖపరమైన విచారణ నిమిత్తం నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది.

విచారణ కమిటీ జూలై 19న తన రిపోర్టును విద్యాశాఖకు సమర్పించింది. ఈ విచారణలో సదరు ఉపాధ్యాయుడు విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తేలింది.

''స్కూల్ జరిగే సమయంలో, అయిపోయిన తర్వాత పిల్లల్ని గదుల్లోకి, క్రీడామైదానంలోకి తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడడంతో పాటు అశ్లీల, అసహజ చర్యలకు చెందిన వీడియోలు తీసేవారు'' అని విచారణ కమిటీ విద్యాశాఖకు సమర్పించిన నివేదికలో పేర్కొంది.

''దీని గురించి (లైంగిక వేధింపులు) ఎవరికైనా చెబితే స్కూల్ నుంచి పంపించేస్తానని, పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని, భవిష్యత్తు లేకుండా చేస్తానని బెదిరించేవారు'' అని రిపోర్టులో తెలిపింది.

శాఖాపరమైన విచారణ ఆధారంగా నిందితుడిని ఉద్యోగం నుంచి డిస్మిస్(శాశ్వతంగా తొలగిస్తూ) చేస్తూ విద్యా శాఖ మంత్రి మదన్ దిలావర్ ఆదేశాలు జారీ చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)