ఒడిశా: లైంగికంగా వేధిస్తున్నారని చెప్పినా చర్య తీసుకోలేదంటూ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం, పరిస్థితి విషమం

డిపార్ట్‌మెంట్ హెడ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ విద్యార్థి, కాలేజీ యాజమాన్యం నుంచి సహాయం కోరారు.

ఫొటో సోర్స్, subrat kumar pati

    • రచయిత, సుబ్రత్ కుమార్ పతి
    • హోదా, బీబీసీ కోసం, భువనేశ్వర్ నుంచి

ఒడిశాలోని బాలాసోర్‌‌లో ఉన్న ఫకీర్ మోహన్ కాలేజీలో ఒక విభాగాధిపతిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ విద్యార్థిని ఒకరు ఆత్మహత్యాయత్నం చేసిన కేసు వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటన శనివారం మధ్యాహ్నం జరిగింది. భువనేశ్వర్‌లోని ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు బీబీసీతో చెప్పారు.

గత కొన్ని నెలలుగా ఆమెను లైంగికంగా వేధిస్తున్నారని, దీనిపై కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు కూడా చేశారని విద్యార్థిని కుటుంబం చెబుతోంది.

ఈ విషయంలో యాజమాన్యం ఎలాంటి చర్య తీసుకోకపోవడంతో ఆమె కలత చెందారని వారు తెలిపారు.

కాలేజీలో ఆమె బీఎడ్ చదువుతున్నారు. బీఎడ్ విభాగాధిపతి (హెచ్‌ఓడీ)పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ, కాలేజీ యాజమాన్యానికి ఆమె ఫిర్యాదు చేశారు. అలాగే ఈ విషయానికి సంబంధించి అనేకమంది ఉన్నతాధికారులను ట్యాగ్ చేస్తూ, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విభాగాధిపతిని, కాలేజీ ప్రిన్సిపల్‌ను, మరో వ్యక్తిని సస్పెండ్ చేశారు.

ఆరోపణలు ఎదుర్కొంటున్న డిపార్ట్‌మెంట్ హెడ్ సమీర్ సాహూను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు దర్యాప్తుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఈ విషయానికి సంబంధించి సస్పెండ్ అయిన ప్రిన్సిపల్ దిలీప్ ఘోష్‌తో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది. కానీ, ఆయన స్పందించడానికి నిరాకరించారు.

విద్యార్థినికి న్యాయం జరగాలంటూ కాంగ్రెస్, బిజు జనతాదళ్ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు భువనేశ్వర్‌లో ఆదివారం నిరసన తెలిపారు.

(ఆత్మహత్య అనేది ఒక తీవ్రమైన మానసిక, సామాజిక సమస్య. ఒకవేళ ఇలాంటి ఒత్తిడికి గురైతే జీవన్‌సాథీ హెల్ప్ లైన్ 1800 233 3330 ద్వారా సహాయం పొందొచ్చు. అలాగే స్నేహితులు, బంధువులతో ఈ ఒత్తిడి గురించి మాట్లాడాలి.)

బాలాసోర్‌లో విద్యార్థినికి ప్రథమ చికిత్స జరిగిన ఆసుపత్రి

ఫొటో సోర్స్, subrat kumar pati

ఫొటో క్యాప్షన్, బాలాసోర్‌లో విద్యార్థినికి ప్రథమ చికిత్స జరిగిన ఆసుపత్రి

విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై ఎయిమ్స్ ఏం చెప్పింది?

విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉందని ఎయిమ్స్ డైరెక్టర్ అశుతోష్ బిశ్వాస్ చెప్పారు.

''వైద్యుల బృందం ఆమెను రక్షించడానికి శాయశక్తులా కృషిచేస్తోంది. పేషెంట్‌ను వెంటిలేటర్‌పై ఉంచాం. కిడ్నీ సహా కొన్ని అంతర్గత అవయవాలు బాగా దెబ్బతిన్నాయి'' అని ఆయన తెలిపారు.

ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఏమన్నారు?

ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఆదివారం ఎయిమ్స్‌కు వెళ్లి విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

ఈ ఘటనను చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామని ఆయన అన్నారు.

''ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు జరుగుతోంది. ప్రభుత్వం ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకుంటుంది. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు ఏ కాలేజీలోనూ జరగకుండా చూస్తుంది. విద్యార్థిని కుటుంబంతో, ఆమెకు చికిత్స అందిస్తున్న వైద్యులతో మాట్లాడాను. వచ్చే 24 గంటలు చాలా కీలకం. అవసరమైతే విమానంలో ఆమెను దిల్లీకి తరలిస్తాం'' అని ఆయన తెలిపారు.

ఆరోపణలు ఎదుర్కొంటున్న విభాగాధిపతితో పాటు, ప్రిన్సిపల్ దిలీప్ ఘోష్, కాలేజీ ప్రెసిడెంట్‌ను కూడా సస్పెండ్ చేశామని ఒడిశా ఉన్నత విద్యా శాఖ మంత్రి సూర్యవంశీ సూరజ్ చెప్పారు.

ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ

కుటుంబీకులు ఏమన్నారు?

బాధితురాలితో కాలేజీలో చదువుతున్న మరో విద్యార్థిని బీబీసీతో మాట్లాడుతూ, టీచర్ ప్రవర్తన కారణంగా బాధితురాలు చాలా రోజులుగా బాధపడుతోందని చెప్పారు.

''టీచర్ అనుచితంగా ప్రవర్తిస్తున్నారంటూ ఆమె కాలేజీ ప్రెసిడెంట్‌కు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత, ఒక దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేశారు'' అని ఆమె తెలిపారు.

ఈ దర్యాప్తు కమిటీ తమ రిపోర్టులో టీచర్‌ లైంగిక వేధింపులకు పాల్పడిన విషయాన్ని ప్రస్తావించలేదని బీబీసీతో విద్యార్థిని తాతయ్య జితేంద్ర దాస్ అన్నారు. పైగా, ఈ వ్యవహారాన్ని అణచివేసే ప్రయత్నం జరిగిందని చెప్పారు.

ఈ ఘటన గురించి కుటుంబీకులకు కూడా విద్యార్థి సమాచారమిచ్చిందని జితేంద్ర దాస్ తెలిపారు.

''మానసికంగా కూడా ఆమెను వేధిస్తున్నారు. ఆమెను కొన్ని పేపర్లలో ఫెయిల్ చేశారు. హాజరు తక్కువగా ఉందని చూపిస్తూ పరీక్షకు హాజరు కానివ్వలేదు'' అని చెప్పారు.

బాలాసోర్ ఎస్పీ రాజ్ ప్రసాద్

ఫొటో సోర్స్, subrat kumar pati

ఫొటో క్యాప్షన్, బాలాసోర్ ఎస్పీ రాజ్ ప్రసాద్

పోలీసులు ఏం అంటున్నారు?

ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని, ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.

అన్ని కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని బాలాసోర్ ఎస్పీ రాజ్ ప్రసాద్ చెప్పారు.

''ఫోరెన్సిక్ టీమ్ కూడా ఈ దర్యాప్తులో భాగమైంది. డీఎస్పీ స్థాయి అధికారికి ఈ దర్యాప్తు బాధ్యతను అప్పగించారు. కాలేజీ అంతర్గత ఫిర్యాదు కమిటీకి కూడా విద్యార్థి ఫిర్యాదు చేశారు. ఆ కమిటీ ఏం చేసిందో, ప్రిన్సిపల్‌కు ఎలాంటి రిపోర్టు ఇచ్చిందో కూడా మేం పరిశీలిస్తాం. ఘటన జరిగిన వెంటనే నిందితుడిని అరెస్ట్ చేశాం'' అని ఆయన తెలిపారు.

ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్

ఫొటో సోర్స్, Bhushan Koyande/Hindustan Times via Getty Images

ఫొటో క్యాప్షన్, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్

ప్రభుత్వాన్ని విమర్శించిన విపక్షాలు

ఈ వ్యవహారంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలంటూ ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ విజ్ఞప్తి చేశారు.

''ఒడిశాలోని ఒక ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో ఒక విద్యార్థిని, ఆత్మహత్యకు ప్రయత్నించడం అనేది చాలా దిగ్భ్రాంతికర అంశం. ఆమె త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. విద్యార్థినిపై లైంగిక వేధింపులు జరిగాయని అంటున్నారు. టీచర్ పదే పదే ఆమె నుంచి సెక్సువల్ ఫేవర్స్ కోరుకున్నారని చెబుతున్నారు. ఇంతకుముందు కూడా ఆత్మహత్యకు యత్నించానని.. అప్పుడు కాపాడారని ప్రిన్సిపల్‌కు రాసిన లేఖలో విద్యార్థిని పేర్కొన్నారు. ఆమె అనేక నెలల పాటు బాధ, భయంతో జీవించారు. ఇక భరించలేక జులై 1న, ఆమె సహాయాన్ని అర్థించారు. తన కష్టాన్ని తెలుపుతూ సోషల్ మీడియాలో పలువురు ఉన్నతాధికారులను ట్యాగ్ చేశారు. కానీ, ఎలాంటి చర్య తీసుకోలేదు.

చివరికి ఆమె ఆత్మహత్యను ఆశ్రయించారు. ప్రిన్సిపల్ గది బయటే ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఆమెకు న్యాయం జరుగలేదన్న నిజాన్ని ఈ ఘటన వెలుగులోకి తెచ్చింది. కాలేజీ ప్రిన్సిపల్ నుంచి ఉన్నత విద్యాశాఖ మంత్రి, కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రి వరకు ఇలా ఆమె అందరినీ పదే పదే విజ్ఞప్తి చేశారు'' అని సోషల్ మీడియా పోస్ట్‌లో నవీన్ పట్నాయక్ పేర్కొన్నారు.

భోగ్‌రాయ్ ఎమ్మెల్యే గౌతమ్ బుద్ధా దాస్

ఫొటో సోర్స్, subrat kumar pati

ఫొటో క్యాప్షన్, ఎమ్మెల్యే గౌతమ్ బుద్ధ దాస్

విద్యార్థిని గత ఆరు నెలలుగా లైంగిక వేధింపులకు గురవుతున్నారని బీబీసీతో బిజూ జనతాదళ్ నాయకుడు, ఎమ్మెల్యే గౌతమ్ బుద్ధ దాస్ అన్నారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదును కూడా ఎవరూ పరిగణలోకి తీసుకోలేదని ఆయన ఆరోపించారు.

''అంతేకాకుండా ఈ కేసు విషయంలో రాజీ పడాలని విద్యార్థినిపై ఒత్తిడి తెచ్చారు. అందుకే ఆమె ఆత్మహత్యకు యత్నించారు. బీజేపీ ప్రభుత్వానికి ఇది సిగ్గుచేటు'' అని ఆయన అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)