Inattentional Blindness: కళ్ల ముందు ఉన్న వస్తువులను కూడా కనిపించనట్లు చేసే ఈ లక్షణం ఏంటి?

- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
మనం వెతికే వస్తువు కళ్ల ముందే ఉన్నా ఒక్కోసారి మనం గమనించలేం. ఇది మనలో చాలామందికి వివిధ సందర్భాల్లో ఎదురయ్యే అనుభవమే.
ఉదాహరణకు బయటకు వెళ్లే సమయంలో బైక్, కారు తాళాల కోసం వెతుకుతాం. అవి మనం వెతుకుతున్న చోటే ఉన్నా అది కనిపించనట్లు/గమనించనట్లు అనిపించి వెతుకుతూనే ఉంటాం.
ఇలాంటి స్థితినే ఇన్‌అటెన్షనల్ బ్లైండ్‌నెస్ (Inattentional Blindness) అంటారు.
"నేను బయటకు వెళ్లేటప్పుడు స్కూటీ తాళాల కోసం పదే పదే వెతుకుతుంటా. కనిపించవు. ఇంట్లో వాళ్లు వచ్చి ఇక్కడే ఉన్నాయి కదా అని తాళాలు నా చేతికి అందిస్తుంటారు" అని తాను తరుచూ ఎదుర్కొనే అనుభవమంటూ విశాఖపట్నానికి చెందిన దంతుర్తి లావణ్య బీబీసీతో చెప్పారు.


ఫొటో సోర్స్, Getty Images
స్కూటీ, కారు తాళాల విషయంలోనే కాదు, సెల్ ఫోన్, ఫ్రిజ్‌లోని కూరగాయాలు, పుస్తకాలు ఇలా ఏదైనా కూడా కళ్ల ముందే ఉన్నా, పక్కన వెతుకుతుంటానని లావణ్య అన్నారు.
'ఇలా చాలాసార్లు జరిగింది' అని ఆమె చెప్పారు.
లావణ్య లాగే చాలామంది ఈ సమస్యను ఎదుర్కొంటున్న వాళ్లే కదా? మరి దీనికి కారణం ఏంటి? ఇది అందరిలోనూ ఉంటుందా, కొందరికే పరిమితమా?.
ఇన్‌అటెన్షనల్ బ్లైండ్‌నెస్ వల్ల మన రోజువారి జీవితంలో సమస్యలు ఏమైనా వస్తాయా? ఈ విషయంపై ఎలాంటి పరిశోధనలు జరిగాయి?

'చూడలేకపోవడం కాదు'
ఇన్‌అటెన్షనల్ బ్లైండ్‌నెస్‌నే గ్రహణ అంధత్వం అని కూడా అంటుంటారు.
వాస్తవానికి 'మనం వస్తువుని చూడలేకపోవడం' అనుకునే పొరబాటు ఉంది. ఇది వస్తువుని చూడలేకపోవడం కాదు, గమనించకపోవడం అని న్యూరాలజిస్టులు చెబుతున్నారు.
మనం ఫోన్‌లో మాట్లాడుతూ రోడ్డు మీద వెళ్తుంటాం. అదే సమయంలో ముందు నుంచి ఓ వ్యక్తి వెళ్తూ పలకరించినా మనం అతడ్ని గమనించలేకపోవచ్చు. దానికి కారణం మన దృష్టి అంతా ఫోన్ మీద కేంద్రీకృతం కావడమే.
మనం త్వరగా ఎక్కడికో వెళ్లాలని ఆలోచిస్తున్నప్పుడు, మెదడు కీలకమని భావించిన 'వెళ్లడం' అనే విషయం మీదే దృష్టి పెడుతుంది. అందుకే, బండి లేదా కారు తాళాలు మన ముందే ఉన్నా మెదడు దాన్ని పట్టించుకోదు.
"మెదడు వేరే విషయంలో బిజీగా ఉన్నపుడు కళ్లకు కనబడుతున్నదాన్ని కూడా మనం గమనించలేం. మన మెదడు ఒక సమయంలో ఒక పని మీద దృష్టి పెట్టినప్పుడు, పక్కన ఉన్నవాటిని పట్టించుకోదు" అని అమెరికాలోని వెస్ట్ వర్జీనియాలో న్యూరాలజిస్టుగా పని చేస్తున్న అప్పాజీ రాయి బీబీసీకి చెప్పారు.

'ప్రాధాన్యతే కీలకం'
ఇన్‌అటెన్షనల్ బ్లైండ్‌నెస్ అనేది చూపు లోపం కాదని, మన మనసు రెండు విషయాలను సమానంగా తీసుకోకుండా, ఒక దానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో రెండో విషయం ప్రాధాన్యత లేనిదిగా మారిపోతుందని, దాంతో ఆ పని సజావుగా సాగదని ఏయూ సైకాలజీ విభాగం ప్రొఫెసర్ ఏంవీఆర్ రాజు వివరించారు.
ఒక పనిని పూర్తి ఏకాగ్రతతో చేయడం ద్వారా ఇన్‌అటెన్షనల్ బ్లైండ్‌నెస్‌ని కొంత మేర అధిగమించవచ్చునని ఆయన సూచించారు.
విశాఖకు చెందిన న్యూరాలజిస్ట్ రాజేశ్ ఇండాల మాట్లాడుతూ ''ఈ సమస్య ఎవరికైనా ఉంటుంది. ఉదాహరణకు డాక్టర్లు సర్జరీలు చేస్తున్నప్పుడు వాళ్ల ఫోకస్ అంతా సర్జరీపైనే ఉంటుంది. దాంతో వారి సర్జరీకి అవసరమైన పరికరాలు వాళ్ల దగ్గరే ఉన్నా వాటిని గమనించలేకపోతుంటారు" అని చెప్పారు.
"ఇదేమి కంటి చూపు, మెదడుకు సంబంధించిన లోపం కాదు. అటెన్షనల్ డెఫిసిట్ అంటారు. దీనిని అధిగమించాలంటే, మనం చేసే పనిపైనే మనస్సును పూర్తిగా కేంద్రీకరించాలి. అవసరమైతే కొంత శిక్షణ కూడా పొందాలి" అని సూచించారు న్యూరాలజిస్ట్ రాజేశ్.

ఫొటో సోర్స్, Getty Images
ఎవరిపై ఎక్కువ ప్రభావం?
డ్రైవింగ్, టీచింగ్, పైలట్స్, ప్రోగ్రామర్స్, డాక్టర్స్, ఫిల్మ్ మేకర్స్ ఇలాంటి ఉద్యోగాలు, వృత్తులలో ఉన్నవారిపై ఇన్‌అటెన్షనల్ బ్లైండ్‌నెస్ ఎక్కువ ప్రభావం చూపుతుందని అప్పాజీ రాయి చెప్పారు.
"ఆరోగ్య సమస్యలు, నిద్రలేమి, ఆహార లోపం, మానసిక ఒత్తిడి వల్ల మెదడుకు గమనించే శక్తి తగ్గిపోయే ప్రమాదం ఉంది. వయసు పెరిగే కొద్దీ, మెదడు శక్తి మార్పుల వల్ల కూడా ఇన్‌అటెన్షనల్ బ్లైండ్‌నెస్ సమస్య ఎదురవుతుంది" అని ఆయన అన్నారు.
ఇది అన్ని వయసుల వారికీ వచ్చే మానసిక లక్షణమని, మల్టీ టాస్కింగ్ సామర్థ్యం తక్కువగా ఉండే వారిపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు అప్పాజీరాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఎలా అధిగమించాలి?
ఇన్‌అటెన్షనల్ బ్లైండ్‌నెస్ నుంచి సంపూర్ణంగా బయటపడలేం కానీ, దీని ప్రభావాన్ని తగ్గించవచ్చునని న్యూరాలజిస్ట్ డాక్టర్ రాజేశ్ ఇండాల అన్నారు.
"ఏకాగ్రతతో పనులు చేయడం, అనవసరంగా దృష్టిని మరల్చడం, మల్టీ టాస్కింగ్ కాకుండా ఒకే పని మీద దృష్టి పెట్టడం, మంచి విశ్రాంతి తీసుకోవడం వంటివి చేయాలి'' అన్నారు.
ఇన్‌అటెన్షనల్ బ్లైండ్‌నెస్ ప్రభావం పెరిగితే, ''డాక్టర్లయితే ఆపరేషన్ చేసే సమయంలో ఏవైనా ధ్వనులు వస్తే వాటిని గమనించలేకపోవచ్చు. అదే కంప్యూటర్ ప్రోగ్రామర్ అయితే తన కళ్ల ముందే ఎర్రర్ ఉన్నా దానిని గమనించకుండా ఆ ప్రోగ్రామ్‌ను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తుండవచ్చు" అని డాక్టర్ రాజేశ్ బీబీసీతో అన్నారు.
"మనసు ఒత్తిడికి లోనైనప్పుడు మెదడు పనితీరు తగ్గిపోతుంది. అలాగే నిద్రలేమి, అలసట కారణంగా కూడా. అందుకే మంచి విశ్రాంతి, ఆహారం తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం వంటివి చేస్తే మెదడు పని తీరు బాగుండి ఇన్‌అటెన్షనల్ బ్లైండ్‌నెస్ ప్రభావం తగ్గుతుంది" అని డాక్టర్ అప్పాజీ రాయి సూచించారు.
పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
ఇన్‌అటెన్షనల్ బ్లైండ్‌నెస్‌కి సంబంధించి 1960, 1999, 2025లో పరిశోధనలు జరిగాయి. వీటిలో ఎక్కువగా చెప్పుకునేది 1999లో జరిగిన ఇన్విజిబుల్ గోరిల్లా టెస్ట్.
హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన మానసిక శాస్త్ర నిపుణులు డానియేల్ సైమన్స్, క్రిస్టోఫర్ షాబ్రిస్ ఈ పరీక్షను చేశారు.
కొంతమంది పిల్లలకు ఒక బాస్కెట్ బాల్ వీడియోను చూపించారు. అందులో బాల్ ఒకరి నుంచి మరొకరికి ఎన్నిసార్లు పాస్ అయ్యిందో లెక్కించమన్నారు. ఆ గేమ్ మధ్యలో ఒక వ్యక్తి గోరిల్లా వేషధారణలో మధ్యలో నడుస్తూ వెళ్లారు. కానీ దీనిని పిల్లలు గమనించలేదు. వారి దృష్టి అంతా బాల్ పాసింగ్‌పైనే ఉంది.
నిజానికి దీనికిముందు 1960లో జరిగిన పరీక్ష కూడా ఇలాంటిదే. 1960లో ఉల్రిక్ నీస్సర్ అనే మానసిక శాస్త్ర నిపుణుడు కాగ్నిటివ్ సైకాలజీ, అవగాహన, జ్ఞాపకశక్తిలపై "సెలెక్టివ్ లుకింగ్" అనే ప్రయోగం చేశారు.
వేర్వేరుగా బాల్ పాస్‌లు అందుకుంటున్న రెండు బృందాల వీడియోను కొందరు విద్యార్థులకు చూపించారు ఉల్రిక్ నీస్సర్. కానీ, ఒక బృందం బాల్ పాస్‌లను మాత్రమే లెక్కించమని చెప్పారు. అదే సమయంలో, ఆ వీడియోలో ఒక వ్యక్తి అడ్డంగా నడిచిన దృశ్యం కూడా ఉంచారు. కానీ దానిని ఎవరు గమనించలేదు.
2025లో అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయంలో నార్ట్‌కర్ బృందం చేసిన అధ్యయనంలో ఆసక్తికరమైన విషయం బయటపడింది.
ఒక దృశ్యాన్ని "మేం చూడలేదు" అని చెప్పినవాళ్లు కూడా మళ్లీ చూపించినప్పుడు దాని రంగు, ఆకారం వంటి కొన్ని వివరాలను గుర్తించగలిగారు. అంటే, వారు పూర్తిగా మిస్ కాలేదు. కళ్లకు కనిపించిన సమాచారం కొంత వరకు మెదడులో నిలిచింది, కానీ స్పష్టమైన అవగాహనకు రాలేదు.
అంటే "ఇన్‌అటెన్షనల్ బ్లైండ్‌నెస్ అనేది పూర్తిగా చూడకపోవడమే కాదు, కొన్నిసార్లు గమనించిన దాన్ని చెప్పడంలో సందేహం కూడా" అని న్యూరాలజిస్ట్ అప్పాజీ రాయి అన్నారు.
సీరియస్‌గా తీసుకోవాలా?
"ఇది తీవ్రమైనది కాకపోయినా, పట్టించుకోవలసిన అవసరం ఉంది. ఎందుకంటే, ఇది ఒక దృష్టి భ్రమ. మనం చూడలేదని మనకే తెలియదు. అంటే మన తప్పు మనకే తెలియదు. అది ప్రమాదాలను, ఇబ్బందులను తీసుకురావొచ్చు" అని డాక్టర్ రాజేశ్ బీబీసీతో అన్నారు.
"ఇన్‌అటెన్షనల్ బ్లైండ్‌నెస్‌ను జీవితంలో ఒక సమస్యగానే భావించాల్సి ఉంటుంది. సీరియస్‌గా తీసుకోవడం మంచిదే. మన మెదడు ఒకేసారి రెండు పనులు చేయాల్సి వస్తే, దానిపై పరిమితంగానే దృష్టి పెట్టగలదు. అందుకే అవగాహన పెంచుకుంటే మన రోజు వారి పనుల్లో ఎదురయ్యే ఇబ్బందులను తగ్గించుకోవచ్చు" అని డాక్టర్ అప్పాజీ రాయి సూచించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














