పీఎఫ్ విత్‌డ్రా పరిమితులపై వచ్చిన మార్పులేంటి, ఎంత సొమ్ము తీసుకోవచ్చు?

ఫొటో సోర్స్, Getty Images
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) తన నియమాలలో కొన్ని మార్పులు చేసింది. ఈ మార్పు ఇల్లు కొనాలనుకునే ఉద్యోగులకు ఉపశమనం కలిగించవచ్చు.
సాధారణంగా ఉద్యోగి ప్రాథమిక జీతంలో 12 శాతం ప్రావిడెంట్ ఫండ్‌లో జమ అవుతుంటుంది. ఉద్యోగి పనిచేసే సంస్థ కూడా అంతే మొత్తాన్ని ఖాతాలో జమ చేస్తుంది.
ఈపీఎఫ్‌ఓ కొత్త నిబంధనల ప్రకారం, ఇల్లు కొనాలనుకునే ఈపీఎఫ్ సభ్యులు ఇపుడు వారి పీఎఫ్ ఖాతా నుంచి మునుపటి కంటే ఎక్కువ సొమ్ము విత్‌డ్రా చేసుకోవచ్చు. గతంలో 36 నెలల్లో ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో జమ చేసిన మొత్తానికి ఇది సమానంగా ఉండేది. ఈపీఎఫ్ స్కీం 1952 పేరా 68-BD కింద చేసిన మార్పులతో ఇపుడు ఇంకా ఎక్కువగా తీసుకోవచ్చు.
కొత్త నిబంధనల ప్రకారం, ఈపీఎఫ్‌ఓ సభ్యులు ఇంటి నిర్మాణం లేదా ఇల్లు కొనడానికి డౌన్ పేమెంట్ లేదా హోంలోన్ ఈఎంఐ చెల్లించడం వంటి వాటి కోసం వారి పీఎఫ్ నుంచి 90 శాతం వరకు విత్ డ్రా చేసుకోవచ్చు.
గతంలో ఈ విధంగా డబ్బును ఉపసంహరించుకోవాలంటే, సభ్యులు ఐదేళ్లు పని చేసి ఉండాలి. కానీ ఇప్పుడు సభ్యులు తమ ఈపీఎఫ్ ఖాతాను తెరిచిన మూడేళ్ల తర్వాత డబ్బును ఉపసంహరించుకోవచ్చు. అయితే సభ్యులు ఈ పీఎఫ్ ముందస్తు ఉపసంహరణ ఎంపికను వారి జీవితకాలంలో ఒకసారి మాత్రమే ఉపయోగించుకోవాల్సి ఉంటుందనే షరతునూ విధించారు.


ఫొటో సోర్స్, Getty Images
'అత్యవసర నిధి'
ఈపీఎఫ్‌ఓ మరో రెండు నియమాలనూ సవరించింది. ఇప్పుడు సభ్యులు అత్యవసర అవసరాల కోసం వారి అకౌంట్ నుంచి రూ. 1 లక్ష వరకు తీసుకోవచ్చు.
సభ్యులు అతి త్వరలో యూపీఐ, ఏటీఎం ద్వారా వారి పీఎఫ్ ఖాతాల నుంచి అత్యవసర నిధులను విత్ డ్రా చేసుకోవచ్చని ఈపీఎఫ్‌ఓ పేర్కొంది.
కానీ, ఈ సౌకర్యం యూఏఎన్ అంటే యూనివర్సల్ అకౌంట్ నంబర్ యాక్టివ్‌గా ఉండి, కేవైసీ ద్వారా పూర్తిగా ధ్రువీకరణ చేసుకున్న వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది.
అలాగే, సభ్యుని బ్యాంక్ అకౌంట్ ఈపీఎఫ్ఓకు లింక్ చేసి, ఆధార్‌తోనూ లింక్ చేసి ఉండాలి.

ఫొటో సోర్స్, Getty Images
ఆటో సెటిల్మెంట్ పరిమితి కూడా..
కోవిడ్ 19 సమయంలో పీఎఫ్ ఆటో సెటిల్మెంట్ సౌకర్యాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పుడు దానిని పర్మినెంట్ ఫీచర్‌గా తీసుకొస్తున్నారు.
ఆటోసెటిల్మెంట్ క్లెయిమ్ కోసం మాన్యువల్ వెరిఫికేషన్ అవసరం లేదు. దీని పరిమితిని లక్షరూపాయల నుంచి ఐదు లక్షలరూపాయలకు పెంచింది. అది కూడా 72 గంటల్లో సభ్యుని ఖాతాకు బదిలీ అవుతుంది.
క్లెయిమ్ ప్రక్రియను సులభతరం చేస్తామని ఈపీఎఫ్ఓ తెలిపింది. వెరిఫికేషన్ పారామీటర్స్ 27 నుంచి 18కి తగ్గించినట్లు చెప్పింది. 95 శాతం క్లెయిమ్‌లు మూడు నుంచి నాలుగు రోజుల్లోనే పరిష్కారమవుతున్నట్లు పేర్కొంది. దీంతో పాటు, ఆన్‌లైన్ క్లెయిమ్ కోసం చెక్ బుక్ లేదా వెరిఫైడ్ బ్యాంక్ పాస్‌బుక్ ఫోటో అప్‌లోడ్ నిబంధనను తొలగించారు.
ఈపీఎఫ్ ఖాతాను యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్)తో లింక్ చేస్తున్నప్పుడే బ్యాంక్ ఖాతాదారుడి పేరు ధ్రువీకరణ జరుగుతుంది, ఈ నేపథ్యంలోనే మరోసారి వెరిఫై చేసిన చెక్, పాస్‌బుక్ అవసరం లేదని నిర్ణయించారు.
అలాగే, బ్యాంక్ ఖాతా సీడింగ్ ప్రక్రియలో భాగంగా చేసే బ్యాంక్ అకౌంట్ ధ్రువీకరణలో ఇప్పుడు కంపెనీ(యజమాని) పాత్రను ఈపీఎఫ్ఓ తొలగించింది.
ఈ సరళీకృత ప్రక్రియ వారి బ్యాంక్ అకౌంట్ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలనుకునే సభ్యులకు ప్రయోజనం చేకూరుస్తుంది.
ఇప్పుడు కొత్త బ్యాంక్ అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్‌సీ కోడ్ నమోదు చేశాక, ఆధార్ ఓటీపీ ద్వారా నిర్ధరిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
పీఎఫ్ ఖాతా ఎవరికి ఉంటుంది?
ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఏ ఉద్యోగికైనా పీఎఫ్ ఖాతా ఉంటుంది. ఆ వ్యక్తి ప్రాథమిక జీతంలో 12 శాతం ఈ ఖాతాలో జమ చేస్తారు, వారి కంపెనీ కూడా అంతే మొత్తాన్ని జమ చేస్తుంది.
కానీ, కంపెనీ జమ చేసిన ఈ 12 శాతంలో 8.33 శాతం పెన్షన్ ఫండ్‌లో జమ అవుతుంది, మిగిలిన 3.67 శాతం పీఎఫ్‌లో జమ అవుతుంది.
ఎప్పుడు విత్ డ్రా చేసుకోవచ్చు?
మీరు ఈపీఎఫ్ నుంచి కొన్ని పరిస్థితులలో డబ్బును ఉపసంహరించుకోవచ్చు. ఉదాహరణకు మీకు లేదా కుటుంబంలోని ఒకరికి అనారోగ్యం, వివాహం, విద్య, ఇల్లు కొనడం లేదా నిర్మించడం, హోం లోన్ చెల్లించడం లేదా నిరుద్యోగం, పదవీ విరమణ వంటి కారణాలతో తీసుకోవచ్చు.
మీరు ఐదేళ్ల కంటే తక్కువ కాలం పనిచేసి పీఎఫ్‌ని ఉపసంహరించుకుంటే, పన్ను విధిస్తారు. ఐదు సంవత్సరాలకు పైగా పని చేస్తే ఎటువంటి పన్ను ఉండదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














