మూవీ రివ్యూ: విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ ఎలా ఉందంటే?

ఫొటో సోర్స్, Sithara Entertainments/twitter
- రచయిత, జీఆర్ మహర్షి
- హోదా, బీబీసీ కోసం
రెండేళ్లకి పైగా గ్యాప్ తర్వాత విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాతో వచ్చాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమాతో విజయ్ కమ్ బ్యాక్ ఇచ్చాడా? లేదా? చూద్దాం.
కథ ఏమంటే...సూరీ (విజయ్) ఒక పోలీస్ కానిస్టేబుల్. అతని అన్న శివ (సత్యదేవ్) చిన్నప్పుడు తండ్రిని చంపి ఇంట్లో నుంచి పారిపోతాడు. అన్న కోసం హీరో వెతుకుతూ వుంటాడు.
ఒక పోలీస్ అధికారి వచ్చి హీరోకి అండర్ కవర్ ఆపరేషన్ అప్పజెప్తాడు. అదేమంటే శ్రీలంకలోని ఒక దీవిలో బంగారం, ఆయుధాలు స్మగ్లింగ్ చేసే ముఠా గురించి తెలుసుకోవాలి. ఆ ముఠాకి నాయకుడు ఎవరో కాదు హీరో అన్న.
అన్నని ఎలాగైనా ఇంటికి తీసుకురాడానికి హీరో శ్రీలంక వెళ్తాడు. అక్కడ అన్నని కలుస్తాడు. తీసుకు వచ్చాడా? లేదా? అనేది మిగతా కథ.
దీనికో ఉప కథ వుంటుంది. 1920లో బ్రిటీష్ దొరల చేతిలో బలై పోయిన ఒక తెగ శ్రీకాకుళం నుంచి శ్రీలంక పారిపోయి ఉంటుంది. తమ నాయకుడు మళ్లీ పుడతాడని ఎదురు చూస్తూ ఉంటుంది. సత్యదేవ్ పనిచేస్తున్న తెగ ఇదే. ఈ తెగకి హీరో నాయకుడై, కింగ్డమ్ స్థాపించడం టైటిల్ జస్టిఫికేషన్.
తెగకి సంబంధించిన మూలకథకి కొన్ని లక్షణాలున్నా ఇది ఫాంటసీ కథ కాదు. సింపుల్‌గా చెప్పాలంటే అన్నదమ్ముల అనుబంధం. అన్న మాఫియాలో వుంటే, తమ్ముడు పోలీస్ అధికారిగా ఉన్న సినిమాలు ఎన్నో చూశాం.
ఒక రకంగా ఇది పరిందా కథే. నానాపటేకర్ మాఫియాలో జాకీష్రాఫ్ పనిచేస్తూ వుంటాడు. అతన్ని బయటికి తీసుకురాడానికి తమ్ముడు అనిల్ కపూర్ అండర్ కవర్ ఆపరేషన్ చేస్తాడు. ఈ ఇద్దరిలో పోలీస్ ఇన్‌ఫార్మర్ ఎవరనే అనుమానం విలన్‌కి వస్తుంది. కథ పాతదే అయినా కథనం కొత్తగా వుండాలి. ఈ సినిమా లోపం అదే. స్లో నెరేషన్ సినిమాని దెబ్బతీసింది. ఎమోషనల్ సీన్స్ బలంగా రాసుకోకపోవడం వల్ల తెరమీద పండలేదు.
సన్నివేశాలు బలహీనంగా వుండడమే కాకుండా కొత్తదనం లేక అన్ని సీన్స్ ఎక్కడో చూసినట్టు వుంటాయి. ఖలేజా, దేవర, పుష్ప, కేజీఎఫ్ రకరకాల సినిమాలు గుర్తొస్తుంటాయి.


ఫొటో సోర్స్, Sithara Entertainments/twitter
విజయ్ దేవరకొండ మంచి నటుడు. కథలో బలం వుంటే , ఒంటిచేత్తో సినిమాని మోయగలడు. విషయం లేకపోయే సరికి ఎనర్జీ లెవెల్స్ వృథా అయ్యాయి. సత్యదేవ్ కూడా దీటైన నటుడే. క్యారెక్టర్‌లో డెప్త్ లేకపోయేసరికి తేలిపోయాడు.
హీరోయిన్ భాగ్యశ్రీ వుండాలంటే వుంది. లేకపోయినా నష్టం లేదు. ఆమెకి లవ్ ట్రాక్ పెట్టి, పాటలు పెట్టకపోవడం రిలీఫ్ (ఉన్న పాటని కూడా కట్ చేసారు). మిగతా నటులెవరికీ స్క్రీన్ స్పేస్ లేదు.
ముఖ్యంగా చెప్పుకోవలసింది కొత్త విలన్ వెంకటేశ్ గురించి. రొటీన్ సైకో విలన్ క్యారెక్టర్ అయినా బాగా నటించాడు. ఇలాంటి సినిమాల్లో హీరో ఎలివేట్ కావాలంటే విలన్ బలంగా వుండాలి. షెకావత్ వుంటేనే పుష్పకి బలం. విలన్ రొటీన్ అయిపోవడం హీరో ఎలివేషన్‌కి అడ్డం పడింది.
జెర్సీలో తండ్రీకొడుకుల ఎమోషన్‌తో మ్యాజిక్ చేసిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి , కింగ్డమ్‌లో మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయాడు. జెర్సీలో కథని బలంగా రాసుకున్న గౌతమ్, కింగ్డమ్ లో దారి తప్పాడు.
1920లో ఫాంటసీ తరహాలో ఓపెన్ చేసి ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసిన దర్శకుడు, ఆ మూడ్ నుంచి బయటికి వచ్చి రొటీన్ అన్నదమ్ముల కథని ఎత్తుకున్నాడు. చివర్లో ప్రయత్నించినా, ప్రేక్షకుడిలో కింగ్డమ్ మూడ్ రాలేదు. బాహుబలి, మగధీర సన్నివేశాలు (హీరో పడవ లాగుతున్నప్పుడు) గుర్తొస్తే అది మన తప్పుకాదు.
కెమెరా పనితనం అద్భుతంగా వుంది. విజువల్‌గా గ్రాండ్ లుక్ ఇచ్చింది. అనిరుధ్ బీజీఎం చాలా చోట్ల బాగా వుంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్‌గా వున్నాయి. సితార సంస్థ ఖర్చుకి వెనుకాడలేదు. అయితే డబ్బు ఖర్చు పెడితే, టికెట్ రేట్లు పెంచుకోవచ్చు తప్ప, పాన్ ఇండియా సినిమాలు రావు. ప్రేక్షకుడు ఎమోషన్‌కి కనెక్ట్ అవుతాడు కానీ ఖర్చుకి కాదు.
ఎడిటింగ్ పక్కాగా వుంది. అయినా నిడివి 160 నిమిషాలు వచ్చింది. దీనికి పార్ట్-2 పూర్తిగా అనవసరం. పార్ట్ వన్ ఇంత నెమ్మదిగా వుంటే, ఇక సెకెండ్ పార్ట్ కోసం ఎవరు ఎదురు చూస్తారు? విజయ్ దేవరకొండ పాన్ ఇండియా పిచ్చి వదిలించుకుని తనకి తగిన కథలు ఎంచుకుంటే సేఫ్. లేదంటే కష్టం.
ప్లస్ పాయింట్స్:
1.ఫస్టాఫ్
2.విజయ్ ఎనర్జీ లెవెల్స్, స్క్రీన్ ప్రెజెన్స్
3.కెమెరా
4.బీజీఎం
5.ప్రొడక్షన్ వాల్యూస్
మైనస్ పాయింట్స్ః
1.స్లో నెరేషన్
2.బలహీనమైన ఎమోషన్స్
3.అనేక సినిమాలు గుర్తు రావడం
4.విపరీతమైన హింస, పూర్ రైటింగ్
హింస వల్ల సినిమాలు ఆడవు. హింసకి ప్రేక్షకుడు కన్విన్స్ అయితే ఆడతాయి.
ఓపిక వుంటే ఒకసారి చూడొచ్చు కింగ్డమ్.
(అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














