డోనల్డ్ ట్రంప్: భారత్‌పై 25 శాతం టారిఫ్ విధించడానికి చెప్పిన కారణాలేంటంటే...

మోదీ, ట్రంప్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, మోదీ, ట్రంప్

భారత్‌పై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు. ట్రూత్ సోషల్‌లో ట్రంప్ ఈ ప్రకటన చేశారు.

ఆగస్టు 1 నుంచి భారత్‌ నుంచి వచ్చే ఉత్పత్తులపై అమెరికా 25 శాతం టారిఫ్‌ను విధిస్తుందని తెలిపారు.

డోనల్ట్ ట్రంప్ ఇప్పటికే పలు దేశాలపై టారిఫ్‌లు విధిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, చర్చల కోసం ఈ టారిఫ్‌లను ప్రస్తుతం నిలిపివేశారు.

ట్రేడ్ డీల్‌పై చర్చల కోసం ఆగస్టు 1ని తుది గడువుగా నిర్ణయించారు.

ట్రేడ్ డీల్‌పై భారత్, అమెరికా మధ్య ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. కానీ, ఇంకా ఎటువంటి ఒప్పందం కుదరలేదు.

ఇదే సమయంలో తుది గడువుకు రెండు రోజులు ముందు భారత్‌పై సుంకాలను విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.

ట్రంప్

డోనల్డ్ ట్రంప్ ఏం చెప్పారు?

''భారత్‌లో ఏ దేశంలో లేని విధంగా అత్యంత కఠినమైన, అన్యాయమైన వాణిజ్య ఆంక్షలు ఉన్నాయి. అంతేకాక, భారత్ పెద్ద మొత్తంలో సైనిక ఆయుధాలను రష్యా నుంచి కొంటోంది. యుక్రెయిన్‌లో రష్యా చేస్తోన్న దాడులను ఆపాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటుంటే, చైనాతో పాటు భారత్ కూడా రష్యాకు అతిపెద్ద చమురు కొనుగోలుదారుగా ఉంది'' అని ట్రూత్ సోషల్‌లో ట్రంప్ రాశారు.

''ఇవన్ని అంత మంచివి కావు. వీటన్నింటికీ భారత్‌పై ఆగస్టు 1 నుంచి జరిమానాతో సహా 25 శాతం సుంకాలను విధిస్తున్నాం. ఈ అంశంపై దృష్టి సారించినందుకు ధన్యవాదాలు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్'' అని ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

విపక్షాలు ఏం అంటున్నాయి?

ట్రంప్ ఈ ప్రకటన చేసిన తర్వాత, మోదీ ప్రభుత్వంపై విపక్షాలు పలు ప్రశ్నలు లేవనెత్తాయి.

'' భారత్‌పై ట్రంప్ 25 శాతం సుంకాలను విధించారు. పెనాల్టీ కూడా వేశారు. ట్రంప్ కోసం నరేంద్ర మోదీ ప్రచారం చేశారు. 'అబ్‌ కీ బార్ ట్రంప్ సర్కార్' (ఈసారి ట్రంప్ ప్రభుత్వం) అంటూ నినాదాలు కూడా చేశారు. ఆయన్ను ఒక సోదరుడిలా ఆలింగనం చేసుకున్నారు. అందుకు బదులుగా, ఇలాంటి కఠినమైన సుంకాలను ట్రంప్ భారత్‌పై వేశారు. ఇది ప్రభుత్వ విదేశాంగ విధానపు వైఫల్యం. ఒక వ్యక్తి స్నేహం వల్ల దేశమంతా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది'' అని విమర్శించారు.

‘‘పరస్పర చర్చల తర్వాత ప్రెసిడెంట్ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని నేను అనుకోను. అమెరికా పరిపాలనా యంత్రాంగంతో మన వాణిజ్య మంత్రి నిత్యం చర్చలు జరుపుతున్నారు. ఈ అంశంపై చర్చల విషయంలో ఏదైనా అభ్యర్థన, డిమాండ్ ఉంటే పరిగణనలోకి తీసుకోవాలి. అప్పుడే భారత్ ఎలాంటి నష్టాన్ని ఎదుర్కోదు'' అని బీజేపీ ఎంపీ అశోక్ చవాన్ అన్నారు.

ట్రంప్ ముందే సంకేతాలిచ్చారా?

అమెరికా రెసిప్రోకాల్ టారిఫ్స్ అమలుకు తుది గడువుకు ముందే భారత్‌ అత్యధిక సుంకాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ సంకేతాలిచ్చారు.

ఇప్పటి వరకు భారత్‌తో ఎలాంటి ట్రేడ్ డీల్ కాలేదని తెలిపారు.

ఎయిర్‌ ఫోర్స్ వన్‌‌లో జర్నలిస్టులతో మాట్లాడిన ట్రంప్.. సుంకాలను తగ్గించేందుకు భారత్ చేసిన ప్రయత్నాలు ఇప్పటి వరకు సక్సెస్ కాలేదన్నట్లుగా మాట్లాడారు.

అమెరికాతో ప్రత్యేక వాణిజ్య ఒప్పందాలలోకి రాని దేశాలన్ని 15 నుంచి 20 శాతం సుంకాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ అంతకుముందే చెప్పారు.

ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

టారిఫ్ అంటే ఏమిటి?

ఇతర దేశాల నుంచి కొనుగోలు చేసే ఉత్పత్తులపై విధించే పన్నునే టారిఫ్‌ అంటారు.

విదేశీ కంపెనీల పోటీ నుంచి నిర్దేశిత రంగాలను రక్షించేందుకు వివిధ దేశాలు సాధారణంగా ఈ టారిఫ్‌ను వేస్తుంటాయి.

10 శాతం బేస్‌లైన్ టారిఫ్ అంటే.. ఒక వస్తువు ధర 10 డాలర్లు ఉంటే, దానిపై 1 డాలర్ పన్ను పడుతుంది. అంటే దిగుమతి చేసుకున్నందుకు మొత్తంగా అయ్యే ఖర్చు 11 డాలర్లు.

అమెరికాకు విదేశీ వస్తువులను తీసుకొచ్చే కంపెనీలు ప్రభుత్వానికి ఈ పన్నులు చెల్లించాలి.

కంపెనీలు ఈ మొత్తంలో కొంత భాగాన్ని లేదా అదనపు ఖర్చు మొత్తాన్ని వినియోగదారులకు బదలాయిస్తుంటాయి.

అమెరికా వస్తువులను దిగుమతి చేసుకునే దేశాలు భారీగా పన్నులు విధిస్తే, అమెరికా దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై కూడా భారీగా పన్నుల వడ్డింపు ఉంటుందని అధ్యక్షుడు ట్రంప్ చెబుతున్నారు.

ట్రంప్ దీన్ని 'రెసిప్రోకల్ టారిఫ్' అంటున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)