ఆసియాకు వెన్నుదన్నుగా ఉన్న టెక్ తయారీ రంగం ట్రంప్ టారిఫ్‌లతో చతికిలపడనుందా?

టెక్ ఇండస్ట్రీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సురంజన తివారీ
    • హోదా, ఆసియా బిజినెస్ కరెస్పాండెంట్

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధాన్ని మొదలు పెట్టినప్పుడు.. ఉద్యోగాలను, తయారీని తిరిగి తమ దేశానికి తీసుకు రావడం, వాణిజ్య లోటును తగ్గించడం, ప్రపంచవ్యాప్తంగా పోటీ పడుతున్న అమెరికా కంపెనీలకు మరింత పారదర్శక వాతావరణాన్ని సృష్టించడం తన లక్ష్యమని చెప్పారు.

అయితే, నెలల తరబడి చర్చల తర్వాత అమెరికా డిమాండ్లను నెరవేర్చేందుకు చాలా దేశాలు నిరాకరించడంతో, ఆయన వ్యూహం కఠినాత్మకంగా మారింది.

అమెరికా కంపెనీలు చాలాకాలంగా వివిధ దేశాలలో తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి.

ట్రంప్ తన తొలి పదవీ కాలంలో చైనా ఎగుమతులపై సుంకాలను విధించినప్పుడు, బీజింగ్‌లో ఉన్న అమెరికా కంపెనీలు తమపై పడే ప్రభావాన్ని తగ్గించుకునేందుకు నానా తంటాలు పడ్డాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

భారీగా విధించిన సుంకాల నుంచి బయట పడేందుకు తమ ఉత్పత్తి కేంద్రాలను వియత్నాం, థాయిలాండ్, భారత్‌కు మళ్లించాయి.

అయితే, కొత్తగా విధించిన టారిఫ్‌లు సైతం ఈ ఆర్థిక వ్యవస్థల్లో దేన్ని వదలలేదు.

శుక్రవారం తైవాన్, దక్షిణ కొరియాల్లో బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు కుప్పకూలాయి. స్టాక్స్ తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

ఈ రెండు దేశాలు ఆసియాలో విస్తరించిన ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తికి కేంద్రంగా ఉన్నాయి.

అయితే, కొత్త సుంకాల వివరాలు అస్పష్టంగా ఉన్నప్పటికీ, యాపిల్ నుంచి ఎన్‌విడియా వరకు అమెరికా సంస్థలు తమ సరఫరా చెయిన్లకు పెద్ద మొత్తంలో చెల్లించాల్సి వస్తుందని తెలుస్తోంది.

పలు ఆసియా దేశాల నుంచి క్రిటికల్ కాంపోనెంట్లను సేకరించే ఈ కంపెనీలు, ఈ ప్రాంతాల్లోనే తమ డివైస్‌లను అసెంబుల్ చేస్తున్నాయి.

ఐఫోన్లు, చిప్స్, బ్యాక్టరీలు, ఇతర చిన్నచిన్న కాంపోనెంట్లను తయారు చేసే ఈ కంపెనీలకు ప్రస్తుతం క్లిష్టమైన పరిస్థితే.

తైవాన్ పోర్టు

ఫొటో సోర్స్, Getty Images

జపాన్ కార్లు, దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ నుంచి తైవాన్ చిప్‌ల వరకు విదేశాలకు ఎగుమతి చేస్తూ, విదేశీ పెట్టుబడులతో అభివృద్ధి చెంది సంపన్న దేశాలుగా మారిన ఆసియా ఆర్థిక వ్యవస్థలకు ట్రంప్ టారిఫ్‌ల విధింపు అంత శుభవార్త కాదు.

ఈ ఉత్పత్తులకు పెరుగుతోన్న డిమాండ్‌తో గత కొన్నేళ్లుగా వాషింగ్టన్‌తో ఈ దేశాలు జరుపుతోన్న వాణిజ్యం ఊపందుకుంది.

అయితే, ఆసియా తయారీ రంగం అమెరికా ఉద్యోగాలను కొల్లగొట్టిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపిస్తున్నారు.

‘టిమ్...మేం మీతో బాగున్నాం. చైనాలో మీ ప్లాంట్లన్నింటినీ కొన్నేళ్లుగా పెంచుకుంటూ వస్తున్నారు. అయినా, మేం సహించాం. కానీ మీరు భారత్‌లో తయారీ మొదలుపెట్టడం మాకు ఇష్టం లేదు. భారత్ తన ఉత్పత్తిని అది చూసుకోగలదు’ అని యాపిల్ సీఈఓ టిమ్ కుక్‌తో మే నెలలో ట్రంప్ అన్నారు.

యాపిల్‌కు తన మొత్తం రెవెన్యూలో సగం చైనా, వియత్నాం, భారత్‌లో తయారు చేసిన ఐఫోన్లతోనే వస్తుంది.

గురువారం రాత్రి ట్రంప్ టారిఫ్‌ల ప్రకటనకు కొన్ని గంటల ముందే జూన్‌తో ముగిసిన మూడు నెలల త్రైమాసిక ఫలితాలను ఈ టెక్ దిగ్గజం విడుదల చేసింది.

ఈ ఫలితాల్లో తాము మంచి ఆదాయాలను ఆర్జించినట్లు తెలిపింది. కానీ, ప్రస్తుతం ఈ కంపెనీ భవిష్యత్‌ అనిశ్చితంగా మారింది.

అయితే, టారిఫ్‌ల కారణంగా గత క్వార్టర్‌లో 800 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 6,900 కోట్లు) భారం పడిందని యాపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ కుక్ కాన్ఫరెన్స్ కాల్‌లో అనలిస్టులకు తెలిపారు.

వచ్చే క్వార్టర్‌లో టారిఫ్ సంబంధిత ఖర్చులు మరో 1.1 బిలియన్ డాలర్లు ఉంటాయని అంచనావేశారు.

ఐఫోన్

ఫొటో సోర్స్, Getty Images

టెక్ కంపెనీలు కొన్నేళ్లు ముందుగానే తమ ప్రణాళికలను రచిస్తుంటాయి. కానీ, ట్రంప్ అనూహ్యమైన సుంకాల విధానం (టారిఫ్ పాలసీ) వారి వ్యాపారాలకు ఇబ్బందికరంగా మారింది.

ఉదాహరణకు అమెజాన్ ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్‌ను తీసుకుంటే.. అమెరికాలో అమ్మే వాటికి ఇది చైనాపై ఆధారపడుతోంది.

అయితే, అమెరికాలోకి వచ్చే చైనీస్ దిగుమతులపై రేట్లు ఎలా ఉంటాయో ఇంకా స్పష్టత లేదు. ఎందుకంటే, బీజింగ్ ఇంకా వాషింగ్టన్‌తో ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంది. ఈ ఒప్పంద ఖరారుకు రెండు దేశాలకు ఆగస్టు 12 వరకు సమయం ఉంది.

అయితే, అంతకుముందు అమెరికా-చైనాలు చేసుకున్న వాణిజ్య యుద్ధంలో కొన్ని వస్తువులపై ప్రతీకార సుంకాలు 145 శాతం వరకు చేరాయి.

రెండు దేశాలు ఒకదానిపై ఒకటి సుంకాలను పెంచడంతో అంతకుముందు సుంకాల సంక్షోభం ఏర్పడింది.

అమెరికాలో అమ్ముడుపోయే చాలా ఐఫోన్లు భారత్‌ నుంచి వచ్చినవని టిమ్ కుక్ చెప్పారు.

అయితే, గడువు లోపల ఒప్పందం కుదుర్చుకోలేకపోవడంతో భారత్ నుంచి వచ్చే దిగుమతులపై 25 శాతం టారిఫ్‌లను విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.

ట్రంప్ తొలి పదవీ కాలంలో టారిఫ్‌లను ప్రకటించిన తర్వాత ఇతర సంస్థలు తమ ఉత్పత్తులను వియత్నాం, థాయిలాండ్ మీదుగా అమెరికాకు దారి మళ్లించాయి.

ట్రంప్ తొలి పదవీ కాలం తర్వాత ఇది చాలా సాధారణంగా మారిపోయింది. ''చైనా+1'' స్ట్రాటజీగా దీన్ని అభివర్ణించారు.

కానీ, ఈసారి ట్రాన్స్‌షిప్డ్ గూడ్స్‌ను (వివిధ ప్రాంతాల మీదుగా రవాణా చేసే ఉత్పత్తులను) కూడా ట్రంప్ లక్ష్యంగా చేసుకున్నారు.

చైనాలో షీన్ ఫ్యాక్టరీ

ఫొటో సోర్స్, Xiqing Wang/BBC

ఆసియా దేశాలతో అమెరికా జరుపుతున్న చర్చలలో ట్రాన్స్‌షిప్పింగ్ అనేది అతిపెద్ద అంశంగా ఉంది.

వియత్నాం దిగుమతులు 20 శాతం అమెరికా లెవీని ఎదుర్కొంటుండగా, ట్రాన్స్‌షిప్డ్ గూడ్స్ అయితే 40 శాతం చెల్లించాల్సి వస్తుందని ట్రంప్ చెబుతున్నారు.

సెమీకండక్టర్లు వంటివాటి తయారీకి కూడా ఇది చాలా కష్టం. ఎందుకంటే, ప్రపంచ చిప్‌లలో సగానికి పైగా, ముఖ్యంగా అధునాతనమైన వాటిలో ఎక్కువ భాగం తైవాన్‌ నుంచే వస్తున్నాయి. వీటికి ప్రస్తుతం 20 శాతం టారిఫ్‌ను చెల్లించాలి.

తైవాన్ ఆర్థిక వ్యవస్థకు చిప్‌లు వెన్నుముక వంటివి. చైనాపై సాంకేతిక పరంగా ఆధిపత్యం సాధించాలని అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు ఇవే కేంద్రంగా ఉన్నాయి.

తమ ఏఐ ప్రొడక్టులలో తైవాన్ టీఎస్ఎంసీకు చెందిన అధునాతన చిప్‌లను పెట్టే మరో అమెరికా కంపెనీ ఎన్‌విడియా, ట్రంప్ టారిఫ్‌ల వల్ల భారీగా లెవీలు చెల్లించాల్సి ఉంది.

అయితే, చైనా అమ్మకందారులు, మార్కెట్‌ప్లేస్‌లపై ఎక్కువగా ఆధారపడ్డ ఆసియా ఈ-కామర్స్ దిగ్గజాలు, అమెరికా కంపెనీలే ట్రంప్ టారిఫ్‌లకు ఎక్కువగా ప్రభావితం కానున్నాయి.

అయితే, ఈ వారంలో ఒక అనూహ్య నిర్ణయాన్ని ట్రంప్ ప్రకటించారు. 800 డాలర్ల (సుమారు రూ.69,762) లోపున్న పార్సిళ్లకు కస్టమ్స్ డ్యూటీల నుంచి మినహాయింపు ఇచ్చే ''డీ మినిమిస్'' నిబంధనను ట్రంప్ తొలగించారు.

చైనా, హాంకాంగ్ నుంచి వచ్చే పార్శిళ్లను లక్ష్యంగా చేసుకుని మే నెలలో తొలుత ఈ నిర్ణయం తీసుకున్నారు.

షీన్, టెము వంటి ఆన్‌లైన్ రిటైలర్లకు ఇది భారీ ఎదురుదెబ్బ. పశ్చిమ దేశాల నుంచి నమోదయ్యే ఆన్‌లైన్ అమ్మకాల నుంచే ఈ కంపెనీలు ఎక్కువగా లాభపడుతున్నాయి.

ఇప్పుడు ఈబే వంటి అమెరికన్ సైట్లు కూడా ఈ మినహాయింపును కోల్పోయాయి. దీంతో, అమెరికా కస్టమర్లు కొనుగోలు చేసే సెకండ్ హ్యాండ్, వింటేజ్, చేతితో తయారు చేసిన వస్తువుల ధరలు విపరీతంగా పెరగనున్నాయి.

అమెరికన్ల కోసం ఈ టారిఫ్‌లతో బ్యాటింగ్ చేస్తున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ చెబుతున్నారు.

కానీ, ప్రపంచీకరణ అయిన ఈ సమాజంలో అమెరికా కంపెనీలు, వినియోగదారులు కూడా బాధితులు అవ్వొచ్చు. ఈ విషయంలో ఎంతో అనిశ్చితి ఉంది. అసలైన విజేతలు ఎవరనేది మున్ముందు తెలుస్తుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)