రష్యా మాజీ అధ్యక్షుడి 'బెదిరింపు'తో న్యూక్లియర్ సబ్‌మెరైన్లను మోహరించాలని ఆదేశించానన్న ట్రంప్, అసలేం జరుగుతోంది?

ట్రంప్, మెద్వెదేవ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ట్రంప్, మెద్వెదేవ్ మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది.
    • రచయిత, జారోస్లావ్ లుకివ్
    • హోదా, బీబీసీ న్యూస్

రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలతో, రెండు అణు జలాంతర్గాములను 'సరైన చోట మోహరించాలని' ఆదేశించినట్లు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తెలిపారు.

"ఈ (మెద్వెదేవ్ వ్యాఖ్యలు) మూర్ఖపు, రెచ్చగొట్టే ప్రకటనలు కేవలం అక్కడికే పరిమితం కాకపోవచ్చు, అందుకే ఆ ఆదేశాలు. ఆయన వాడిన పదాలు చాలా ముఖ్యం, కొన్నిసార్లు అవి అవాంఛనీయ పరిణామాలకు దారితీస్తాయి. ఈసారి అలా జరగదని ఆశిస్తున్నా" అని ట్రంప్ అన్నారు.

అయితే, యుక్రెయిన్‌లో రష్యా కాల్పులు విరమించాలని, లేకపోతే మరింత కఠినమైన ఆంక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ ఇచ్చిన అల్టిమేటంకు ప్రతిస్పందనగా మెద్వెదేవ్ పలు వ్యాఖ్యలు చేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అణు జలాంతర్గాములు, రష్యా, అమెరికా, ట్రంప్, పుతిన్

ఫొటో సోర్స్, Getty Images

మా ప్రజల్ని రక్షించుకుంటాం: ట్రంప్

రష్యా, అమెరికా వద్ద ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో అణ్వాయుధాలు, పెద్ద సంఖ్యలో అణు జలాంతర్గాములున్నాయి.

"రష్యా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం రష్యా భద్రతా మండలి డిప్యూటీ చైర్మన్‌గా ఉన్న దిమిత్రి మెద్వెదేవ్ చేసిన బెదిరింపు ప్రకటనల నేపథ్యంలో, రెండు అణు జలాంతర్గాములను తగిన ప్రాంతాలలో మోహరించాలని ఆదేశించా" అని డోనల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్‌లో శుక్రవారం పోస్ట్ చేశారు.

ఈ పోస్ట్‌లో అవి అణ్వాయుధ జలాంతర్గాములా? లేదా అణ్వాయుధాలను మోసుకెళ్లే జలాంతర్గాములా? అనేది ట్రంప్ పేర్కొనలేదు.

అదేరోజు మరోసారి ట్రంప్ విలేఖరులతో మాట్లాడుతూ "బెదిరింపులు వచ్చాయి, అది సముచితమని మేం భావించడం లేదు. అయితే, చాలా జాగ్రత్తగా ఉండాలి" అని అన్నారు.

"మా ప్రజల భద్రత కోసం ఇలా చేస్తున్నా. రష్యా మాజీ అధ్యక్షుడు బెదిరింపులకు దిగారు, మేం మా ప్రజలను రక్షించుకుంటాం" అని ట్రంప్ చెప్పారు.

అణు జలాంతర్గాములు, రష్యా, అమెరికా, ట్రంప్, పుతిన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మెద్వెదేవ్ 2008 నుంచి 2012 వరకు రష్యా అధ్యక్షుడిగా ఉన్నారు.

రష్యా స్టాక్ మార్కెట్ పతనం

ఇప్పటివరకైతే, రష్యా దీనిపై స్పందించలేదు. కానీ, ట్రంప్ వ్యాఖ్యల తర్వాత మాస్కో స్టాక్ మార్కెట్ భారీగా పతనమైంది.

సోషల్ మీడియాలో ట్రంప్, మెద్వెదేవ్‌లు ఇటీవల వ్యక్తిగత దూషణలకు దిగారు. ఆగస్టు 8 నాటికి పుతిన్ యుద్ధాన్ని ఆపేయాలని ట్రంప్ గడువు విధించిన తర్వాత ఇదంతా మొదలైంది. ఈ గడువుకు పుతిన్ అంగీకరించే సూచనలు కనిపించడం లేదు.

ఈ నేపథ్యంలో, రష్యా 10, 12 రోజుల్లో యుద్ధాన్ని ముగించాలని ట్రంప్ సోమవారం కొత్త గడువు ఇచ్చారు. అంతకుముందు, 50 రోజుల్లో పుతిన్ యుద్ధాన్ని ఆపకపోతే, రష్యన్ చమురు, ఇతర ఎగుమతులపై భారీగా పన్నులు విధిస్తామని జూలైలో హెచ్చరించారాయన.

అణు జలాంతర్గాములు, రష్యా, అమెరికా, ట్రంప్, పుతిన్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, రష్యా, అమెరికా వద్ద ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో అణ్వాయుధాలు, చాలా సంఖ్యలో అణు జలాంతర్గాములు ఉన్నాయి.

మెద్వెదేవ్ 'కోడ్‌నేమ్' వాడారా?

మెద్వెదేవ్ 2008 నుంచి 2012 వరకు రష్యా అధ్యక్షుడిగా ఉన్నారు. రష్యాతో ట్రంప్ అల్టిమేటం గేమ్ ఆడుతున్నారని మెద్వెదేవ్ ఈ వారం ప్రారంభంలో ఆరోపించారు.

మెద్వేదెవ్ ఇటీవల ఒక ఎక్స్ పోస్టులో "ప్రతి కొత్త అల్టిమేటం ఒక ముప్పు, యుద్ధం వైపునకు అడుగు" అని రాశారు.

ట్రంప్ అల్టిమేటం నాటకీయమని, రష్యా దాన్ని పట్టించుకోదని జూలై ప్రారంభంలో వ్యాఖ్యానించారు మెద్వేదెవ్.

గురువారం టెలిగ్రామ్‌లో "డెడ్ హ్యాండ్" ముప్పు గురించి హెచ్చరిస్తూ మెద్వెదేవ్ పోస్ట్ చేశారు. దీనిని రష్యా అణు ప్రతీకార వ్యవస్థ(రష్యా రిటాలియేటరీ న్యూక్లియర్ స్ట్రైక్స్ కంట్రోల్ సిస్టం) కోడ్‌నేమ్ సూచనగా కొంతమంది సైనిక నిపుణులు భావిస్తున్నారు.

మెద్వెదేవ్ వ్యాఖ్యలపై ట్రంప్ స్పందించడం ఇదే మొదటిసారి కాదు. ఆయనొక రష్యా విఫలమైన మాజీ అధ్యక్షుడని, ఇప్పటికీ అధ్యక్షుడిగా భావిస్తుంటారని ట్రంప్ గురువారం అన్నారు.

'మాటలు జాగ్రత్త' అని కూడా మెద్వెదేవ్‌ను హెచ్చరించారు ట్రంప్. "ఆయన చాలా ప్రమాదంలోకి అడుగుపెడుతున్నారు!" అని ట్రంప్ అన్నారు.

2022లో యుక్రెయిన్‌పై రష్యా మొదలుపెట్టిన యుద్ధానికి మెద్వెదేవ్ మద్దతిచ్చారు. ఆయన పశ్చిమ దేశాలను తీవ్రంగా విమర్శించేవారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)