ఆ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు గాలిపటాల బెడద

ఫొటో సోర్స్, Haryo Bangun Wirawan/BBC
- రచయిత, కోహ్ ఈవ్, హన్నా సమోసిర్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
జకార్తా అంతర్జాతీయ విమానాశ్రయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న వరి చేలో పిల్లలు గాలి పటాలు ఎగరేసుకుంటున్నారు. అయితే విమానాలు ఎగిరేటప్పుడు వచ్చే పెద్ద శబ్దం ఆ గాలిపటాల మృదువైన శబ్దాన్ని వినపడనివ్వకుండా చేస్తోంది.
గాలి పటాలు ఎగరేస్తూ పిల్లలు ఆకాశం వైపు చూస్తుంటారు. అదే సమయంలో ఎయిర్‌పోర్టు అధికారులు తమ గాలిపటాలు తీసుకెళ్లేందుకు వస్తారేమో అని కూడా ఓ కంట కనిపెడుతుంటారు.
''మొదట్లో అధికారులొచ్చినప్పుడు నేను, నా స్నేహితులు పరుగులు తీసేవాళ్లం. ఇప్పుడు నేను ధైర్యంగా ఉంటున్నా. వాళ్లు అరుస్తున్నప్పుడు నేను మామూలుగా వింటా'' అని ఏడేళ్ల అతీఫ్ చెప్పారు.
''వాళ్లు నా గాలిపటం తీసుకెళ్తే నాకు బాధేస్తుంది. కానీ కొత్తది తయారుచేసుకోగలను'' అని అతీఫ్ అన్నారు.
ఎయిర్‌పోర్టు అధికారులు, గాలిపటాలు ఎగరేసే ప్రజల మధ్య ఇండోనేసియాలో టగ్ ఆఫ్ వార్‌లాంటిది జరుగుతోంది.

3 రోజుల్లో 21 విమానాల రాకపోకలపై ప్రభావం
ఇండోనేసియాలో గాలిపటాలు ఎగరేయడానికి చాలా ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా స్కూళ్లకు వేసవి సెలవులు ఇచ్చినప్పుడు పిల్లలు గాలి పటాలు ఎగరేస్తుంటారు.
కానీ ఆ గాలిపటాలు ప్రమాదకరమని ఎయిర్‌పోర్టు అధికారులు హెచ్చరిస్తుంటారు.
విమానం సెన్సర్లను బ్లాక్ చేసినా, అవి ఇంజిన్లలో చిక్కుకున్నా ప్రమాదాలు జరుగుతాయని వారు చెబుతుంటారు.
వరి చేనుకు దగ్గరగా ఉన్న సుకర్ణో-హట్టా అంతర్జాతీయ విమానాశ్రయంలో జూలై ప్రారంభంలో గాలిపటాల వల్ల కేవలం మూడు రోజుల్లో 21విమానాలపై ప్రభావం పడింది.
కొన్ని విమానాలు ఇతర ఎయిర్‌పోర్టుల్లో ల్యాండ్ కావాల్సి వచ్చింది. కొందరు పైలట్లు ప్రమాదకరంగా భావించి ల్యాండింగ్ చేయకూడదని నిర్ణయించుకున్నారు.
గాలిపటాలు విమానాలకు తీవ్ర ప్రమాదం కలిగిస్తాయని ఎయిర్‌పోర్ట్ హెడ్ ‘పుటు ఎకా కహ్యాది’ చెప్పారు.
ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తపడాలనుకుంటున్నామని తెలిపారు.
2024 జూలైలో గాలిపటాల దారం చిక్కుకోవడంతో బాలిలో ఓ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ఇండోనేషియన్లు, ఇద్దరు ఆస్ట్రేలియన్లు గాయపడ్డారు.
2020 జూలైలో సుకర్ణో-హట్టా విమానాశ్రయానికి వచ్చిన ఓ విమానం ఇంజిన్‌లో గాలిపటాల దారాలు, వెదురు కర్రలు కనిపించాయి. ఆ విమానం సురక్షితంగా ల్యాండ్ అయినప్పటికీ, భద్రతాపరంగా అనేక ఆందోళనలకు కారణమైంది.
ఈ ఘటన జరిగిన నెల రోజుల తర్వాత ఎయిర్‌పోర్టుకు దగ్గరలో గాలిపటాలు ఎగరవేయకుండా చూసేందుకు ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు విమానాశ్రయ అధికారులు.
కానీ ఐదేళ్ల తర్వాత కూడా ఆ సమస్య అలాగే కొనసాగుతోంది.

ఫొటో సోర్స్, Haryo Bangun Wirawan/BBC
గాలిపటాలు ఇండోనేసియా సంస్కృతిలో ఓ భాగం
గాలిపటాల వల్ల విమానాలకు కలిగే ప్రమాదాలను తగ్గించాలని ఇండోనేసియా రవాణాశాఖ మంత్రి ఈ ఏడాది జూలైలో దేశవ్యాప్తంగా ఎయిర్ పోర్టు అధికారులను, ప్రాంతీయ ప్రభుత్వాలను ఆదేశించారు.
సరదా కోసం గాలిపటాలు ఎగరేస్తున్నప్పటికీ, విమానాలను ప్రమాదంలో పడేసే పనులు చేయకూడదని ప్రజలకు, ముఖ్యంగా పిల్లలకు చెప్పాలని పుటు అన్నారు.
పిల్లలు సురక్షితమైన ఆటలు ఆడుకునేలా వారికి ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్ ర్యాకెట్లు ఇచ్చేందుకు ఎయిర్ పోర్టు సిబ్బంది ప్రయత్నించారు.
కానీ గాలిపటం ఎగరేయడమన్నది ఇండోనేసియా సంస్కృతిలో ఓ భాగం.
గతంలో ప్రజలు ఆకులు, కాగితం, వస్త్రంతో గాలిపటాలు తయారుచేసుకునేవారు.
అనేక కారణాలతో ఇండోనేసియాలో గాలిపటాలు ఎగరేస్తారు. పంట చేతికొచ్చే పండుగల సమయాల్లో, పంటలను పాడు చేయకుండా పక్షులను అదిలించడానికి, బాలిలో పూజా కార్యక్రమాల సమయంలోనూ గాలిపటాలు ఎగరేస్తారు.
పూర్వీకుల నుంచి గాలిపటాలను ఎగరేయడం సంప్రదాయంగా వస్తోందని, ఇండోనేసియాలోని ప్రతి ప్రాంతంలో ఈ సంప్రదాయం ఉందని ఇండోనేసియా కైట్ మ్యూజియంకు చెందిన అసెప్ ఇర్వాన్ చెప్పారు.
''కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు సరదా కోసం గాలిపటాలు ఎగరేస్తారు. వారికి ప్రమాదం సంగతి అర్ధం కాదు'' అని ఆయనన్నారు.

‘మీరే మంచి ప్రదేశం చూపించండి’
ఎయిర్‌పోర్టులు దగ్గర గాలిపటాలు, డ్రోన్లు, ఇతర అభ్యంతరకర వస్తువులను ఎగరేసేవాళ్లకు మూడేళ్లవరకు జైలుశిక్ష పడుతుంది. లేదా 61 వేల డాలర్లు (సుమారు రూ. 53 లక్షలు) జరిమానా కట్టాల్సి వస్తుంది.
ఎయిర్‌పోర్టులకు దగ్గర మాత్రమే కాదు. రద్దీగా ఉండే నగరాల్లో సైతం వాటివల్ల ప్రాణాంతక ప్రమాదాలు జరుగుతున్నాయి.
జకార్తాకు దక్షిణంగా ఉండే దెపోక్ నగరంలో గత ఏడాది ఎనిమిదేళ్ల బాలుడు
ప్రాణాలు కోల్పోయాడు.
రోడ్డు మీద గాలిపటం పట్టుకునేందుకు పరుగుతీస్తున్న బాలుడిని కారు ఢీకొట్టిందని పోలీసులు చెప్పారు.
2020లో బాలిలోని ఒక ఎలక్ట్రిక్ సబ్‌స్టేషన్‌పై ఓ గాలిపటం పడింది. దీనివల్ల 70 వేల ఇళ్లకు, కొన్ని భవనాలకు గంటలపాటు కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఆ గాలిపటం ఎగరేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
విమానాలకు సమస్యలు సృష్టించాలని తమకు లేదని, కానీ గాలిపటాలు ఎగరేయడానికి తమకింకెక్కడా అవకాశం లేదని సుకర్ణో-హట్టా ఎయిర్ పోర్టు దగ్గర పొలంలో ఉన్న పిల్లలు చెప్పారు.
2000 నుంచి 2020 మధ్య జకార్తాలో ఖాళీ ప్రదేశాలు బాగా తగ్గిపోయాయి. పొలాలు, అడవులు ఉండే చోట రోడ్లు, అపార్ట్‌మెంట్లు నిర్మించారు.
గాలిపటాలు ఎగరేసేందుకు మంచి ప్రదేశాలే లేవని, గాలిపటాలు తయారు చేసి అమ్మే 17 ఏళ్ల రషా చెప్పారు.
గాలిపటాలను ఇష్టపడేవారంతా ఇప్పుడా వరి పొలం దగ్గరకు వస్తున్నారు. అక్కడ గాలిపటాలు ఎగరేసే పోటీలు జరుగుతున్నాయి. ఆ పోటీల్లో రాషా రెండు సార్లు గెలుపొందారు.
అంతకుముందు అతన్ని ఎయిర్‌పోర్టు అధికారులు పట్టుకుని, గాలిపటాలు తీసుకున్నారు.
''పోలీసులు మా ఇంటికి కూడా వచ్చారు. నా గాలిపటాలను దారాలతో సహా తగలబెట్టారు'' అని అతను చెప్పాడు. నా అన్నలు, అక్కలకు కోపమొచ్చింది. గాలిపటాలు చేయడం ఆపేయాలని వారు చెప్పారు. కానీ ఇటీవలే నేను మళ్లీ మొదలుపెట్టాను. అది ప్రమాదకరమే కానీ వారు మీ గాలిపటాలు తీసుకున్నప్పుడు మీరు భయపడడం మానెయ్యాలి’’ అని రాషా చెప్పాడు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














